శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 12, 2020 , T00:15

సంక్షోభ బ్యాంక్‌

సంక్షోభ బ్యాంక్‌

ఆర్బీఐ అనుమతితో వెలుస్తున్న బ్యాంకులు ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా, రక్షకులుగా వ్యవహరించాలి. కానీ యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడైన రాణాకపూర్‌ నిర్వహణ కార్యకలాపాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. బ్యాంకులోని సొమ్మంతా తనదే అన్నట్లుగా వివిధ పేర్లతో ఉన్న 40 సొంత సంస్థల్లోకి మళ్లించాడు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా రుణాలిచ్చాడు. దీంతో మొండిబకాయిలు వేల కోట్ల లో పేరుకొనిపోయాయి. నిరర్థక ఆస్తులు తడిసిమోపెడయ్యాయి.

పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంక్‌ (పీఎంసీ) కుంభకోణం మర్చిపోకముందే తాజాగా యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుల్లో నాలుగోదైన యెస్‌ బ్యాంకు బోర్డు తిప్పేసే పరిస్థితి రావటంతో ఖాతాదారులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మొత్తంగా బ్యాంకింగ్‌ రంగంపైనే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే దుస్థితి ఏర్పడింది. యెస్‌ బ్యాంక్‌ నిర్వహణ తీరుపై రెండేండ్లుగా ప్రజల్లో అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. మొండి బకాయిలు పేరుకుపోవడంతో యెస్‌ బ్యాంక్‌ కుదేలైంది. బ్యాంకులపై ఎనలేని విశ్వాసంతో తమ కష్టార్జితాన్ని పొదుపు రూపంలో, డిపాజిట్ల రూపంలో ప్రజలు జమ చేసుకుంటారు. పిల్లల వివాహాల కోసమో, చదువుల కోసమో, అత్యవసరాల్లో ఆసరాగా ఉంటుందనో బ్యాంకుల్లో దాచుకుంటారు. ఆ సొమ్ము రాత్రికిరాత్రి ఆవిరైపోతుంటే పకడ్బందీగా ఏటా నిర్వహిస్తున్నామంటున్న ఆడిట్‌లు, రిజర్వ్‌ బ్యాంక్‌ పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మిగులుతున్నాయి. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలతో కాలం గడుపుతూ, బ్యాంకు నిర్వహణలో అవకతవకలకు పాల్పడుతున్న తీరుపై ఈడీ ఉచ్చు బిగించటంతో యెస్‌ బ్యాంక్‌ బాగోతం బయటపడింది. నష్ట నివారణ కోసం అని ఆర్‌బీఐ ముం దుకువచ్చి డిపాజిట్‌దారులకు భరోసానివ్వటం ఆహ్వానించదగినదే అయినా, ఇలా ఒకదాని తర్వా త ఒకటిగా బ్యాంకులు సంక్షో భంలో కూరుకుపోవటాన్ని నిలువరించలేమా అన్నది ప్రశ్న!

