మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 22, 2020 , 22:52:44

సాంబశివుడి పద్య తాండవం

సాంబశివుడి పద్య తాండవం

దక్షిణ కాశిగా ప్రసిద్ధికెక్కిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం పంపన, భీమన వంటి ఉద్ధండ కవి పండితులెందరినో సాహితీలోకానికి అందించింది. అలాంటి కోవలోకే చెందిన కవివరేణ్యులు వేములవాడ వాస్తవ్యులు సాంబశివ శర్మగారు. తెలంగాణ ప్రాంతంలో మరుగునపడిపోయిన వారిలో మామిడిపల్లి సాంబశివశర్మగారు కూడా ఒకరు. వీరు సంస్కృతాంధ్ర భాషలతో పాటు ఉర్దూ, హిందీ భాషల్లో సైతం పాండిత్యం గడించారు. ప్రజ్ఞాశాలియైన సాంబశివ కవి గురుముఖతః అభ్యసించినది చాలా తక్కువ. వీరు ఏకసంథాగ్రాహి. దక్షిణా మూర్తి ఉపాసన వల్ల వీరికి దైవకశక్తి అబ్బింది. తద్వారా ఏది విన్నా, చదివినా వెంటనే చెప్పగలిగే శక్తి కలిగింది. వివిధ ప్రక్రియల్లో వీరి రచనలు వన్నెకెక్కాయి. సుప్రభాత శ్లోకాలు, బుర్రకథలు, నాటకాలు, హరికథ, రమ్యమైన శైలిలో ‘ద్విపద రామాయణం’తో పాటు భావ గాంభీర్యం, అర్థ గౌరవం, శబ్దర్థాలంకార భూషితంగా, ధారాశుద్ధికి ప్రతిబింబమైన పద్యకావ్యాలు వెలువరించి పాఠకులను రసభరితుల్ని చేశారు. వీరు సంప్రదాయ కవిత్వంతో పాటు, భావ, అభ్యుదయ మార్గాలలో తమ కవితా ప్రస్థానాన్ని కొనసాగించారు. అవధానిగా మార్గదర్శమైన వీరి ప్రతిభ పలువురిని అవధాన పీఠానికెక్కించింది. సాంబశివ కవి పీవీ నరసింహారావు స్థాపించిన ‘కాకతీయ పత్రిక’కు విలేకరిగా పనిచేయడం విశేషం. స్థాపించిన ‘కాకతీయ పత్రిక’కు విలేకరిగా పనిచేయడం విశేషం.

సాంబశివ కవి ఆశు కవిత్వము, కమ్మని గానము, రమ్యమైన గాత్రము కలిగిన చతురోక్తి సంపన్నులు. నటకులు. హరికథకు లు. పురాణ ప్రవచనా ప్రవీణులు. పసిమి వన్నెతో, స్ఫురద్రూపంతో, పాండితీగరిమతో, మహోన్నత వ్యక్తిత్వంతో అలరారే వీరిని శృంగేరి పీఠాధిపతులు, కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, ఘంటసాల వంటి ప్రముఖులెందరో సత్కరించారు. డాక్టర్‌ సినారె వీరిని గురుతుల్యులుగా భావించేవారు.

దైవభక్తి, దేశభక్తి, జాతీయత, మానవతావాదం, సమాజ శ్రేయస్సు మొదలగునవి వీరి రచనల్లో అడుగడుగునా గోచరిస్తా యి. ‘లోభ సంహారం’, ‘ముక్తాహారం’, ‘మా దేవర శతకం’ ‘జ యశ్రీ’ వంటి పద్యకావ్యాలు కవిలోని రచనా వైదుష్యానికి ప్రతీకలు. సాంబశివ కవి ప్రాచీన, ఆధునిక కవి సంప్రదాయమునకు వారధులుగా గోచరిస్తారు. చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిర్భీతితో, నిజాయితీగా తన రచనల ద్వారా చెప్పడంలో వారికి వారే సాటి.

