బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Mar 23, 2020 , 22:49:26

పౌరస్ఫూర్తిని పాటించాలి

పౌరస్ఫూర్తిని పాటించాలి

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా సఫలమైంది. ప్రజలు క్రమశిక్షణతో మెలిగితే మన దేశమూ ఈ వైరస్‌ను మట్టి కరిపించడం అసాధ్యమేమీ కాదు. కానీ చైనాకు, మన దేశానికి వ్యవహారపరంగా ఎంతో తేడా ఉంటుంది. అక్కడ ఉన్నది ఏక పార్టీ నిరంకుశ వ్యవస్థ. కానీ ప్రజాస్వామ్యవ్యవస్థలో మన విలువలను, రాజనీతిని పణంగా పెట్టకుండానే, ప్రజల సహకారంతో కార్యాన్ని సాధించడం అసిధారా వ్రతం వంటిది.

ఆదివారమంతా రాష్ట్ర  ప్రజలు ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన తీరు అద్వితీయం. కానీ అంతలోనే సోమవారం నాడు లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత కూడా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన తీరు ఆందోళనకరం. సోమవారం మీడియా పెద్దలతో సమావేశమైన ప్రధాని మోదీ కూడా దేశ ప్రజలు సహకరించడం లేదని ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన తర్వాత, ప్రజలకు కర్తవ్య బోధ చేయడంలో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన పాత్ర గణనీయమైనది. తెలంగాణ జాతి ఉద్యమకాలంలో చూపిన పట్టుదలను, క్రమశిక్షణను గుర్తుచేస్తూ అదే పట్టుదలను ఇప్పుడూ కనబరచాలంటూఉత్తేజపరచారు. ప్రజలు కేసీఆర్‌ పిలుపునకు స్పందించడం ఉద్యమకాలంలోనే కాదు, రాష్ర్టాన్ని సాధించి పరిపాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతున్నది. కుటుంబ సర్వేకు సహకరించవలసిందిగా సీఎం పిలుపునిస్తే, ఇతర రాష్ర్టాల నుంచి కూడా తెలంగాణవారు స్వచ్ఛందంగా తరలివచ్చి నమోదు చేయించుకొని వెళ్లారు. ఇదేవిధంగా ప్రజలు ఆదివారం స్వచ్ఛందంగా ఇంటి పట్టునే ఉన్నారు. కానీ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఈ క్రమశిక్షణ కనిపించకపోవడం గమనార్హం.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వం మేరకు పరిపాలనా యం త్రాంగం ఎంత ప్రయాసపడుతున్నదో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు సహకరించకపోతే అహోరాత్రులు సేవలు చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కృషికి ఫలితం ఉండదు. కరోనా వైరస్‌ సోకిన రోగులను గుర్తించడానికి పగలు రాత్రి తేడాలేకుండా వేలాది బృందాలు తిరుగాడుతున్నాయి. అనుమానితుల ఇంటికి వెళ్లి వారు ఒంటరి జీవితం గడుపుతున్నారా, ఏవైనా రోగ లక్షణాలు కనిపిస్తున్నాయా అనేది ఆరాతీస్తున్నా యి. మృత్యువు కోరల దాపున చేరి, నిబద్ధతతో పనిచేస్తున్న వైద్యుల భద్రతకు అన్ని వసతులు సమకూర్చడంలోనూ ముఖ్యమంత్రి శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుం డా పరిస్థితిని అదుపు చేయడంలో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర కూడా ప్రశంసనీయమైనదే. 

కరోనా సోకిన విదేశీయులు కరీంనగర్‌కు వచ్చి వెళ్లారని తెలిసిన వెంటనే వారు తిరిగిన ప్రదేశాలన్నీ జల్లెడ పట్టిన తీరు అపూర్వం. వారు ఏయే ప్రాంతాల్లో, ఏయే వాహనాల్లో తిరిగారు, ఎవరిని కలిశారు, ఎక్కడ ఆహారం తీసుకున్నారు తది తర విషయాలన్నింటినీ అనతికాలంలోనే పసిగ ట్టారు. తెలంగాణలో ‘పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌' ను సీఎం కేసీఆర్‌ అమలుపరిచారు. ‘షీ’ టీమ్స్‌ మొదలైన విభాగాల సేవలను ప్రశంసిస్తూ, పోలీసుల పనితీరును చెప్పి ఓట్లడిగిన ఏకైక పార్టీ తమదని కేసీఆర్‌ ఎన్నికల సమయంలో చెప్పడం గమనార్హం. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో కరోనాపై పోరాడుతున్నాయనడానికి కరీంనగర్‌ను తార్కాణంగా చెప్పవచ్చు. కరీంనగర్‌లో విదేశీయుల ఉనికిని గమనించిన మొదటి మూడురోజుల్లోనే వంద బృందాలు రంగంలోకి దిగి లక్షా ఇరువై ఏడు వేల మందికి వైద్య పరీక్షలు జరిపాయి. మరోవైపు నగరపాలక సంస్థ చొరవతో వేయి మంది సిబ్బంది పారిశుధ్య కార్యక్రమం సాగించారు. ఆధునిక పద్ధతుల్లో స్ప్రే చేస్తూ నగరమంతా  పనులు నిర్వహించారు. గత ఆరేండ్ల పాలనలో కేసీఆర్‌ పరిపాలనారంగాన్ని కర్తవ్యోన్ముఖులను చేయడంలోనూ ప్రజలతో మమేకం కావడంలోనూ సాగించిన కృషి ఫలితమిది.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా సఫలమైంది. ప్రజలు క్రమశిక్షణతో మెలిగితే మన దేశమూ ఈ వైరస్‌ను మట్టి కరిపించడం అసాధ్యమేమీ కాదు. కానీ చైనాకు, మన దేశానికి వ్యవహారపరంగా ఎంతో తేడా ఉంటుంది. అక్కడ ఉన్నది ఏక పార్టీ నిరంకుశ వ్యవస్థ. కానీ ప్రజాస్వామ్యవ్యవస్థలో మన విలువలను, రాజనీతిని పణంగా పెట్టకుండానే, ప్రజల సహకారంతో కార్యాన్ని సాధించడం అసిధారా వ్రతం వంటిది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అంతరం లేనప్పుడే పరిపాలన సమర్థంగా సాగుతుంది. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నది.

 లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారాలు దెబ్బ తినవచ్చు, అయినా దీర్ఘకాల సంక్షేమం దృష్ట్యా తప్పదు. రెక్కాడితే డొక్కాడ ని పేదలకు ఇంటిపట్టున ఉండటం కష్టం. అందుకే పేదలకు బియ్యంతో పాటు పదిహేను వందల రూపాయలను ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఆంక్షలు విధించినా, కొంత కఠినంగా వ్యవహరించినా తమ సంక్షేమం కోసమేనని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రధాని మోదీ అన్నట్టు- ‘ఒక సుదీర్ఘ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే’. ఈ సుదీర్ఘ పోరాటానికి తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలి. ఆదివారం నాటి క్రమశిక్షణను ఇకముందు కూడా ప్రదర్శించాలే తప్ప ఉల్లంఘించకూడదు. కఠోర దీక్షతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. బంగారు తెలంగాణ నిర్మించుకుంటున్నాం. ఈ దశలో ఈ మహా విపత్తు వచ్చిపడ్డది. ఈ విపత్తు నూ ఉద్యమ దీక్షతో ఎదుర్కొందాం.


logo
>>>>>>