సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 19, 2020 , 23:14:57

ఎల్‌ఐసీ భవితవ్యం!

ఎల్‌ఐసీ భవితవ్యం!

ఒకప్పుడు అప్పటి అవసరాల రీత్యా స్థాపించిన సంస్థలు ఇప్పుడు అనవసరం అనిపిస్తే, వాటిని ప్రైవేటీకరించడంలో తప్పులేదు. కానీ ప్రైవేటీకరించడాన్నే ఒక విధానంగా ఎంచుకోవడం అభ్యంతరకరం. యురోపియన్‌ దేశాల్లో కూడా ప్రభుత్వరంగ సంస్థలు, సంక్షేమ విధానాలతో ఆర్థికవ్యవస్థలో ఒక సమతుల్యత ఉండేది. కానీ పనిగట్టుకొని ప్రైవేటీకరణ జరుపడం, సంక్షేమ పథకాలను తగ్గించడం వంటి చర్యల ద్వారా ఇప్పుడా దేశాలన్నీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ప్రతి దేశానికి కొన్ని చెప్పుకోదగిన ప్రతీకలుంటాయి. అవి కళాఖండాలు, చారిత్రక ప్రదేశాలు కావచ్చు, సజీవంగా ఉన్న సంస్థలూ కావచ్చు. 1950వ దశకం నుంచి ప్రజల జీవితాలతో పెనవేసుకొని ఉన్న జీవిత బీమా సంస్థ కూడా ఇటువంటి ప్రతీకనే. ఒక ఉద్యోగి తన పేర, పిల్లల పేర పాలసీ తీసుకోవడమనేది అత్యంత సాధారణ విషయం. ప్రాణాపాయం ఏర్పడినప్పుడు వచ్చే సొమ్ముగానే కాకుండా, దీనినొక పొదుపు చర్యగా పాలసీదారులు భావిస్తారు. తమ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందనే భరోసా కూడా ఇందుకు కారణం. పాలసీల విషయంలో ప్రజలు అత్య ధికంగా విశ్వసించేది ఎల్‌ఐసీనే. 

కానీ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎల్‌ఐసీ మెడ మీద కత్తి వేలాడుతున్నదనే విషయం ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నది. ప్రజలు మౌనంగా ఉన్నా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎల్‌ఐసీని దశలవారీగా ప్రైవేటీకరించాలనే విధాన నిర్ణయాన్ని గతంలోనే తీసుకున్నప్పటికీ, ఇటీవలి బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి మరింత స్పష్టంగా చెప్పా రు. పబ్లిక్‌రంగ సంస్థల ద్వారా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను సమీకరించాల ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న భారీ లక్ష్యం నేపథ్యంలో ఎల్‌ఐసీలో కొంత వాటాను ప్రైవేటుకు అప్పగించడం తప్పనిసరి అవుతున్నది.

నష్టాలతో నడుస్తున్న సంస్థలను ప్రైవేటుకు అప్పగించాలనడంలో తప్పేమీ లేదు. కానీ జీవిత బీమా సంస్థ చక్కగా నడుస్తున్న సంస్థ. ఇది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థ. ఎల్‌ఐసీ విజయవంతంగా నడుస్తున్న తీరును, స్వేచ్ఛా ఆర్థిక విధానాలకు మద్దతు ఇచ్చే వారు కూడా ప్రశంసించక తప్పదు. పాలసీదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రం గా సొమ్మును అప్పగించడంలో ఎల్‌ఐసీ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం 1956లో ఐదు కోట్ల రూపాయలతో ఈ సంస్థను నెలకొల్పింది. ఇప్పుడీ సంస్థ 48 వేల కోట్ల రూపాయలకు పైగా మిగులుతో ఉన్నది. 30 లక్షల కోట్ల కు పైగా ఆస్తులున్నాయి. 

