సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 22, 2020 , 10:15:45

మహమ్మారికి ముకుతాడేద్దాం

మహమ్మారికి ముకుతాడేద్దాం

డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలను మన దేశం నిర్లక్ష్యం చేయలేదు. మార్చి 11న పాండెమిక్‌ ప్రకటన వెలువడగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌-19ను సీరియస్‌గా తీసుకున్నాయి. అవసరమైన అన్నిచర్యలను చేపట్టడంతో చైనా తర్వాత అత్యధిక జనాభా సుమారు 130 కోట్లు ఉన్న మన దేశంలో 275 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైనాయి. మరణించినవారు ఐదుగురు మాత్రమే. దేశంలోని పలు రాష్ర్టాలకు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

చైనాలో గబ్బిలం ద్వారా ఒక మనిషికి సంక్రమించిన ‘కోవిడ్‌-19’ వైరస్‌ 186 దేశాలకు కేవలం మూడునెలల్లో వ్యాప్తిచెందింది. ఇప్పటివ రకు 12 వేల మంది ప్రాణాలను హరించింది. భవిష్యత్తులో మనం భయపడుతున్నట్లు ‘బయోలాజికల్‌ వార్‌' అనేదే జరిగితే యుద్ధాన్ని మొదలుపెట్టే దేశంతో సహా ఏ దేశంలో మనుషులు మిగులరనే సంకేతాన్ని ఈ కోవిడ్‌-19 ఇస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది కి ఈ వ్యాధి సోకిందని ఇప్పటివరకు నిర్ధారణ అయినా, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో జనానికి కరోనా పాజిటివ్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా చికిత్స పూర్తయిన లక్షా మూడు వేలకు పైగా కేసుల్లో సుమారు 93 వేల మంది కోలుకోగా 12 వేల మంది మరణించారు. మరో 2 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో సుమారు 8 వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. వ్యాధిసోకిన వారిలో నాలుగు నుంచి ఆరు శాతం మంది మరణిస్తున్నారు. అరువై ఏండ్లకు పైబడినవారే ఎక్కువ మంది చనిపోతుండగా ఇరువై ఏండ్లలోపు వారిలో ఈ వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంటు న్నట్లు నిపుణులు చెబుతున్నారు.

రోజులు గడుస్తున్నాకొద్దీ వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. రెండు నెలల కిందట ఒక్క మరణమూ సంభవించని ఇటలీలో ఒకేరోజు నాలుగు వందల మందికిపైగా మరణించారు. మరణాల్లో ఇటలీ చైనాను అధిగమించడం ప్రపంచ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. కానీ ఇటలీది ప్రత్యేక పరిస్థితి. ఇతరదేశాల ప్రజలు ఇటలీని చూసి భయపడనక్కరలేదు.ఇటలీలోని వివిధ నగరాల్లో ఉన్న లెదర్‌ వ్యాపారులు చైనాలో వూహాన్‌ నగరంలోని లెదర్‌ పరిశ్రమల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు. కనుక వీరి మధ్య రాకపోకలు ఎక్కువ. కోవిడ్‌-19 బయటపడింది వూహాన్‌ నగరంలోనే. డిసెంబర్‌ మొదటివారం నుంచి మూడువారాలు ఈ వైరస్‌ కొన్నివేల మంది శరీరాల్లో ప్రవేశించిన తర్వాతే డిసెంబర్‌ 31న బయటి ప్రపంచానికి చైనా వెల్లడించింది. బహుశా ఈ వైరస్‌ లక్షణాలు వారికి అర్థం కావడానికి అంత సమయం తీసుకొని ఉండవచ్చు. తొలు త దీన్ని నిమోనియాగానే భావించి చికిత్సనందించారు. డిసెంబర్‌-జనవరి నెలల్లో కొన్నివేల మంది వూహాన్‌ నగరం నుంచి చైనాలోని ఇతర ప్రాంతాలకు వివిధ దేశాల కు ప్రయాణించడం వల్ల ఈ వైరస్‌ ఇంతగా విజృంభించింది. యూరప్‌ దేశాలకు వెళ్లినవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, ఆ దేశాల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం, ఆయా దేశాల ప్రభుత్వాలు కోవిడ్‌-19 పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇటలీతో సహా యూరప్‌లోని వివిధ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ వ్యాధి ప్రభావం పట్ల చైనా గానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ జనవరి 30వ తేదీ దాకా అవసరమైన హెచ్చరికలను ప్రపంచ దేశాలకు జారీ చేయలేదు.

