ఆదివారం 29 మార్చి 2020
Editorial - Mar 13, 2020 , 23:22:15

విలువలు పెంచేదిగా విద్య

విలువలు పెంచేదిగా విద్య

సాంకేతికాభివృద్ధి తోడుగా సమాజాభివృద్ధి జరుగాలంటే సాంకేతిక కోర్సులతోపాటు సామాజిక శాస్ర్తాలకు సంబంధించిన కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.సమాజాభివృద్ధి జరిగిన ప్రాంతంలో సాంకేతికాభివృద్ధి త్వరగా జరుగుతుంది. ప్రభుత్వాలు పూర్తిగా సాంకేతిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తే సామాజిక విలువలు, మానవీయత పూర్తిగా కుంటుపడిపోతాయి. నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తూ మన రాష్ట్రంలో ‘దిశ’ లాంటి ఘటనలు జరుగకుం డా ఉండాలంటే కౌమారదశలోని విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేయాలన్నారు. దీనికి అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ ద్వారా పాఠ్య ప్రణాళికలను తయారుచేయిస్తున్నట్లు ప్రకటించటం ముదావహం. అయితే నైతిక విలువల తో కూడిన విద్యాబోధన ఎలా జరుగాలి? ఎలా ఉండాలి? అనే అంశాలపై చర్చించుకోవాలి. మానవీయ, నైతిక విలువలతో కూడిన విద్యాబోధన నూటికి నూరు శాతం సామాజిక శాస్ర్తాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాంటి విలువలను బోధించగలిగే సామాజిక శాస్ర్తాల్లో చరిత్ర ముఖ్యమైనది.

చరిత్ర అంటే రాజులు, యుద్ధాలు, విప్లవాలు అని చాలామందికి అపోహ. కానీ మానవ జీవనవికాసాన్ని వివరిస్తూ, భవిష్యత్‌ తరాలకు గుణపాఠాలను చరిత్ర అందిస్తుంది. చరిత్ర మనిషి సమగ్ర కార్యకలాపాలను వివరిస్తుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో చరిత్ర పరిజ్ఞానం సమస్త మానవాళికి అవస రం. మానవజాతికి భవిష్యత్తులో వచ్చే సమస్యలను పరిష్కరించుకునే వివేకం చరి త్ర పరిజ్ఞానంతో మాత్రమే సాధ్యమవుతుందనడంలో సందేహం లేదు.చరిత్ర ఎందుకు? చరిత్ర వల్ల కలిగే ఉపయోగాలేమిటి? చరిత్రను ఎందుకు చదువాలి? చరిత్రను అధ్యయ నం చేస్తే ఉద్యోగాలు వస్తా యా? ఇటువంటి ప్రశ్నలు విద్యార్థుల నుంచే కాకుండా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల నుంచి కూడా తలెత్తుతున్నాయి. అలాగే చరిత్ర ను ఒక పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టుగానే పరిగణిస్తున్నారు. ఒకవైపు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందుతుండటం వల్ల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, సాఫ్ట్‌వేర్‌ తదితర కోర్సుల వైపు మొగ్గుచూపుతూ సామాజిక శాస్ర్తాలతో కూడిన కోర్సుల పట్ల ముఖ్యంగా చరిత్రతో ముడిపడిన కోర్సుల పట్ల నిరాసక్తతను చూపుతున్నారు.

