మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 18, 2020 , 23:27:55

పదవీ వ్యాజ్యం

పదవీ వ్యాజ్యం

పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులకు కాంగ్రెస్‌ పార్టీ పదవులు కట్టబెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తప్పుపట్టింది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండి మాజీ న్యాయమూర్తులకు పదవులు ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. కొందరు న్యాయమూర్తుల పాత తీర్పుల చిట్టాను తవ్వితీసి, ఫలానా తీర్పునకు ప్రతిఫలం అని ఆరోపణలు చేస్తున్నారు. మాజీ న్యాయమూర్తులకు పదవులు ఇవ్వకూడదనే సూత్రబద్ధ విధానానికి ఏ పార్టీ కూడా కట్టుబడి ఉండటం లేదు. కానీ నైతిక విలువలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే దిగజారుడుతనం రెండు పార్టీలలోనూ కనిపిస్తున్నది.

మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయిని రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రపతి నియమించడంతో, మాజీ న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టవచ్చునా, వారు స్వీకరించడం సబబా అనే చర్చ మళ్ళీ మొదలైంది. గొగోయి పదవీకాలం చివరి దశలో రాఫెల్‌, అయోధ్య వంటి కొన్ని కీలకమైన కేసులపై తీర్పు ఇచ్చారు. పదవీవిరమణ పొందిన నాలుగు నెలల్లోనే ఆయనకు మళ్ళీ పదవీ భాగ్యం కలిగింది. రాఫెల్‌ వివాదం ఎన్నికల సమయంలో అధికారపక్షాన్ని ఇరుకున పెడుతున్న దశలో వెలువడిన తీర్పు ప్రధానికి ఊరట కలిగించిందని కొందరు ఎత్తి చూపుతున్నారు. బీజేపీని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ఈ విమర్శలు గొగోయి నిబద్ధతను ప్రశ్నార్థకం చేయడంతోపాటు న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కూడా బోనులో నిలబెట్టడం ఆందోళనకర విషయం. మాజీ న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టకూడదనే చట్టపరమైన అడ్డంకి ఏమీ లేదు. కానీ ఈ విధానం మంచిది కాదనే చర్చ 1950 దశకం నుంచే ఉన్నది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య రాజ్యాంగవేత్తలు స్పష్టమైన హద్దులు విధించారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ప్రాణం. న్యాయవ్యవస్థ పరిధిలోకి కార్యనిర్వాహకశాఖ బహిరంగంగా చొరబడనప్పటికీ, ఇతరత్రా ప్రలోభపెట్టడం ద్వారా ప్రభావితం చేసే అవకాశం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందువ ల్ల పదవీవిరమణ పొందిన న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టడం మంచిది కాదనేది బలమైన వాదన.


మాజీ న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టడం సరైన విధానం కాదని పద్నాలుగవ లా కమిషన్‌ స్పష్టంచేసింది. పదవుల కోసం చూసే న్యాయమూర్తులు తమ విధిని సక్రమంగా నిర్వహించలేరని ప్రజలు భావించవచ్చునని కూడా అభిప్రాయపడ్డది. పలు కేసుల్లో ప్రభుత్వం కక్షిదారుగా ఉంటుంది. అందువల్ల మాజీ న్యాయమూర్తులు ప్రభుత్వ చలువతో పదవులు పొంద డం భావ్యం కాదనే అభిప్రాయం కూడా ఉన్న ది. నెహ్రూ హయాంలో కొందరు న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేసి ఇతర పదవులు చేపట్టిన ఉదంతాలున్నాయి. 1958 లో ప్రధాని నెహ్రూ కోరికపై జస్టిస్‌ ఎం.సి.చాగ్లా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి అమెరికాకు రాయబారిగా వెళ్ళారు. దేశవిదేశాల్లోని శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలను, వివిధరంగాలలోని నిష్ణాతులను నెహ్రూ గుర్తించి ఉపయోగించుకునేవారు. అందువల్ల చాగ్లా నియామకం పట్ల రాద్ధాంతం చెలరేగలే దు. ఇందిరా గాంధీ పాలన మొదలైన తర్వాత వ్యవస్థల పతనం, నైతిక విలువలు పడిపోవడం ప్రధాన సమస్యగా మారింది. 1983లో జస్టిస్‌ బహరుల్‌ ఇస్లాం ఒక క్రిమినల్‌ కేసులో బీహార్‌ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రాకు అనుకూలం గా తీర్పు ఇచ్చి, అనతికాలంలోనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేయడం గమనార్హం. ‘పదవీ విరమ ణ తర్వాత ఇచ్చే పదవులు, పదవీవిరమణకు ముందు ఇచ్చే తీర్పులను ప్రభావితం చేస్తాయ’ని బీజేపీ దివంగత ప్రముఖుడు అరుణ్‌ జైట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్య విస్తృత ప్రచా రం పొందింది.


పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులకు కాంగ్రెస్‌ పార్టీ పదవులు కట్టబెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తప్పుపట్టింది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండి మాజీ న్యాయమూర్తులకు పదవులు ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. కొందరు న్యాయమూర్తుల పాత తీర్పుల చిట్టాను తవ్వితీసి, ఫలానా తీర్పునకు ప్రతిఫలం అని ఆరోపణలు చేస్తున్నారు. మాజీ న్యాయమూర్తులకు పదవులు ఇవ్వకూడదనే సూత్రబద్ధ విధానానికి ఏ పార్టీ కూడా కట్టుబడి ఉండటం లేదు. కానీ నైతిక విలువలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే దిగజారుడుతనం రెండు పార్టీలలోనూ కనిపిస్తున్నది. పరస్పరం బురద జల్లుకునే క్రమంలో, ప్రజల్లో న్యాయవ్యవస్థను పలుచన చేస్తున్నామనే స్పృహ జాతీయపార్టీలుగా చెప్పుకునే ఈ రెండింటికీ లేకపోవడం బాధాకరం. నైతికవిలువల పరిరక్షణ పట్ల నిజంగా నిబద్ధత కనుక ఉంటే, రెండుపక్షాలకు చెందిన పెద్ద మనుషులు కూర్చొని ఈ అంశంపై ఏకాభిప్రాయానికి రావ చ్చు. కొన్ని నియమాలు పాటించాలనే ఒప్పందానికి వస్తే, ఎటువంటి చట్టం లేకున్నా, భవిష్యత్తు లో మరెవరు అధికారంలోకి వచ్చినా, వీరు నెలకొల్పిన సంప్రదాయాన్ని అతిక్రమించడానికి సాహసించరు. న్యాయమూర్తుల శక్తియుక్తులను సమాజానికి వినియోగించుకోవడంలో తప్పేమీ లేదు. మాజీ న్యాయమూర్తులను నిజాయితీగా ఉన్నత పదవులకు ఎంపిక చేసిన ప్రతిసారీ ఇటువంటి విమర్శలు రాలేదనేది గమనార్హం. చాగ్లా, హిదాయతుల్లా వంటి ప్రముఖుల నియామకాలే ఇం దుకు ఉదాహరణ. మాజీ న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టే విషయంలో రాజకీయపక్షాలు నిజాయితీగా వ్యవహరించాలి. కొన్నేండ్ల కాలపరిమితి తర్వాత మాత్రమే పదవులు చేపట్టే విధంగా ఒక నియమాన్ని ఏర్పాటుచేయడం కొంతవరకు మంచిది. న్యాయమూర్తులే తమలో తాము చర్చించుకొని కొన్ని నియమాలు విధించుకుంటే న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం ఇనుమడిస్తుంది.


logo
>>>>>>