బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 20, 2020 , 23:29:19

మధ్యప్రదేశ్‌ రాజకీయం

మధ్యప్రదేశ్‌ రాజకీయం

పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం చూస్తే ప్రజలు ఎన్నుకున్న సభ్యుడిపై ఎటువంటి ఆంక్షలు, ఒత్తిడులు ఉండకూడదు. ఎమ్మెల్యే తనను ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా, నిర్భయంగా ఉండాలి. కానీ రెండు పార్టీల నాయకత్వాలు వల వేసి పట్టుకునే ప్రయత్నాలు, వారు శిబిరాలకే పరిమితమై, స్పీకర్‌ దగ్గరికి వచ్చి రాజీనామాలను సమర్పించలేకపోవడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

బలపరీక్ష శుక్రవారం నాడు జరుపాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌ రాజీనామా చేయక తప్పలేదు. ఆరుగురు మంత్రులతో పాటు మొత్తం 22 మంది సభ్యులు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది.  శాసనసభలోని కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 92కు తగ్గిపోయింది. తమకు మద్దతు ఇస్తున్న మరో ఏడుగురిని కలుపుకొన్నా కాం గ్రెస్‌ బలం 99కి మించదు. మెజారిటీ పొందడానికి 104 మంది సభ్యులు అవసరం కాగా, బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. అధికారం కాపాడుకోవడానికి చివరి క్షణం వరకు పాకులాడకుండా ఇంకా ముందుగానే కమల్‌నాథ్‌ రాజీనామా చేస్తే గౌరవంగా ఉండేది. ఈ నెల 16వ తేదీనే కమల్‌నాథ్‌ అసెంబ్లీలో బల నిరూపణకు దిగాల్సింది. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తిని కారణంగా చూపి పదిరోజుల పాటు బలపరీక్షను వాయిదా వేయడం హాస్యాస్పదంగా ఉన్నది. బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రెండువా రాల గడువు కావాలన్న కమల్‌నాథ్‌ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు- ‘వారాలు’ అవకాశం ఇవ్వడం అం టే బేరసారాలకు బంగారు గనులను అప్పగించిన ట్టు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

మధ్యప్రదేశ్‌లో ఈ మాసారంభంలో మొదలై న నాటకీయ పరిణామాలు మన రాజకీయ వ్యవ స్థ పతనావస్థకు అద్దం పట్టాయి. ఈ నెల మూడు, నాలుగవ తేదీలలో అధికా ర కూటమికి చెందిన ఎనమండుగురు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మారా రు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులు రంగంలోకి దిగి ఒక ఎమ్మెల్యే ను మళ్లీ వెనుక్కు తేగలిగారు. ఈలోగా ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం పది మంది బీజేపీ వైపు దూకినట్టు వెల్లడైంది. బీజేపి వీరందరినీ బెంగళూరులోని ఒక విశ్రాంతి కేంద్రానికి తరలించింది. కొద్దిరోజుల్లోనే వీరిలో ఎనమండుగురు మళ్లీ కాంగ్రెస్‌ వైపు తిరిగారు. ఈలోగా కాంగ్రెస్‌ అసమ్మతి వర్గం నేత జ్యోతిరాదిత్య చక్రం తిప్పారు. ఆయనకు గట్టి పట్టు ఉన్న గ్వాలియర్‌- చంబల్‌ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో సహా పందొమ్మిది మంది సభ్యు లు బీజేపీ వైపు మొగ్గారు. కాంగ్రెస్‌ పెద్దలు వీరిని ఆశ్రయించకుండా బీజేపీ బెంగళూరులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నది. కాంగ్రెస్‌ దిగ్గజం దిగ్విజయ్‌సింగ్‌ బెంగళూరులోని ఎమ్మెల్యేల శిబిరం ముందుకుపోయి ధర్నా చేసినా ఫలితం లేకపోయింది. రెండు వారాలకు పైగా ఎమ్మెల్యేలు అటూ ఇటూ మారిన క్రమంలో కోట్ల రూపాయల మేర బేరసారాలు సాగాయనే ఆరోపణలున్నాయి. 

పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం చూస్తే ప్రజలు ఎన్నుకున్న సభ్యుడిపై ఎటువంటి ఆంక్షలు, ఒత్తిడులు ఉండకూడదు. ఎమ్మెల్యే తనను ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా, నిర్భయంగా ఉం డాలి. కానీ రెండు పార్టీల నాయకత్వాలు వల వేసి పట్టుకునే ప్రయత్నాలు, వారు శిబిరాలకే పరిమితమై, స్పీకర్‌ దగ్గరికి వచ్చి రాజీనామాలను సమర్పించలేకపోవడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. సుప్రీంకోర్టు వెంటనే బలపరీక్ష జరుపాలని ఆదేశించడం వల్ల వివాదం ముగిసింది కానీ ఎల్లవేళలా న్యాయస్థానమే చక్కదిద్దలేదు. ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకావాలా వద్దా, ఎవరి బలమెంత అనేది తేలాల్సింది న్యాయస్థానాలలో కాదు. రాజకీయరంగంలో విలువలను కాపాడే బాధ్యత రాజకీయపక్షాలదీ, చట్టసభ సభ్యులదే. 


logo