మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 25, 2020 , 22:46:53

పౌరుల నిర్లక్ష్యం ప్రమాదకరం

పౌరుల నిర్లక్ష్యం ప్రమాదకరం

ఈ మూడు మాసాలలో కరోనా వ్యాప్తి తీరును, పాక్షికంగా నియంత్రణ జరిగిన క్రమాన్ని గమనిస్తే.., ఈ సమస్యపై ప్రభుత్వాల చర్యలు ఎంత ముఖ్యమో పౌరులు బాధ్యతగా వ్యవహరించటం అంతే ముఖ్యమని అర్థమవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య తీవ్రతకు తగినట్లుగా నిర్విరామ చర్యలు తీసుకుంటున్నాయి. కొత్త చర్యలపై నిరంతరం ఆలోచిస్తున్నా యి. మరొక వైపు పౌరులకు ఈ సరికి భయం అయితే ఏర్పడింది. కానీ తమ బాధ్యతలను గుర్తించినవారు ఎందరున్నారో, ఇంకా గుర్తించక నిర్లక్ష్యం చేస్తున్న వారు అంతగా కన్పిస్తున్నారు! ఈ ధోరణి వేగంగా మారాలి.

పౌరుల బాధ్యతారాహిత్యం వల్ల కలిగే ప్రమాదానికి ఒక ఉదాహరణను గమనించా లి. కరోనా వ్యాధికి నాలుగు దశలుంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇంతకాలం ప్రాథమిక దశలోనే ఉండిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక దంపతుల నిర్లక్ష్యం కారణంగా ఈ నెల 21న రెండవ దశలోకి ప్రవేశించింది. వ్యాధి విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే పరిమితం కావటం మొదటిదశ. ఆ వ్యక్తుల నుం చి తమ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సంక్రమించటం రెండవ దశ. ఇటువంటి వారినుంచి చుట్టుపక్కల సమాజంలోని వారికి వ్యాపించటం మొదలైతే అది మూడోదశ. ఇక చివరిదైన నాల్గోదశలో వ్యాధి మన నియంత్రణలో లేకుండా విచ్చలవిడిగా మారుతుంది. దేశంలో కరోనా మొదలైనప్పటినుంచి కొన్ని ప్రాంతాలు రెండోదశలోకి ప్రవేశించగా, తెలంగాణ మాత్రం మొదటి దశలోనే ఉన్నది. అం దుకే ప్రభుత్వం రోగులంతా బయటివారేనని, వారికే చికిత్సలు చేస్తున్నామని, రాష్ట్రంలోని ఏ ఒక్కరికి కూడా వ్యాధి సోకలేదని చెబుతున్న ది. 

కాని ఆ స్థితి ఇప్పుడు ఒక బాధ్యతారహితుడైన రోగి, ఆయన భార్య కారణంగా భంగపడింది. మరొక కేసు- ఇండోనేషియా వారితో కలిసి తిరిగిన ఒక కరీంనగర్‌ వాసిది. అయితే అది ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినదికాదు. మొత్తానికి ఈ స్థితిని అక్కడికే పరిమి తం చేసి నిలువరించాలంటే పూర్తి జాగ్రత్త తప్పనిసరి.జరిగిందేమిటంటే.. సదరు కుటుంబం దుబాయి నుంచి హైదరాబాద్‌కు మార్చి 14 నాడు వచ్చింది. కాని పరీక్షలు చేయించుకోలే దు. మూడు రోజుల తర్వాత కరోనా లక్షణాలు కన్పించటంతో పరీక్షలు చేయగా ధృవీకరణ జరిగింది. అప్పటికే మూడు రోజుల కాలంలో కుమారునితో, పనిమనిషితో, డ్రైవర్‌తో కలుస్తూనే ఉన్నారు. ఇపుడు వీరందరికి పరీక్షలు జరిపితే కుమారునికి పాజిటివ్‌ అని తేలింది. తక్కినవారి పరీక్షా ఫలితాలు ఇంకా అందవల సి ఉన్నది.ఈ విధంగా బయటి నుంచి వచ్చిన దంపతుల నుంచి స్థానికంగా ఇతరులకు వ్యా పించటం రెండోదశ అయితే, అట్లా వ్యాపించ టం ఎక్కడినుంచి మొదలవుతుందో ఆ ఇంటి ని వ్యాప్తి కేంద్రంగా పరిగణిస్తారు. తెలంగాణ లో ఇట్లా వ్యాప్తి కేంద్రం ఒకటి మొదలుకావ టం ఇదే మొదటిది. అట్లా ఒక వ్యాప్తి కేంద్రా న్ని గుర్తించినపుడు ఇక అక్కడి నుంచి ఒక కిలోమీటర్‌ పరిధిలోగల అన్ని ఇళ్లను, సంస్థల ను పరీక్షించవలసి ఉంటుంది.

