శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 15, 2020 , 22:32:38

చరిత్రను చెప్పే శాసనాలు

చరిత్రను చెప్పే శాసనాలు

తెలంగాణను శాతవాహనులు మొదలుకొని అసఫ్‌జాహీల వరకు అనేక రాజవంశాల వారు పరిపాలించారు. ఆయా రాజుల కాలంలో వందల, వేల సంఖ్యలో శాసనాలు వేయించినారు. అందులో పరిష్కరించబడనివి ఇంకా చాలా ఉన్నాయి. పురావస్తుశాఖ వారు, వ్యక్తిగతంగా కొందరు శాసన పరిశోధకులు పరిష్కరించి శాసన సంపుటాలుగా ప్రచురించారు. వీటిలో దాదాపు 90 శాతం దాన శాసనాలే. దాన శాసనాలే కాకుండా ప్రశస్తి శాసనాలు, ధర్మ శాసనాలు, ఒప్పంద శాసనాలు, భూ, గ్రామ పొలిమేరలకు సంబంధించిన శాసనాలు, ఆర్థిక సంబంధ శాసనాలు, యుద్ధశాసనాలు, ప్రజోపయోగ నిర్మాణాలకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి.

మొదట ఇక్కడి శాసనాల్లో ప్రాకృత భాష ఉంది. ఆ తర్వాత క్రమంగా సంస్కృతం ప్రవేశించింది. ఎక్కువ ప్రాకృతం  తక్కువ సంస్కృతం నుంచి, తక్కువ ప్రాకృతం  ఎక్కువ సంస్కృతం ఉన్న శాసనాలు వచ్చినవి. కాలక్రమంలో ప్రాకృతం పూర్తిగా అదృశ్యమైంది. సంస్కృతం కన్నడం,కన్నడ సంస్కృతం, కన్నడ తెలుగు, తెలుగు కన్నడ, సంస్కృతం  తెలు గు, తెలుగు సంస్కృతం.. ఈవిధంగా శాసనాల్లో ఆయా రాజుల అధికార భాషానుగుణంగా భాష స్థిరపడింది. కొన్ని మరాఠీ, పర్షియన్‌, ఉర్దూ శాసనాలు కూడా ఈ ప్రాంతంలో లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటివరకు వెలుగుచూసిన శాసనాల్లో  శాతవాహనులకు సంబంధించిన సిముఖుని నాణేలు, వాటిపై ఉండే లిపి మొదటివిగా పేర్కొంటున్నారు. మొదటి సంస్కృత శాసనం విష్ణుకుండిన గోవిందవర్మ ఇంద్రపాల నగరశాసనం. మొదటి ప్రాకృత శాసనం వర్ధమానుకోటలో లభించిన ఉపాసికాయ బుద్ధరక్షితాయ దాన శాసనం. మొదటి పద్య శాసనం జినవల్లభుని కుర్క్యాల శాసనం.మొదటి గద్య శాసనం కొరవి శాసనంగా పేర్కొంటున్నారు. 


ప్రజల ఆచార వ్యవహారాలు, భాష, మత, రాజకీయ, ఆర్థిక, సాం ఘిక, సాంస్కృతిక సంబంధమైన ఎన్నో అంశాలను శాసనాలు ప్రతిబింబిస్తాయి. రాజులు, సామంతులు కళాకారులకు చేసిన దానధర్మా లు, తద్వారా సాధించిన అనేక ప్రయోజనాలు మనం ఇక్కడ లభించిన శాసనాలను అధ్యయనం చేస్తే గమనించవచ్చు. వ్యక్తుల అభివృద్ధి కి, వారి శ్రేయస్సును కాంక్షిస్తూ వారి పేరు మీదుగా దేవాలయాలు నిర్మించి, విగ్రహాలు ప్రతిష్ఠించి ఆలయాల నిర్వహణకు సంబంధించి దానం చేయడం, ఆ దానం తరతరాలకు చెందాలని, భావి తరాలవారు ఆ దానాన్ని పాటించాలని కట్టడి చేయడం వంటి అంశాలను మనం ఇక్కడి శాసనాల్లో గమనించవచ్చు. దానం చేయడం అంటే వ్యక్తి తనను తాను సంస్కరించుకొని ఉద్ధరించుకోవడం. తాను ఏ ప్రయోజనాన్ని ఆశించి దానం చేస్తున్నాడో ఆ దాన ఫలం అందాలంటే అవసరం ఉన్న వ్యక్తులకే దానం చేయాలి. 


తెలంగాణ ప్రాంతంలో ఇప్పటివరకు వెలుగుచూసిన   శాసనాల్లో  శాతవాహనులకు సంబంధించిన సిముఖుని నాణేలు, వాటిపై ఉండే లిపి మొదటివిగా పేర్కొంటున్నారు. మొదటి సంస్కృత శాసనం విష్ణుకుండిన గోవిందవర్మ  ఇంద్రపాల నగరశాసనం.


