గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 15, 2020 , 22:32:51

విశ్వనాథపై నిందలా!

విశ్వనాథపై నిందలా!

విశ్వనాథ కులభావి, మతభావి, సంప్రదాయభావి అను నిందలున్నాయి. ఈ నిందలు సరియైనవి కావని నిరూపించుటకు మనకు వారి నవలలో అనేక సాక్ష్యాలు లభిస్తాయి. ఆయన గుణభావే కాని కులభావి కాదని నిరూపించుటకు, స్వయానా తాను పుట్టిన కులస్తులనే అనేకచోట్ల నిందించిన ఉదాహరణలు దొరుకుతాయి. ‘వేయిపడగలు’లో అతని తండ్రి మూడుకులాల నుంచి పెళ్లి చేసుకోవడం అతడు కులవాది కాడు గుణవాది యని నిరూపించుటకు అతిపెద్ద సాక్ష్యం.

నన్నడిగితే వేయిపడగలు నవలలో నాయకుడున్నాడు కానీ నాయకి లేదు. ఆ ముఖ్య నాయకుడు మూడు కులాలనుంచి ముగ్గురుని పెళ్ళాడిన ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి. అతడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ విశ్వనాథయే. విశ్వనాథ తన కులేతర భావాన్ని నిరూపించుకోవడం కోసమే ఆ నవల రాశా డు, ఆ పాత్రను సృష్టించాడు. తక్కిన పాత్రలన్నీ ఆ పాత్రకు అనుబంధ పాత్రలే. నవలలో ధర్మారావు నాయకుడు కాదు, ధర్మారావు తండ్రయిన రామేశ్వరశాస్త్రే నాయకుడు. అందులో ముఖ్యమైన సందేశం మనకు అతని మూడు పెళ్ళిళ్ల ద్వారానే వస్తుంది కానీ మరొకదాని నుంచి రాదు. ఆ మూడు పెళ్ళిళ్లు ఎందుకు చేసుకున్నాడు? అని ప్రశ్నించుకుంటే వస్తుంది అస లు జవాబు.


‘బద్దన్న సేనాని’, ‘వీర వల్లడు’, ‘జేబు దొంగలు’ నవలల్లో విశ్వనాథ అన్య కులస్తులను అగ్ర కులస్తులకన్నా మిన్నగా చూపెట్టడానికి రాసినట్లు తెలుస్తూనే ఉంది. అలా మనం మరెన్నో రచనలను, పాత్రలను పేర్కొనవచ్చు. రామాయణంలో రాము ని చుట్టూరా క్షత్రియులే కాని బ్రాహ్మణులు అట్టే మనకు కనబడరు. ఆంజనేయుడు బ్రాహ్మణుడు కాదు, విభీషణుడు కాదు, సుగ్రీవుడు కాదు, విశ్వామిత్రుడు కాదు, మరెందరో కారు. పైపెచ్చు మనం అతనిని క్షత్రియుల పక్షపాతి, శూద్రుల పక్షపాతి అని అనవచ్చు. ఎన్నో బ్రాహ్మణేతర రచనలు చేశాడు, బ్రాహ్మణేతర పాత్రలను పోషించాడు. ‘ఏకవీర’లో బ్రాహ్మణుడెక్కడున్నాడు? ‘చెలియలికట్ట’లో బ్రాహ్మణుడెక్కడున్నాడు? ఏ నవల బ్రాహ్మణుని పేరిట రాశాడు? ఏ గొప్పపాత్ర బ్రాహ్మణునికిచ్చా డు అతనిని బ్రాహ్మణ పక్షపాతియని యనుటకు?


అతడు కులవాది అని అనవచ్చు కాని, అతని కులవాదం వృత్తికి చెందింది కాని జన్మకు చెందింది కానేకాదు. కులమనేది వృత్తికి చెందింది కాని జన్మకు చెందింది కాదని అతడే పలుచో ట్ల అన్న ఉదాహరణలెన్నో అతని రచనల నిండా, ఉపన్యాసాల నిండా ఉన్నాయి. కాలానుగుణంగా అలా ఏ కులపు వాడైనా ఏ పనైనా చేసే యోగ్యత, సమర్థత విద్య కల్పించింది కనుక వంశపారంపర్యంగా ఒక కులానికి చెందినవాడు ఆ కులానికి చెందిన వృత్తి తప్ప మరొక వృత్తి చేయరాదు అను భావం అం తమైంది. మన రాజ్యాంగం ప్రకారం వాటికి ఈ కులస్తుడు, ఆ కులస్తుడు అనకుండా అందరూ అర్హులే కదా. ఇక ఇప్పుడు కుల ప్రమేయమేమిటి? కుల ప్రసక్తేమిటి? (ఒకనాటి కులం పేరట ఈనాడు కొన్ని రాజకీయపరమైన ప్రయోజనాల కోసమే తప్ప దాని గురించి ఇప్పుడు మాట్లాడటం అప్రస్తుతం కాదా?) రామ్‌ మనోహర్‌ లోహియా లాంటి రాజకీయ యోధుడు కూడా కుల వ్యతిరేక బావుటా ఎత్తీ ఎత్తీ, కుల వ్యతిరేక వ్యాసా లు రాసీరాసీ, ఉపన్యాసాలిచ్చీ తుదకు ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో కూడా వృత్తి కులభావన ఎప్పటికీ ఉండి తీరుతుంది అని అక్షరాలా అన్నాడు. అతనికుండిన ఆ అవగాహన దేశంలో మరెవ్వరికీ లేకుండింది. 