 ప్రస్తుతం వైద్యులు, అధికారులు అదే పని లో ఉన్నారు. ఈ విధమైన నిర్లక్ష్యాన్ని పౌరులు వీడితేనే తెలంగాణ రెండోదశలోకి ప్రవేశించకుండా ఆగుతుంది. కేసీఆర్‌ ఆదివారం చెప్పిం ది ఇదే.

ఇటువంటి నిర్లక్యాల వల్ల ఇదే విధమైన ప్రమాదాన్ని తెలంగాణ ఎదుర్కొన్న సందర్భా లు ఇంకా ఉన్నాయి. ఇక్కడి మొట్టమొదటి కరోనా కేసు వ్యక్తి కూడా దుబాయి నుంచి బెం గళూరు మీదుగా హైదరాబాద్‌ వచ్చినవాడే. ఇదే పద్ధతిలో మరెంతో మంది విదేశాల నుం చి నేరుగానో, ఢిల్లీ, బెంగుళూరు, ముంబయి వంటి ఇతర నగరాల మీదుగానో, రైళ్లు, రోడ్డు మార్గాల ద్వారానో హైదరాబాద్‌కు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గల ఈ వ్యాధి విషయం, అవసరమైన జాగ్రత్తలు, పరీక్షల సంగతి వారి కి తెలియదని అనుకోలేం. అయినప్పటికీ వారు గుట్టుచప్పుడు కాకుండా, అధికారులను ఏమార్చి తమ నివాసాలకు వెళ్లిపోతున్నారు. వారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు ఇది తమకు సైతం ప్రమాదకరం కాగలదని తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారు. ఈ జాబితాలోకి కనికా కపూర్‌, మేరీ కోమ్‌ వంటి ప్రముఖులు కూడా చేరటం విస్మయాన్ని కలిగించే విషయం. ఇంత ప్రమాదకర బాధ్యతారాహిత్యాన్ని నమ్మటం కూడా కష్టమవుతున్న ది. ఇటువంటి ధోరణి దృష్టికి వచ్చినందువల్లనే కావచ్చు సీఎం కేసీఆర్‌, ఇతర దేశాలనుంచి వచ్చిన వారంతా తప్పక పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్‌,ఐసొలేషన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, కుటుంబసభ్యులు తగు జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు.  అవసరమైన పరీక్షలు, చికిత్సలు మాత్రమే జరుగుతాయని, ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని వివరించి చెప్తున్నారు.ఈ పనిని వారు తమ కోసం, తమ కుటుంబాల కోసం, సామాజిక బాధ్యతగా చేయాలని కోరుతున్నారు. కేసీఆర్‌ ఆదివారం అన్నట్లు విదేశీ విమానాల ఆపివేతతో ఒక సమస్య నిలిచిపోయింది. అంతర్రాష్ట్ర రాకపోకలబంద్‌తో మరో సమస్య తీరిం ది. ఇక స్థానిక వ్యాప్తిని నిరోధించగలిగితే విజయానికి చేరువ అవుతాం.