సాంబశివ కవి భావనా బంధురములైన పద్య, గేయ కీర్తనల సమాహారమే ‘ముక్తాహారము’. ఇది 13 శీర్షికలతో కూడిన కావ్య ము. 1949లో వెలువరించిన ఈ కావ్యంలో నాటి సామాజిక స్థితిగతులెన్నింటినో వెలుగులోకి తెచ్చారు. దీనిలో శారదాపద్యములు, శ్రీరామ నవరత్నమాల, సీత, భరతమాత, బాపడా, చాటువులు, రామ, కృష్ణ భజనకీర్తనలు, మంగళగీతికలు, గేయ ము వంటి వైవిధ్యభరితమైన ప్రక్రియల్లో తన భావమౌక్తికలను మాలగా కూర్చి శ్రీరాజరాజేశ్వరున్ని ముక్తాహారంతో అలంకరింపజేశారు.

ముక్తాహారము కావ్యారంభంలో ఈ కావ్యాన్ని శ్రీ రాజరాజేశ్వర స్వామికి అంకితం చేస్తూ..

‘భక్తి, క్రీత భవాబ్ధి పోతయభవా! భద్రేభచర్మాంబరా!

ముక్తి ద్వార కవాట పాటనకరా! ముగ్ధేందు చూడామణీ!

ముక్తాహారము లంచమిచ్చితిని శం/ భూతస్కరణాంపతీ

దక్తాపంబుల బాపి మాకు నిక నా/ రోగ్యంబు చేకూర్పవే..’

అంటూ ఒక చురకతో స్వామికి పత్ర సమర్పణ చేశారు. లం చం ఇవ్వడం, పుచ్చుకోవడం రెండు చట్టం దృష్టిలో నేరమే అయినా లోకం తీరు మారడం లేదనేది కవి భావన. కావ్యాన్ని శివునికి అంకితం చేయడాన్ని శివునకు లంచమివ్వవడంగా చమత్కరిస్తూ కావ్యారంభంతోనే పాఠకులను పఠన పరాయణుల్ని చేయగలగడం సాంబశివ కవి ప్రత్యేకత.

‘భారతమాత’ ఖండికలోని ఈ పద్యం ద్వారా ఏడు దశబ్దాల కిందట మన దేశ పరిస్థితిని కళ్ళకు కట్టించారు.

 సీ॥ ‘ఆలుబిడ్డల దెగ నమ్మి సత్యమునిల్పు కొన్న హరిశ్చంద్రు 

గన్నతల్లి లేమిలో బసిడి వర్షించి త్యాగము నిల్పు 

కొన్నట్టి రఘురాజు గన్నతల్లి

తన మాంసమిచ్చి యార్త త్రాణమున్నిల్పుకొన్న శిబి ప్రభు 

గన్నతల్లి చూలాలి సతిబాసి స్రుక్కిశీలము నిల్పుకొన్న 

       సీతారాము గన్నతల్లి..’


తే॥ గీ॥ ‘యిప్పుడు నరమూషకముల డబ్బెంతుగాండ్ర 

కల్లరుల లబ్దుల న్మహా కపటమతుల 

స్వార్థపరుల ముష్కరుల నిరర్థకులను  

విరివిగా గన నేలనే భరతమాత..’

అంటూ కవి తన ఆవేదననూ, ఆక్రోశాన్ని భరతమాతకు విన్నవిస్తున్నాడు. ఎంతోమంది పుణ్య పురుషులకు, త్యాగమూర్తులకు జన్మనిచ్చిన పుణ్యభూమి భారతదేశంలో నీతి, నిజాయితీ మంచితనం నశించి, కపటము స్వార్థపరత్వ మూ పెరిగిపోతుందంటూ కవికలం కన్నీరు కారుస్తుంది. ఇది ఆనాటిదైనా, నేటి కి దేశం అన్యాయాలకు, అరాచకాలకు అంతులేకుండా పోతుందనే అంశాన్ని నడుస్తున్న చరిత్రగా దర్శింపజేశారు కవి.

