గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 11, 2020 , 00:16:23

కాంగ్రెస్‌ దీనావస్థ

కాంగ్రెస్‌ దీనావస్థ

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంలో కాంగ్రెస్‌ నాయకత్వం వెనుకబడింది. దేశానికి ప్రత్యామ్నాయాన్ని అందించడంలోనూ ఘోరంగా విఫలమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్నామ్నాయంగా కాంగ్రెస్‌ నిలువలేదనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా ముందుగానే పసిగట్టారు. ప్రధాని మోదీకి పోటీగా రాహుల్‌గాంధీని దేశ ప్రజల ముందుంచడం ఆత్మహత్యా సదృశమని కూడా స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ కూడా బీజేపీయేతర పక్షాలను కూడగట్టడంలో విఫలమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేదు.

మధ్యప్రదేశ్‌ నాటకీయ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర నాయకత్వ బలహీనతను మరోసారి బయటపెట్టాయి. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సరిపడని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తన బలగంతో కాంగ్రెస్‌ పార్టీని వీడిపోయారు. ఇరువై మందికిపైగా శాసనసభ్యులు ఆయన వెంట వెళ్ళడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. రాష్ట్రంలోని రెండువర్గాల మధ్య విభేదాలు ఇంత తీవ్రస్థాయికి చేరుకుంటే, ఇంతకా లం అధిష్ఠానం ఏమి చేస్తున్నదనే ప్రశ్న తలెత్తుతున్నది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో జ్యోతిరాదిత్య కృషి కూడా ఉన్నది. ఆయన కుటుంబం మొదటినుంచి పార్టీ నాయకత్వానికి సన్నిహితమైనది. జ్యోతిరాదిత్య పార్టీని వీడుతారని ఏ మాత్రం ఊహించలేదని మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. కమల్‌నాథ్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించినందువల్ల అధిష్ఠానం తనకు పీసీసీ నాయకత్వమైనా ఇస్తుందని జ్యోతిరాదిత్య ఆశించారు. ఈ కోరిక నెరవేరకపోగా ఆయన అనుయాయులకు కూడా ఏ పదవులూ ఇవ్వలేదు. పార్టీ నిర్ణయాల్లో ఆయనను పూర్తిగా పక్కకుపెట్టారు. తాజాగా రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, తప్పనిసరిగా గెలిచే మొదటి సీటును తనకు కేటాయించకపోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఏ రాజకీయపక్షంలోనైనా భిన్నవర్గాలుంటాయి. అన్నింటినీ సంబాళిస్తూ పార్టీని నడిపించాలి. కాంగ్రెస్‌ అధిష్ఠానం కమల్‌నాథ్‌-దిగ్విజయ్‌సింగ్‌ కూటమిని ఒప్పించలేనంత బలహీనంగా ఉండటమే జ్యోతిరాదిత్య వంటి నాయకుడిని కోల్పోవడానికి కారణం. గోవా, కర్ణాట క పరిణామాల తర్వాత మధ్యప్రదేశ్‌ సన్నివేశం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ వైఫల్యాన్ని చాటుతున్నది.

జ్యోతిరాదిత్య నిష్క్రమణను గమనిస్తున్న వారికి రాజస్థాన్‌ రాజకీయాలు గుర్తుకువస్తున్నా యి. రాజస్థాన్‌లో కూడా మధ్యప్రదేశ్‌ను పోలిన పరిస్థితులే ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ విజయానికి కృషిచేసిన యువనాయకుడు సచిన్‌పైలట్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కలేదు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఏకపక్ష ధోరణిని నియంత్రించలేని నిస్సహాయత కేంద్ర నాయకత్వానిది. సచిన్‌ పైల ట్‌ అడుగడుగునా అసమ్మతిని వ్యక్తంచేస్తూనే ఉన్నారు. రాజ్యసభకు వజ్రాల వ్యాపారిని పంపాలని ముఖ్యమంత్రి గెహ్లాట్‌ భావిస్తుంటే సచిన్‌ పైలట్‌ అభ్యంతరం చెబుతున్నారు. వ్యాపారుల ను కాదు, రాజకీయ నాయకులను పంపాలని ఆయన అంటున్నారు. పైలట్‌ కనుక ఓ ఇరువై మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నుంచి బయటకు తెస్తే ప్రభుత్వం కూలిపోతుందనీ, అధిష్ఠానం ఇం త క్రియాశూన్యంగా ఉండకూడదనీ పార్టీ వర్గాలే అంటున్నాయి. కాంగ్రెస్‌లో పాత నాయకులకు, యువనేతలకు మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. రాహుల్‌గాంధీ సీనియర్‌ నాయకులతో వ్యవహరించడానికి అవసరమైన పరిణతిని, స్థాయిని సంతరించుకోలేకపోయారు. రెండువర్గాల మధ్య సమన్వయం సాధించడానికి బదులు యువ నాయకులతో తనకంటూ ఒకవర్గాన్ని తయా రుచేసుకున్నారు. పాత నాయకులు ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం సహజం. అన్ని రాష్ర్టాలలో ఈ రెండువర్గాల మధ్య విభజన రేఖ ఏర్పడి విభేదాలు తీవ్రమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని పటిష్ఠ వ్యూహంతో నడిపించడంలో విఫలమైన రాహుల్‌గాంధీ, ఫలితాలు వెలువడిన తర్వాత అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్నారు. సోనియాగాంధీకి ఎంతటి చతురత ఉన్నా అనారోగ్యం మూలంగా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. నెహ్రూ కుటుంబం సమర్థనాయకత్వాన్ని అందించడమూ లేదు, సమష్టి నాయకత్వాన్ని రూపుదిద్దుకోనివ్వడమూ లేదు. సమస్యకు అదే మూలకారణం.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంలో కాంగ్రెస్‌ నాయకత్వం వెనుకబడింది. దేశానికి ప్రత్యామ్నాయాన్ని అందించడంలోనూ ఘోరంగా విఫలమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్నామ్నాయంగా కాంగ్రెస్‌ నిలువలేదనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా ముందుగానే పసిగట్టారు. ప్రధాని మోదీకి పోటీగా రాహుల్‌గాంధీని దేశ ప్రజల ముందుంచడం ఆత్మహత్యా సదృశమని కూడా స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ కూడా బీజేపీయేతర పక్షాలను కూడగట్టడంలో విఫలమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా వివిధ రాష్ర్టాలలో చెప్పుకోదగినంత బలంగా లేదు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంగా ఆలోచించే పరిస్థితి లేదు. రెండు జాతీయ పార్టీల మధ్యనే పోటీ అనే భావన ఇక ఉండదు. కేంద్రీకృత, సమాఖ్యశక్తుల మధ్య రాజకీయ మోహరింపు జరుగవచ్చు. దేశవ్యాప్తంగా ప్రాంతీయశక్తులు బలంగా నిలదొక్కుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలన్నీ ఒక సైద్ధాంతిక భూమికను ఏర్పాటుచేసుకొని ఏకతాటిపైకి రావడం అవసరం. ఇందుకు ఎన్నికల సందర్భమే ఉండాలని లేదు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే చాలు. కేసీఆర్‌ సూచనల మేరకు ఒకే వేదిక మీదకు వచ్చి చర్చించుకుంటే ఆయా పక్షాలకే కాదు, దేశానికీ శ్రేయస్కరం.


logo