ఇందులో పౌరులు తమకు తాముగా అర్థం చేసుకోలేనిది ఏమీ లేదు. పత్రికలు,ఛానళ్ల నిం డా ఈ సమాచారాలు, చర్చలు తప్ప మరేమీ లేవు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రతిరోజు వివరించి చెప్తూనే ఉన్నది. నిర్లక్ష్యాల వల్లనే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వందలు వేల మం ది చనిపోతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు కుప్పకూలుతున్నాయి. తమ కండ్ల ఎదుట ఇం త జరుగుతున్నా ఇటువంటి నిర్లక్ష్యాలను, బాధ్యతారాహిత్యాన్ని గమనించినప్పుడు ఆగ్ర హం కూడా కలుగుతుంది. కేసీఆర్‌ గత 21న చెప్పిన లెక్కల ప్రకారం.. మార్చి ఒకటి నుంచి అప్పటివరకు సుమారు ఇరవై వేల మంది ఇత ర దేశాల నుంచి రాష్ర్టానికి వచ్చారు. వారందరి జాడ కనుగొనే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులున్నారు. వారిలో బాధ్యతగా వ్యవహరించింది ఎందరు? పరీక్షలు జరిపి క్వారంటైన్‌ లోనో, ఐసొలేషన్‌ లోనో ఉంచిన వారుకూడా అధికారుల కన్ను గప్పి తిరుగుతున్నట్లు వార్త లొస్తున్నాయి. పరిస్థితి రోజురోజుకు ఎంత ఆందోళనకరంగా మారుతున్నదో, అయినప్పటికీ పలువురు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారోఎన్ని ఉదాహరణలనైనా పేర్కొనవచ్చు.

 ఈ పరిస్థితులలోనే కొందరు నిపుణులు దేశం రెండోదశను దాటి మూడోదశలోకి ప్రవేశించిందని హెచ్చరిస్తున్నారు. కొందరి అంచ నా ప్రకారం దేశంలో మూడోదశ అధికారుల దృష్టికి రాకుండా చాప కింది నీరులా వ్యాపిస్తున్నదని, రానున్న కొద్ది కాలంలోనే ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ (వ్యాధి లక్షణాలను వైరస్‌ పూర్తిగా సంతరించుకునే రెండు వారాల కాలం) పూర్తయి ఒక వెల్లువలా బయటపడవచ్చునని భయపడుతున్నారు. చైనాతో సహా పలు ఇతర దేశాల్లో జరిగింది ఇదే. ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే నమూనా పరీక్షలు ఇం కా విస్తృతంగా జరపటం, నివారణ పరికరా లు భారీగా అందుబాటులోకి తేవటం, క్వారంటైన్లను, ఆస్పత్రి పడకలను పెంచటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల కదలికలపై తగినంతకాలం గట్టి ఆంక్షలు అవసరమంటున్నారు. అయితే గత ఆదివారం నాటి ప్రజాకర్ఫ్యూను విజయవంతం చేసిన పౌరు లు ఆ మరునాటి నుంచి అమలుకు వచ్చిన లాక్‌ డౌన్‌కు సరిగా సహకరించకపోవటంపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తపరచవలసిన స్థితి ఏర్పడింది. అటువంటివారిపై జైలు, జరిమానా శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. అదే విధమైన చర్యలు తీసుకోగలమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కూడా ప్రకటించటం గమనార్హం.

కేసీఆర్‌ నాయకత్వాన తెలంగాణ ప్రభు త్వం, మోదీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ర్టాలు ఒక వైపు ముందు జాగ్రత్త చర్యలను, మరొకవైపు చికిత్సల ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. అది లేనట్లయితే రాష్ట్రం, దేశం ఇప్పటికే మూడోదశలోకి ప్రవేశించి ఉండేది. పౌరులు తగు బాధ్యతతో వ్యవహరించినప్పుడు మాత్రమే సమస్యను నియంత్రించేందుకు వీలవుతుంది. అందుకే ప్రధాని మోదీ ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ అనుభవాలను మరువొద్దని హెచ్చరిక చేశారు.

 విచిత్రం ఏమంటే ఇటువంటి స్పృహ తెలంగాణలోని గ్రామీణులకు విస్తృతంగా ఉన్నట్లు, వారు తీసుకుంటున్న  చర్యలు చెబు తున్నాయి. కానీ సమస్య అంతా చదువులు చదివిన వారు, పట్టణవాసులు, విదేశాల నుం చి వస్తున్న వారు, విమానం దిగే ముందు పారాసిటమాల్‌ వేసుకుంటున్నవారు, సోకాల్డ్‌ నాగరికులనుంచే నిర్లక్ష్యం పొంచి ఉంటున్నది.   ఒక అధికారి అన్నట్లు ఈ వ్యాధిని దాచిపెట్ట చూడటం హత్యాయత్నం వంటి నేరమే. ఇక నైనా పైరులు బాధ్యతగా వ్యవహరించాలి.


logo
>>>>>>