బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 24, 2020 , 22:43:25

శ్రీ శార్వరి!

శ్రీ శార్వరి!

శ్రీ వికారీ వీడుకోలు

ఆకారమంత వికారం గాదని

భాష్యాలెన్నో చెప్పేసుకొని

లెక్కకు చిక్కని మిక్కిలి తిక్కలు

బుద్ధికి అందని నూతన తిప్పలు

మేధకు లొంగని వైరస్సు డెత్తులు

ధరిత్రి చుట్టూరా కమ్మటం కన్నాం!

శ్రీ శార్వరి సుస్వాగతం

కృష్ణపక్షపు రాత్రిలో

తుహినకరుడు తరిగినటు

క్రమంగా బుద్ధిని హరించక

శుక్లపక్షపు శార్వరిలో

వెన్నెల అతిశయించినట్లు

మనో వికాసం విస్తరిస్తూ

మధుమాసపు తరుల తీరు

విరబూసే విరుల తీరు

శ్రావ్యపు కూతల కోకిలల తీరు

ప్రాభాత మయూఖాల వెల్గుల తీరు

ప్రాణకోటి మనుగడుండేనని 

చైత్రపు విరుల నెత్తావులల్లే

మలయమారుతపు మంచిగంధమల్లే

శుభఘడియల్ని చుట్టూ చుట్టుకుని

జగత్తుకు వరప్రదాతమయ్యేవని

వినమ్రంగా నమస్కరించి ప్రార్థిస్తూ

ఆహ్వానమమ్మా ఆహ్వానం

శ్రీ శార్వరి!! శ్రీ శార్వరి!!


- రవి కిశోర్‌ పెంట్రాల

లాంగ్లీ, లండన్‌


logo