ఆర్బీఐ అనుమతితో వెలుస్తున్న బ్యాంకులు ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా, రక్షకులుగా వ్యవహరించాలి. కానీ యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడైన రాణాకపూర్‌ నిర్వహణ కార్యకలాపాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. బ్యాంకులోని సొమ్మంతా తనదే అన్నట్లుగా వివిధ పేర్లతో ఉన్న 40 సొంత సంస్థల్లోకి మళ్లించాడు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా రుణాలిచ్చాడు. దీంతో మొండిబకాయిలు వేల కోట్ల లో పేరుకొనిపోయాయి. నిరర్థక ఆస్తులు తడిసిమోపెడయ్యాయి. నిబంధనల ప్రకారం డిపాజిట్‌దారులకు సొమ్ము చెల్లించలేని స్థితి ఏర్పడిం ది. బ్యాంక్‌ దుస్థితిని పసిగట్టడం వల్ల కావచ్చు, నిరుడు మార్చి-సెప్టెంబర్‌ మధ్యకాలంలో ఏకంగా 18 వేల కోట్లకు పైగా డిపాజిట్లకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో బ్యాంక్‌ నిర్వహణలో చెప్పినవన్నీ కాకిలెక్కలేనని తేలింది. 2017లో బ్యాంకుకు ఉన్న నిరర్థక ఆస్తుల విలువ రెండు వేల కోట్లని చెప్పినా, అది వాస్తవంగా 8 వేల కోట్లని ఆర్బీఐ లెక్కగట్టింది. అలాగే 2019లో నూ నిరర్థక ఆస్తులు 7,883 కోట్లు అని తెలిపినా, అవి 11,160 కోట్లని ఆర్బీఐ తేల్చింది. అర్హత లేకున్నా ఆశ్రితులకు లెక్కలేకుండా రుణా లు ఇవ్వటంతో మొండి బకాయిలు మోయలేని భారంగా మారాయి. రుణభారం యెస్‌ బ్యాంక్‌ పుట్టిముంచుతుందని 2015లోనే యూబీఎస్‌ హెచ్చరించింది. బ్యాంక్‌ వ్యవహరాలపై సెబీకి కూడా ఫిర్యాదులు అందాయి. ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థికసంస్థలు చర్యలకు ఉపక్రమించే లోపే యెస్‌ బ్యాంక్‌ వ్యవహారం రోడ్డున పడింది. ఖాతాదారులను ఆదుకునేందుకు ఆర్బీఐ ముందుకువచ్చి నగదు ఉపసంహరణకు నెలకు 50 వేల పరిమితి విధించింది. ప్రజల సొమ్మును ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా బుక్కితే, ప్రజలను ఆదుకునేందు కు ప్రభుత్వసంస్థల నుంచి నిధులు వెచ్చించటం పట్లా విమర్శలున్నాయి. ప్రభుత్వ సంస్థలు నష్టపోతే, దేశంలోని కుబేరులైన వారు ఆదుకున్న దాఖలాలు ఏనాడూ లేవు. సాధారణంగా ప్రైవేటు సంస్థలు సత్వర సేవలు అందిస్తూ, పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజల మన్ననలు పొందుతాయనీ, ప్రభుత్వ సంస్థలు అలసత్వానికి ప్రతీకగా నిలుస్తూ పౌరసేవలు అందించటంలో నిర్లక్ష్యంగా ఉంటాయనీ ప్రచారంలో ఉన్నది. కానీ గత కొన్నేండ్లుగా దేశంలో ప్రైవేటు బ్యాంకుల తీరు ఇందుకు విరుద్ధంగా ఉన్నది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి దర్జా చేసిన ఉదంతాలే ఎక్కువ.

దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థే గత కొన్నేండ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ మొండి బకాయిలు, నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్నాయి. బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న బడాబాబులు ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నారు. విల్‌ఫుల్‌ డీఫాల్టర్లలో పెద్దపెద్ద కంపెనీలు మొదలు ప్రముఖ రాజకీయ నేతలెందరో ఉన్నారు. వీరినుంచి మొండి బకాయిలను వసూలుచేయటం బ్యాంకులకు తలకుమించిన భారంగా మారింది. ప్రైవేటు బ్యాంకుల పరిస్థితి మరింత దయనీయం. ఈ పరిస్థితిని అధిగమించటం కోసమే దేశంలో బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగింది. నిరర్థక అస్తుల నేపథ్యంలో రుణాలు 9 శాతానికి తగ్గించుకోవాలని కూడా బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది కూడా. అయినా యెస్‌ బ్యాంక్‌ నిర్వాహకులు దేన్నీ ఖాతరు చేయలేదు. 30 శాతం రుణాలిచ్చి బ్యాంకు పతనానికి కారణమయ్యారు. బ్యాంక్‌ నిర్వహణలో ఒక ఆర్బీఐ ప్రతినిధి కూడా ఉంటాడు. క్రమం తప్పకుండా జరిగే ఆడిటింగ్‌ వ్యవహరాల్లో భాగస్వామిగా, సాక్షిగా కూడా వ్యవహరిస్తాడు. అయినా యెస్‌ బ్యాంక్‌లో ఇంతటి అవకతవకలు చోటుచేసుకున్నాయంటే తిలాపాపం తలా పిడికెడు అని చెప్పకతప్పదు. ఇప్పటికైనా కేంద్రం, ఆర్బీఐ నిరంతర పర్యవేక్షణతో బ్యాంకుల అక్రమాలను అరికట్టాలి. మదుపుదారుల, డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించాలి. బ్యాంకింగ్‌ వ్యవస్థపై విశ్వసనీయతను మళ్లీ కల్పించడం తక్షణావసరం. 


logo