బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 19, 2020 , 23:16:46

మూలాలు మరిచిన ఫలితమిది

మూలాలు మరిచిన ఫలితమిది

ఇప్పుడు ఇల్లు.. వాకిలి.. పల్లె.. పట్నం అన్నీ కాంక్రీట్‌ మయం. అప్పట్లోవాకిట్లో కల్లాపి చల్లి, ఇడుపులకు అలుకు పూసేవాళ్లం. ఇంట్లోకి ఏ పురుగూ పుట్రా రాకపోయేది. కడపకు పసుపు పూసేవాళ్లం. వైరస్‌లు.. బ్యాక్టీరియాలు దాన్నిదాటుకొని ఇంట్లోకి రాకపోయేవి. లోపలికి వస్తే కచ్చితంగా కాళ్లు, చేతులు కడుక్కునేవాళ్లం. దుమ్ము, ధూళి ఉంటే శుభ్రమయ్యేవి. కరోనా కాదు కదా దానికంటే శక్తిమంతమైన వైరస్‌లు వచ్చినా ఏం చేయలేని జీవనశైలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై పూర్తిగా దృష్టి సారించాయి. ఐసోలేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటునుంచి మొదలుకుంటే విమానాలు రద్దు చేయడం వరకు అన్నీపకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రత్యేక బులెటిన్స్‌ విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించి, ముందస్తు జాగ్రత్త చర్యలుగా విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. తగు జాగ్రత్తలు సూచించింది. మనం జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యమో అపోహలకు, వదంతులకు, అనుమానాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని ప్రతిరోజూ సూచిస్తున్నది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. కరోనా.. మహమ్మారే కావచ్చు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసేంత ప్రమాదకరమైందే అయుండొచ్చు. కానీ లోకాన్ని ముంచేంత శక్తి దానికున్నదా? బయట కరోనా గురించి చాలా చర్చ జరుగుతున్నది. జనాలు ఆందోళన చెందుతున్నారు. అదిగో కరోనా వచ్చె.. వచ్చె అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ వైరస్‌లు.. బ్యాక్టీరియాలు మన నియంత్రణలో లేనివా? వైరస్‌ అనగానే మన గుండెలెందుకు గుభేల్‌మంటున్నాయి? ఎందుకంటే.. మనం మారిపోయాం. నిరోధక శక్తి నుంచి ఆరో గ్య విరోధక శక్తి వైపు మారిపోయాం. భయానికి దగ్గరగా.. భద్రతకు దూరంగా వెళ్లిపోతున్నాం. ఈ భయం మనం ఏర్పరుచుకున్నదే. ఈ అలజడి మనం ఆపాదించుకున్నదే. కరోనా గురించి మనసులో రేగే ఒక చిచ్చు.. కలకలం మన ఆలోచనలను అల్లకల్లోలం చేస్తూ ఒక కొత్త ఫోబియాకు అవకాశం కల్పిస్తున్నది.

కరోనా చైనా నుంచి వ్యాప్తి చెందింది.. నిజమే. జరుగాల్సిన నష్టమైతే జరుగుతూనే ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎక్కడినుంచి వచ్చిందో అక్కడికి తరిమేయలేమా? కట్టడి చేయలేమా? ముట్టడించిందని మూలుగుతూ కూర్చుందామా? మనపై దాడి చేస్తున్న కరోనా ఒక వైరస్‌ మాత్రమే. మన కంట్రోల్‌లో మనం ఉండి దానినుంచి తప్పించుకుంటే సేఫ్‌లో ఉంటాం. తలవంచితే చేదు జ్ఞాపకంగా మారిపోతాం. ఇంత జరుగుతున్న కరోనా కలకలం గురించి ఇటలీ ఏం చెప్పింది? మం చి గుణపాఠమే చెప్పింది. ‘మేం తప్పు చేశాం.. మీరు చేయకండి’ అని మంచి సందేశమిచ్చింది. ‘వైరస్‌ వ్యాపిస్తుంది.. బయటకు వెళ్లొద్దు’ అని ఇటలీ ప్రభుత్వం ఎంతగా మొత్తుకున్నా జనాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ముందస్తు చర్యగా సెలవులు ప్రకటిస్తే.. విహారయాత్రలు, విం దులకు వెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దని చెప్తే వినకుండా గుం పులు గుంపులుగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ సూచనను తేలికగా తీసుకున్నారు. ఒకరకంగా చాలా తప్పు చేశారు. ఇటలీ కరోనా మరణాల సంఖ్య ఎంత? 2,978 మంది. 35,713 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నది. ఇంకా ఎలా ఉండబోతుందో? దేశ పౌరులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి తేలికగా తీసుకున్నారు. ఏమైంది? ఇవాళ ఇటలీ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆ దేశం కరోనాను కట్టడి చేయలేదా? మందుల్లేకనా? డాక్టర్లు లేకనా? ఎందుకు పరిస్థితి ఇంతగా దిగజారిం ది? అంటే ఒక్కటే కారణం.. పౌరులకు స్వీయనియంత్రణ లేకపోవడ మే. కేసుల సంఖ్య పెరుగడంతో వారికి ఎక్కడ ఐసోలేషన్‌ చేయాలో.. ఎక్కడ చికిత్స అందించాలో తెలియక అతలాకుతలమైన పరిస్థితి. ఇప్పు డు బాధపడుతున్నారు. ‘మేం చేసిన తప్పు మీరు చేయకండి.. ప్రభు త్వం చెప్పిన సూచనలను పాటించండి’ అంటూ మనకు సూచిస్తున్నారు.

