శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 21, 2020 , 22:28:01

నియంత్రణే ప్రధానం

నియంత్రణే ప్రధానం

వైరస్‌ స్థితిగతులు, దానివల్ల ఎదురవుతున్న సవాళ్లను అందరికీ అందుబాటులో ఉండేవిధంగా వెల్లడించాలి. ఈ విధమైన సమాచార పంపిణీతోనే మహమ్మారి గురించి సమగ్ర అవగాహన వస్తుంది. తద్వారా వైరస్‌ విస్తరిస్తున్న తీరు అర్థమైన దాన్ని కట్టడి చేయవచ్చు. పరిశోధకులు, ప్రభుత్వాలు దాపరికాలు లేకుండా సమాచారాన్ని పంచుకోవటం ద్వారానే విస్తృతస్థాయిలో ఓ సమగ్ర కార్యాచరణకు ఉపయోగపడుతుంది.

చైనా తర్వాత పశ్చిమ దేశాల్లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలో ‘నేచర్‌' పత్రిక తమ సంపాదకీయంలో ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది. ఈ సూచనల ప్రకారం- ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు మూడు అంశాలను పాటిస్తే బాగుంటుంది. ఇందులో ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాలను పాటించడం. అయితే వైరస్‌ తీవ్రతను గుర్తించి ప్రపంచాన్ని హెచ్చరించటంలో డబ్ల్యూహెచ్‌వో ఆలస్యం చేసిందన్న విమర్శలున్నా, అమెరికా, యూకే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పాటించడం లేదనే అభిప్రా యం ఉన్నది. ఈ సంస్థ సూచనల ప్రకారం.. కరోనా వ్యాపించిన వ్యక్తుల కోసం అతి ఉధృతస్థాయిలో గాలింపు జరుపుతూ ఉండాలి. వారిని గుర్తించి వెంటనే ఒంటరిగా పెట్టి చికిత్స చేయాలి. ఆయా ప్రభుత్వాలు గొప్ప ఖ్యాతి ఉన్న వైద్యవేత్తల సలహాలను తీసుకుంటున్నామని అంటున్నాయి. అయితే డబ్యూహెచ్‌వోకు ప్రపంచవ్యాప్తంగా వివి ధ దేశాలలో ఇటువంటి ముప్పు ఏర్పడినప్పుడు తీసుకున్న చర్యల విషయమై అనుభవా లున్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. సార్స్‌ మహమ్మారిని ఎదుర్కొన్నప్పటి అనుభవాలను కూడా ఇప్పు డు గుర్తుచేసుకోవాలి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంపైనే తీవ్రస్థాయి దృష్టిసారించాలి. దీంతో పాటు జనసమ్మర్దం లేకుండా చర్యలు తీసుకోవాలి. వైద్య చికిత్స చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. అమెరికా వంటి దేశంలో కూడా తగిన మేర పరీక్ష పరికరా ల్లేవు. ఏకీకృత వైద్య వ్యవస్థ లేదు. యూకేలో కూడా పరీక్షలు భారీ జరిపే ఏర్పాట్లు లేవు. ఉధృతంగా పరీక్షలు జరుపడం, అనుమానంగా ఉన్నవారిని ఒంటరిగా పెట్టడం అనే ది అమెరికా ప్రాధాన్యాంశాలుగా గుర్తించలేదు. కరోనా వైరస్‌ వ్యాపించిన తర్వాత దానిని నియంత్రణ చేయడానికి ఒక్కోదేశానికి ఒకో పద్ధతి ఉంటుంది. చైనా, దక్షిణ కొరియా దేశాలు వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి చాలా ఉధృతస్థాయి చర్యలు చేపట్టాయి. దీంతో కొత్త కేసులు తగ్గిపోయాయి. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని పనిగట్టుకొని విమర్శించదు. తమకు విరాళాలు ఇచ్చే దేశాలను విమర్శించాలని అనుకోదు. కానీ ఇటీవల డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ అధానమ్‌ ఘెబ్రెయెసెస్‌ చేసిన వ్యాఖ్య గమనార్హమైనది. కొన్నిదేశాలు వైరస్‌ విస్తరించకుండా నిరోధించడం కన్నా, ప్రజలకు సోకిన తర్వాత చికిత్స చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని తప్పుబట్టారు. వైరస్‌ను నిరోధించడానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం ప్రమాదకర ధోరణి గా ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరిని గుర్తించేవిధంగా ఉధృతస్థాయి నిఘా ఉండాలి. వ్యాధి సోకిన వారిని గుర్తించిన వెంటనే ఒంటరిగా చేసి చికిత్స అందించాలి. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి సాగే లంకె తెగిపోతుంది. ఈ లంకెను తెంపడమనేదే వైరస్‌ను అరికట్టే మార్గం. ఒకసారి ప్రజల్లో వైరస్‌ విస్తరించడం మొద లుపెడితే, దానిని గుర్తించి ఎదుర్కోవడం కష్టమవుతూ ఉంటుంది. శత్రువును చూడకుండానే కాల్పులు జరిపినట్టుగా ఉంటుంది.