పదకొండేండ్ల కిందట స్వైన్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. 2009, ఏప్రిల్‌లో అమెరికాలో పదేండ్ల పాపలో బయటపడి స్వైన్‌ఫ్లూ వైరస్‌ వలన ఒక్క ఏడాదిలోనే ఆ దేశంలో ఆరుకోట్ల మందికిపైగా జబ్బుపడగా, వీరిలో 2,73, 304 మంది హాస్పిటల్స్‌లో చేరి చికిత్స పొందారు. వీరిలో 12,469 మంది మరణించారు. కొద్దిరోజుల్లోనే స్వైన్‌ ఫ్లూ వైరస్‌ ప్రపంచంలోని 128 దేశాల్లో 140 కోట్ల మందికి వ్యాపించింది. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (సీడీసీ) అం చనా ప్రకారం 1,51,700 నుంచి 5,75,400 మంది స్వైన్‌ఫ్లూ వల్ల మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 18,631 మంది  మాత్రమే మరణించినట్లు తెలిపింది. స్వైన్‌ఫ్లూ వల్ల మన దేశంలో చనిపోయినవారు 777 మంది. 2009లో కూడా సుమారు 74 దేశాల్లో స్వైన్‌ ఫ్లూ కేసులు వెల్లడైన తర్వాతే 2009, జూన్‌ 11 న ఈ వైరస్‌ వ్యాధిని ‘పాండెమిక్‌'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పు డు కూడా అదే అలసత్వాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్రదర్శించింది. డిసెంబర్‌ 31న చైనా ఈ వ్యాధి తీవ్రతను గుర్తిస్తే, మార్చి 11న కోవిడ్‌-19ను పాండెమిక్‌గా ప్రకటించిం ది ప్రపంచ ఆరోగ్య సంస్థ. జనవరి 30న మొదటిసారి అంతర్జాతీయంగా పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన తర్వాత కూడా, చైనా, అమెరికాలు తప్ప ఏ దేశం అప్పట్లో దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఫలితంగా ఈ వైరస్‌ ప్రపంచంలోని 186 దేశాలకు వ్యాపించింది. మార్చి 11 తర్వాత మన దేశంతో సహా అన్ని దేశాలు కోవిడ్‌-19ను సీరియస్‌గా తీసుకొని అవసరమైన చర్యలను చేపట్టా యి. అప్పటికే జరుగాల్సిన ఉపద్రవం జరిగిపోయింది. లక్షలాది ప్రయాణీకుల ద్వారా ప్రపంచమంతా ఈ వ్యాధి వ్యాపించింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా సంయుక్తంగా కోవిడ్‌-19పై అధ్యయనం చేయడం కోసం 25 మంది నిపుణులతో కమిటీని ఏర్పాటుచేశాయి. ఈ బృందం ఫిబ్రవరి 16-24 మధ్య చైనాలోని వివిధ ప్రాంతాల్లోని దవాఖానలు, ల్యాబ్స్‌, రీసెర్చ్‌ సెంటర్స్‌, జనావాసాల్లో పర్యటించి నివేదికను రూపొందించింది.కోవిడ్‌-19 వైరస్‌కు గబ్బిలాలు రిజర్వాయర్లుగా మారినాయని, మనుషులకు ఈ వైరస్‌ సోకడానికి ఆశ్రయమిచ్చిన మధ్యస్థ జీవులను గుర్తించలేకపోయామని, వూహాన్‌ నగరంలోని వివిధ మార్కెట్ల నుంచి సేకరించిన ఎన్విరాన్‌మెంటల్‌ శాంపిల్స్‌పై పరిశోధన కొనసాగుతున్నదని ఈ బృందం తమ నివేదికలో పేర్కొన్నది. ఈ వైరస్‌ రోగి ముక్కు, నోటిద్వారా వెలువడిన నీటి చుక్కలు లేదా రోగి తాకిన వస్తువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నదని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా వృద్ధులలో ఉన్నట్లు, అరువై ఏండ్లపై బడిన వారే ఎక్కువ సంఖ్యలో మరణించినట్లు ఈ బృందం గుర్తించింది. 19 ఏండ్ల లోపు వారిలో వైరస్‌ ప్రభావం చాలా తక్కువగా ఉన్నది. కోవిడ్‌-19 వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో కూడా కొందరికి ఏ రోగ లక్షణా లు కన్పించే అవకాశం లేదని ఈ నివేదిక వెల్లడించింది. 

