ఆదివారం 29 మార్చి 2020
Editorial - Mar 17, 2020 , 23:15:46

‘విభజన’ అమలులోనూ వివక్ష

‘విభజన’ అమలులోనూ వివక్ష

కర్ణాటక, గుజరాత్‌, యూపీ, మహారాష్ట్ర రాష్ర్టాల్లో బీజేపీ బలంగా ఉన్నందున, తమిళనాడులోని ఇరు ప్రధాన పార్టీలతోపార్లమెంట్‌లో అవసరం ఉన్నందున కేంద్రం ఈ రాష్ర్టాలకు మాత్రమే సహకరిస్తున్నది. కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ ఆర్థికసాయం కింద చేపట్టే పథకాల పట్ల పూర్తి వివక్ష చూపిస్తున్నారని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. ఆయన ఎంతో ప్రజాస్వామ్యయుతంగా ఫెడరల్‌వ్యవస్థను గౌరవిస్తూ విజ్ఞప్తి చేసినా తగురీతిలో స్పందించడం లేదు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే చట్టం నినాదంతో బీజేపీ రెండవ సారి అధికారం చేపట్టగానే ఆర్టికల్‌ 370ని రద్దుచేస్తూ, జమ్ము కశ్మీర్‌ను విభజిస్తూ పునర్విభజన చట్టం తెచ్చింది. అయితే కేంద్రం ఈ పునర్విభజన చట్టాన్ని, ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలుచేయడంలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నది. తాజాగా రాత్రికిరాత్రి సీట్ల పెంపు అంశాన్ని ఏపీ పునర్విభజన బిల్లులో చేర్చారని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. కానీ 2013లో నే కేంద్ర క్యాబినెట్‌లో అసెంబ్లీ స్థానాల పెంపును ప్రతిపాదించారు. ఏపీ పునర్విభజన బిల్లును రాష్ట్రపతి ఏపీ అసెంబ్లీ పరిశీలనకు పంపినప్పుడు కూడా ఈ అంశం ఉన్నది. ఫిబ్రవరి 13న ఈ బిల్లును లోక్‌సభలో పెట్టి 18న రాజ్యసభలో పెట్టి ఆమోదించారు. ఈ వాస్తవాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 


జమ్ము కశ్మీర్‌ విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాలను 107 నుంచి 114కి పెంచాలని నిర్దేశించారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్‌ 26లో తెలంగాణ  అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు, ఏపీలో సీట్లను 175 నుంచి 225కు పెంచాలని పేర్కొన్నారు. అయితే గత ఐదేండ్లుగా ఎన్డీయే ప్రభుత్వం విం త వాదన చేస్తున్నది. ఆర్టికల్‌ 170(3) ప్రకారం 2026 సంవత్సరం వర కు అసెంబ్లీ స్థానాలు పెంచకూడదని, పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని చెబుతున్నది. అదే జమ్ము కశ్మీర్‌ విషయంలో పునర్విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాల పెంపు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించటం పునర్విభజన కమిషన్‌ ఏర్పాటు అంశాలను నిర్దేశించింది. వీటి అమలుకు అడ్డుగా ఉన్న ఆర్టికల్‌ 170 క్లాజ్‌-3ను రాజ్యాంగ సవరణ ద్వారా సవరించకుండా, దీనిలో ఏవీ ఉన్నప్పటికీ అవి పరిగణనలోకి రావని  చేర్చిం ది. 


అలాగే ‘2026 తర్వాత వచ్చే తొలి జనగణనతో పునర్విభజన (సీట్ల పెంపు) చేయాల’న్న రాజ్యాంగ నిబంధనలో మార్పులు చేసి దాని స్థానం లో ‘2011 జనాభాతో’ అన్న పదాలు చేర్చి, కేవలం కశ్మీర్‌ విభజన చట్టంతోనే అసెంబ్లీ సీట్ల పెంపును చట్టంలో నిర్దేశించారు. అక్కడితో ఆగకుండా కేంద్రం మార్చి 6న కేంద్ర న్యాయశాఖ పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి రంజన్‌ ప్రకాశ్‌ దేశాయ్‌ని చైర్మన్‌గా, భారత ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్రను సభ్యులుగా మరొక అధికార సభ్యుడిగా ఆయా రాష్ర్టాల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించింది. జమ్ము కశ్మీర్‌లో సీట్ల పెంపుతో పాటు, (2008లో నిలిపివేయబడిన) అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ర్టాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేవిధంగా ఏడాది కాలపరిమితితో ఈ కమిషన్‌ను నియమించింది.


రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద రాష్ట్ర విభజన చట్టం రూపొందించారని, అందులోని సెక్షన్‌ 26లోని ‘సబ్జెక్ట్‌ టు ప్రొవిజన్‌' స్థానంలో ‘నాట్‌ విత్‌ స్టాండింగ్‌ కంటైయిన్డ్‌ ఆఫ్‌ ది ఆర్టికల్‌ 170 క్లాజ్‌ 3’ అని చేర్చి పార్లమెంట్‌లో చట్టసవరణ లేదా కేంద్రం క్యాబినెట్‌ ఆమోదించడం ద్వారా సీట్ల పెంపుదల అమల్లోకి తీసుకువచ్చారని కేంద్ర మాజీ సమాచార ప్రధాన కమిషనర్‌ మాడబూషి శ్రీధర్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరిస్తూ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ కేంద్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. సీట్ల పెంపుదల ప్రక్రియ అడుగు ముందుకుపడలేదు.


