మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 22, 2020 , 22:49:50

అనుబంధాల నెమరువేత ‘అంతర్వాహిని’

అనుబంధాల నెమరువేత ‘అంతర్వాహిని’

కోట్ల వెంకటేశ్వరరెడ్డి ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్న కవి. నిరంతరంగా కవిత్వం రాస్తున్న కవి. అవన్నీ సమాజాన్ని వస్తువుగా చేసుకున్న కవితలే. కానీ ‘అంతర్వాహిని’ కవితా సంపుటిలోని కవితలన్నీ భార్యా విరహతప్తుడైన కవి హృదయవేదనను వ్యక్తీకరిస్తున్నాయి. ఎప్పుడో కాళిదాస మహాకవి భార్యా వియోగతప్తుడైన యక్షుని హృదయవేదనను ‘మేఘ సందేశం’ కావ్యంలో వినిపించా డు. ఏవో చిన్న తప్పులకు యక్షరాజు యక్షునికి ఒక సంవత్సర కాలం దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. వస్తున్నది వర్షాకాలం. నల్లని మేఘాలు ఆకాశం నిండా కమ్ముకుంటున్నాయి. ‘విధి వశాత్‌ దూర బంధూర్‌ గతోహం’ అని చింతిస్తూ కమ్ముకున్న మేఘాల్లో ఒక మేఘాన్ని సందేశకునిగా ఎంచుకుని యక్షుడు తన విరహాన్ని భార్యకు వినిపించి ఊరడించమని వేడుకున్నాడు. ఈ కవితా సంపుటిలో కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి భార్యా వియోగతప్త హృదయంతో ఏ మేఘాన్ని ఆశ్రయించలేదు. తన హృదయ ఆవేదనను ఆవిష్కరించే చక్కని కవితా పంక్తులతో పాఠకులతో పంచుకున్నాడు. కవి తన హృదయంలో తిష్టవేసిన భార్య గురించి ఇట్లా అంటాడు..


‘ఆమె అంతే

ఏం మాయ చేస్తుందో

ఎదలో తిష్ఠ వేసి

అధిష్ఠాన దేవతవుతుంది..’

ఆ అధిష్ఠాన దేవత ఓ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నిబంధనల మేరకు ఆమె మరో జిల్లాకు బదిలీపై వెళ్లవలసి వచ్చింది. దాంతో విచలితుడైన కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి హృద యం విలపించింది.

‘బదిలీలు వారి మధ్య

చైనా గోడల్ని నిర్మిస్తున్నవి’అని వాపోతాడు.

భార్య అతనిలో ప్రవహించే ‘అంతర్వాహి ని’. అతని శక్తియుక్తులకు, జీవితానికి ప్రేరణ. ఆ విషయాన్ని స్మరిస్తూ.. జపిస్తూ..

‘నువ్వట్లా కదలివస్తుంటే

భరోసా గీతమొకటి నడిచొస్తున్నట్లుంటది

కలిసి నీతో నడుస్తానా లోకాన్ని జయించినట్లుంటది..’ అంటాడు.

కోట్ల మూడుముళ్ల బంధం జీవన మాధుర్యాన్ని విప్పినట్లుంది. తన అనుభవంలోకి వచ్చిన దాంపత్య జీవన మాధుర్యాన్ని ఈ విధంగా పలుకుతాడు...

‘మాంగళ్యానికి ఏదో మంత్ర శక్తి ఉంది.

అన్ని బంధాలనూ

మరింత బలోపేతం చేస్తుంది..’

వివాహబంధం గురించి ఆధునిక కాలంలో ఇంత చక్కని భావవ్యకీకరణ ఎవరూ చేయలేదేమో అనిపిస్తుంది. అయినా కవులంతా ప్రేయసిని గురించో, ప్రియుని గురించో రాసినవారే కానీ భార్యను స్మరించిన వాళ్లున్నారా! వివాహబంధం గురించి ఇంత మధురంగా మనసువిప్పిన వాళ్లున్నారా! అనిపిస్తుంది.

