శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 11, 2020 , 00:14:08

‘పౌర’ అగ్నిపరీక్ష

‘పౌర’  అగ్నిపరీక్ష

కేంద్ర పెద్దలు వాదిస్తున్నట్టు ఇప్పుడు వారు జరుపాలనుకుంటున్నది జనగణన మాత్రమే అయితే.. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌,ఆఫ్ఘనిస్థాన్‌ హిందువుల దేశీయతనే కాదు, శ్రీలంకలో స్థిరపడిన తమిళ హిందూవుల పరిస్థితిని కూడా సమీక్షించవలసిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు వారిని సీఏఏలో ఎందుకు చేర్చలేదన్న ప్రశ్న ఉదయిస్తుంది. హిందీ మాట్లాడే ఆఫ్ఘనిస్థాన్‌ హిందువులకు మోదీ సర్కార్‌ పౌరసత్వం ఇస్తున్నప్పుడు, శ్రీలంకలో సింహల భాష మాట్లాడని తమిళుల సంగతేంటీ? తమిళులపై శ్రీలంకలో దాడులు జరుగడం లేదా? ఆ దేశపు తమిళులు దేశంలోకి రావడం లేదా? ఎందుకీ ద్వంద్వ విధానం అని ఆలోచించాల్సిన అవసరమున్నది.

గంగా జమునా తెహజీబ్‌ హైదరాబాద్‌ సంస్కృతి అని సీఎం కేసీఆర్‌ ఎన్నోసార్లు అన్న మాట. నిజమే.. హైదరాబాద్‌ ఒక మినీ ఇండియా. వందల ఏండ్ల నుంచి అనేక ప్రాంతాల దేశాల ప్రజలు మన హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఏ దేశం, రాష్ట్రం వారైనా, ఏ మతం, వర్గం వారైనా అక్కున చేర్చుకొని ఆదరించే గొప్ప ప్రేమాభిమానాల నగరం మనది. భూగోళమంతా వెతికినా సకల మతాలకు, సంస్కృతులకు సమ్మేళనమైన ఇటువంటి అద్భుత నగరం మనకు కనిపించదు. ఒక్క హైదరాబాద్‌ మాత్రమే కాదు, తెలంగాణ మొత్తంలో మనుషుల మధ్య ఇవే ప్రేమాభిమానాలుం టయి. కానీ ఇప్పుడు ఈ ఘనమైన చరిత్రను చెరిపేస్తూ మతాన్ని మనుషులకు అంటగట్టి, తద్వారా జరిగే రావణకాష్టంలో చలిమంటలు కాపుకుందామని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కుట్రలను మనుషులే దేశమని నమ్మే వారంతా వాటిని ఎదుర్కోక, వ్యతిరేకించక తప్పని పరిస్థితి వచ్చింది. 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి కోసం వ్యూహాలు రచించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంటే, మన దేశంలో మాత్రం మతఘర్షణలతో దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు. మనుషుల నడుమ గోడలు కట్టి దేశానికున్న లౌకిక ఆత్మను హననం చేయాలని చూస్తున్నారు. ఇది గర్హనీయమే కాదు అనాగరికం.


76 ఏండ్ల గణతంత్ర దేశంలో, 130 కోట్ల జనాభాకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనే అగ్నిపరీక్ష పెట్టింది. అసలు మోదీ ప్రభుత్వం చేస్తున్నదేమిటో, జ్ఞానశీలురంతా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల నడుమ చిచ్చుపెట్టే వారి ప్రయత్నా న్ని ప్రజలకు వివరించి, విజ్ఞానవంతులను చేయాల్సిన అవసరం ఏర్పడింది. అసోంలో మోదీ ప్రభుత్వం ప్రకటించిన 19 లక్షల మంది స్థానికేతురుల బూచి, ఇప్పుడు దేశ కాషాయికరణకు ఆయుధంగా మారుతుందని దేశప్రజలు భయపడుతున్నరు. ఆ భయమే ఇప్పుడు సీఏఏ, ఎన్నార్సీ నిరసనల ఆకృతిగా మారింది. ఇదే రేపు దేశ ఔన్నత్యానికి మచ్చగా మారి తే, ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికున్న ప్రత్యేక గుర్తింపునకు సీఏఏ, ఎన్నా ర్సీ మచ్చగా మారే ప్రమాదం ఉన్నది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే చొరబాటుదారుల పట్ల అప్రమత్తత అవసరమే. కానీ అక్రమ చొరబాటుదారుల పేరుతో 130 కోట్ల మంది ప్రజలను పరీక్షకు నిలబెట్టడం భావ్యం కాదు. ఇప్పటికే ఆధార్‌కార్డ్‌ పౌరసత్వ గుర్తింపునకు దోహదపడుతుంటే.. దాన్ని బలోపేతం చేసి దేశాన్ని సంరక్షించాల్సిందిపోయి, దేశ ప్రజలకు కొత్త చిక్కులు పెట్టడం ఎందుకు? ఇప్పుడు అసోంలో మొదలైన సీఏఏ కార్చిచ్చు దేశ రాజధానిలో 30 పైచిలుకు పౌరుల ప్రాణాలను తీసింది.


