సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Mar 15, 2020 , 22:29:31

ఆంధ్ర వాల్మీకి రామాయణం అజరామరం

ఆంధ్ర వాల్మీకి రామాయణం అజరామరం

వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యథా వాల్మీకంగా పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి, కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బరావు(వాసుదాసు). శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ ఏడెనిమిది దశాబ్దాల క్రితమే తెలుగునేల నలుచెరుగులా విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. ఎనిమిదేండ్ల సాహిత్య శ్రమ ఫలితంగా రామాయణాన్ని తొలుత నిర్వచనంగా తెనిగించి, ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేశారు. ఆయన రచించిన నిర్వచన రామాయణం ఆయన జీవిత కాలంలోనే నాలుగైదుసార్లు ముద్రించబడింది. ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని భావించిన వాసుదాసు ‘శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరం’ పేరు తో గొప్ప వ్యాఖ్యానం రాశారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. దాన్ని చిలికి న కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయని, భావితరాలవారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసుదాసుగారు. 


తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృ త రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలను తన పద్యాలలో కూర్చారు.అవన్నీ సుమారు 14,000 పద్యా లయ్యాయి. ఆయన రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో జ్ఞానపిపాసికి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పలమాలలు, సీస, ఆటవెలది, తేటగీతి, కంద, శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా తెలుగు ఛందస్సులో ఉండే వందకుపైగా వృత్తాలను సందర్భోచితంగా ప్రయోగించారు. వాసుదాసు ‘ఆంధ్రవాల్మీకం’లోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్ర్తాల సంగమం దర్శనమిస్తుంది. ప్రతికాండ ఒక ధర్మశాస్త్రం, రాజనీతిశాస్త్రం, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం, సామాజిక, ఆర్థిక, సామా న్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురాతత్వశాస్త్రం లాగా దర్శనమిస్తుంది. అసలు-సిసలైన పరిశోధకులంటూ ఉంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా ఒకటి కాదు, వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. 


వావిలికొలను సుబ్బరావు కడప జిల్లా, జమ్మలమడుగులో 1863లో జన్మించి 1939లో పరమపదించారు. ఎఫ్‌.ఎ.చదువు పూర్తిచేసి, ప్రొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ హోదాకెదిగారు. 1893-1904 మధ్యకాలంలో పదకొండేండ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేశారు. మద్రాస్‌ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. కళాశాలలో చేరకముందే, ‘శ్రీ కుమారాభ్యుదయం’ అనే ప్రబంధ గ్రంథాన్ని రచించారు. భార్యా వియోగం కలుగడంతో వాసుదాసు భక్తి, యోగమార్గం పట్టారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్యలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో ఉన్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేశారాయన. వాల్మీకంలో ఉన్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసుదాసుగారు గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాశారు. ‘ఆంధ్ర వాల్మీకం’ అనువాదమైనా సొంత రచన, స్వతంత్ర రచన అనిపించుకుంది. వ్యాస మహాభారతాన్ని మొదట తెనిగించిన నన్నయను ఆదికవిగా పిలిచినప్పుడు, వాల్మీకి రామాయణాన్ని మొట్టమొదట తెనిగించిన వాసుదాసు కూడా ఆదికవే కదా? నన్నయంతటి గొప్పవాడే కదా. వాస్తవానికి సరైన పోషకుడో, ప్రాయోజకుడో ఉండి ఉంటే, వాసుదాసు ‘ఆంధ్రవాల్మీకి రామాయణం’, ఎప్పుడో, ఏనాడో నోబెల్‌ సాహిత్య బహుమతికో, జ్ఞానపీఠ పురస్కారానికో నోచుకుని ఉండేది.


(వాసు దాసుగారి మందరాలన్నీ, మందర మకరందాలుగా, ఆయనే వక్తగా, నేను కేవలం అనువక్త-వాచవిగా, సరళమైన వాడుక భాషలో-సాధ్యమైనంత లఘు కృతిలో అందించుదామని తొలి ప్రయత్నంగా సుందరకాండ మందర మకరందం రాశాను. 16 సంవత్సరాల కిందట మొద లుపెట్టి వరుసగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, ఇటీవలే యుద్ధకాండ మందర మకరందం పుస్తకాలు రాయడం, ప్రచురించడం పూర్తిచేశాను. ఈ పుస్తకాలన్నీ ఉచితంగా ఇవ్వడానికే వున్నాయి. ఓపిక చేసుకొని రచయితను 80081 37012 ఫోన్లో సంప్రదించి, మరింత ఓపిక చేసుకొని ఆయన ఇంటికి వచ్చి వాటిని తీసుకుపోవచ్చు. చిరునామా: ఫ్లాట్‌ నంబర్‌ 502, వాసవీ భువన అపార్ట్‌మెంట్స్‌, కంట్రీ ఓవెన్‌ పక్క సందు, శ్రీనగర్‌ కాలనీ, హైదరాబాద్‌-500073).

- వనం జ్వాలా నరసింహారావు


logo