శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 18, 2020 , 23:25:43

కేసీఆర్‌ సూటి ప్రశ్నలు

కేసీఆర్‌ సూటి ప్రశ్నలు

సీఏఏ వ్యతిరేక తీర్మానంపై అసెంబ్లీ చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ లేవనెత్తిన సూటి ప్రశ్నలకు బీజేపీ నుంచి సమాధానాలు లేవు. ఆ ప్రశ్నలను బీజేపీ దాటవేస్తున్నది తప్ప సమాధానాలు ఇచ్చే ప్రయత్నమే చేయటం లేదు. ఈ అంశంపై గత కొద్ది నెలల చర్చ సమయంలో ప్రదర్శించిన ఈ దాటవేత వైఖరినే వారు ఇప్పటికీ చూపుతున్నారు. ఈ కపటధోరణి కారణంగానే వారి చర్యలలో రహస్య ఉద్దేశం ఉన్నదని స్పష్టమవుతున్నది. అందువల్ల బీజేపీ స్వప్రయోజనాలు ఎంత నెరవేరుతాయో గానీ దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సమాజానికి మాత్రం ఎనలేని హాని కలుగుతున్నది.

సీఏఏ చట్టాన్ని విమర్శించినవారిని, ఆందోళనలు చేసినవారిని దేశద్రోహ నేరంపై మోదీ ప్రభుత్వం కేసులు మోపి అరెస్టులు చేస్తుండగా, ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం దేశద్రోహం కాదని ఇప్పటికే పలువురు న్యాయమూర్తులు ప్రకటించటం ఆయన దృష్టికి వచ్చినట్లు లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌ గుప్తా అయితే ప్రభుత్వ చర్యలు ప్రతిసారి ఒప్పుకాబోవని, చట్టాలను విమర్శించటం ద్వారానే సమాజం వికసిస్తుందని, చట్టాలనే గాక చట్టసభలను, ప్రభుత్వాలను, న్యాయవ్యవస్థను, సైనిక వ్యవస్థను విమర్శించినా సరే దానిని దేశ వ్యతిరేక చర్య అనలేమన్నారు. 


కేసీఆర్‌ లేవనెత్తిన సూటి ప్రశ్నలు ఏమిటో చూద్దాం. పౌరస త్వ సవరణ చట్టంలో హిందూ, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన, పార్శీ అనే ఆరు మతాలను పేర్కొన్న స్థితిలో ముస్లింలను ఎందుకు మినహాయించారన్నది ఒక ప్రశ్న. ఇందుకు మోదీ ప్రభుత్వం గాని, బీజేపీ గాని అధికారికంగా జవాబివ్వటం లేదు. అందుకు బదులుగా చతురమైన వాదన ఒకటి చేస్తున్నా రు. సీఏఏ వల్ల దేశంలో ఇప్పటికే గల ముస్లిం పౌరులకు ఎటువంటి నష్టం కలుగదన్నది వారు చెప్తున్న మాట. కానీ పౌరసత్వ చట్టం దేశంలో ఇప్పటికే ఉన్నవారి గురించి కాదు. ప్రశ్నలు వస్తున్నది కూడా వారి గురిం చి కాదు. పొరుగుదేశాల్లో వేధింపులకు గురై ఇక్కడికి వచ్చేవారి గురించి మాత్రమే. వలస వచ్చేవారు ఎవరైనా ఎటువంటి వివక్ష లేకుండా చూడా లి తప్ప మతం ప్రాతిపదికపై వివక్ష ఎందుకన్నది సూటి ప్రశ్న. ఈ ప్రశ్న బయటినుంచి వచ్చే బాధితులకు సంబంధించినది కాగా బీజేపీ ఆ కోణా న్ని తెలివిగా దాటవేస్తూ, ఇప్పటికే ఇక్కడ ఉన్నవారి గురించి మాట్లాడి ప్రజలను ఏమార్చజూస్తున్నది.