నేచర్‌ పత్రిక చేసిన రెండవ ప్రధాన సూచన- పరిశోధనలు, డేటా విషయంలో గోప్యత పాటించకుండా, పరస్పరం అందిపుచ్చుకోవడం. వైరస్‌ జీన్‌ సీక్వెన్సెస్‌ మొదలుకొని, విస్తరణ, నియంత్రణ వరకు అన్ని అంశాలపై పరిశోధనలను బహిరంగపరుచాలి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులు అన్ని పరిశోధనలను, అనుభవాలను సాకల్యంగా పరిశీలించుకోవడానికి, చర్చించడానికి అవకాశం కలుగుతుంది. వైరస్‌ మొదట్లో ప్రబలడానికి అవకాశం కల్పిస్తే, ప్రజల్లో రోగ నిరోధకత పెరుగుతుందని యూకేలోని విధానకర్తలు మొదట్లో భావించారు. ప్రభుత్వానికి విజ్ఞానశాస్త్ర సలహాదారులు ఇటువంటి సూచనలు చేశారు. దీన్ని శాస్త్రవేత్తలు వ్యతిరేకించారు. వైరస్‌ తీవ్రత దృష్ట్యా మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తన విధానాలను వేగంగా మార్చుకోగలగాల ని కూడా నేచర్‌ పత్రిక సూచించింది.నేచర్‌ పత్రిక చేసిన మూడవ సూచన దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలనేది. కొన్నిదేశాలు రెండవ ప్రపంచ యుద్ధకాలం మాదిరిగా కొద్దిమందితో ఆంతరంగికంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ సమిష్టి ప్రయత్నం అనే భావన పలు ప్రభుత్వాల లో కనిపించడం లేదు. భిన్నరంగాల నిష్ణాతులను కలుపుకొని పోవడం లేదు. పరస్పరం చర్చించుకుంటే అన్ని నమూనాలను పరిశీలించే అవకాశం లభిస్తుంది. తమ చర్యలను మరింత పటిష్టం చేసుకోవచ్చు. తమ నిర్ణయా ల ప్రభావం భవిష్యత్‌ తరాలపై ఉంటుందని విధానకర్త లు గుర్తించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అంతర్జాతీయ సహకారం అంటే గిట్టదు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏ కారణాల వల్ల ఆ నిర్ణయాలు తీసుకుంటున్నదీ వెల్లడించారు. తర్కబద్ధత లేని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

పలు ప్రభుత్వాలు కొద్దిమంది శాస్త్ర సలహాదారుల మాటలు నమ్ముతున్నాయే తప్ప విస్తృత ప్రజానీకం అనుభవాలను స్వీకరించడం లేదు. రెండవ ప్రపంచయుద్ధకాలంలో కొందరు శాస్త్రసలహాదారులు ఎటువం టి ఆధారాల్లేని సూచనలు చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నదని నేచర్‌ పత్రిక తన సంపాదకీయంలో విమర్శించింది. అరువై ఏండ్ల కిందట రసాయన శాస్త్రవే త్త, రచయిత అయిన చార్లెస్‌ పెర్సీ స్నో తన పుస్తకం ‘సైన్స్‌ అండ్‌ గవర్నమెంట్‌'లో ఆశ్చర్యం గొలిపే విషయాలను రాశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రసాయన శాస్త్రవేత్తలు ప్రభుత్వాలకు ఇచ్చిన సూచనలు, సలహాలన్నీ ఏ విధమైన సాక్ష్యాధారాలు, భూమిక లేకుండా నే ఇచ్చారని తెలియజేశారు. ఆధునిక సమకాలీన ప్రపం చం ఇవ్వాళ ఒక మహమ్మారితో కబళింపబడుతున్న వేళ.. పెర్సీ స్నో చెప్పిన విషయాలు ఇప్పటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయి. అమెరికా, ఇంగ్లండ్‌తో సహా పలు దేశాలు కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల విషయంలో పారదర్శకతను పాటించడం లేదు. ఈ విధమైన గోప్యత అనుచితం, దీనికి ముగింపు పలుకాలి.కరోనా వైరస్‌ మహమ్మారికి ఇప్పుడు యూరప్‌ కేం ద్రంగా మారింది. వైరస్‌ బారిన ప్రతి దేశంలోనూ బాధితు ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. వైరస్‌ బారిన దేశాలు డబ్ల్యూహెచ్‌వో సలహాలు పాటించాలి. కానీ అమెరికా కానీ, ఇంగ్లండ్‌ కానీ  ఆయా దేశాల్లో కోవిడ్‌-19 విజృంభిస్తున్నా  డబ్ల్యూహెచ్‌వో తెలిపిన సూచనలు పాటించటం లేదు. వైరస్‌ వెలుగు చూసినప్పటి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు, వైద్యులు తమ దగ్గరు న్న సమగ్ర సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. వైరస్‌ స్థితిగతులు, దానివల్ల ఎదురవుతున్న సవాళ్లను అందరికీ అందుబాటులో ఉండేవిధంగా వెల్లడించాలి. ఈ విధమైన సమాచార పంపిణీతోనే మహమ్మారి గురించి సమగ్ర అవగాహన వస్తుంది. తద్వారా వైర స్‌ విస్తరిస్తున్న తీరు అర్థమైన దాన్ని కట్టడి చేయవచ్చు.  పరిశోధకులు, ప్రభుత్వాలు దాపరికాలు లేకుండా సమాచారా న్ని పంచుకోవటం ద్వారానే విస్తృతస్థాయిలో ఓ సమగ్ర కార్యాచరణకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సలహాదారులు నాయకులను సమిష్టి కార్యాచారణకు ప్రోత్సహించా లి. అందరి సంక్షేమం కోసం పాటుపడాలి. డబ్ల్యూహెచ్‌వో వెలుగులో నడుచుకునేందుకు కార్యాచారణ రూపొందించాలి. ఇదే కరోనా వైరస్‌ కట్టడికి అనువైన మార్గం.

(‘నేచర్‌' సంపాదకీయం సంక్షిప్తంగా.. )


logo