 ‘మాదేవర’ శతకంలో కవి ‘లేమలవాడ దేవరా’ అనే మకుటంతో రాసిన పద్యాలలో వివిధాంశముల ను స్పృశించారు. లోకపు తీరుతెన్నులను తన బాధలను, బాధ కారకులనూ ఎత్తి చూపించారు. 

కవి తన సాహిత్య వ్యక్తిత్వాన్ని, కవిత్వమందుగల తమకాన్ని తన్మయత్వంతో రచించిన తీరు పాఠకుల్ని పరవశింపజేస్తుంది. 

‘ఏ నొక పేద బాపడ, కవీశుడ, నీశ! 

త్వదంఘ్రి దాసుడన్‌

గానముజేతు, దాశరథి గాథను జెప్పుడు, 

సుంతసుంతవ్యా

ఖ్యానము వాగనేర్తు, నితిహాస 

పురాణకథల్‌ వచింతునే

కాని కవిత్వమంద తమకంబుర 

లేములవాడదేవరా..!’

కవి ఈ పద్యంలో తను గురించి చెబుతున్నట్లనిపించినా, అంతరార్థాన్ని చూసినప్పుడు హరిహరద్వైతా న్ని ప్రటించారు. ఇలా కవిత చెప్పటం హరిహరక్షేత్రమైన వేములవాడలో వెలసిన కవిపుంగవులైన సాంబశివ కవికి నల్లేరుపై బండి నడక లాంటిది.

కుంజవిహారము నలభై పద్యాలున్న చిన్న కావ్యం. కావున కవి దీనికి కుంజవిహారము అనే పేరును నిర్ణయించినారేమో. కుంజము అంటే చిన్న పొద. విహారము అంటే సరదాగా తిరగడం. రాధామాధవుల విహార కేంద్రం బృందావనం. యమునా నదీతీరంలో ని బృందావనం చిన్నచిన్న పొదరిళ్లతో నిండి ఉంటుం ది. అందువల్ల కూడా కవి కుంజవిహారము అనే పేరు పెట్టి ఉండవచ్చు. ఏ విధంగా చూసినప్పటికీ కవి ఈ ఖండకావ్యానికి పేరు పెట్టడంలో నామౌచిత్యాన్ని ప్రదర్శించారు. మధుర భక్తియుక్తుడై సరళంగా సులభ శైలిలో ఉన్న ఈ పద్యకావ్యం రాధావిరహం, రాధామాధవుల ప్రణయ వృత్తాంతంతో రసభరితమైనది. 1955 నుంచి 1958 మధ్యకాలంలో  రాసిన ఈ కావ్యంలో నాటి కవుల ప్రభావం ప్రతిఫలిస్తుంది. దీనికి ఉదాహరణగా.. 

‘అనుచురాధ మూర్ఛిల్ల! తదంతికమున

సేద దీర్చుచు తలవైపు/ చిన్మయుండు/నెమ్మిపురితల వూపుగా! నిగ్గుదేర/ కనులవిప్పిన రాధను గనియెనంత..’ అంటూ వర్ణించారు. 

సమాజ హితాన్ని కోరేదే సాహిత్యం. దీన్ని ప్రత్యక్ష ర సత్యం కావించిన వారు సాంబశివ శర్మగారు. వీరు ఈ కావ్యం చివరన లోకానికి అనవరతమూ అత్యంతావ శ్యకమైన ప్రేమ, శాంతి, త్యాగం, ధర్మం విలువను వాటి అనుసరణీయతను ఈ పద్యంలో హృద్యంగా అందించి పాఠకలోకానికి చిరస్మరణీయుడయ్యారు. 

