సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 12, 2020 , T00:08

విదేశీ విమర్శనూ వినవలె

విదేశీ విమర్శనూ వినవలె

గతంలో ఇండియాపై పాకిస్థాన్‌ విమర్శలతో ఈ దేశాలు అరుదుగా తప్ప ఏకీభవించలేదు. ఈసారి అవి పాకిస్థాన్‌ను మించి ఘాటైన భాషను ఉపయోగిస్తున్నాయి. వాటి ఆక్షేపణలకు మతకోణంతో తోసిపుచ్చవచ్చు. కానీ అమెరికా,యురోపియన్‌ సంస్థలు, ఐరాస ప్రధాన కార్యదర్శి, మానవహక్కుల సంస్థల మాటేమిటి? స్వదేశంలోనే ప్రజాస్వామికవర్గాల విమర్శలను ఏమంటారు?

దేశ సార్వభౌమతపై బయటి జోక్యం ఆమోదయోగ్యం కాదనటంలో భిన్నాభిప్రాయానికి తావులేదు. కానీ ఈ ప్రశ్నను పురస్కరించుకొని తలెత్తిన పరిస్థితులను చర్చించుకోవటం అవస రం. సీఏఏపై విచారణలో కొన్ని అంశాల వివరణకు సహకరించగలమంటూ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంస్థ సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేయదలచింది. ఇందుకు కోర్టు సమ్మతించకపోవచ్చు గాక. కానీ అటువంటి సంస్థ అసాధారణమైన రీతిలో ఇటువంటి ప్రతిపాదన చేయడమంటేనే ప్రపంచం దృష్టిలో ఇండియా ప్రతిష్ఠకు నష్టం జరిగినట్టు.

హక్కుల సంస్థ ప్రతిపాదనను భారత ప్రభుత్వం వెంటనే ఆక్షేపించింది. ఆ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదిస్తుందో, తిరస్కరిస్తుందో లేక ప్రభు త్వ అభిప్రాయాన్ని తీసుకొని ఒక నిర్ణయానికి వస్తుందో తెలియదు. మొత్త మ్మీద తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. కానీ అది ఒక స్థాయిలో సాంకేతికమైన ప్రశ్న. మరొక స్థాయికి వెళ్లి విచారిస్తే, ఐరాస మానవ హక్కుల సం స్థ ఇంత అసాధారణ వైఖరి తీసుకోవటం రాజకీయంగా, నైతికంగా తేలిక గా తోసిపుచ్చగలది కాదు. దేశ సార్వభౌమత అనే కారణాన్ని ముందుకు తెచ్చి తోసిపుచ్చితే అది సాంకేతికంగా చెల్లుబాటవుతుంది. ఇందులో సార్వభౌమత కోణం ఇమిడి ఉందన్నది మానవహక్కుల సంస్థకు తెలియదనలేం. అయినా వారు ఈ దరఖాస్తు చేయదలిచారంటే అందుకు వారు చెబుతున్న కారణాలను విచారించాలి. అందుకు మనవైపు నుంచి తగిన వివరణ ఇవ్వగలగాలి. సార్వభౌమత్వ విషయమంటూ ఏకవాక్య ప్రకటనలు చేయటం వల్ల సాంకేతికంగా గెలువవచ్చు గాని, ప్రపంచాన్ని మెప్పించలేం. ముఖ్యంగా అది ఐరాస సంస్థ అయినందున.హక్కుల సంస్థ ఈ కేసులో కక్షిదారుగా ఉంటామనటం లేదు. సీఏఏతో ముడిపడి అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలు, నియమాలు, ప్రమాణాలు కొన్ని ఉన్నాయని, అవేమిటో న్యాయస్థానానికి వివరించటమే తమ ఉద్దేశమని పేర్కొన్నది. సీఏఏ నిబంధనల్లో భారతదేశం పేరును మాత్రమే ప్రస్తావించి ఉంటే భారతదేశానికే పరిమితమైనదనవచ్చు. కానీ పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను, ఆరు మతాలను పేర్కొన్నది. ఈ మూడు దేశా ల్లో వేధింపులకు గురవుతున్నవారిలో అహమ్మదీయ, హజారా, షియా తదితర అల్పసంఖ్యాకవర్గాలు కూడా ఉన్నాయని ఆ సంస్థ దృష్టికి తెచ్చిం ది. సీఏఏలోని ఉద్దేశం మానవహక్కుల పరిరక్షణ అయినందున ఆ సుగుణాన్ని హక్కుల సంస్థ గుర్తించింది. అయితే  ఆ హక్కులను జాతి, మత భేదాలు లేకుండా వర్తింపజేయాలన్నది హక్కుల సంస్థ  సూచన. భారత రాజ్యాంగానికి కొన్ని విలువలున్నాయని, సీఏఏ చట్టం ఆ విలువలకు అనుగుణంగా ఉందో లేదో న్యాయమూర్తులు విచారించే సమయంలో వారికి తాము సహాయకులుగా ఉండగోరుతున్నామని కూడా సూచించిం ది. సీఏఏ గురించి మానవహక్కుల సంస్థ మాత్రమే మాట్లాడటం కాదు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కూడా వివక్షతో కూడిన సీఏఏ వల్ల కొందరు వలసదారులు ఏ దేశానికీ చెందనివారుగా మిగిలిపో వచ్చునని ఆందోళన వ్యక్తపరిచారు. ఆఫ్ఘనిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు కర్జాయ్‌ ఇటీవల ఢిల్లీ వచ్చినప్పుడు, తమ దేశంలో వేధింపులకు గురవుతున్న ఇత ర అల్పసంఖ్యాకవర్గాల వారు కూడా ఉన్నారన్నారు. శ్రీలంక తమిళుల సంగతి సరేసరి. ఇటాంటి ఆక్షేపణలు ఇంకా అంతర్జాతీయ సంస్థలనుంచి, ఈయూ వంటి వేదికల నుంచి, పొరుగుదేశాల నుంచి వినవస్తున్నాయి. 

