మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Mar 25, 2020 , 22:44:22

భాగవత మకరందం

భాగవత మకరందం

భారతీయ సాహిత్యంలో ప్రాచీనతా పరంగానేకాక ధర్మోపదేశ పరంగాను వేదాల తర్వాత అంతటి మహనీయ స్థానాన్ని అలంకరించేవి పురాణాలు. ప్రభువులలాగా శాసించేవి వేదాలు, మిత్రులలాగా మంచిని పంచేవి పురాణాలు. పురాతన కాలానికి చెందిన పురాణాలు నిత్యనూతనాలు.

సనాతన భారతీయ సంస్కృతితోపాటు మానవ జీవన వికాసానికి తోడ్పడే ఎన్నో విలువలను వెలువరించిన పురాణాలు విశ్వవిజ్ఞాన సర్వస్వాలుగా వెలుగుతున్నాయి. అటువంటి పురాణాలలో శ్రేష్ఠమైంది శ్రీమద్భాగవతం. అందుకే, దానిని ‘పురాణ తిలకం’ అన్నారు.  ముక్తి సాధనాలలో భక్తిది మొదటి స్థానం. భక్తి ప్రబోధకం భాగవతం. ‘భక్త్యా భాగవతం జ్ఞేయం’ అన్నది విజ్ఞులమాట. భాగవతాన్ని భక్తిద్వారా ఆస్వాదించాలి. భాగవతం భావ (హృదయ) గతమైతే, ముక్తి కరతలామలకమే. సమగ్రంగా శ్రీకృష్ణకథను ఆవిష్కరించిన భాగవతం అచ్చంగా శ్రీకృష్ణ స్వరూపమే. సామాన్యంగా కొన్ని గ్రంథాలు చదువుతున్నకొద్దీ గ్రంథులను (ముడులను అంటే సంసారబంధాలను) కలిగిస్తాయి. కాని, భాగవత గ్రంథ పఠనం లేదా శ్రవణం వల్ల సంసారగ్రంథులు తెగి భక్తులకు కైవల్యం కైవసమవుతుంది. వేదవ్యాస మహర్షి అనేక పురాణాలను రచించికూడా శాంతిని పొందని క్లిష్టస్థితిలో శ్రీమద్భాగవతాన్ని రచించి మన:శాంతిని సంతరింపజేసుకున్నాడు. సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు విరచించిన భాగవతానికి తెలుగుల పుణ్యపేటి అయిన పోతనామాత్యుడు అనువాదం పేరిట తీయని తెలుగు పద్య మకరందాన్ని మనకందించాడు. ‘శ్రీ కైవల్య పదంబు’ అన్న పదంతో భాగవత రచనకు శ్రీకారం చుట్టి తెలుగువారికి కైవల్యపథానికి బంగారుబాట చూపాడు పోతన్న.


భాగవత మకరందం అమృతం కంటే శ్రేష్ఠం. అది దేవతలకు కూడా దుర్లభం. సంసారతప్తులైన మానవులకు అది లభ్యం. దివ్య మకరందాన్ని పంచే భాగవతాన్ని ‘కమనీయ కల్పవృక్షం’గా నిరూపించాడు మహాకవి పోతన. లలితములైన స్కంధములు కలది భాగవతం. అందమైన బోదె కలది కల్పవృక్షం. కృష్ణుడు మూలంగా కలిగి ముచ్చటైంది భాగవతం. నల్లని వేళ్లు కలది కల్పవృక్షం. శుకమహర్షి సుకుమార సూక్తులతో సుమనోహరమైంది భాగవతం. చిలుక పలుకులతో కమనీయమైంది కల్పవృక్షం. సౌందర్య సంశోభితమైంది భాగవతం. సుమధుర లతలతో సుందరమైంది కల్పవృక్షం. విజ్ఞులు తెలుసుకోదగింది భాగవతం. విశేష వర్ణాలుగల విరులతో విజ్ఞేయమైంది కల్పవృక్షం. సుందరం, ఉజ్జలమైన ఇతివృత్తం (కథ) కలది భాగవతం. సుందరోజ్జలమైన గుండ్రని ఆకారం (వృత్తం) కలది కల్పవృక్షం. కైవల్య రూపమైన ఫలం ప్రసాదించేది భాగవతం. మహత్తపూర్ణమైన ఫలాలను కలిగింది కల్పవృక్షం. విమలమతి అయిన వేదవ్యాసుడే ఆధారంగా కలిగింది భాగవతం. స్వచ్ఛమైన వ్యాసం (చుట్టుకొలత) కల పాదు కలిగింది కల్పవృక్షం. ఆ కల్పవృక్షమేమో స్వర్గంలో పక్షులకు శ్రేయస్కరమై ఉండగా, ఈ భాగవత కల్పతరువు భూమిపై సంస్కారవంతులకు శ్రేయస్సాధకమై ఉన్నది. ఇటువంటి భాగవత కల్పతరువును సేవిద్దాం, తరిద్దాం.


logo