శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 25, 2020 , 22:44:48

ఈ అనుభవం ఓ గుణపాఠం

ఈ అనుభవం ఓ గుణపాఠం

సానిటైజర్‌, ఐసోలేషన్‌, క్వారంటైన్‌ లాంటి పదాలను తొలిసారి వింటున్న ప్రజలే అత్యధికంగా కలిగిన దేశం మనది. పామో.. తేలో.. కరిస్తే డాక్టర్‌ దగ్గరికి కాకుండా, మంత్రగాడి దగ్గరికి పరుగులు తీసే నమ్మకాలున్న సమాజమిది.పండుగలు, ఉత్సవాలు, వివాహాలు, విషాదాలు.. విషయం ఏదైనా సరే సామూహికంగా జరుపుకునే సంస్కృతి ఈ నేలది. ఇలాంటి దేశం నేడు వైద్య శాస్ర్తానికే ఇంకా సంపూర్ణంగా అర్థం కాని భయంకరమైన వ్యాధితో యుద్ధం చేయాల్సి వస్తున్నది. అజ్ఞాత శత్రువు ముప్పు నుంచి తప్పించుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది.

ప్రపంచంలోనే అతి వేగంగా పరిగెత్తే రైలును, రాకెట్‌ వేగంతో దూసుకెళ్లే విమానాలను ఉత్పత్తి చేసిన చైనానుంచే బహుముఖం గా వ్యాపించే వైరస్‌ పుట్టుకొచ్చింది. మేడిన్‌ చైనా వస్తువులు లేని దేశమే లేనట్టుగా ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకూ చైనా వైరస్‌ వ్యాపించింది. ఈ స్థితిలో సమాజం ప్రదర్శించే ఐక్యత, విజ్ఞతపైనే మన దేశం ఎంత మేరకు నష్టాన్ని తగ్గించుకోగలుగుతుందనేది ఆధారపడి ఉం టుంది. వైరస్‌ వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని ఎలా గూ తప్పించుకోలేం. వీలైనంత ప్రాణనష్టం తగ్గించుకోవడమే ఇప్పుడు అందరి ముందు న్న లక్ష్యం. 

వైరస్‌ దిగుమతిని మొదట్లోనే ఆపగలిగా మా? లేదా? అనేది పక్కన పెడితే, భారత దేశం కరోనా వైరస్‌పై స్పూర్తిదాయకమైన పోరాటమే చేస్తున్నది. రాజకీయ విబేధాలను వ్యక్తిగత అహంకారాలను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. నరేంద్రమోదీ అంటేనే ఒంటి కాలిపై లేచే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి బాసటగా నిలిచారు. బీజేపీతో సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నప్పటికీ కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం కేంద్రంతో కలిసి నడుస్తున్నది. దేశానికి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేంద్రాన్ని సమర్థించిన కేసీఆర్‌ ప్రభుత్వం కరోనా విషయంలో అదే ఒరవడి కొనసాగించింది. 

మొన్ననే మోదీతో వైరం పెట్టుకుని మరీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఉద్ధవ్‌ కూడా దేశం కోసం అంతా కలిసి నడుద్దామని చెప్పా రు. విపత్కర సమయంలో నాయకులు ప్రజ ల ప్రాణాల రక్షణే లక్ష్యంగా కలసి నడవడానికి సిద్ధమవ్వడం శుభ పరిణామం. అలా అని వైరస్‌ను అరికట్టే విషయంలో కేంద్రంపై ఆయా రాష్ర్టాలకు ఫిర్యాదులు లేవని కాదు. అడిగినన్ని వెంటిలేటర్స్‌, టెస్ట్‌ కిట్స్‌, మాస్కు లు, ఇతర వైద్య పరికరాలు, ఆర్థిక సహాయం అందివ్వట్లేదని రాష్ర్టాలు కేంద్రంపై ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. కానీ దానికిది సమయం కాదని భావించి, ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు సంయమనం పాటిస్తున్నాయి. మన దేశ రాజకీయ వ్యవస్థ సాధించిన పరిపక్వతకు ఇది నిదర్శనం. అదే అవగాహన, స్పూర్తితో ముందుకు సాగడమే అందరి ముందున్న కర్తవ్యం. 

జరుగబోయే ప్రమాదం పసిగట్టిన దగ్గర నుంచి ప్రణాళికాబద్ధంగానే వ్యవహరిస్తున్నాం. మొదటి దశలో విదేశాల నుంచి వ్యాధిగ్రస్తులు రాకుండా విమానాలు ఆపారు. రెండో దశలో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, అందులో వ్యాధి సోకిన వారికి చికిత్స ప్రారంభించారు. మూడో దశలో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వ్యాధి సోకిన స్థానికులనూ గుర్తించా రు. ఇప్పుడు స్థానికుల ద్వారా మొత్తం సమా జానికి, తద్వారా యావత్‌దేశానికి వ్యాధి ప్రబలకుండా చూడాల్సిన తరుణం వచ్చింది. ఇం దుకోసం ప్రభుత్వపరంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ చేశారు. ప్రజలు ఒకే దగ్గర గుమిగూడకుండా చూడటం, ఎవరికి వారు ఒంటరిగానే ఉండటం, వ్యాధి లక్షణాలు కలిగిన వారంద రూ వెంటనే పరీక్షలు చేయించుకోవడం లాం టి చర్యలు ప్రారంభమయ్యాయి. వీటిని ప్రజ లు ఎంత బాగా పాటిస్తే అంత తక్కువ ముప్పుతో దేశం బయటపడుతుంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి ఎంత మద్దతు లభింస్తుందనేదే ఈ మొత్తం వ్యవహారంలో కీలకాంశం. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కొన్ని దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. బయటకు వస్తే జైలు, భారీ జరిమానాలు విధిస్తున్నారు. దేశంలో మొదటి నుంచి ప్రజలను ఎక్కువగా భయభ్రాంతులకు గురిచేయకుండానే వ్యాధి విస్తరణను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి విషమించే అవకాశాలు కనిపిస్తుండటంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటు న్నారు. 

