గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 16, 2020 , 23:08:49

లౌకికత్వానికి బాసటగా!

లౌకికత్వానికి బాసటగా!

సీఏఏ తదితరాల విషయంలో కూడా కేంద్రం మరోసారి తన విధానాన్ని సమీక్షించుకోవడం అవసరం. సీఏఏను వ్యతిరేకించినంత మాత్రాన దేశంలోకి చొరబాట్లను అరికట్టకూడదని కాదు. చొరబాటుదారులను గుర్తించకూడదనీ కాదు. దేశ భద్రతకు అవసరమైన చర్యలను కేంద్రం తీసుకుంటే, రాష్ర్టాలు, ప్రజలు సహకరించవలసిందే. కానీ అనుమానాలకు తావివ్వడం వల్లనే ఇంత ఆందోళన చెలరేగుతున్నది. అంతర్జాతీయంగా కూడా దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేధావులతో, జాతీయ అంతర్జాతీయ అంశాల నిపుణులతో చర్చించడం మంచిది. రాష్ర్టాల ఃముఖ్యమంత్రులను కూడా సంప్రదిస్తే బాగుంటుంది.

రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగానే కాకుండా, తెలంగాణ సామరస్య సంస్కృతికి విరుద్ధం గా ఉన్న సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానించడం ప్రశం సనీయం. భారతీయ సమాజం సహన సంస్కృతికి, లౌకికత్వానికి ప్రతీక. రాజ్యాంగ నిర్మాతలు కూడా లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మత ప్రాతిపదికపై రూపొందించిన సీఏఏ పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. అందుకనే పలు రాష్ర్టాల అసెంబ్లీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి. టీఆర్‌ఎస్‌ పార్లమెంటులో సీఏఏ ను వ్యతిరేకించింది. తెలంగాణ మంత్రివర్గం కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం గమనార్హం. సీఏఏ మూలంగా అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ఠ మసకబారుతున్నది. జాతీయ పౌర పట్టిక తయారుచేయడానికి గతంలో చేసిన ప్రయత్నం విఫలమైందంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వాదన కూడా బలమైనదే. 2003లోనే వాజపేయి హయాంలో ఇటువంటి ప్రయ త్నం జరిగింది. మల్టీపర్పస్‌ నేషనల్‌ ఐడెంటిటీ కార్డ్స్‌ను ప్రవేశపెట్టడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలలోని ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకున్నారు. చివరికి ఈ ప్రయోగం విఫలమైందని 2011లో కేంద్రం అంగీకరించకతప్పలేదు. పౌరపట్టికలు తయారు చేయడమనేదే అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం. దీనిని ఆషామాషీగా చేపట్టి వివాదాస్పదమైన అంశాలతో ప్రజలను ఆందోళనకు గురిచేయడం సబబు కాదు.

దేశంలో ఎంతోకాలంగా జనాభా లెక్కలు చేపడుతున్నారు. ఇందులో వ్యక్తి గురించే కాకుండా అతడి ఆర్థిక, సామాజికాంశాలను కూడా సేకరిస్తారు. ఈ వివరాలకు ఆ పౌరుడు చెప్పిన వివరా లే ఆధారం. పదేండ్లకు ఒకసారి జరిగే జనాభాల లెక్కల వల్ల దేశం వివిధరంగాలలో సాధించిన పురోగతితో పాటు అనేక లోపాలు తెలుస్తాయి. ప్రజల అభివృద్ధికి ఏయే పథకాలు అమలుచే యాలనేది అర్థమవుతుంది. కానీ జాతీయ జనా భా పట్టిక (ఎన్పీఆర్‌) ద్వారా పౌరుడి జనన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, ఎంతకాలంగా ఉంటున్నదీ, జాతీయత, చిరునామా మొదలైన వివరాలను మాత్రమే సేకరించవలసి ఉంటుంది. ఇందుకు ఆధారాలు అడుగడమనేది ఉండదు. జనం చెప్పి న విషయాలనే సేకరణ సిబ్బంది నమోదు చేసుకుంటుంది. కానీ జాతీయ పౌర పట్టిక (ఎన్నా ర్సీ) మాత్రం ఇందుకు భిన్నమైనది. పౌరులమని చెప్పుకోవడానికి ఆధారాలు చూపించవలసి ఉం టుంది. ఓటరు కార్డు, రేషన్‌కార్డు మొదలైన ఆధారాలను ప్రభుత్వం ఆమోదించకపోవచ్చు. పౌరు డు చూపించే ఆధారాల వల్ల సంబంధిత అధికారి సంతృప్తిచెందకపోతే ఇబ్బందులు తప్పవు. కొందరిని దేశం నుంచి పంపించవచ్చు లేదా నిర్బంధ శిబిరంలో కూడా పెట్టవచ్చు. దేశ విభజన నేపథ్యంలో లక్షలాదిమంది సరిహద్దుకు ఇరువైపులా తరలివెళ్ళారు. ఈ నేపథ్యంలో పౌరసత్వా న్ని రుజువుచేసుకోవడం అంత సులభం కాదు. పేద ప్రజలు, మహిళలు, ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చిన వారు ఆధారాలు చూపించడం కష్టం. జాతీయ జనాభా పట్టిక  (ఎన్పీఆర్‌) ఎన్నార్సీ రూపకల్పనకు మొదటి మెట్టు అని చట్టంలో పేర్కొనడం కూడా ఆందోళనకు తావిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టు ఒక చట్టం చేస్తే అది తమ బాగు కోసమని ప్రజలు భావించేలా ఉండాలి. కానీ తమకు ఇబ్బందులు కలుగుతాయని ఆందోళనచెందే పరిస్థితి ఉండకూడదు. 

సీఏఏ న్యాయ సమీక్షకు నిలబడదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఇటువంటి కీలకమైన చట్టాలు చేసే ముందు దేశవ్యాప్తంగా సుదీర్ఘ చర్చ జరుపడం ప్రజాస్వామిక వ్యవస్థలలో పరిపాటి. వివిధ కమిటీలు వేయడం, చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలలో ఆందోళనలు చోటుచేసుకోవు. ఒక్కోసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ప్రజలు ఆందోళనలు చేపట్టిన ఉదంతాలున్నాయి. ప్రజల ఆందోళనలకు సంతృప్తికరమైన వివరణలు ఇవ్వడం ప్రభుత్వ విధి. ప్రజల్లో ఆందోళనలు తగ్గకపోతే, నిర్ణయాలను ఉపసంహరించకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సీఏఏ తదితరాల విషయంలో కూడా కేంద్రం మరోసారి తన విధానాన్ని సమీక్షించుకోవడం అవసరం. సీఏఏను వ్యతిరేకించినంత మాత్రాన దేశంలోకి చొరబాట్లను అరికట్టకూడదని కాదు. చొరబాటుదారులను గుర్తించకూడదనీ కాదు. దేశ భద్రతకు అవసరమైన చర్యలను కేంద్రం తీసుకుంటే, రాష్ర్టాలు, ప్రజలు సహకరించవలసిందే. కానీ అనుమానాలకు తావివ్వడం వల్లనే ఇంత ఆందోళన చెలరేగుతున్నది. అంతర్జాతీయంగా కూడా దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేధావులతో, జాతీయ అంతర్జాతీయ అంశాల నిపుణులతో చర్చించడం మంచిది. రాష్ర్టాల ముఖ్యమంత్రులను కూడా సంప్రదిస్తే బాగుంటుంది. 


logo