ఇటలీ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇటలీ మాదిరిగా మన దగ్గరా పరిస్థితులు చేయి దాటిపోకుండా చూసుకోవాల్సింది మనమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై పూర్తిగా దృష్టి సారించాయి. ఐసోలేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటునుంచి మొదలుకుంటే విమానాలు రద్దు చేయడం వరకు అన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రత్యేక బులెటిన్స్‌ విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించి, ముందస్తు జాగ్రత్త చర్యలుగా విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. తగు జాగ్రత్తలు సూచించింది. మనం జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యమో అపోహలకు, వదంతులకు, అనుమానాలకు దూరంగా ఉం డటం కూడా అంతే ముఖ్యమని ప్రతిరోజూ సూచిస్తున్నది. కాబట్టి ప్రజ లు అర్థం చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండటం అంటే భయపడుతూ ఉండమని కాదు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవాలి. కొంద రు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ వదంతులు పుట్టిస్తున్నారు. వైర స్‌ ట కన్నా వదంతులనే ఎక్కువగా వ్యాపింపచేస్తూ అలజడి  సృష్టిస్తున్నారు. ఏమైందిప్పుడు.. దెబ్బకు పౌల్ట్రీ రంగం కుదేలైంది. మామూలు దెబ్బ కాదు అది. ఇప్పట్లో కోలుకోలేనంత దెబ్బ. కోళ్లను ఫ్రీగా ఇస్తామ న్నా, మాకొద్దంటే మాకొద్దూ అని భయపడిపోతున్న పరిస్థితి. సెన్సెక్స్‌పై కూడా గట్టి దెబ్బనే పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. దేశ ఆర్థికవ్యవస్థ ఇటలీకన్నా దారుణంగా తయారవుతుందనడంలో సందేహం లేదు. ప్రశాంతమైన మన జీవితాలు గాఢాంధకారంలోకి నెట్టివేయబడతాయి.కాబట్టి మనం వదంతులను, భయాలను పక్కనబెట్టి సెల్ఫ్‌ క్వారంటై న్‌, సెల్ఫ్‌ ఐసోలేషన్‌ను పాటించాలి. ముఖ్యంగా మన జీవనశైలిని మార్చుకోవాలి. అందరూ అంటున్నారు కదా.. ‘మనం ఇండియన్సబ్బా. ఈ వైరస్‌లు గియ్స్‌ల్రూ మనకు సోకవు. మనల్ని చూస్తే వైరసే పారిపోతుంది’ అని. వాస్తవమే మనం తినే తిండీ.. మన వాతావరణం మనకు రక్షణ కవచాలు. కానీ మన జీవనశైలి ఎలా ఉందిప్పుడు? మొత్తం మారిపోయింది. మనమూ అందరిలాగనే మనమూ తయారవుతున్నాం. చిన్నపాటి జలుబు వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. మన పెద్దవాళ్లు అదే జలుబుకు ఒక ఎల్లిపాయతో స్వస్తి చెప్పేవారు. ఇదొక్కటే కాదు, చాలా మారింది. మనం గట్టివాళ్లమనే గీత దాటి జీవిస్తున్నాం.ఇప్పుడు ఇల్లు.. వాకిలి.. పల్లె.. పట్నం అన్నీ కాంక్రీట్‌ మయం. అప్ప ట్లో వాకిట్లో కల్లాపి చల్లి, ఇడుపులకు అలుకు పూసేవాళ్లం. ఇంట్లోకి ఏ పురుగూ పుట్రా రాకపోయేది. కడపకు పసుపు పూసేవాళ్లం. వైరస్‌లు.. బ్యాక్టీరియాలు దాన్ని దాటుకొని ఇంట్లోకి రాకపోయేవి. లోపలికి వస్తే కచ్చితంగా కాళ్లు, చేతులు కడుక్కునేవాళ్లం. దుమ్ము, ధూళి ఉంటే శుభ్రమయ్యేవి. కరోనా కాదు కదా దానికంటే శక్తిమంతమైన వైరస్‌లు వచ్చి నా ఏం చేయలేని జీవనశైలి.

