గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 09, 2020 , 23:36:47

ప్రతికూలతనధిగమించి!

ప్రతికూలతనధిగమించి!

సంక్షేమపథకాలు సమాజానికే కాదు, పరిశ్రమలతో పాటు మొత్తం ఆర్థికవ్యవస్థకే పునరుజ్జీవాన్ని ఇస్తాయనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. చరిత్రలో ఇందుకు బలమైన దృష్టాంతాలు కూడా ఉన్నాయి. సమాజం చితికిపోయి ఉన్నప్పుడు సంక్షేమ పథకాల ద్వారానే కోలుకుంటుందనేది అమెరికాతోపాటు ఆధునిక యూరప్‌ చరిత్రను గమనిస్తే అర్థమవుతుంది. ప్రపంచ యుద్ధాల ద్వారా చితికిపోయిన సమాజాన్ని వారు మళ్ళా పునర్నిర్మించుకోగలిగింది సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల నిర్మాణాల ద్వారానే. అమెరికాలో మహా మాంద్యం ఆవరించిన నేపథ్యంలో సంక్షేమ పథకాల ద్వారానే అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ దేశాన్ని గట్టెక్కించగలిగాడు.

దేశవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కమ్ముకుపోయి ఉన్నప్పటికీ కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని నిశ్చలంగా నడుపుతున్న తీరుకు రాష్ట్ర బడ్జెట్‌ అద్దం పడుతున్నది. గడ్డు పరిస్థితుల్లోనూ 1,82,914 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆశ్చర్యకరం. గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు ముప్పైఆరు వేల కోట్లు ఇవి ఎక్కువ! ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, పేదలకు అం దిస్తున్న సంక్షేమ పథకాలలో ఎక్కడా కోత వేయకపోగా మరింత విస్తరించడం, ప్రాధాన్య రంగాలను విస్మరించకపోవడం విశేషం. దీర్ఘకాలిక లబ్ధి కోసం వనరులను కల్పించే క్యాపిటల్‌ వ్యయానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఇందుకోసం దాదాపు 22 వేల కోట్లను కేటాయించడమే కాకుండా, మరిన్ని నిధులను ఇతరమార్గాలలో సమీకరిస్తున్నది. 


వ్యవసాయంతో పాటు పారిశ్రామికరంగం, గ్రామీణ ప్రగతితోపాటు నగరాల అభివృద్ధి- ఈ విధంగా వివిధ రంగాల మధ్య సమతుల్యతను పాటించింది. భాగ్యనగరిని విశ్వనగరంగా మార్చేందుకు పదివేల కోట్ల భారీ నిధులను కేటాయించడం అబ్బురపరిచే విషయం. గతంలో నగరాభివృద్ధి అంటే ఆశ్రితవ ర్గ స్థిరాస్తి వ్యాపారమనే విమర్శ ఉండేది. ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచీ మౌలికవసతుల కల్పనతో పాటు జనజీవనాన్ని ఉల్లాసభరితంగా మార్చడానికి ప్రాధాన్యమిస్తున్నది. తాజా కేటాయింపులతో మౌలికవసతులను సమకూర్చడమే కాకుండా మూసీ ప్రక్షాళనతో పాటు నదీ పరీవాహక ప్రాంతమంతా సుందర ఉద్యానవనంగా మారబోతున్నది. భాగ్యనగరాన్ని ప్రపంచపటం మీద మెరిసే తెలంగాణ మణిమకుటంగా మార్చాలనే పట్టుదల ఈ కేటాయింపులో కనిపిస్తున్నది.


ఆర్థికపరిస్థితి దిగజారిన నేపథ్యంలో అటు సం క్షేమ పథకాలను, ఇటు అభివృద్ధి కార్యక్రమాల ను అమలుచేయడం ఎట్లా సాధ్యమనే సందేహం కలగడం సహజం. నిజానికి ఇదొక పెద్ద సవాలు. కానీ పాలకులకు మొదట ఉండాల్సింది సత్సంక ల్పం. ఆ తర్వాత కావలసింది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన సృజనాత్మకత. వనరులను సేకరించడం, తగిన రీతుల్లో వెచ్చించడంలోనే పరిపాలనాదక్షత ఇమిడి ఉం టుంది. ఈ చిత్తశుద్ధి, చతురత పాలకులకు లోపించినప్పుడు సమాజంలో సంక్షోభాలు వస్తా యి. ఆర్థికమాంద్యంలోకి దిగజారుతామనే భయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న తరుణం లో ప్రభుత్వం బడ్జెట్‌ను కుదించకుండా మరింత పెంచి సంక్షేమానికి పెద్దపీట వేసింది. 


ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధిస్తామన్న సూత్రాన్ని అమలుచేస్తున్నది. రాష్ట్ర బడ్జెట్‌లో నలభై వేల కోట్లు సంక్షేమానికే వెచ్చించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆసరా, కళ్యాణలక్ష్మి వంటి పథకాల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నది. రైతుబంధు పథకానికి కూడా కేటాయింపును పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పొడుగునా మత్స్య, పర్యాటకాదిరంగాల అభివృ ద్ధి పథకాలు అమలవుతున్నాయి. పారిశ్రామికరంగంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరచడం కూడా ప్రశంసనీయం. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం పారిశ్రామిక పోత్సాహక నిధులను 21.55 కోట్ల నుంచి భారీగా 1,132 కోట్లకు పెంచింది.


పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదనే రీతిలో కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం ఆశ్చర్యకరంగా ఉన్నది. సంక్షేమపథకాలు సమాజానికే కాదు, పరిశ్రమలతో పాటు మొత్తం ఆర్థికవ్యవస్థకే పునరుజ్జీవాన్ని ఇస్తాయనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. చరిత్రలో ఇందుకు బలమైన దృష్టాంతాలు కూడా ఉన్నాయి. సమాజం చితికిపోయి ఉన్నప్పుడు సంక్షేమ పథకాల ద్వారానే కోలుకుంటుందనేది అమెరికాతోపాటు ఆధునిక యూరప్‌ చరిత్రను గమనిస్తే అర్థమవుతుంది. ప్రపంచయుద్ధాల ద్వారా చితికిపోయిన సమాజాన్ని వారు మళ్ళా పునర్నిర్మించుకోగలిగింది సంక్షేమపథకాలు, మౌలిక వసతుల నిర్మాణాల ద్వారానే. అమెరికాలో మహా మాంద్యం ఆవరించిన నేపథ్యంలో సంక్షేమ పథకాల ద్వారానే అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ దేశాన్ని గట్టెక్కించగలిగాడు.


 ప్రజల దగ్గర కొనుగోలుశక్తి ఉంటేనే ఆర్థిక రథచక్రాలు తిరుగుతాయి. కొనుగోలు శక్తి నశిస్తే మొత్తం పారిశ్రామికరంగమే కుప్పకూలుతుంది. సంక్షేమ పథకాలు బలహీనవర్గాల పట్ల ప్రభుత్వ బాధ్యతకు సూచన మాత్రమే కాదు, పారిశ్రామిక ప్రగతికి ఇంధనం. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత గ్రామాలకు లక్షల కోట్ల రూపాయలను పంపిణీ చేయడం ద్వారా ఇవాళ గ్రామీణ సమా జం కళకళలాడుతున్నది. ఆ పునాదిపైనే అన్నిరంగాలు నిలదొక్కుకుంటున్నాయి. పరాయిశక్తుల పాలనలో దశాబ్దాల పాటు చితికిపోయిన తెలంగాణ సమాజానికి జవసత్వాలు ఇవ్వడానికి కేసీఆర్‌ రూపొందించిన సమగ్ర వ్యూహంలో భాగమే ఈ కార్యాచరణ. ఇందులో సమాజ వికాస మూ, ఆర్థిక ప్రగతీ దాగి ఉన్నాయి. దేశమంతా ఆర్థిక మందగమనానికి కుదేలయినా తెలంగాణ నిలకడగా ఉండగలుగుతున్నదీ, అన్ని రంగాలలో దేశాన్ని మించిన సగటు వృద్ధిని సాధిస్తున్నదీ అంటే అది కేసీఆర్‌ వ్యూహ ఫలితమే!


logo