బీజేపీ నాయకులు అనధికారంగా వ్యక్తిగత హోదాలో కొన్ని వాదన లు చేస్తున్నారు. ఒకవేళ ముస్లింలు వేధింపులకు గురైతే వారికి ముస్లిం దేశాలున్నాయి గదా ఇటురావటమెందుకని. ఇతర ముస్లిం దేశాలున్నమాట నిజం. ఒకవేళ అదేగనుక సూత్రమైతే క్రిస్టియన్ల కోసం క్రిస్టియన్‌ దేశాలు, బౌద్ధుల కోసం బౌద్ధ దేశాలు, పార్శీల కోసం ఇరాన్‌ లేవా అన్న ది విమర్శకుల ప్రశ్న. అదేవిధంగా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో వేధింపులకు గురవుతున్నవారిలో షియా, హజారా వంటి మైనారిటీ తెగ ల మాటేమిటన్నది మరొక ప్రశ్న. మయన్మార్‌లో బౌద్ధ ప్రభుత్వం చేత దమనకాండకు గురయ్యే రోహింగ్యాలు, శ్రీలంకలో తమిళుల ప్రశ్నలూ ఉన్నాయి. ఈ చట్టం బాధితుల పట్ల మానవతా దృష్టికి సంబంధించినదే అయినప్పుడు అందులో ఒక మతాన్ని మినహాయించటం ఎందుకన్నది ప్రశ్న. 


ఇవి ఒక విధమైన ప్రశ్నలు కాగా, ఈ వివక్ష మన రాజ్యాంగ స్ఫూర్తి కి, ప్రజాస్వామిక సంస్కృతికి, అంతర్జాతీయ నియమ నిబంధనలకు విరుద్ధమన్నది కేసీఆర్‌ వలెనే దేశ విదేశాలకు చెందిన విమర్శకులు వేస్తు న్న ప్రశ్నలు. ఇందుకు సమాధానమివ్వని బీజేపీ ఇది మా అంతర్గత విషయమని, సార్వభౌమాధికారమని దబాయిన్నది. అంతర్గత విషయాల్లో, సార్వభౌమాధికారంలో మత వివక్ష ఉండవచ్చునా అనే ప్రశ్నకు జవాబు లేదు. ఇదే సందర్భంలో బీజేపీ నాయకులు చూపుతున్న చతురత మరొకటి ఉన్నది. పాక్‌, ఆఫ్ఘన్‌, బంగ్లాదేశ్‌లలో బాధితులైన హిందువులకు మనం పౌరసత్వం ఇవ్వవద్దంటారా అని. ప్రతిపక్షాలు గాని, విమర్శకులు గాని ఆ మాట ఎవ్వరూ, ఎప్పుడూ అనలేదు. ఇవ్వాలనే అంటున్నా రు. వారు అనని మాటను అన్నట్లు ప్రచారం చేస్తున్న బీజేపీ, ఆ వక్రీకర ణ వెనుక తన వివక్షలను కప్పిపెట్టజూస్తున్నది.


సీఏఏలో ముస్లింల ప్రస్థావన ఎందుకు లేదంటూ ముఖ్యమంత్రి వేసి న ప్రశ్నలో ఈ అర్థాలు, అంతరార్థాలు అన్నీ ఉన్నాయి. ఇదే విధమైన మరొక సూటి ప్రశ్నను చూడండి. సీఏఏ, ఎన్పీఆర్‌లకు ఎన్నార్సీతో సం బంధం లేదన్నది మోదీ ప్రభుత్వం ప్రకటన. అదే సమయంలో వాటి మధ్య సంబంధం ఉందని కూడా అంతే అధికారికంగా చెప్తున్నారు. ప్రధాని, హోంమంత్రి, హోంశాఖ 2018-19 వార్షిక నివేదిక వేర్వేరు విధంగా పేర్కొంటుండటం ఒక విచిత్రమైన స్థితి. ఇదొక బహుముఖ వైరుధ్యం. దీనిని గతంలోనే ఎత్తిచూపిన కేసీఆర్‌ ఈ నెల 16 నాటి అసెం బ్లీ చర్చలో తిరిగి ప్రస్తావించారు. ఎన్పీఆర్‌ సర్వే అన్నది ఎన్నార్సీకి తొలి అడుగు అంటూ స్వయంగా హోంశాఖ నివేదిక పేర్కొన్నదానిని చదివి వినిపించారు. దీనంతటికి అర్థం ఏమిటి? ఇందువల్ల ప్రజల్లో భయాందోళనలు తలెత్తవా? ఇటువంటి పరస్పర విరుద్ధ స్థితి వల్లనే కదా విమర్శలు, దేశమంతటా ఆందోళనలు వస్తున్నది? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కానీ ఈ తరహా ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం గాని, బీజేపీ గానీ కనీసం కుంటి సమాధానాలైనా ఇవ్వలేకపోయాయి. ఎన్నార్సీ గురించి ఇంతవరకు అసలు చర్చించలేదంటూ మభ్యపెట్టజూస్తున్నారు గాని భవిష్యత్తులో చర్చించబోమంటూ ఇంతవరకు ప్రకటించలేదు. ఒక్కొక్క అడుగుగా ముందుకుపోవటమే వారి రహస్య పథకం.