సీఏఏలో వివిధ రూపాల్లో అంతర్జాతీ య కోణాలున్నపుడు, ఆ కోణాల వల్ల, ముఖ్యంగా అందులోని వివక్షా ధోరణి వల్ల కొందరు నష్టపోతారనే అభిప్రాయం ఏర్పడినప్పుడు, ఆ ప్రభావాలు అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలపై, నియమాలపై డగలవనుకున్నప్పుడు, అదొక దేశ సార్వభౌమతలో ఇమిడిపోయే విషయమవుతుందా అన్నది చర్చించవలసిన విషయం. ఈ విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయాన్ని కూడా ప్రపం చం గమనిస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, ఈ కేసులో మానవహక్కుల సంస్థ జోక్యం అవసరం లేదని అంటూనే, హక్కుల విషయమై సీఏ ఏ అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నదని, అందువల్లనే ఇటువంటి వైఖరి తీసుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది.హక్కుల సంస్థ దరఖాస్తును సాంకేతికత ఆధారంగా తిరస్కరించగలిగి నా, దానితో సంబంధం గల వాదనలను తేలికగా తోసిపుచ్చలేమని గుర్తించాలి. ఒక దేశానికి ఇతర దేశాలతో, ప్రపంచంతో గల సంబంధాల్లో ఫిజిక్స్‌ మాత్రమే కాదు కెమిస్ట్రీ కూడా ఉంటుంది, ఉండాలి. మనం నివసిస్తున్నది ఆధునిక ప్రపంచం. అందువల్లనే అంతర్జాతీయ సంస్థలు, చట్టాలు, నియమాలు ఉనికిలోకి వచ్చాయి. అవి మనకు అనుకూలమైనపుడు ఒకవిధం గా, కానప్పుడు మరొకవిధంగా మాట్లాడుతామంటే సాంకేతికంగా నెట్టుకుపోవచ్చునేమో గాని వ్యవహారరీత్యా అది సులభం కాదు.సీఏఏను పాకిస్థాన్‌ మాత్రమే విమర్శిస్తే అందుకు విశ్వసనీయత ఉండే ది కాదు. ఇస్లామిక్‌ దేశాల సంస్థ, మలేషియా, ఇరాన్‌, టర్కీ వంటి దేశాలు  ఆక్షేపణ చేస్తే వాటిది మతకోణమనడానికి ఆస్కారం ఉండేదేమో. గతంలో ఇండియాపై  పాకిస్థాన్‌ విమర్శలతో ఈ దేశాలు అరుదుగా తప్ప ఏకీభవించలేదు. ఈసారి అవి పాకిస్థాన్‌ను మించి ఘాటైన భాషను ఉపయోగిస్తున్నాయి. వాటి ఆక్షేపణలకు మతకోణంతో తోసిపుచ్చవచ్చు. 