 దేశంలో ఇంత అలజడి జరుగుతుంటే, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మాలాంటి ప్రజాప్రతినిధులం ప్రశ్నించకపోతే ఈ అగ్నిపరీక్ష పాపం లో భాగస్వాములం కాదా అన్నది ఆత్మక్షోభకు గురిచేస్తున్నది. బంగ్లాదేశ్‌ నుం చి అసోంకు వలసలు వస్తున్నది నిజమే. బంగ్లా-భారత్‌ నడుమ యుద్ధం కన్నా ముందు, వలస వచ్చినవారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన కేంద్రం, ఆ తర్వాత భారత్‌లోకి అక్రమంగా చొరబడిన వారిని ఆపేందుకు ఏ ప్రయ త్నమూ చేయలేదు. అక్రమ చొరబాటుదారుల పట్ల అందరికీ ఒకే అభిప్రా యం ఉండాలి. కానీ, ఆ పేరుతో దేశంలో ఉన్న ముస్లిం ప్రజలను అభద్రతలోకి నెట్టివేస్తామనేది ఆక్షేపణీ యం. సీఏఏ అమలైతే.., ఈ దేశం లో వందల ఏండ్లుగా ఉన్న ముస్లింలు ఒంటరివారమనే భావనతో జీవిస్తారు. సీఏఏ ప్రకా రం, దేశంలో ఉన్న హిందువులు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు స్థానికులై, ముస్లింలను మాత్రమే వెలివేసినట్లవుతుంది. బీజేపీ నాయకులు చెప్పినట్టు కేవలం ఇది జనగణన అయితే పర్వాలేదు. కానీ, సంఘ్‌పరివార్‌కు చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాగూర్‌ వంటి నాయకుల రెచ్చగొట్టే మాటలు.. ఎలా ఉం టున్నాయో అందరూ చూస్తున్నదే. ఇదిలా ఉంటే, ఏ మతానికి చెందినవారో తెలియడానికి వారు వేసుకున్న దుస్తులు చాలవా.. అన్న ప్రధాని మాటలు సామాన్యుల గుండెల్లో భయందోనలు రేపవా? ఈ మాటలను ఏ విధంగా సమర్థించు కుంటారో వారే చెప్పాలి. 


కేంద్ర పెద్దలు వాదిస్తున్నట్టు ఇప్పుడు వారు జరుపాలనుకుంటున్నది జనగణన మాత్రమే అయితే.. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ హిందువుల దేశీయతనే కాదు, శ్రీలంకలో స్థిరపడిన తమిళ హిందూవుల పరిస్థితిని కూడా సమీక్షించవలసిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు వారిని సీఏఏలో ఎందుకు చేర్చలేదన్న ప్రశ్న ఉదయిస్తుంది. హిందీమాట్లాడే ఆఫ్ఘనిస్థాన్‌ హిందువులకు మోదీ సర్కార్‌ పౌరసత్వం ఇస్తున్నప్పుడు, శ్రీలంకలో సింహల భాష మాట్లాడని తమిళుల సంగతేంటీ? తమిళులపై  శ్రీలంకలో దాడులు జరుగడం లేదా? ఆ దేశపు తమిళులు దేశంలోకి రావడం లేదా? ఎందుకీ ద్వంద్వ విధానం అని ఆలోచించాల్సిన అవసరమున్నది. 


ఈ భయాలు కేవలం సృష్టించుకున్నవో లేక అపాదించుకున్నవో కాదు మోదీ-షాలు 2014 నుంచి మాట్లా డుతున్న అనేక అంశాల భావప్రతీకలు. కమలనాథులు కోరుకుంటున్నట్టు.. తప్పక జరిపి తీరుతామంటున్న సీఏఏ, ఎన్నా ర్సీ అనంతరం తేలాల్సింది ప్రజలె వరో, పౌరులెవరో భారతీయులెవరో విషయమే కదా. కానీ సీఏఏ, ఎన్నార్సీ నిబంధనలతో ఇది సాధ్యమా? కేంద్రం అడిగే ప్రశ్నలకు 130 కోట్లమంది ప్రజల వద్ద ఆధారాలున్నాయా? ఒకవేళ వారడిగే 15 రకాల ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సమాధానం లేకపోతే పరిస్థితి ఏమిటి? ఎందుకంటే సాక్షాత్తు అమిత్‌ షా అన్నమాటలు No person will citizenship autometically. అంటే ప్రజలంతా తాము పౌరులమని నిరూపించుకో వాల్సి అన్నమాట. కానీ అగ్రదేశాలకు వలసల పట్ల ఒక విధానం ఉన్నది. వలసలను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ అక్రమంగా చొరబాటుదారులపైన రాజకీయ నిర్ణయంతో అక్కడి దేశాల్లో జాతీయత కలిగించిన అనేక సందర్భాలున్నాయి. అమెరికా సైతం సందర్భానుసారంగా అక్రమ చొరబాటుదారులకు సిటిజన్‌షిప్‌ ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించిన ఉదాహరణలున్నయి. 


అందుకే మోదీ సర్కారు నిర్ణయాన్ని ఒక్క కేసిఆర్‌ మాత్రమే వ్యతిరేఖించడం లేదు. ఎన్డీయేలో భాగస్వాములైన జేడీయూ, అకాళీదల్‌తో పాటు, హిందుత్వ మార్కుతో రాజకీయాలు చేసే శివసేన కూడా వ్యతిరేకిస్తున్నది. మతాలు, కులాల పేర జరిగే అల్లర్ల పట్ల అప్రమత్తంగా ఉండే తెలంగాణ ఇప్పుడు అప్రమత్తమైంది. కాబట్టే కేసీఆర్‌ కుండబద్ధలు కొట్టిసీఏఏను వ్యతిరేకిస్తునారు. మానవీయతకు పట్టం గడుతున్నారు.

(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)


logo