కేసీఆర్‌ మూడవ సూటి ప్రశ్న-ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు సమర్పించవలసిన పత్రాల గురించి. ప్రభుత్వం చెప్పేదా నిలో ఇందులోనూ పై తరహా వైరుధ్యాలే ఉన్నాయని ఆయన ఎత్తిచూ పారు. ప్రజలు తమకు తెలిసిందే చెప్పవచ్చునని, ఉన్న పత్రాలే ఇవ్వవచ్చునని, లేని వాటిగురించి చింతించనక్కరలేదని,ఆ కారణంగా తర్వా త ఇబ్బందులుండబోవని ప్రభుత్వం నుంచి ఒకవైపు నోటిమాటగా నమ్మబలుకుతున్నారు. మరొకవైపు  అవి తప్పనిసరి అంటున్నారు. లోగ డ జరిగిన జనాభా లెక్కల్లో లేని కొత్త ప్రశ్నలను ఈసారి ఎన్పీఆర్‌లో చేర్చారు. ఈ ఎన్పీఆర్‌ డేటా తర్వాత జరిగే ఎన్నార్సీకి ఆధారమవుతుం ది. ఒక్కొక్క అడుగు ముందుకు పోవడమంటే ఇదే. ఇది ప్రజలను వం చించే బుద్ధిపూర్వకమైన వైరుధ్యం కాదా? ఒక స్థాయి కుటుంబానికి చెం దిన తనకే జన్మనామం తప్ప జన్మపత్రం లేదని, అటువంటప్పుడు దేశంలోని కోట్లాదిమంది పేదల పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించా రు. ఇది గత అనేక వారాల చర్చ సందర్భంగా జవాబు రాని ప్రశ్న. ఇప్పటికీ రావటం లేదు. ఏ దేశానికైనా ఒక పౌరసత్వం అంటూ ఉండాలన్న దే కేసీఆర్‌ ఉద్దేశం. కానీ ఆ ప్రక్రియ ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధం గా, పారదర్శకంగా, ఇండియా వంటి వైవిధ్య దేశంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ వివక్ష లేనివిధంగా కాకుండా ముసుగు వ్యవహారంగా ఎందుకు సాగాలన్నది ఆయన అసెంబ్లీలో వేసిన ప్రశ్న. ఇది ఎవరి ప్రయోజనాల కోసమని కూడా ఆయన అంతే సూటిగా అడిగారు. అంతిమంగా ఇది ముస్లిం సమస్యో, హిందూ సమస్యో కాద ని, యావద్దేశ సమస్య అని ప్రకటించారు.