దేశంలో మౌలిక వసతు ల కల్పన కోసం ఈ సంస్థ 2018 నాటి వరకు 3,76,097 కోట్ల రూపాయల మేర వెచ్చించింది. ఏటా రెండు వేల కోట్లకు పైగా డివిడెండ్లను ప్రభుత్వానికి ఇస్తున్నది. ఐడీబీఐ, ఓన్‌జీసీ వంటి సం స్థలు సంక్షోభంలో ఉన్నప్పుడు బెయిలవుట్‌ ఇచ్చి న ఘనత ఈ సంస్థది. గతంలో పంచవర్ష ప్రణాళికలకు నిధులను సమకూర్చిన చరిత్ర ఉన్నది. బంగారు గుడ్లు పెట్టే బాతు వంటి ఈ సంస్థ గొంతు కోయడం వల్ల దేశానికే నష్టం కాదా! ఈ సంస్థను ప్రభుత్వం కృత్రిమంగా బతికించడం లేదు. విదేశీ బీమా సంస్థల పోటీని తట్టుకొని మార్కెట్‌ లీడర్‌గా నిలబడుతున్నది. మొదటి ఐదేండ్ల పాలనలో కూడా వివిధ బ్యాంకులను గట్టెక్కించడంలో జీవిత బీమా సంస్థ నిధుల మీద ప్రధాని మోదీ ఎక్కువగా ఆధారపడ్డారు. అయినా ఈ సంస్థను ప్రైవేటీకరించాలని అనుకోవడంలో తర్కమేమిటో ప్రభుత్వం వివరించలేకపోతున్నది.

1980 దశకం తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధాన లోపం వల్లనే కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల బాట పట్టాయనే వాదన ఉంది. నష్టాలతో నడుస్తున్న సంస్థను ప్రైవేటుకు అప్పగిస్తే అభ్యంతరాలు వ్యక్తం కావు. జీవిత బీమా సంస్థను కూడా నష్టాల బాట పట్టించే చర్యలు ప్రారంభమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మాదిరిగానే ఎల్‌ఐసీకి కూడా మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి. గత ఐదేండ్లలో ఈ మొండిబకాయిలు రెట్టింపై 6.10 శాతానికి చేరుకున్నాయి. కొన్ని బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన సంస్థలే ఎల్‌ఐసీకి కూడా బాకీ ఉన్నాయి. ఏదో ఒక క్షణాన ఈ మొండి బకాయిలను రద్దుచేయడం కూడా జరుగవచ్చు. నష్టాలు వస్తున్న పబ్లిక్‌రంగ సం స్థలను ప్రజల నిధులతో మోయాలని లేదు. ప్రైవేటు రంగమంటేనే వ్యతిరేకించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు అప్పటి అవసరాల రీత్యా స్థాపించిన సంస్థలు ఇప్పుడు అనవసరం అనిపిస్తే, వాటిని ప్రైవేటీకరించడంలో తప్పులేదు. కానీ ప్రైవేటీకరించడాన్నే ఒక విధానంగా ఎంచుకోవడం అభ్యంతరకరం. 

యురోపియన్‌ దేశాల్లో కూడా ప్రభుత్వరంగ సంస్థలు, సంక్షేమ విధానాలతో ఆర్థికవ్యవస్థలో ఒక సమతుల్యత ఉండేది. కానీ పనిగట్టుకొని ప్రైవేటీకరణ జరుపడం, సంక్షేమ పథకాలను తగ్గించ డం వంటి చర్యల ద్వారా ఇప్పుడా దేశాలన్నీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. బ్రిటిష్‌ రైల్వేను ప్రైవేటీకరించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయనే అనుభవం ఉన్నది. ప్రైవేటు సంస్థలుదాన్ని సమర్థంగా నడుపలేకపోగా, ప్రయాణికులపై మరింత భారం మోపుతాయనేది తెలిసివచ్చింది. అయినా ప్రభుత్వం రైల్వే సంస్థను ఖండఖండాలుగా చేసి ప్రైవేటు సంస్థలకు పంచి పెట్టడం విమర్శలకు తావిచ్చింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు అటు కమ్యూనిస్టు బాట పట్టకుండా, ఇటు కార్పొరేట్‌శక్తుల పెత్త నం లేకుండా మన పాలకులు మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. ఆ విధానం సత్ఫలితాలను ఇవ్వడ మే కాకుండా స్వావలంబనను, సంక్షేమాన్ని ఇచ్చింది. కాలానుగుణంగా మార్పులు అవసరం కావ చ్చు. కానీ విధాన నిర్ణయాలు విచక్షణారహితంగా ఉండకూడదు.


logo