‘ప్రేమయే గదా భూమికి ప్రియతమంబు/ 

శాంతమేగదా జగతికి శర్మదంబు

త్యాగమే కదా వసుధకు తారకంబు/ 

ధుర్మమే గదా ధరణికి దైవతంబు’ అంటూ మృధు మధురమైన పదజాలంతో రాధా మాధవుల ప్రేమ తత్తాన్ని, మానవీయ విలువలను లోకానికి మార్గదర్శనం చేశారు. 

లోభ సంహారము 1960 ప్రాంతంలో రచించిన అధిక్షేప కావ్యం. లోకంలో భూస్వాములు, ధనికులు, రాజకీయ నాయకులు మొదలగు వారైన కొందరిలో కనబడు వివిధరకాల అవినీతి, అమానవీయత, అరాచకాలకు మూలకారణమైన లోభాన్ని గూర్చి వివరించారు. లోభాన్ని సంహరించదలచిన కవి అక్షర సమరమే లోభ సంహారము. లోభ సంహారములో ప్రత్యేకమైన రీతిలో సాంబశివ కవిగారు ప్రయోగించిన రూపకాలంకారం.. ఈ పద్యంలో...

‘గబ్బిలము మంత్రి, రాజు ఘూకంబు, ప్రజలు/పైడి కంటెలు, సేనాని పంతురాగ

కటిక చీకటి నగరమ్ము గాలికోట/ పన్ను లేదు దున్నుట లేదు పంటలేదు..’ 

సాంబశివ శర్మగారు సాహిత్యరంగంలో ప్రవేశింప ని ప్రక్రియలు లేవనేది అతిశయోక్తి కాదు. సాంబశివ కవి నాటి పరిస్థితుల దృష్ట్యా ఊరిలోని గద్దెలనే అవధాన పీఠంగా  భావించి అవధానాలు నిర్వహించేవా రు. తన తొలి అవధానాన్ని వేములవాడలోని మహాలక్ష్మీ దేవాలయంలో నడుపబడిన సంస్కృత కళాశాలలో నిర్వహించి విజయపథంలో ముందుకుసాగా రు. అవధాన సరస్వతియైన వారి అవధానాలను మార్గదర్శకంగా తీసుకొని వారి శిష్యులు తిగుళ్ల శ్రీహరి శర్మగారు శతాధిక అవధానాలు చేశారు. సాం బకవి అందించిన స్ఫూర్తి అవధానులెందరికో మార్గదర్శకం అయ్యింది. 

సాంబశివ శర్మగారి రచనల్లో అముద్రితాలు చాలా ఉన్నాయి.  వేములవాడ వారి ఉదయసాహితి 9171, ఆగస్టు 15 జన్మదిన సంచికలో వీరు రాసిన పంద్రాగస్టు కవిత ‘సాహితీ మిత్రబృందం’ ప్రచురితమైనది. తెలంగాణ కళా, సాహితీరంగాల్లో ఇంతటి మహోన్నత మేరునగధీరులైన సాంబశివ కవి వంటి వ్యక్తి మరొకరుండరు. బహుముఖ ప్రజ్ఞశాలి, కళాతపస్వి, అమరజీవి తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ సాంబశివ శర్మగారి రచనలపై పరిశోధన చేసిన ఇట్టేడు విష్ణు వందనా దేవి ధన్యజీవి. సాంబశివ శర్మగారి ఒక్కొక్క రచనా ప్రక్రియపై ప్రత్యేక పరిశోధనలు జరుగాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా తెలంగాణలోని విశ్వవిద్యాలయా లు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉన్నది. మామిడిప ల్లి సాంబశివ శర్మగారి సమగ్ర సాహితీ జీవన వైభవం చిరకాలం అజరామరమై భావితరాలకు మార్గదర్శకం గా నిలుస్తుంది. 


- డాక్టర్‌ నమిలికొండ సునీత, 99084 68171 


logo
>>>>>>