ఒక దేవాలయ వ్యవస్థను తీసుకొన్నట్లయితే అందులో నిర్వహణకు సంబంధించి చాలామంది వ్యక్తులు సేవలను అందిస్తారు. గురువు, ద్వారపాలక, ఘటికా నిర్ధారక, గణక, లేఖక, పౌరాణిక, పురోహిత, జ్యౌతిషిక, కావ్యజ్ఞ, విద్వజ్జన, దేవతార్చక, మాల్యకారక, పరిమళకారక, గోష్ఠాధికార (గోశాలాధ్యక్షుడు), గజాధికార, అశ్వాధికార, భాండాధికార, ధాన్యాధికార, సూద (వంటశాల అధ్యక్షుడు), తాంబూలిక, తాళవృంతక (వింజామర వీచేవాడు), ఛాత్రిక (గొడుగు పట్టేవాడు), కళాచిక (కాహళను ఊదేవాడు) నర్తక, గాయక, వైణిక, శాకునిక, శిలాచ్ఛేదక, కాంస్యకారక, కుంభకారక, పక్షిఘోషక (పక్షులను పెంచేవాడు), ఉగ్రాణాధికార (వస్తువులన భద్రపరిచేవాడు), స్వర్ణకార మొదలైన 72 మంది బాహత్తర నియోగాధిపతులు ఉండేవారు. ఆయా సందర్భాలలో ఆయా రాజులు, సామంతులు, ఇతర వ్యక్తులు దానం చేసే సందర్భంలో వీరందరికీ వృత్తులు నిర్ణయించేవారు. 


ఆయా దానభాగాలు వారికి అందే ట్లు చూసే బాధ్యత బాహత్తర నియోగాధిపతిది. ఈ దానం క్రమం తప్పకుండా పాటించాలనే నియమం కూడా శాసనంలో మనకు కనిపిస్తుంది. ఒకవేళ దాన నియమం పాటించకపోతే శాపోక్తులు కూడా ఉంటాయి. అంటే శాసనా న్ని చెరిపినవారు గంగలో 100 గోపులను చంపిన పాపం పొందుతారని, కాశీలో బ్రాహ్మణుడిని చంపిన పాపం, తమ పెద్ద కుమారుడిని చం పిన పాపం, స్త్రీ, శిశుహత్య చేసిన పాపం పొందుతారని శాప వాక్యాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా దాన నియమాన్ని పాటించినట్లయి తే  అనేక ఆవులను దానం చేసిన ఫలితం పొందుతారని, మోక్షం పొందుతారని, వేల గుడులు, చెరువులు నిల్పిన పుణ్యం పొందుతారని, తర తరాలవారికి పుణ్యం లభిస్తుందని తెలిపే ఆశీర్వాద వాక్యాలు కూడా శాసనాల్లో మనకు కనిపిస్తున్నాయి.


‘దేవద్రవ్యం గురుద్రవ్యం విప్రద్రవ్యం తథైవచ

ఉపేక్షితాని భక్ష్యాణి కులక్షయమిదం భవేత్‌..’

దేవునికి, గురువులకు, బ్రాహ్మణులకు ఇచ్చిన ద్రవ్యాన్ని ఉపేక్షించి ఆ ధనాన్ని అనుభవిస్తే కులక్షయం అవుతుందనే హెచ్చరికలు కూడా శాసనాల్లో కన్పిస్తున్నాయి.


ఆలయాలకు, బ్రాహ్మణులకే కాకుండా సమాజంలోని భిన్న వృత్తుల వారందరికి కూడా దానాలు ఇచ్చిన సందర్భాలు అనేకం మనకు శాసనాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవాలయాల్లో సేవలు చేసేవారికి, అన్నదాన సత్రాల్లో విస్తర్లు ఎత్తేవారికి, వండి, వడ్డించేవారికి కూడా దానరూపంలో వస్తువులు కాని, ధనం కాని ఇచ్చేవారు. ఇవన్నీ మన సంస్కృతిని కొనసాగించే ప్రయత్నంలో భాగంగానే నేటికీ దేవాలయాల్లో అనేక అంశాల్లో సేవలు జరుగుతున్నాయి. పూర్వం దేవాలయం విద్యాలయం గా, వైద్యాలయంగా, అన్నపూర్ణాలయంగా, కళా నిలయంగా విలసిల్లిన ది. నేడు ఆ సంస్కృతిని కొనసాగించవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. 


మన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. ఎవరి స్థాయిలో వారికి తోచిన విధంగా ఈ కర్తవ్యా న్ని నిర్వర్తించవచ్చు. శాసనాల గురించి అవగాహన లేకున్నా, ఏదైనా ఒక కొత్త అంశం తెలిస్తే దానికి సంబంధించిన వ్యక్తులకు సమాచారం అందజేయాలి. చాలామందికి శాసనాల గురించి తెలియక పెద్ద పెద్ద బండరాళ్లపై చెక్కిన రాతలను గుర్తించక వాటిని తమ ఇండ్లకు గోడలుగా, మెట్లుగా ఉపయోగించుకొని చరిత్రను మరుగుపరిచారు. వాటిమీద ఉన్న భాష అందరికీ అర్థం కాదు. అవి దేవతల రాతలని, ఆ బండలు ఉన్నచోట నిధినిక్షేపాలు ఉంటాయని భావించి వాటిని తొలిగించే ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలో రాళ్ళు ఛిద్రమై చరిత్ర చెదిరిపోతుంది. పూర్వకాలంలో ఇప్పుడు న్న ప్రచార, ప్రసార సాధనాలు లేవు. ఒక విష యం ప్రజలందరికీ తెలియజేయాలంటే రచ్చబండ వద్దనో, దేవాలయం వద్దనో ఒక శిలాస్తంభం పాతించి దానిపై శాసనరూపంలో తెలియజేసేవారు. ప్రజలకు, సంస్కృ తి సంప్రదాయాలకు శాసనాలు వారధిలాగ పనిచేస్తాయి. 


తెలంగాణ సంస్కృతి ఎంత విలక్షణమైనదో ఇక్కడ ఉన్న శాసనాలు కూడా అంతే ప్రత్యేకమైనవి. ఇక్కడ లభ్యమైన శాసనాలను సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, మత, రాజకీయకోణంలో అధ్యయనం చేస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవా ట్లు, ఆచారాలు, మత, ధార్మిక అంశాలు అనేకం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. 

- డాక్టర్‌ బి.మనోహరి, 93749 71177


logo