బీజేపీకి రాజకీయ అవసరం జమ్ము కశ్మీర్‌లో ఉన్నందున ఆర్టికల్‌ 3 ప్రకారం ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర విభజన చట్టంతోనే సీట్ల పెంపుదల ప్రక్రి య మొదలుపెడుతున్నారు. అంటే తెలంగాణలో, ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగసవరణ కావాలి. కశ్మీర్‌, సిక్కిం (తాజాగా 32 నుం చి 40 అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు కేంద్ర హోంశాఖ ముసాయిదా ప్రకటించి క్యాబినెట్‌ నోట్‌ కూడా పంపించారు)లలో మాత్రం విభజన చట్టం ప్రాతిపదికగానే అమలుచేయడం పూర్తిగా వివక్షపూరిత నిర్ణయంగానే భావించాలి. జమ్ము కశ్మీర్‌లో 107 నుంచి 114కు పెరుగుతున్నప్పటికీ ప్రత్యేకించి జమ్ము రీజియన్లో ఎక్కువ స్థానాలు పెరుగడం వల్ల బీజేపీ పెద్ద పార్టీగా వస్తుంది. కశ్మీర్‌ లోయలో సీట్లు జనభా ప్రాతిపదికన పెరిగే మాట ఎలా ఉన్నా పునరావాసం వల్ల సీట్ల సంఖ్య తగ్గే అవకాశమే కాక ఇక్కడ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు సీట్లను చీల్చుకుంటాయి. ఇలాంటి రాజకీయ లబ్ధి కోసమే కశ్మీర్‌లో డిలిమిటేషన్‌ కమిషన్‌లో సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ ప్రారంభించింది.


ఏపీలో బీజేపీ బలంగా లేదు. తెలంగాణలో బీజేపీ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కు ఒక సవాలు విసిరి 3వ బలమైన పార్టీగా అవతరించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డీకొని ఓడించాలంటే కాంగ్రెస్‌ 10 శాతం ఓట్లకు పరిమితం కావాలి. లేదా బీజేపీ బలహీనపడితే కాంగ్రెస్‌ బాగా పుంజుకుంటేనే సాధ్యపడుతుంది. ఇవేవీ జరిగే అవకాశాలు లేనందున అసెంబ్లీ స్థానాలు పెంచి టీఆర్‌ఎస్‌కు మేలు చేయడం ఎందుకని బీజేపీలో ఒక వర్గం వాదనగా ఉన్నది. సికింద్రాబాద్‌ పూర్తిగా నగర పరిధిలోని పార్లమెంట్‌ స్థానం. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ స్థానాలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాలలో బీజేపీ గణనీయమైన ఓట్లు సాధించిందనీ, సీట్ల సంఖ్య పెరిగితే నగర పరిసరాల్లో 20కి పైగా అదనపు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, అది బీజేపీకి లాభిస్తుందని పార్టీలోని మరొక వర్గం ప్రతిపాదిస్తున్నది. తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తుల పంపిణీని కేంద్రం త్వరితగతిన చేయడం లేదు. అలాగే అసెంబ్లీ సీట్లను పెంచడం లేదు. ఇరు రాష్ర్టాలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదు. ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం, కడప, స్టీల్‌ ప్లాంట్లు, దుగ్గరాజపట్నం పోర్టు, ఏపీ రాజధాని నుంచి హైదరాబాద్‌కు జాతీయ రహదారుల విస్తరణ వంటి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.


కర్ణాటక, గుజరాత్‌, యూపీ, మహారాష్ట్ర రాష్ర్టాల్లో బీజేపీ బలంగా ఉన్నందున, తమిళనాడులోని ఇరు ప్రధాన పార్టీలతో పార్లమెంట్‌లో అవసరం ఉన్నందున కేంద్రం ఈ రాష్ర్టాలకు మాత్రమే సహకరిస్తున్నది. కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ ఆర్థికసాయం కింద చేపట్టే పథకాల పట్ల పూర్తి వివక్ష చూపిస్తున్నారని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. ఆయన ఎంతో ప్రజాస్వామ్యయుతంగా ఫెడరల్‌వ్యవస్థను గౌరవిస్తూ విజ్ఞప్తి చేసినా తగురీతిలో స్పందించడం లేదు. దీంతో రాష్ట్ర వనరులు, రుణ సమీకరణ ద్వారా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ స్థానాల పెంపుదలలో ఆయా రాష్ర్టాల పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షను సరిచేసుకోవాలి. విభజన బిల్లులో ఇచ్చిన హామీల ను అమలుచేయాలి. ఇలాంటి చర్యల వల్లనే బీజేపీ పట్ల ప్రజలకు నమ్మ కం ఏర్పడుతుంది.


logo