విశ్వనాథ కులభావి కాదు కాని మతవాది. హిందూ మతవాది. హిందూ మతంలోని ఎన్నో సంప్రదాయాలను మెచ్చిన, అవలంబించిన గొప్ప దార్శనికుడు. డాక్టర్‌ అంబేద్కర్‌ కూడా పాత కులభావాన్నే నిందించాడు, దానిలోని అస్పృశ్యతా భావాన్నే కాని మరే దానిని కాదు. తక్కినవాటిలో నేను కూడా హిందువునే అన్నాడు. విశ్వనాథ అంబేద్కర్‌ లాంటి మతవాది. ‘నేను కూడా మార్క్సిస్టునే, కమ్యూనిస్టునే కాని నా రామునితోపాటు’ అన్న సామ్యవాది, సమాజవాది. అతన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం దర్శనం చాలదు, దార్శనికత కావాలి. బహిర దృష్టి చాలదు, అంతర్‌ దృష్టి కావాలి. అతని రచనలను జాగ్రత్తగా సహృదయంతో, ఆగ్రహంతో కాదు, నిగ్రహంతో చదవాలి. విశ్వనాథ డాక్టర్‌ లోహియా కోవకు, అంబేద్కర్‌ కోవకు చెందినవాడు. అంతటి విశాలదృష్టి ఉన్నవాడు, అంతటి విజనరీ. 


విశ్వనాథ హిందూ మతంలోని అన్ని సంప్రదాయాల వాది కూడా కాదు, కొన్ని సంప్రదాయాల వాదే. కాని ఎన్నో సంప్రదాయాలను, బ్రాహ్మణుల సంప్రదాయాలను కూడా విమర్శించిన ఉదంతాలు కూడా లేకపోలేదు. కనుక అతన్ని సంపూర్ణం గా సంప్రదాయవాది అని నిందించడం సరికాదు. అతడు సం ప్రదాయే కాని ’సత్సంప్రదాయి’. విశ్వనాథ రిచువలిజం మక్కికి మక్కిరిచువలిజం కాదు. ‘నాకు నా తండ్రి మీద ప్రేమ కనుక అతనికి పిండాలు పెట్టడం ఇష్టం కనుక, నేను అతని కొరకు పిండాలు పెడుతున్నాను కాని పిండాల కొరకు కాదు’ అని అం టాడు అతన్ని పిండాలు పెట్టడాన్ని విమర్శించినవారితో. మీరు (కమ్యూనిస్టులు), మీ లీడర్లు చనిపోతే అతని ఫొటో పెట్టి దండలు వేసి అతని పేరిట దానధర్మాలు చేయడం లేదా, ఉపన్యాసాలివ్వడం లేదా? నాదీ అలాంటిదే. మీరు అవి మానుకోండి, నేను ఇవి మానుకుంటా ను అంటాడు విమర్శించిన వారితో. వివిధ రాజకీయ పార్టీ లవారికి అలాంటివి మరెన్నో సంప్రదాయాలుంటా యి. మతస్తులకు చెంది న వారివి కూడా అలాంటివే. మరి, వాటి సంగతేమి టి అని ప్రశ్నిస్తాడు. ఇజాల రిచువలిజంకు, మతాల రిచువలిజంకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇవి మూర్ఖమైనవైతే అవీ మూర్ఖమైనవే అంటాడు విశ్వనాథ. అసలు మతానికి ఇజానికి తేడా ఏమీ లేదు. ఇజానికి లీడ ర్‌ ఉంటాడు, మతానికి దేవుడుంటాడు. అంతే తేడా అంటాడు. తక్కిన అన్నిటిలో వాటికి చెందినవారు, వీటికి చెందినవారు సమానమే అంటాడు.


వాస్తవానికి విశ్వనాథ తన జీవితంలో నిజమైన కమ్యూనిస్టు జీవించినట్లే అత్యంత సాదా సీదాగా, నిర్భయంగా జీవించాడు. ఒక్క పెంకుటిల్లు తప్ప అతనికి మరేదీ ఉండేది కాదు. ఆ ఇల్లు కాలిపోతుంటే రామాయణం రాత ప్రతి కోసం ఏడ్చాడు తప్ప ఇంటికొరకు ఏడువలేదు. ఆయన ఎన్నడూ దేనికోసమూ ఏడు వలేదు ఒక్క తన భార్య వరలక్ష్మి చనిపోయినప్పుడు తప్ప. ఏవీ కావాలని కోరలేదు, అడుక్కోలేదు. అవి వాటికవి అతనికొచ్చా యి తప్ప. అలాంటివాడిని ఈ వాది, ఆ వాది అని నిందించ డం తగునా? He Walked What what he talked. How many of his critics can claim to have so done, to be so doing? pray, say!


- డాక్టర్‌ వెల్చాల కొండలరావు, 

98481 95959


logo
>>>>>>