శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 08, 2020 , 22:51:57

విశ్వ చైతన్య గీతం

విశ్వ చైతన్య గీతం

వీరభద్రయ్యగారి కలానికి రెండువైపులా పదునే. ఒకవైపు కవిత్వం, మరొకవైపు విమర్శ. ఇలా సృజన విమర్శనా శక్తుల మేళవింపు వీరి ‘జాతి విపంచీగానం’ కావ్యంలో కనపడుతుంది.

ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, సంగీత విద్వాంసులు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య ‘జాతి విపంచీగానం’ అనే జాతీయ కావ్యాన్ని రచించి, సుప్రసిద్ధ కవి, విమర్శకులైన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారికి గత  ఒక విద్వత్‌సభలో ఆవిష్కరించి, అంకితం చేశారు. గత శతాబ్దపు తొలినాళ్ళలో దేశంలోను, ప్రపంచ దేశాలలోను ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నుంచి దేశాన్ని, జాతిని, సంస్కృతిని, జ్ఞాన సంపదను సంరక్షించుకునే లక్ష్యంతో ఎందరో మహాకవులు జాతీయ చైతన్యాన్ని కీర్తిస్తూ గొప్ప రచనలు చేశారు. 


బంకించంద్రుడు, రవీంద్రుని వంటి వారి ని స్ఫూర్తిగా తీసుకుని గురజాడ, రాయప్రో లు, విశ్వనాథ వంటి కవులు దేశభక్తి గీతాలు రాశారు. ఆనాడవి ప్రజల నాలుకలపై నాట్యం చేసినవి. ‘శ్రీలు పొంగిన జీవగడ్డయి, పాలువారిన భాగ్యసీమయి వ్రాలినది యీ భరత ఖండ ము. భక్తి పాడర తమ్ముడా! వేదశాఖలు వెలిసె నిచ్చట, ఉపనిషన్మధువు లొలికె నిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు, పాదు సుమ్మిది చెల్లెలా!’ వంటి గేయాలానాడు ప్రజలను ఉర్రూతలూగించినవి. ప్రజలను స్వాతంత్య్ర సముపార్జనకు పురికొల్పి ఉపకరించినవి. ఇది గత చరిత్ర. దాదాపు ఒక శతాబ్దం గడచింది. మరల ఈనాడు ప్రజలను, యువతను, విద్యావంతులను మేలుకొలిపి జాతి చైతన్యాన్ని పునఃఆవిష్కరించవలసిన ఆవశ్యకత ఏర్పడినది. ఈ అవసరాన్ని గుర్తించిన కాలమే వీరభద్రయ్యగారి కలం నుంచి జాతి విపంచీగానమై ఆవిష్కృతమైంది.


‘శతాబ్దాల ఈ కృషి ఫలితాన్ని

భవ్య కవితావేశ వీణియపై గానంగా 

వినిపిస్తున్న శుభ ముహూర్తం ఇది’ అంటూ వీరభద్రయ్యగారు భరతజాతి గొప్పతనాన్ని తన ఈ కావ్యంలో వెల్లడిస్తారు.

‘ఎన్ని యుద్ధాలు ఎన్ని దండయాత్రలు, 

ఎన్నెన్ని కొల్లగొట్టడాలు జరిగినా 

    సహనం కోల్పోకుండా -

రజస్తమస్సుల అనుక్షణం అణచివేస్తూ

కేవలం సత్యాన్నే భజించి

లోకానికి ఆదర్శాన్నిచ్చిన అద్భుత జాతి

భరతజాతి..’ అని అంటారు కవి. సహనం భరత జాతికి గొప్ప గుణం. ఆ సహనత్వమే మన జాతి సంస్కృతికి ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టింది. ‘సహనౌభునక్తు.... సహవీర్యంకరవావహై’ అన్న ఉపనిషత్‌ సూక్తి కూడా అదే చెబుతున్నది. అందుకే కవిగారు ఈ కావ్యంలో.. 

‘యోగ సమాధిలో ఎన్ని నాళ్ళుండిందో

జాతి శరీరానికి శత్రుమూకలు తూట్లు పొడిచినా

తనలో తాను మునిగి పట్టించుకొననే లేదు..’ అంటారు. తనలక్ష్యం కోసం భౌతికం నుంచి ఆధ్యాత్మిక తీరానికి అంతర్ముఖ ప్రయాణంచేసే లక్షణం కల్గిన భరతజాతికి గొప్ప సాధనం యోగ సమాధి. ఈ గుణమే ప్రపంచంలోని దేశాలన్నింటి కి ఆదర్శమైందీనాడు. నిన్నటిదాకా సుప్తావస్థలో ఉన్న జాతిచైతన్యం ఇప్పుడు జాగ్రదవస్థలోకి వచ్చి అభ్యుదయంవైపు అడుగులు వేస్తుందంటూ..

‘తూర్పున సూర్యుడు ఫక్కున నవ్వాడు

గుట్టు తెలిసిపోయింది

జ్ఞాన సూర్యుడే మిగిలేడు!


జాతి చైతన్యం ఇక తిరోగామి అవనే అవదు..’ అని వీరభద్రయ్యగారు కవిగా కాలాన్ని శాసిస్తూ తన వాక్‌ శాసనం ద్వారా నేటి యువతకు ధైర్యా న్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే జాతి భావనకు నిర్వచనం చెబుతాడు కవి ఇట్లా..

‘కష్టసుఖాలను చరిత్ర జాడీలో ఊరవేస్తే

క్రమంగా సిద్ధించే ఊరగాయే జాతి భావన..’ జాతి భావనకు ఇది ఒక అందమైన నిర్వచనం. అట్లే చరిత్రను గూర్చి నిర్వచిస్తూ..