చర్చ సమయంలో సీఎం కొన్ని విషయాలు స్పష్టం చేశారు. టీఆర్‌ ఎస్‌ సెక్యులర్‌ పునాదులున్న పార్టీ అని, మన రాజ్యాంగంలోనే సెక్యులరిజం అనే మాట ఉన్నదంటూ, తమ విధానం ప్రకారమే ప్రస్తుత తీర్మా నం చేస్తున్నామని, దానిని తెలంగాణ సమాజం హర్షిస్తుందో లేదో చూద్దామన్నారు. వందల ఏండ్ల మెట్రో పాలిటన్‌ సంస్కృతి గల తెలంగాణ ఇటువంటి ప్రశ్నలు వేయవలసి ఉంటుందన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా సరే తమ వైఖరి ఇదని సాహసంతో ప్రకటించారు. కేసీఆర్‌ లౌకికవాద సిద్ధాంతంపై ఆయన గురించి మొదటి నుంచి తెలిసిన వారెవరికీ సందేహం ఉండదు. మజ్లిస్‌ పార్టీతో రాజకీయ మైత్రి అదేక్రమంలో ఏర్పడినటువంటిదే. ఆ మైత్రిని చూపుతూ ఆయనపై బీజేపీ నిరంతరం విషం కక్కటం కనిపిస్తున్నదే. సీఏఏను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులని, పాకిస్థాన్‌ ఏజెంట్లని ముద్రవేయజూస్తున్నారని అసెంబ్లీ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి నిరసించిన సాయంత్రమే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు బండి సంజ య్‌, మరొక ఎంపీ అరవింద్‌లు, దీన్నొక అవకాశంగా తీసుకొని ఆయా ప్రశ్నలపై ప్రజలకు సావధానంగా వివరణ ఇవ్వటానికి బదులు కేసీఆర్‌పై దేశద్రోహం కేసు మోపాలంటూ డిమాండ్‌ చేయటం గమనించదగినది. సం జయ్‌కు గల ఘనమైన అవగాహన ప్రకారం పార్లమెంట్‌ చేసిన ఒక చట్టాన్ని వ్యతిరేకించటం, అసెంబ్లీలో తీర్మానించటం దేశద్రోహమవుతుంది!


సీఏఏ చట్టాన్ని విమర్శించినవారిని, ఆందోళనలు చేసినవారిని దేశద్రోహ నేరంపై మోదీ ప్రభుత్వం కేసులు మోపి అరెస్టులు చేస్తుండగా, ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం దేశద్రోహం కాదని ఇప్పటికే పలువు రు న్యాయమూర్తులు ప్రకటించటం ఆయన దృష్టికి వచ్చినట్లు లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌ గుప్తా అయితే ప్రభుత్వ చర్యలు ప్రతిసారి ఒప్పు కాబోవని, చట్టాలను విమర్శించటం ద్వారానే సమాజం వికసిస్తుందని, చట్టాలనే గాక చట్టసభలను, ప్రభుత్వాలను, న్యాయవ్యవస్థ ను, సైనిక వ్యవస్థను విమర్శించినా సరే దానిని దేశ వ్యతిరేక చర్య అనలేమన్నారు. ప్రభుత్వం వేరు, దేశం వేరని స్పష్టం చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షునికి ఈ విషయం తెలిస్తే ఆ జడ్జిపై కూడా దేశద్రోహం కేసు పెట్టమంటారనే భయం కలుగుతున్నది. కొంతకాలంగా ఆయన మాటలు, చేతలను గమనిస్తున్నవారికి, అక్కరలేని దూకుడు తగ్గించి కొంత పరిణ తి తెచ్చుకోవటం మంచిదనిపిస్తున్నది. ప్రస్తుతానికి మాత్రం ఆయన  ‘విషం కక్కటం ద్వారా రాజ్యాధికార సాధన’ అని సిద్ధాంతీకరించుకున్నట్లు కనిపిస్తున్నారు. 


పదవులే కాదు, కొంత గౌరవనీయత కూడా అవసరమని ఆయన గ్రహించాలి. ఇంచుమించు ఇదే విధమైన తీర్మానాలు ఇప్పటికే అరడజను రాష్ర్టాలు చేశాయని, వాటిలో తమ ఎన్డీయేలో భాగస్వామి అయిన బీహార్‌ కూడా ఒకటని ఆయనకు తెలుసునో లేదో. ఈ ఇద్దరు బీజేపీ నేతలు అసెంబ్లీ తీర్మానాన్ని చిత్తు కాగితమని, దాన్ని చెత్త బుట్టలో పడేయాలని ఈసడిస్తూ మాట్లాడారు. తెలంగాణ సహా ఈ అసెంబ్లీ తీర్మానాలన్నీ చట్టపరంగా నిలువవచ్చు, నిలువకపోవచ్చుగాక. అయినా వాటికి గల ప్రజాస్వామిక అర్థాన్ని  ప్రజాస్వామ్యవాదులు మాత్రమే గుర్తించగలరు. ఆయా రాష్ర్టాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే చట్టసభల అభిప్రాయం గురించి ఇంత తిరస్కారంగా మాట్లాడటమంటే వీరిద్దరికి ప్రజాస్వామ్యం పట్ల ఎంత అవగాహన, గౌరవం ఉన్నాయో అర్థమవుతున్నది.


logo