మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Mar 22, 2020 , 22:44:25

అమ్మ గెలిచింది!

అమ్మ గెలిచింది!

ఆకాశానికి భూమికి దారులు వేస్తూ..

ఆనంద, భయ సన్నివేశాలను 

మునుముందుకు తోస్తూ..

ఆమె గెలిచింది! అమ్మ గెలిచింది!!

కళ్లకుగట్టిన గంతలు, చేతబట్టిన తరాజు

న్యాయదేవత ఏడేళ్లుగా దించిన తల ఎత్తిందని చెప్తూ..

ఆమె గెలిచింది! అమ్మ గెలిచింది!!


తనదాకా వస్తే వ్యవస్థ అస్తవ్యస్తమనడం

తనదాకా రాకుంటే, చట్టం న్యాయమనడం

ఓ అసభ్య సమాజపు సభ్యులారా..

మీ స్తబ్ధమెదళ్లకు పెను సవాళ్లను నిర్భయంగా వేస్తూనే

ఆమె గెలిచింది! అమ్మ గెలిచింది!!


రక్తాపరాధానికి రకరకాల శవపరీక్షలు

రాజో.. పేదో.. ఏకపక్ష అమానుషాలైనప్పుడు

వేదన మిగిల్చే చేదు జ్ఞాపకాలనే

తన ఖాతాలో పడేసుకుంటున్నది నేటి చరిత్ర!

ఓ న్యాయవాదులారా

వాదనలకు అతీతమైన నిజమేదో

మీ మనోవేదికపై గుంభనంగా దాగి ఉన్నది

మనసు తెరవండి

కుళ్లును చూడొద్దనే కళ్లనూ తెరవండి

మీకూ ఓ కుటుంబముంటుందనే

హృదయ నేత్రాలనూ తెరవండిక

ఆమె గెలిచింది! అమ్మ గెలిచింది!!


తడిరెప్పలు దాటిన దృశ్య జలపాతం

ఇక దుఃఖ జలపాతం కాదంటున్నది

సహజ మరణాల్ని స్వాగతించే ప్రకృతిప్పుడు

అకృత్యాలకు తెరదీసే నిరసనను కనుమన్నది!


లొసుగుల దారం ఉరినాపలేకపోయింది

స్త్రీ జాతి పక్షాన భూ మాత గళమెత్తి నిగళమయ్యింది

మొక్కవోని ధైర్యం.. చెక్కు చెదరని పట్టుదల..

ఆమె గెలిచింది! అమ్మ గెలిచింది..!!

డాక్టర్‌ కొండపల్లి నీహారిణి, 98663 60082


logo