భర్త సంతోషానికై భార్య ఎంతో సేవ చేస్తుం ది. ఆమె చేసే సేవల గురించి ఈ కవి ఇలా అంటాడు..

‘ఆమె

చేసే సేవలకు విలువ కడతానా?

జీవితమే అప్పు పడతది..!’ అని చక్కని వక్రోక్తి అలంకారంతో ముగిస్తాడు. కొన్ని జం టలు నిశ్శబ్దంగా గంటల తరబడి కూచొని మాట్లాడుకోకుండా గడిపేస్తారు. ఆ నిశ్శబ్దం లోనే వాళ్ల ప్రేమ ఊహలు నడుస్తుంటాయి. దాన్ని కోట్ల ఇట్లా కవిత్వీకరిస్తాడు..

‘నిశ్శబ్దంగా మాట్లాడుకుంటామా

పూల పరిమళమొకటి

విసురుగా చుట్టేస్తుంది..’

అంటూ.. జీవితంలో భార్య భాగస్వామ్యా న్ని ఎంతమంది అంగీకరిస్తారు ఈ లోకంలో! కానీ ఈ కవి మాత్రం భార్య అర్ధభాగమే  కాదు సింహభాగమంటూ..

‘నువ్వంటే ఒట్టి నువ్వేనా

నా పరిమితులను గుర్తుచేసే శక్తివి

నాలోని ప్రవాహశీలతను ఎవరభినందించినా

అందులో సింహభాగం నీదే..!’

ఇవ్వాళ నన్నెవరైనా సగౌరవంగా ఆదరిస్తే అందులో ఎప్పటికీ సింహభాగం ఆమెదే అని ఈ లోకంలో ఎంతమంది భర్తలు ఈ సత్యా న్ని పైకి చెప్పగలుగుతారు? అయినా ఇట్లా చెప్పటానికి ఒక్క కవికే సాధ్యమేమో.

‘నేను ఒంటరిగా నిలబడినప్పుడల్లా

సున్నాలా పక్కనచేరి నన్ను పదింతలు చేసింది..’ అంటూ భావంలో చమత్కారాన్ని పొదిగి భార్య గొప్పతనాన్ని ఈర్ష్యాసూయలు లేకుండా, ఆధిక్యభావం లేకుండా భార్య పట్ల ఈ విధమైన ప్రణయ కవిత్వం రాయటం హర్షణీయం. భార్యకే అంకితమిచ్చిన భార్య ప్రణయకావ్యం రాయటం సాధ్యమా అనిపిస్తుంది. ఈ కవితా సంపుటి చదివాక స్త్రీ వాదులంతా కవిని అభినందిస్తే బాగుండుననిపించింది. కోట్ల వెంకటేశ్వరరెడ్డితో అంతగా పరిచయం లేదు. కానీ ‘అంతర్వాహిని’ కవితా సంపుటి చదివాక ఈ వ్యాసం రాయలనిపించింది.

దాంపత్య జీవితంలో భార్య విరహాన్ని, వియోగాన్ని అనుభవించే భర్త తన ప్రేమను, ఔన్నత్యాన్ని కవిత్వంలో చాటడం ఇదే మొదటిసారేమో!

అందుకే నేనంటాను ‘అంతర్వాహిని’ అం దరూ చదివి ఆనందించే కవిత్వమని.

‘ఇల్లుంది అండ్ల ఆమె లేదు

నేనున్నా నాలో ఆత్మ లేదు

నేనిప్పుడు ఆమె చుట్టూ పరిభ్రమించే

అదృశ్య శకలాన్ని!

ఒదిలీ ! నేవెంత కఠినమో..’ అనే ఈ కవి మాటలతో నా వ్యాసాన్ని ముగిస్తున్నాను. ఆయన మరింత మంచి కవిత్వాన్ని రాయాల ని ఆకాంక్షిస్తున్నాను.

- ముదిగంటి సుజాతరెడ్డి, 83095 71083


logo
>>>>>>