శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Mar 24, 2020 , 22:45:52

శ్రీ సదానందో విజయతే..

శ్రీ సదానందో విజయతే..

అఖిల ప్రపంచం అఖండానంద స్వరూపమే. అయినా ఆనందానుభూతి పొందుతున్నామనే కేవల భావనతోనే జీవిస్తుంటుంది. ‘ఆనందం’ అనేది ఏమిటనే అంశమే అత్యంత ఆలోచనీయం. కేవలానుభూతి ప్రధానమైన ఆ విషయం అనిర్వచనీయం కూడా. అవ్యక్తం, అనిర్వచనీయం, అనుభూతి, ఆనందం మొదలైన పదాలను విడివిడిగా చూడటం కుదరదు. అంతర్లీనంగా అవన్నీ ఒకటే. సహజంగా సచ్చిదానందమనే పదసముచ్ఛయాన్ని వాడుతుంటాం. సత్‌ చిత్‌, ఆనందములనే ఈ మూడు పదాలను వివరణగా చూస్తే, ‘సత్‌' అనేది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ‘చిత్‌' మౌనంగా ఉనికిని తెలుపుతుంది. ఆనందం ఈ రెండింటికీ కన్నతల్లి లాంటిది. 

‘శర్కర’ అనే పదార్థాన్ని తీసుకుంటే తెల్లగా ఉండటం, వాసన లేకపోవడం మొదలైనవి దాని లక్షణాలు. ఇవి కేవలం బాహ్యలక్షణాలు. కానీ ‘తీపిదనం’ ప్రధాన లక్షణం కదా! జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా అనుభూతి కలిగేవి సత్‌, చిత్‌లు. అయితే, ఈ రెండింటికీ అతీతమైన విషయమే అనుభవైక వేద్యము కదా! అదే ‘ఆనందం’. దీనినే ‘రసము’ అనికూడా అంటారు. ఈ ‘రసము’ ఎవరిద్వారా ఉత్పన్నమౌతుంది?  ఎవరిద్వారా వృద్ధి పొంది ఎవరిని అలరిస్తుంది. చివరికి ఏమౌతుంది? అనే విశ్లేషణను అనేకులు అనేక విధాలుగా చర్చించినారు. అసలు ఆనందాన్ని అనుభవించిన వారికి మాత్రమే అది అభివ్యక్తమవుతుంది. ప్రపంచంలోని వస్తుజాలములను నిస్పృహతో, నిరీహగా చూసి ఔదాసీన్యాన్ని పూర్తిగా అభ్యసించిన సాధకునికైనా ‘ఆనందం’ అనేది విషయంలో లేదు, నిస్పృహాదులలో లేదు, అది ‘దానిగానే’ ఉన్నదని తెలుస్తుంది. ఇవన్నీ అవరోధాలు మాత్రమే అని కూడా తెలుస్తుంది. 


  • నమస్తే..నమస్తే.. నమః
  •  శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి

జ్ఞానవికాసం అయినంతటనే ఏ విషయాన్నికూడా వస్తుబుద్ధితో దర్శించడం జరగదు. ఆనంద చక్షువులతో చూడడం జరుగుతుంది. వాస్తవబుద్ధి కలుగుతుంది. అంతటా ఒకే స్వరూపంగా కనిపిస్తుంది. అనుభవానికి, చూడటానికి, వస్తువుకు, ఇంద్రియాలకు మధ్యలోని అంతరం అంతమై అంతటా ఆనందమే భాసిస్తుంది. సముద్రంలోని అలలను చూసిన వ్యక్తికి ఆ అలలు వేరే పదార్థం కాదనీ, నీరే అలలని తెలిస్తే ఇక అలలు కల్లలుగానే లేదా కలగానే తోస్తాయి కదా! దీనికోసం సాధన అవసరం. ఆ సాధన సక్రమంగా జరగాలి. సదాచారం, స్నేహం, సహాయం, సంయమనం, సేవ ఇవన్నీ సంతోషాన్ని ఎల్లప్పుడూ అనుభవించేందుకు సహకరించే అంశాలు. ఇవి ప్రాథమిక అంశాలు. ఇంకా సాధన చతుష్టయ సంపత్తి చాలా అవసరం. అంటే, నిత్యానిత్య వస్తు వివేకం, శమాది షట్కసంపత్తి, ఇహాముత్రాఫలభోగ విరామం, ముముక్షుత్వం ఇవే సాధనకు కీలకాలైన అభ్యాస సంపదలు. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది మంచి, ఏది చెడు, ఏది యదార్థం, ఏది అబద్ధం ఇలా వడబోసి చూసే తెలివి పేరు నిత్యానిత్య వస్తువివేకం, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, గురువాక్యాన్ని ఆచరించడం. తృప్తిని కలిగి ఉండడం, ఎదిగిన స్థాయిలోనే నిలబడి ఉండడం కోసం తగిన ఓరిమి కలిగి ఉండడంతో పాటు శీతోష్ణ సుఖదుఃఖాలను ప్రతీకారరహితంగా అనుభవించడం, ఆనందస్థాయిలోనే వ్యవహరించడం వీటిని ‘శమాది షట్కసంపత్తి’ అంటారు. 

సాధనవల్ల వచ్చే ఇహలోక, పరలోక సుఖాలపట్ల ఆసక్తి ఉండకపోవడమే ఇహాముత్రార్థ ఫలభోగ విరామం. పై మూడింటి ద్వారా స్థిరీకరణమైన చిత్తంతో బంధ, మోక్షాలను విచారించుకొని మోక్షాసక్తితో ఉండటం పేరు ముముక్షుత్వం. వీటిని అన్నింటినీ విస్తృతంగా పరిశోధించి ఆచరించాలి. వస్తుభ్రాంతిని వదిలి వాసుదేవస్థితి పొందేందుకు అహరహం ప్రయత్నించాలి. మాటలలో చెబితే ప్రయోజనం లేదు. ఆచరణ చేసి చూడాలి, చేవ చూపాలి. వాచా వేదాంతం పనికిరాదు. అనుష్ఠాన వేదాంతమే ఆచరణీయం. అంతటా పరమాత్మను దర్శించేందుకు సాధనయే బహుళాదరణీయం ‘సాధనాత్‌ సాధ్యతే సర్వమ్‌' కదా !


logo