ఇప్పుడు.. అందమైన ఇల్లు ఉంది. కానీ ఈ కల్లాపి.. అలుకు పూత లు.. పసుపు పూతలేవీ లేవు. చాలా సున్నితమైన జీవనశైలి. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి లోపం. ఎలా వస్తుంది వ్యాధి నిరోధక శక్తి? మనిషి ఆలోచన మారితే వస్తుంది. ఏటా ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకొని తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఎవరైనా..ఎప్పుడైనా దీనిగురించి సీరియస్‌గా ఆలోచించారా? తల్లిపాలలో మంచి పోషక విలువలుంటా యి. మొదటి వారం రోజుల పాలల్లో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే శక్తి ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ప్రతి బిడ్డకూ తల్లిపాలు పట్టించాలి.. కనీసం ఏడాదైనా తాగించాలనే విషయాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? కనీసం ఆర్నెళ్లపాటైనా పాలు ఇవ్వకుండా డబ్బా పాలనే ఆశ్రయిస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. పరిస్థితి ఇలా మారింది కాబట్టే నేటి పిల్లలో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యకే ఆగమాగమవుతున్నారు. ఏ పనీ చెప్పక మరీ సెన్సిటివ్‌గా మారుస్తున్నాం. వెనుకటి రోజుల్లో పిల్లలు ఎలా ఉండేవాళ్లు? పొద్దున లేచి కూరగాయలకు వెళ్లేవారు. కనీసం గిర్నీ దగ్గరికి వెళ్లి పిండి అయినా పట్టించుకొచ్చేవాళ్లు. ఇప్పటి పిల్లలు ఫోన్లు ముందరేసుకొని  ఏది చెప్పినా వినరు. కనీసం లేచి లైట్‌ ఆఫ్‌ చేయమంటే కూడా ఆపసోపాలు పడే జీవనశైలిని మనం వాళ్లకు ఇస్తున్నాం. ఇదేనా మనమిచ్చే వారసత్వ సంపద? 

అర్థమైంది కదా? మనం ఏం కోల్పోతున్నామో? అప్‌డేట్‌ ముసుగు లో మనమే చేజేతులా వీటన్నింటికీ దూరమవుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కుదరకపోయి ఉండొచ్చు కూడా. కానీ కుదిరించుకోవాలి. లేకపో తే కరోనా లాంటి వైరస్‌లు మన జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే రానున్నరోజుల్లో పరిస్థితులు దారుణంగా తయారవుతాయనడంలో సందేహం లేదు. 

మన జీవనశైలి ఇలా మారితేనే.. ‘మనకేం అవుతుందిలే? మనం ఇండియన్స్‌' అనొచ్చు. మనమేవరమైతే వైరస్‌కేంటి? దానితో ఫైట్‌ చేసే శక్తి మనలో ఎంత ఉందనేదే కావాలి. ఇదొక్క కరోనా విషయంలోనే కాదు.. భవిష్యత్‌లో ఇంకేదైనా మహమ్మారి సోకితే ఢీకొనే శక్తి పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనకు ఉండాలి. అలాగే అవగాహన. కరోనా గురించి దుష్ప్రచారం చేస్తున్నవాళ్లలో ఎవరికీ దాని గురించి స్పష్టమైన అవగాహన లేదు. కొంతమంది కరోనా సోకితే తెగ ఆనందపడుతున్నారు లోకం మునిగిపోతుందని. లోకం ఎక్కడికీ మునిగిపోదు. ఏమీ కాదు. వెనకట ఒకప్పుడు స్కైలాబ్‌ పడినప్పుడూ ఇలాంటి ప్రచారాలే చేశారు. జనాలు నిజాలకంటే.. అబద్ధాలకే త్వరగా పడిపోతారు కాబట్టి ఒక్కొక్కరు ఉన్న కోళ్లన్నీ కోసుకొని తిన్నారు. మేకలు, గొర్లన్నింటినీ అమ్మేశారు. తెగ ఎంజాయ్‌ చేశారు. కానీ ఏమైంది? లోకం మునిగిపోయిందా? ఇదీ అంతే.. కాకపోతే వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది కాబట్టి కొంతకాలం స్తబ్ధత ఉంటుంది.ప్రభుత్వాలు చేస్తున్న కృషికి పౌరులుగా మనలో స్వీయ నియంత్రణ లేకపోతే మాత్రం జనజీవనం స్తంభించి దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపో తుంది. కాబట్టి స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 225,484. చనిపోయింది 9,277 మంది. కోలుకున్నది 85,831. ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 197. కొత్త కేసులు 28+. మరణాల సంఖ్య 4. కోలుకున్నది 20 మంది. యాక్టివ్‌లో ఉన్న కేసులు 173.పరిస్థితి ఇంతకన్నా దారుణంగా మారకముందే మనం తేరుకుందాం. ఎవరికి వాళ్లం శుభ్రంగా ఉందాం. ప్రభుత్వ సూచనలు పాటిద్దాం. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించుకొని కరోనాను కట్టడి చేద్దాం.logo