కానీ అమెరికా,యురోపియన్‌ సంస్థలు, ఐరాస ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల సంస్థల మాటేమి టి? స్వదేశంలోనే ప్రజాస్వామిక వర్గాల విమర్శలను ఏమంటారు?ఇలాంటి సంస్థలతో, అంతర్జాతీ య మీడియాతో మాది సార్వభౌమ దేశం, ఇది మా అంతర్గత వ్యవహా రం అంటున్నది మోదీ ప్రభుత్వం. స్వదేశంలోని పౌరులు విమర్శిస్తే దేశద్రోహులని, పాకిస్థాన్‌ ఏజెంట్లని, పాకిస్థాన్‌కు వెళ్లిపోండని వారు బెదిరిస్తారు. చివరికి దేశద్రోహం కేసులు కూడా మోపుతున్నారు. చట్టాలను విమర్శించటాన్ని, ప్రధానిని విమర్శించటాన్ని దేశద్రోహమనే స్థాయికి పతనం కావటం వల్ల ప్రభుత్వానికి ఇంటా, బయటా గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌ గుప్తా ఈ విషయమై మాట్లాడుతూ, దేశం వేరు ప్రభుత్వం వేరని, ప్రభుత్వాన్ని విమర్శించటం దేశాన్ని విమర్శించటం కాబోదని, దేశ వ్యతిరేకం కాదని, ఒక పార్టీకి 51 శాతం ఓట్లు వచ్చినా తక్కిన 49 శాతం మంది తర్వాత ఐదేండ్ల పాటు మౌనంగా ఉండవలసిన అవసరం లేదని, నిరసన తెలపటం మానవహక్కని, ప్రభుత్వ చర్యలు ప్రతిసారి ఒప్పు కాబోవని, చట్టాలను ప్రశ్నించటం ద్వారానే సమాజం వికసిస్తుందని స్పష్టం చేశారు. చట్టాలనే గాక చట్టసభలను, ప్రభుత్వాలను, న్యాయవ్యవస్థను, సైనికవ్యవస్థను విమర్శించినా సరే దానిని దేశ వ్యతిరేక చర్య అనలేమన్నారు. సుప్రీంకోర్టు 1962లోనే కేదార్‌నాథ్‌సింగ్‌ కేసులో 124-ఏ ఆర్టికల్‌కు భాష్యం చెప్తూ, ఇదే విషయం ప్రకటించింది. పైగా అటువంటి విమర్శ కారణంగా హింస జరిగితే తప్ప విమర్శకులను శిక్షించలేమన్నది.దేశంలో ఇటువంటి విచారకర పరిణామాల వల్ల ఐరాస వంటి ప్రపంచసంస్థలు సైతం ఆందోళన చెందుతున్నాయి. ఎంత ఆందోళన చెందకపో తే సుప్రీంకోర్టుకు దరఖాస్తు వంటి అసాధారణమైన ఆలోచన చేస్తాయనుకోవాలి. ఈ స్థితికి ప్రతిఫలనమా అన్నట్లు అంతర్జాతీయ ప్రజాస్వామ్య సూచీలలో మన స్థానం దారుణంగా పతనమవుతున్నది. ద ఎకానమిస్ట్‌ పత్రిక గత జనవరి సర్వేలో నిరుటికన్న 10 స్థానాలు పడిపోయి 51వ స్థానానికి రాగా, ఇదే మార్చిలో వెల్లడైన ఫ్రీడం ఇన్‌ ద వరల్డ్‌ నివేదికలో 83వ స్థానానికి పతనమైంది. పరిమాణంలో అతిపెద్దది అయిన ప్రజాస్వా మ్య దేశం, గుణంలో అత్యుత్తమ ప్రజాస్వామ్యం కానక్కరలేదా?


logo