బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 18, 2020 , 23:23:27

తెలంగాణ గడ్డ, లౌకికతత్త్వానికి అడ్డా

తెలంగాణ గడ్డ, లౌకికతత్త్వానికి అడ్డా

ఈ దేశంలో ఉండాలంటే సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను ఒప్పుకోవాల్సిందే, లేకుంటే మీరు దేశద్రోహులే అనటం దేశంలో ఆలోచనాపరులందరినీ బాధకు గురిచేస్తున్నది. ఈ చారిత్రక సందర్భంలో కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొత్తం లౌకిక ప్రజాస్వామిక శక్తులందరినీ ఒక్కటిచేస్తూ చేసిన చారిత్రక ప్రకటనగా నిలిచిపోతుంది.

మనది సర్వమత సమానత్వాన్ని ప్రతిష్ఠించిన నేల. ఈ నేల పై ఎవరు ఎన్నెన్ని రకాలుగా మత ఘర్షణలను లేపి, మతరాజ్యాలను చెలాయించాలని చూసినా దాన్ని తిప్పికొట్టిన సర్వమత సమానత్వ సమ్మేళనాల భూమి నా భరతభూమి. చరిత్ర పాఠాలను తిరగేస్తే ప్రపంచంలోనే సర్వమత సమానత్వ లౌకికరాజ్యం భారతదేశమేనని సగర్వంగా చెప్పబడుతున్నది. మతం పేరు తో ఎవరైనా లబ్ధి పొందాలని చూసినప్పుడల్లా మహాత్మా గాంధీకి ఇష్టమై న ‘రఘపతి రాఘవ రాజారావ్‌ు/ పతీత పావన సీతారావ్‌ు/ ఈశ్వర అల్లా తేరే నావ్‌ు/సబ్‌కో సమ్మతి దే భగవాన్‌' గీతం గుర్తుకువస్తుంది. భక్తి ఉద్యమకారుడు, సామాజిక సంస్కర్త సంత్‌ కబీర్‌దాస్‌ ‘మతం పేరిట సామరస్యం చెడగొట్టుకోవడం అవివేకం’ అన్నది గుర్తుకువస్తుంది. 


మతం పేరున లేస్తున్న మంటలు వినాశనం వైపునకే తీసుకుపోతాయని చరిత్ర చెబుతున్నది. కబీర్‌ అన్న ‘రావ్‌ు రహీవ్‌ు ఏక్‌హై’ సూక్తి మత సామరస్యానికి గుర్తుగా నిలుస్తుంది. భద్రాద్రి రామునికి తానీషా ముత్యాల తలంబ్రా లు సమర్పించే సంప్రదాయం హిందూ ముస్లిం ఐక్యతకు సంకేతం. ఇం దులో హిందువుల భక్తి సంప్రదాయాలు, ముస్లింల సూఫీతత్త్వం కలగల సి ఉన్నాయి. ఇంతకంటే మత సామరస్యానికి చిహ్నాలేముంటాయి?  రాష్ట్ర అవతరణ తర్వాత చార్మినార్‌ సాక్షిగా ఒక్క మతఘర్షణ జరుగలేదు. కొందరు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా హైదరాబాద్‌ మతసామరస్య కేం ద్రంగా నిలిచింది. ఈ సంస్కృతి బలంగా కొనసాగిస్తూ అభివృద్ధి దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇది భవిష్యత్తుకు శుభసూచకం.


న్యూనతాభావనతో జీవించటం కంటే ఘోరమైనది మరొకటి ఉండదు. మనిషిని న్యూనతలోకి నెట్టి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజ్వరిల్లే ఆగ్రహాన్ని అంచనా వేయలేం. జ్యోతిభా పూలే, అంబేద్కర్‌లు అన్నిరకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు. మనుషులు, మతాల మధ్య అడ్డుగోడలను కూల్చి భారతదేశం మానవీయ సమాజంగా ఉండాలని ఎందరెందరో కొట్లాడి భారత రాజ్యాంగం రాశారు. ఈ దేశంలో అణగదొక్కబడుతున్న మహా జనావళికి గొప్ప అండ భారత రాజ్యాంగం. జీవించే హక్కు ను, ఆత్మగౌరవంతో నిలిచే హక్కును కల్పించింది రాజ్యాంగం. 2020, మార్చి 3న అసెంబ్లీ సాక్షిగా ‘సర్వమత సమభూమిలో మత వివక్షా?’ అని గర్జించిన సీఎం కేసీఆర్‌ కంఠం విన్నాక ఒళ్లు పులకరించింది. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం పెట్టి వాటిని ఒప్పుకోమనగానే తెలంగాణ నేలంతా పరవశించింది. లౌకిక ప్రజాస్వామిక శక్తులంతా పరమానందంలో మునిగాయి.


అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే 1990లకు ముందు తెలుగునాట లేచిన అస్తిత్వ సాహిత్య ఉద్యమాల్లో వచ్చిన ప్రశ్నలు గుర్తుకువచ్చాయి. ‘పాదముద్ర’ దీర్ఘకవిత గుర్తుకువచ్చింది. ఇది అట్టడుగు బహుజనవర్గాల అస్తిత్వాలకు గుర్తుగా వచ్చింది. ఖాదర్‌ మొహియొద్దీన్‌ రాసిన ‘పుట్టుమచ్చ’ కవిత మొత్తం తెలుగు సమాజాన్ని ఆలోచింపజేసింది. ముస్లిం అస్తిత్వ కోణం నుంచి రాసిన ఈ కవితలో.. ‘నేను పుట్టకముం దే/నా పేరు దేశద్రోహుల జాబితాలో నమోదైంది..’ అంటూ రాసిన కవిత భరతమాత బిడ్డలుగా ఈ మట్టి పాలు తాగి పెరిగిన నన్ను అనుమానంగా చూస్తున్నారా? అన్న ఖాదర్‌ వేదన కలచివేస్తుంది. తెలుగు సాహిత్యంలో ముందుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాలన్నీ మనుషులను విడదీసేవిగా కాకుం డా అందర్నీ ఐక్యం చేసేదిగా అస్తిత్వ సాహిత్యం వచ్చింది. స్త్రీ, దళిత, బహుజన, గిరిజన, బీసీ అస్తిత్వవాదాలతో వచ్చిన సాహిత్యమంతా సమాజంలో ఉన్న ఒడిదుడుకులన్నింటిని సరిచేసేందుకు వచ్చినవే. అందులో తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్యం ప్రపంచ అస్తిత్వ ఉద్యమసాహిత్యంలో విశిష్ఠమైనది. తెలంగాణ అస్తిత్వ సాహిత్య ఉద్యమం రాష్ట్ర సాధన ఉద్యమానికి అండదండగా నిలిచింది.


ఇప్పుడు ఈ దేశంలో ఉండాలంటే సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను ఒప్పుకోవాల్సిందే, లేకుంటే మీరు దేశద్రోహులే అనటం దేశంలో ఆలోచనాపరులందరినీ బాధకు గురిచేస్తున్నది. ఈ చారిత్రక సందర్భంలో కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొత్తం లౌకిక ప్రజాస్వామిక శక్తులందరినీ ఒక్కటిచేస్తూ చేసిన చారిత్రక ప్రకటనగా నిలిచిపోతుంది. కేంద్రం రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తీరు ను కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలందరి తరపున్నే కాకుండా దేశప్రజలందరి తరపున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లయ్యింది. ఈ తీర్మానం ప్రజాస్వామిక విలువలకు పట్టం కట్టింది.


మనది అందరినీ కలుపుకొనిపోయే సంస్కృతి. హైదరాబాద్‌ నగరాన్ని రెండుముక్కలు చేసి మంటలు లేపే సంస్కృతికి తెలంగాణ రాష్ట్రంలో కాలంచెల్లింది. ఈ నేలలో పీర్ల పండుగకు, బతుకుమ్మ పండుగకు ఎన్న డూ పోటీపెట్టి చూడలేదు. శ్రీరామనవమి తీర్థాన్ని కలిసి తాగినం, రంజా న్‌ సేమియాలను కలిసి సేవించి నం. క్రీస్తు పుట్టినరోజును కలిసి చేసుకున్నం. ఈ మహోన్నత మానవీయ సంబంధాల మీద ఎవరు దాడిచేసినా ఈ నేల ఒప్పుకోదు. తిప్పికొడుతదనటానికి 2020, మార్చి 3 అసెంబ్లీ తీర్మాన ప్రకటన రుజువుచేస్తున్నది.


యాభై మంది పౌరులు ఢిల్లీలో చనిపోయిన తీరు, ఆ అల్లర్ల వెనుక ఉన్న నేపథ్యం దారుణం. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి, ఒక వర్గంపై మరో వర్గం ఆధిపత్యం చెలాయించే స్థితిని ఈ భరతభూమి ఏనాడూ ఒప్పుకోలేదు, భవిష్యత్తులో ఒప్పుకోదు. మత సామరస్యాన్ని వ్యతిరేకించేవాళ్లను దేశద్రోహులనే మద్రవేసే స్థితి మంచిదికాదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘా తం. దీన్ని తిప్పికొట్టవలసిందే.


నలభై ఏండ్ల కిందట మీరట్‌లో అల్లర్లు జరుగుతున్న సందర్భంలో భయం గొల్పేవిధంగా ఉన్న వార్తలను గడగడా చదివేసుకుంటూ పోతుం టే సంపాదకీయంలో కులదీప్‌ నయ్యర్‌ రాసిన వ్యాసాన్ని ఆసాంతం గుక్కబట్టినట్లుగా చదివేశాను. ఓ నలభై ఏండ్ల తర్వాత మళ్లీ కులదీప్‌ నయ్యర్‌ మతం మత్తు మందే కాదు కరోనా, గత్తర కంటే భయంకరమైనది. మనిషిని మనిషిగా చూడలేని తనం దుర్మార్గమైంది. మనుషులందరూ ఒక్కటేనని చల్లటి సంగీతం వినిపించే గానం భూగోళాన్నంతా చుట్టుకపోవాలి. విశ్వమానం గీతిక కావాలి.


ఆలోచనలు సంఘర్షించుకొని ఎన్నెన్ని రకాలుగా వికసించినా వికసించనివ్వండి. కానీ, ఒక వ్యక్తిపై మరో వ్యక్తి ఒక సమూహంపై మరో సమూ హం మతం రంగు పులుముకొని దాడి చేయటం, ఆధిపత్యం చెలాయించడం అమానవీయ సంస్కృతికి అద్దం పడుతుంది. ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఎవరి మత విశ్వాసాలు, అలవాట్లు, ఆచారాలు వారికి ఉంటాయి. ఉండవచ్చును కూడా.


logo