సోమవారం 30 మార్చి 2020
Editorial - Mar 26, 2020 , 22:21:29

గొలుసు తెగాలె...

గొలుసు తెగాలె...

రూపం లేని శక్తి శకలాలుంటాయని

ఏ దేశపు జానపద గాథా చెప్పకపాయె..

ఒల్లు జల్లెడే గని

జీవి ఏ రంధ్రం గుండాపోతదో

ఏ పురాణమూ ప్రవచించదాయె!

బల్లులూ తెలుసు

రాక్షస బల్లులూ తెలుసు

పులుగూ ఎరికే

పులుగులా ఎగిరే ప్రాణమూ ఎరికే..

దేనికి ఏది లింకు

ఏ చర్యకు ఏది ప్రతిచర్య

ఎప్పటి క్రియకు

ఎప్పటి ప్రతిక్రియ

యముడి చేతిలో

ఇప్పుడెన్ని తాళ్ళున్నాయో లెక్కబెట్టు తండ్రీ!

రెండర్థ గోళాలు

ధృవ దేశాలు

ఉష్ణమండలం

ఎక్కడ మెల్లగా పాకుతుందో

ఎప్పుడు ఏ క్షణాన నాకుతుందో

తెలియని బేలతనం

తెలిసీ యుద్ధం చేయలేనితనం

నాలుగు గోడల నడుమ

తారాడటమే కష్టమైనవాడా

అది సరిహద్దులు దాటింది..!

కరోనా కుంటిది

మనం చేయిబట్టి

నడిపిస్తేనే నడుస్తది!

కరోనా గుడ్డిది

వెలుగుపరిచి మనం

దారి చూపితేనే కదుల్తది

కరోనా మూగది

నువ్వెంత మాట్లాడినా

అది మౌనంగా పనిలో ఉంటది

అది గాలిని అధిరోహించి

తిరుగుతున్న మంట

తాకిన చోటల్లా

కొత్త జన్మనెత్తే బుగ్గి.

చక్రం దొర్లిపోతుందో తెలియదు

దూది తేలిపోతుందో అంతుచిక్కదు

నీటిలో మునిగేటట్లూ లేదు

కత్తెరకు చినిగేటట్లూ లేదు

కనిపించని శతృవుతో

ఇప్పుడు భూగోళపు

అణువణువూ యుద్ధక్షేత్రమే!

మనం కదలకుండా ఉంటేనే

దాని గొలుసు భళ్ళున తెగిపోతుంది

మనం చేతులు కలపకుండా ఉంటేనే

దాని సామ్రాజ్యం కూలిపోతుంది 

మనం పరిశుభ్రతా మాలను ధరిస్తేనే

అది జారుకుంటుంది

మనలో మనం

దూరాలు పాటిస్తేనే 

అది దూరంగా జరిగి

అంతర్థానమవుతుంది

మనకు మూడే మూడు ఆప్షన్లు

ఇంట్లో ఉండటం..

దవాఖానలో ఉండటం..

దండ కింద ఉండటం..!

- ఏనుగు నరసింహారెడ్డి, 89788 69183


logo