చరిత్ర నాటినుంచి నేటివరకు మానవ నాగరికతకు చెందిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక, అభివృద్ధి విషయాలు వివరిస్తుంది. అలాంటి చరిత్రను విస్మరించడం, చరిత్ర ఎందుకని ప్రశ్నించడం అమాయకత్వమైన భావనగా చెప్పవచ్చు. ప్రతి దేశం తన చరిత్ర, సంస్కృతి పట్ల అధ్యయనాలు పరిశోధనలు చేసుకొని గతకాలపు అనుభవాలను నమోదు చేసుకుంటుంది. భవిష్యత్తులో ఎదుర య్యే సవాళ్లను చారిత్రక దృష్టితో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. చరిత్రను నిర్లక్ష్యం చేసిన దేశం, ప్రాంతం, జాతులు మనుగడలో ఉన్నట్లు దాఖలాల్లేవు. ఒక దేశం తన చరిత్ర, సంస్కృతిని తెలుసుకోకుంటే వేర్లు లేని చెట్టు తో సమానం. అలాగే ఏ దేశంలోనైనా విద్యార్థులకు, యువతకు చరిత్ర జ్ఞానం లేకుంటే నిర్వీర్యమవుతారు. నేటి విద్యార్థుల్లో చరిత్ర స్పృహ లేకపోవడం వల్ల దేశం పట్ల, మతాల పట్ల, జాతీ య నాయకుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, వారు నివసించే సమాజం పట్ల సరైన అవగాహన ఉండటం లేదు.

చరిత్ర చదివిన ఒక విద్యార్థి ఒక డాక్టర్‌ కాకపోవచ్చు, ఇంజి నీర్‌ కాకపోవచ్చు. కానీ ఒక సమాజంలో మానవీయ, నైతిక విలువలతో కూడిన సామాజిక తార్కిక ఆలోచనలు కలిగిన పరిపూర్ణుడవుతానడంలో సందేహం లేదు. ఒక డాక్టర్‌ రోగికి రోగం నయం చేయాలంటే రోగి లక్షణాలు, రోగం కారణాలు, రోగి ఎంతకాలం నుంచి బాధపడుతున్నాడు, ఆ రోగం వంశపారంపర్యమైనదా లేదా, ఆ రోగం గతంలో ఏ విధంగా నయమైందనే గతానికి సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసిన తర్వాతనే చికిత్స చేస్తాడు. అలాగే ఒక ఇంజినీర్‌ కూడా భావితరాలకు ఉపయోగపడే నీటి ప్రాజెక్టును రూపకల్పన చేయడంలో రిజర్వాయర్‌ ఎంతకాలం నుంచి ఉన్నది, దానికివచ్చే నీటి మార్గాలు, గతం లో ఎంత నీరు నిల్వ ఉండేవని గతానికి చెందిన పలు విషయాలను అధ్యయనం చేస్తాడు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం కోరే ఒక పథకానికి రూపకల్పన చేయాలంటే ప్రజల అభివృద్ధికి సంబంధించి గత విషయాలను అధ్యయనం చేసే ముందుకువెళ్తుంది. పై విషయాలను బట్టి డాక్టరై నా, ఇంజినీరైనా, ప్రభుత్వమైనా గత అధ్యయనం ద్వారానే తమ పనితీరును మెరుగుపరుచుకుంటాయి.

సాంకేతికాభివృద్ధి తోడుగా సమాజాభివృద్ధి జరుగాలంటే సాంకేతిక కోర్సులతోపాటు సామాజిక శాస్ర్తాలకు సంబంధించిన కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సమాజాభివృద్ధి జరిగిన ప్రాంతంలో సాంకేతికాభివృద్ధి త్వరగా జరుగుతుంది. ప్రభుత్వాలు పూర్తిగా సాంకేతిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తే  సామాజిక విలువలు, మానవీయత పూర్తిగా కుంటుపడిపోతాయి. నేరాలు, ఘోరా లు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పినట్లు విద్యార్థులకు నైతిక విలువలతో కూడి న బోధన అవసరమని చెప్పక తప్పదు. కాబట్టి మానవీయ, నైతిక విలువలతో కూడిన విద్యాబోధన కోసం ఇంటర్‌, డిగ్రీ విద్యలో చరిత్రను కామన్‌ సబ్జెక్టుగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ దిశగా విస్తృతస్థాయిలో చర్చ జరిగి ఒక సమగ్ర విద్యాబోధనకు పునాది పడాల్సిన ఆవశ్యకత ఉన్నది.


logo