శనివారం 28 మార్చి 2020
Editorial - Mar 26, 2020 , 22:26:52

కాలము-కాలుడు

కాలము-కాలుడు

కాలం మనిషి వినియోగం కోసం ఏర్పరచుకున్నది. జీవన విధానానికి, జీవన ప్రమాణానికి, ప్రకృతి పరిశీలనకు కాలం ఒక ప్రమాణంగా ఉంది. మనిషి విజ్ఞానిగా మారడానికి కాలం వినియోగపడింది. ఖగోళంలోని గ్రహాలు, నక్షత్రాలను గమనించడానికి కాలం ఒక ప్రమాణం. ఇంతకూ, కాలం దేనివల్ల ఏర్పడుతుంది? భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల కాలం ఏర్పడుతుంది. తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడం వల్ల ప్రకృతిలో మార్పులు ఏర్పడుతున్నాయి. ఋతువు లు ఏర్పడుతున్నాయి. కాలాన్ని ఏర్పరచేవాడే కాలు డు అయితే భూమే మనకు కాలుని స్వరూపమవుతుంది.

కాల శబ్దం యమునికి, కాలానికి పేరు (కలయతి ప్రాణిన ఇతి కాల:). మనసును ప్రేరేపించేది (కాలయతి మన ఇతి క్షేపే). దీనితో గణన జరిగేది, ప్రేరేపింపజేసేది. దీనితో సుఖదుఃఖాదులు సమకూరుతవి. దీనిలోనే జనులు వ్యాపారయుక్తులు అవుతారు. ఇంతేకాదు, కాలం నశించనిది, చేష్టలేనిది. లెస్సగా ఎరుకలోకి వచ్చేది. ధర్మాధర్మములైనా, కాలాన్నయినా లెక్కించేవాడు.. మొదలైనవి కాలానికి, కాలునికి చెందిన పేర్లు. కాల శబ్దానికి ‘నలుపు’ అనే అర్థమూ ఉంది. కాలం శివస్వరూపం. అందుకే, కాలుడు అంటే శివుడే. కాలం బ్రహ్మస్వరూపం కూడా. కనుకే, సృష్టి ప్రారంభించే కాలగణన బ్రహ్మాయుర్దాయంగా పరిగణిస్తున్నారు. ‘అద్య బ్రహ్మణ:’ అంటూ నిత్యం సంకల్పంలో కాలాన్ని ప్రార్థించడం, గుర్తించడం భారతీయ సంప్రదాయం. కాలమంటే ప్రకృతి అనీ అర్థం. ప్రకృతి వికాసాదులన్నీ కాలంలోనే గుర్తింపు పొందుతాయి.

శివలింగం భూస్వరూపమే. శివుడు దిగంబరుడు. భూమికూడా ఆకాశంలో ఒంటరిగానే ప్రయాణిస్తుంది. శివునికి తలపై చంద్రుడుంటాడు. భూమికి ఉపగ్రహమూ చంద్రుడే. భూమిచుట్టూ తిరుగుతూ ఉంటాడు. శివుని తలపై గంగ ఉంటుంది. భూమిపైన మూడింట రెండు వంతుల జలమే ఉంటుంది. శివుడు లయకారకుడు. కాలం తీరిన మనిషి, జీవులు.. అన్నీ భూమిలో కలిసిపోవడం కూడా మనం గమనిస్తున్నదే. భూమిలోని గురుత్వాకర్షణ గణపతిగా, భూమిచుట్టూ ఉండే విద్యుదయస్కాంత శక్తి కుమారస్వామిగా, భూమిచుట్టూ ఉండే పాంచభౌతిక శక్తి పార్వతిగా భావిస్తే.. ఇది ‘సదాశివ కుటుంబం’ అవుతుంది. ‘అభిషేక ప్రియ: శివ:’ అనే మాటనుబట్టి శివలింగానికి చేసే అభిషేకమంటే భూమిపైన కురిసే వర్షమే. వర్షం భూమిపై కురిస్తే భూమిలో మొలకలు మొలిచి, సస్యశ్యామలమవుతుంది. శివునికి ఈ భావనతో పూజ చేయడం ద్వారా మన హృదయాలు ఆనందమయమై, సంతానవంతమౌతాయి.

కాలాన్ని గణించడానికి భూభ్రమణాలు మాత్రమే ఆధారం కావడం వల్ల శివుడు కాలస్వరూపుడవుతాడు. పూర్వకాలం భారతవర్షానికి ఉజ్జయిని మధ్యభాగం కావడం వల్ల అక్కడి శివునికి ‘మహాకాలుడ’నే పేరు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. అందుకే, శివారాధన చేయడం అంటే ‘కాలానికి నమస్కరించడమే’. బ్రహ్మకు చేసే నమస్కారం కాలపూజనే. ప్రకృతి స్వరూపమైన అమ్మవారికి చేసే పూజలన్నీ కాలానికి చెందినవే. కాలం నియమబద్ధమైంది. కాబట్టి, యమునికి చేసే ఆరాధన కూడా కాల సంబంధమైందే.

‘మానం’ అంటే కొలత. ‘కాలమానం’ అంటే కాలాన్ని కొలవడం. ఈ కొలతలన్నీ ప్రకృతిలోని మార్పులను అధ్యయనం చేయడమే. ఎన్నో మానాలన్నీ అందుకే ఏర్పడినాయి. ప్రస్తుతం మనం అనుసరించే ఆంగ్ల కాలమానం తప్ప అన్ని కాలమానాలకు ఖగోళ ప్రాతిపదికలున్నాయి. తెలుగువారు సౌర, చాంద్రమానాల కలయికను అనుసరిస్తారు. సౌరమాన మంటే సూర్యుడు ఒకరాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని గణించే విధానం. మేషమాసం, వృషభమాసం... అంటూ సౌరమాన మాసాలుంటాయి. చాంద్రమానం ప్రకారం ఒక మాసానికి పేరు నిర్ణయించడం కూడా ఖగోళ ప్రాతిపదికవల్ల మాత్రమే జరుగుతుంది. 

ఖగోళాన్ని, భూగోళాన్ని, ప్రకృతిని ఒక క్రమపద్ధతిలో గమనించాలంటే ఒక కాలం కావాలి. అందుకే, కాలానికి చేసే నమస్కారం అందరు దేవతలకు చేసే నమస్కారమే. కాలాయ తస్మై నమ:..


logo