సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 24, 2020 , 22:39:11

శార్వరికి స్వాగతం!

శార్వరికి స్వాగతం!

నేడు ఉగాది పర్వదినం, శార్వరి సంవత్సరాది. కొత్త వత్సరంలోకి అడుగు పెట్టడం అంటే ఆనందంతో పాటు ఉద్వేగం మిళితమై ఉంటుంది. భవిష్యత్తుపై ఆసక్తి, ఒకింత ఆందోళన. రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం మొదలైన అంశాలు తెలుసుకుంటూ ఉంటారు. జీవితమంతా ఒకేలా సాగదు. కొంత ఆశ, మరికొంత నిరాశ కూడా కలిసి ఉండవచ్చు.  ఒక్కోసారి మనం బాధాకరం అనుకునేది నిజానికి సౌఖ్యంగా పరిణమించవచ్చు. అందుకేనేమో పూర్వీకులు తొలిరోజు ఉగాది పచ్చడి సేవనాన్ని ఆచారంగా పెట్టారు. జీవితమంటే షడ్రుచుల సమ్మేళనమనే తాత్త్వికతను బోధించారు. జీవితంలోని భిన్న కోణాలను గంభీరంగా స్వీకరించాలనే సందేశాన్ని అందించారు. ఈ తాత్తికతను అర్థం చేసుకుంటే ఒడిదొడుకులను ఎదుర్కొని నిలువగల మానసిక ైస్థెర్యం నెలకొంటుంది. ఈ సానుకూల దృక్పథంతోనే నూతన సంవత్సరం శార్వరికి స్వాగతం పలుకుదాం. అనేక విజయాల మధ్య, కరోనా చేదు అనుభవాలను మిగులుస్తూ వికారి వీడ్కోలు తీసుకున్నది. శార్వరి తీపిని పంచుతుందనే ఆకాంక్షతో, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుదాం. కొత్త ఏడాదిలో కోరిన విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. 

ఉగాది అనగానే తెలంగాణ మేధోసంపత్తి గుర్తుకువస్తుంది. శాలివాహన శకమనే కాలగణనను ప్రపంచానికి కానుకగా అందించినది మన సమాజమే. కాలగణన మేధావులకే పరిమితమైంది కాదు. దుక్కిదున్ని విత్తనాలు వేసే రైతన్నల కు కూడా పంచాంగమే ప్రామాణికం. ఈ పంచాంగమే ఇరుగు పొరుగు రాష్ర్టాలకు, దేశ సరిహద్దులు దాటి తూర్పు ఆసియాకు చేరింది. స్వాతంత్య్రానంతరం జాతీయ కాలగణనగా గుర్తింపు పొందింది. మానవ నాగరికత ప్రతి దశలోనూ తెలంగాణ భాగస్వామ్యం ఉన్నది. కళా సాహిత్యరంగాల్లోనైనా, విజ్ఞానంలోనై నా తెలంగాణ తన వెలుగును నలుదెసలా ప్రసరించింది. ప్రపంచంలో తొలి గణతంత్రాలుగా  ప్రసిద్ధికెక్కిన షోడష జనపదాల్లో మన తెలంగాణలోని అశ్మక జనపదం కూడా ఒకటి. గోదావరి, కిన్నెరసాని గలగలల లయకు దీటుగా శిలలపై ఉలి నాట్యమాడుతుంటే, శిల్పకళ పురుడు పోసుకున్నదిక్కడే. సాంచి స్థూప తోరణాల సొబగులు అద్దినది తెలంగాణ శిల్పులే. వందేండ్ల కిందటే ఆధునిక వేధశాలను నిర్మించుకొని, అంతరిక్షాన్ని కొలిచిపెట్టిన ఘనత మనది. భవిష్యత్తులోకి అడుగుపెట్టే ముందు గతాన్ని తలుచుకొని, ధైర్యంగా ముందడుగు వేద్దాం. 

ఉగాది షడ్రుచులను ఒకేసారి ఆస్వాదించడం మన జీవన తాత్తికతకు నిదర్శనం. చరిత్ర యావత్తూ తెలంగాణ జాతి ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. సామ్రాజ్య కేంద్రంగా వెలిగింది, పరాయి పాలన చీకటిలోనూ మగ్గింది. కష్టసుఖాలు మనకు కొత్త కాదు. విజయాలకు విర్రవీగిందీ లేదు, కష్టాలకు కుంగిపోయిందీ లేదు. తెలంగాణ అంటేనే ఉత్తమ జీవన విధానం. సాత్వికత, సమష్టి తత్తం ఉట్టిపడుతుంది. బతుకమ్మ చప్పట్లు, పాల పిట్టల దర్శనాలతో, పండుగలు పబ్బాలు  సామూహికంగా జరుపుకొనే మహోన్నత సంస్కృతి మనది. కానీ కాలం మనకొక విషమ పరీక్షను పెట్టింది. కరోనా వైరస్‌ మన ఉనికినే సవాలు చేస్తున్నది. ఇంద్రజిత్తు మాదిరిగా కంటికి కనిపించని మాయా యుద్ధం సాగిస్తున్నది. ఇతర దేశాల అనుభవాలు భయంకరంగా ఉన్నాయి. కరోనా ఇప్పటికే లక్షలాదిమందిని చేరింది. ఇతర దేశాలు అనుభవిస్తున్న క్షోభ నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుందాం. ఆ మహమ్మా రి మనలను తాకకుండా అతిజాగ్రత్తగా ఉందాం. కొంతకాలం పాటు ఇంటికే పరిమితం కావాలనే సామూహిక నిర్ణయం తీసుకుందాం. కాలం పెట్టిన కరోనా పరీక్షను దిగ్విజయంగా ఎదుర్కొందాం. శార్వరి సంవత్సరాన్ని అతి మధురంగా మార్చుకుందాం. 


logo