‘చరిత్ర నిస్సారపు కాగితాలు పిండితే

కన్నీరే కారుస్తుంటాయవి

అవన్నీ కన్నీటి సముద్రాలే - ఉప్పునీళ్ళే!’ అలాగే చరిత్ర పుటలను పిండితే కన్నీటితో పాటు ద్వేషాగ్నుల సెగ కూడా తగులుతుందంటాడు కవి. ఈ కావ్యంలో కవి చరిత్రను ఒక జ్ఞాన భాండాగారం గా చూశాడు. అందుకే ‘చరిత్ర అంటే మానవ జ్ఞాన పురోగతి’ అంటాడు కవి. అలాంటి చరిత్రలు నాయకులు విజ్ఞానవంతులై ఉంటే ఎలా ఉంటుం దో వర్ణిస్తూ..

‘నాయకులు విజ్ఞానులవుతే

భూగోళం మీదున్న ప్రతి దేశమూ

ఒక యోగభూమే!’ కవిదృష్టిలో ఒక దేశం కేవ లం కర్మభూమిగానే కాదు యోగభూమి అయి ఉండాలని కోరుకోవడం కనిపిస్తుంది. అట్లాంటి నాయకుల నాయకత్వంలో భారతజాతి సహస్రాబ్దాలకు పూర్వమే యోగ భూమిగా పరిణామం చెం దిందని, ఇది  కూడా ఈ జాతి విశిష్టతకు నిదర్శనమని ఈ కావ్యం చెబుతున్నది. 

దేశాన్ని కేవలం రాజకీయ జాతిగా కాకుండా ఆధ్యాత్మిక భూఖండంగా పరిణమింపచేశారని చెబుతూ ఈ కావ్యంలో..


‘రాజకీయం నుంచి కూడా 

     ఆధ్యాత్మికాన్ని మొలిపించిన

మానుష దేహదారులైన అవతారాలు వారు..’ అంటారు. 

వీరభద్రయ్యగారి కలానికి రెండువైపులా పదునే. ఒకవైపు కవిత్వం, మరొకవైపు విమర్శ. ఇలా సృజన విమర్శనా శక్తుల మేళవింపు వీరి ఈ కావ్యంలో కనపడుతుంది.

జాతి  సంస్కృతులను కాపాడేది కావ్యమ ని, అలాంటి కావ్యాలను సృజించే కవులు కళాకారులు దేవదూతలని వర్ణిస్తూ ఇలా అంటారు..

‘కవులు కళాకారులు దేవదూతలుగా

వర్తిస్తూ నాయకత్వం వహిస్తుంటారు.

జీవితానుభవాల బాణం నేలలోకి ప్రయోగిస్తే

చిమ్మిన కవితామృతమే కావ్య సరస్సులయినవి..’ ఇలాంటి వినూత్న భావచిత్రణతో ఉన్న కవితాపంక్తులు ఈ కావ్యానికి సౌందర్యస్ఫోరకంగా కనిపిస్తాయి. ఈ కావ్యంలో జాతిసంస్కృతులను ముందుకు నడిపే శక్తిపుంజంగా కావ్యాన్ని వర్ణించడంలో వీరభద్రయ్యగారి కవిత్వంలోని విమర్శనాశక్తి ప్రస్ఫుటం అవుతుంది. 


ఈ దేశంలో జాతిచైతన్యానికి కృషి చేసిన త్యాగధనులైన మహానుభావులు ఉన్నట్లే మన జాతికి ద్రోహం తలపెట్టి, జాతికి నష్టం చేసే దుర్మార్గులు కూడా కొందరు ఉంటారని అలాంటివారు జాతి శత్రువులై ‘బడా బద్మాష్‌'లుగా రూపొందుతున్నారంటారు కవి. తన వ్యంగ్యోక్తులతో వారి స్వభా వాన్ని ఎండగట్టినాడు ఈ కావ్యంలో.

ఇంకా ఈ కావ్యంలో భరతజాతి ఆదర్శ లక్షణా లు అరవిందులు, అనీ బిసెంటు, నివేదితా, ఆల్కా ట్‌ వంటి వారు భారత హైందవజాతి అమృతబిం దువులన్నారు. జీవన మరణాల రహస్యాలను కనుగొన్న నచికేతాది మహర్షుల తపో బలమూ మొదలైన అనేక విశిష్టతలతో కూడుకొని ఉన్న భరతజాతి వేల ఏండ్లుగా తన వైభవాన్ని తన చైతన్యాన్ని చెక్కుచెదరనీకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించుకుంటూపోతోందో వివరిస్తూ  ఆచార్య ముదిగొండ ఈ ‘జాతి విపంచీగానం’ కావ్యాన్ని రూపొందించారు. అందుకే ఈ కావ్యం చివరలో..

‘చెదరిపోని దీక్షతో - లోకం ఆశ్చర్యపోయే

మహామహా సత్యాలను

పొరలు విప్పి ఆవిష్కరించిన

విలక్షణ విచిత్ర విశేష జాతి


తాను వికసిస్తూ పూదీపంలాగా 

ప్రపంచోద్యానవనంలో

కాంతి వికాసాలను వెదజల్లు ఘనజాతి

ప్రకాశజాతి - భరతజాతి..’ అన్న కవితాపంక్తు లు జాతి విశ్వచైతన్య గీతమై సహృదయ పాఠకుల మన్ననలను పొందగలదని విశ్వసిస్తున్నాను.

- ఆచార్య కె. యాదగిరి, 9390113169


logo