వంద రోజుల్లోపే చైనా కోవిడ్‌-19 వైరస్‌ను నియంత్రించడం ప్రపంచ ప్రజల ను, నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఒక్కరోజే వందలాదిమంది ఈ వైరస్‌తో మరణించిన వూహాన్‌ నగరంలో ప్రస్తుతం రోజుకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు. చైనా ప్రభుత్వం అవలంబించిన కఠిన దిగ్బంధ చర్యలతో పాటు ప్రాణాలను పణంగా పెట్టిన హెల్త్‌ వర్కర్లు, వైద్యులు ముఖ్యంగా ప్రజలందించిన సహకారం కరోనాపై చైనా సాధించిన విజయానికి కార ణం. ప్రజల్లో రోగ లక్షణాలున్నవారిని గుర్తించి దవాఖానల్లో చికిత్సనందించడం అవసరమైన మందులను, మాస్క్‌లను అందుబాటులో ఉంచడం, యుద్ధప్రాతిపదికన మాస్క్‌ల తయారీ పరిశ్రమలను, దవాఖానలను ఏర్పాటుచేయడం, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి నగరాలను దిగ్బంధం చేయడం, ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేయడం మంచి ఫలితాలిచ్చాయి. ముఖ్యంగా ప్రజలను అనవసర భయాలకు గురిచేయకుండా అవసరమైన మేరకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై చైనా చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని ప్రపంచ ఆరోగ్య సం స్థ ప్రకటించింది.చైనాలో 81వేల కేసులు నమోదు కాగా 3,255 మంది మరణించారు. కానీ ఇటలీలో 47 వేల కేసులకు నాలుగు వేల మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను ఇటలీ నిర్లక్ష్యం చేసింది. మరణాల్లో ఇరాన్‌ మూడో స్థానంలో ఉన్నది. ఇరాన్‌లో సుమారు ఇరువై వేల మందికి కోవిడ్‌-19 వైరస్‌ వ్యాపించగా 1,556 మంది మరణించారు. ఇరాన్‌ తర్వాతి స్థానం స్పెయిన్‌దే. ఈ దేశంలో 21, 571 మందికి వ్యాధి సోకగా 1,093 మంది చనిపోయారు. వ్యాధి సోకిన జన సం ఖ్య ప్రకారం స్పెయిన్‌ తర్వాతి స్థానం జర్మనీది. 19,848 మందికి వ్యాధి సోకగా మరణించినవారు 68 మంది. 

అమెరికాలో 19,774 మందికి వ్యాధి సోకగా 275 మంది మృతిచెందారు. ఫ్రాన్స్‌లో 12,612 కేసుల్లో 450 మం ది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు చేపట్టిన వైరస్‌ నివారణ చర్యల్లో ప్రస్తుతం ఫ్రాన్స్‌కే అగ్రతాంబూలమని చెప్పవచ్చు. ప్యారిస్‌ నగరంలో కొద్దిరోజులుగా కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది. ఎవరైనా వీధుల్లోకి వస్తే పెద్ద మొత్తం జరిమానా విధిస్తున్నారు. ఇంగ్లండ్‌లో 3983 కేసులు నమోదు కాగా 175 మంది మరణించారు. దక్షిణకొరియాలో 8,799 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 102 మంది మరణించారు. కొద్దిరోజుల కిందట వరకు పై దేశాలేవీ కోవిడ్‌-19 వైరస్‌ను సీరియస్‌గా తీసుకోకపోవటం పెనుముప్పునకు కారణమవుతున్నది.డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలను మన దేశం నిర్లక్ష్యం చేయలేదు. మార్చి 11న పాండెమిక్‌ ప్రకటన వెలువడగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌-19ను సీరియస్‌గా తీసుకున్నాయి. అవసరమైన అన్నిచర్యలను చేపట్టడంతో చైనా తర్వాత అత్యధిక జనాభా సుమారు 130 కోట్లు ఉన్న మన దేశంలో 275 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైనాయి. మరణించినవారు  ఐదుగురు. దేశంలోని పలు రాష్ర్టాల కు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే దీనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కృషి మాత్రమే చాలదు. వైరస్‌ నివారణలో ప్రతి ఒక్కరూ తమకుతాము కట్టడి చేసుకోవాలి. ప్రధాని ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు ను పాటించితీరాలి. కోవిడ్‌-19 నివారణలో భారతీయులు ప్రపంచానికే భేష్‌ అనిపించుకోవాలి.

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)


logo