విజ్ఞులకు చేదు అనుభవం కూడా ఒక మం చి అవకాశమే. ప్రతికూల పరిస్థితుల్లో ప్రజ్ఞ ప్రదర్శించిన వాడే విజేత. ఇప్పుడు కరోనా రూపంలో దేశానికో గుణపాఠం కూడా అవసరమే. ఇతర దేశాల మాదిరిగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య వేలల్లో, లక్షల్లో లేదు. కాబ ట్టి మనదగ్గర ఉన్న సదుపాయాలు సరిపోతున్నాయి. 

కానీ, నిజానికి దేశం వైద్య సదుపాయాల విషయంలో చాలా వెనుకబడి ఉన్నది. కేరళ, తమిళనాడు, తెలంగాణ లాంటి కొన్ని రాష్ర్టాలను మినహాయిస్తే ఎక్కడా ప్రజారోగ్యం పై సరైన దృష్టి పెట్టడం లేదు. ప్రతి వెయ్యి మందికి కనీసం 7 నుంచి 8 బెడ్స్‌ అందుబాటులో ఉంచడం ఉత్తమ ఆరోగ్య పరిరక్షణ విధానం. కానీ మన దేశంలో కేవలం 0.7 మాత్రమే ఉన్నాయి. అంటే వెయ్యి మందికి ఒక్క బెడ్‌ కూడా లేదు. ఐసియు బెడ్స్‌ ప్రతి వెయ్యి మందికి రెండు నుంచి మూడుండాలి. కానీ, దేశంలో 0.07 కన్నా తక్కువ ఉన్నాయి. అంటే పదివేల మందికి ఏడు కూడా లేవు. ఇక వెంటిలేటర్లు, ల్యాబులు, టెస్ట్‌ కిట్స్‌, డయాలసిస్‌ సెంటర్లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఐసోలేషన్‌ వార్డులు తదితర సదుపాయల విషయం లో మన దేశం ప్రమాణాలకు చాలా దూరంగా  ఉందన్నది నిర్వివాదాంశం. వైరస్‌ సోకడం ద్వారా వచ్చే వ్యాధులకు సంబంధించిన రోగ నిర్ధారణకు దేశంలో ఒకే ఒక సంస్థ ఉంది. పుణేలోని నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మాత్రమే దిక్కు. 

ఈ సారి కరోనా వచ్చినట్లే, ఇంతకు ముందు స్త్వ్రన్‌ ఫ్లూ, చికెన్‌ ఫ్లూ, బర్డ్‌ ఫ్లూ, నిఫా లాంటి వ్యాధులొచ్చాయి. అప్పుడు కూడా శాంపిల్స్‌ పుణేకు పంపి, ఫలితాల కోసం నిరీక్షించాల్సి వచ్చేది. దీనివల్ల విలువైన చికిత్సా సమయం కోల్పో యి పేషెంట్‌ పరిస్థితి విషమిస్తున్నది.కనీసం రాష్ర్టానికో ఎన్‌ఐవీ ని నెలకొల్పాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభు త్వం గుర్తించాల్సి ఉంది. హైదరాబాద్‌లోని సీసీఎంబీలో పరీక్షలు నిర్వహించడానికి అనుమతిస్తే, వెయ్యి మందికి ఒకే సారి పరీక్షలు జరప వచ్చని సీఎం కేసీఆర్‌ సాక్షాత్‌ ప్రధాన మంత్రికి మార్చి 20న జరిగిన వీడి యో కాన్ఫరెన్సులో చెప్పారు. కేంద్ర ప్రభు త్వం అనుమతించింది కూడా. కానీ 25 వర కు అనుమతి రాలేదు. ఫలితంగా సీసీఎంబీలో పరీక్షలు జరుపడం లేదు. మన దేశంలో విధానపరమైన లోపాలకు ఇదో ఉదాహరణ. ఇలాంటి లోపాలు సవరించుకోవడానికి ఈ విషాదం ఓ గుణపాఠంగా మారితేచాలు. సవా ళ్లు సమర్థతకు పరీక్షలు. కఠినమైన పరిస్థితులను తట్టుకుని నిలబడిన ప్రతి సందర్భం మానవ నాగరికత పురోగతిలో ఓ మైలురాయిలా మారింది. ఈ సందర్భమూ అలాంటి విజయమే సాధించాలి.


logo