శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 25, 2020 , 22:48:33

ప్యాకేజీ భరోసా

ప్యాకేజీ భరోసా

కరోనా వైరస్‌ సృష్టించిన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు త్వరలో ఒక ప్యాకేజీ ని ప్రకటిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన ఊరట కలిగించేదిగా ఉన్నది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం రెండు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇప్పటికైతే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడం మరో పెద్ద సవాలు. అందువల్ల ఇప్పటి నుంచే ఆ దిశగా చర్యలు తీసుకోవడం అవసరం. కరోనా ప్రభావం దాదా పు అన్ని రంగాలపై ఉన్నది. విమానయానం, పర్యాటకం, చిన్న మధ్యతరహా పరిశ్రమలు తదితర రంగాలు మరింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

ఈ మం త్రిత్వ శాఖల అధికారులతో ఆర్థిక మంత్రి  ఇప్పటికే చర్చలు జరిపారు. స్టాక్‌ మార్కెట్‌ ఎదుర్కొంటున్న ఆటుపోట్లు తదితర పరిణామాలను కేంద్రం ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నదని, ప్రధాని మోదీ కూడా పరిస్థితిని గమనిస్తూనే ఉన్నారని  మంత్రి వివరించారు. కేంద్రం తక్షణమే ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించక పోవచ్చు. కానీ కేంద్ర గమనిస్తున్నదని, ఆదుకుంటుందని చెప్పడం వల్ల ఆయా రంగాల వారికి భరోసా కలుగుతుంది. ఆర్థిక పరిస్థితిని, తీసుకోబోయే చర్యలను చర్చించడానికి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పా టు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సంబంధిత వర్గాలతో సమావేశాలు జరపడంతోపాటు దేశవ్యాప్తంగా పారిశ్రామిక, మేధోవర్గాల నుంచి కూడా ఈ టాస్క్‌ ఫోర్స్‌ సూచనలను తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

మొదట చైనాలో కరోనా విలయ తాండవం చేసినప్పుడు అక్కడి ఉత్పత్తి, ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడ్డది. స్వయంగా కరో నా బారిన పడటం వల్ల, పరోక్షంగా చైనా ప్రభావం వల్ల నష్టపోయిన పదిహేను దేశాలలో భారత్‌ కూడా ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడించింది. అమెరి కా, జపాన్‌, ఈయూ దేశాలతో పోలిస్తే చైనా విపత్తు ప్రభావం మనదేశ ఆర్థిక రంగంపై తక్కువగా ఉన్నది. అయినప్పటికీ ఈ రెండు రీతుల్లో భారత్‌ ఇప్పటి వరకు 348 మిలియన్‌ డాలర్ల మేర నష్టపోయిందని అంచనా.  ఫార్మా రంగం 70 శాతం ముడిపదార్థాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నది. క్రిమిసంహారకాల ముడిపదార్థాల కోసం కూడా చైనాపైనే ఆధారపడటం వల్ల చిక్కులు తప్పడం లేదు. చైనా ఇప్పటికే కుదేలైన నేపథ్యంలో కరోనా దెబ్బకు భారత్‌ నిలదొక్కుకుంటుందా అనేదాని పైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవితవ్యం ఆధారపడి ఉన్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొన్నది. అందువల్ల కరోనా విషయంలోనూ, ఆర్థిక రంగంలోనూ భారత్‌ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారాయి. 

కరోనా వైరస్‌ రావడానికి ముందే మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు కరోనా దాపురించింది. అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలే ఇప్పుడు గిలగిలలాడుతున్నాయి. కరోనా వైరస్‌ ఎప్పటికి శాంతిస్తుందీ, దీని మొత్తం ప్రభావం ఆర్థిక వ్యవస్థల మీద ఏమేర ఉంటుందనే అంచనాలు వేయడమే కష్టంగా ఉన్నది. అయినప్పటికీ ఉజ్జాయింపుగా ఆయా దేశాలు ఉద్దీపన పథకాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికాలో లక్ష కోట్ల డాలర్లు, యూరప్‌ దేశాలలో మరో లక్ష కోట్ల డాలర్ల మేర కొనుగోళ్ళు పెరిగితే తప్ప ఆర్థిక వ్యవస్థ కోలుకోదనేది ఒక ఆర్థిక వేత్త అంచనా. 2019లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం కనీసం 53 లక్షల నుంచి గరిష్ఠంగా రెండున్నర కోట్ల మేర పెరిగిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆర్థిక చక్రం తిరుగాడుతుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఈ కోణంలోనే ఆలోచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అన్నివర్గాల సంక్షేమంపై దృష్టి సారించడం, ఆర్థికరంగం పుంజుకునే రీతిలో నగదు చలామణి అయ్యేలా చూడటం అవసరం. 


logo