శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 08, 2020 , 22:49:33

క..రోనా

క..రోనా

గర్వమంతా సఫా గాలిలో 

జావగారి పోయి పుర్రు కొట్టింది 

గాబరా పాము పాకింది ప్రపంచ శరీరమంతా 

ఒక్క దెబ్బకే ఒకే ఒక్క దెబ్బకే 

కుప్పకూలిపోయింది గుట్టంత ఏనుగు 

రాలింది పెళ్లలు పెళ్లలుగా, పెచ్చులు పెచ్చులుగా.. 


నిన్నటి దాకా ఉండేది పోటీ

సై ఆనేది సరఫరాలో ఏదైనా చీఫ్‌గా

ఇప్పుడు తన దేశం తలుపులు తానే మూసుకొని 

చేసుకుంటూనే ఉంది శస్ర్తాలకు అందని చికిత్స 

పోయిన వారెందరో, ఉన్నవారెందరూ 

లెక్కలు కాదులే పక్కా 

ఎంత తలుపులు బిడాయించుకున్నా

వైరస్‌ పక్కా ఔర్‌ ఏక్‌ దక్కా 

దేశం వెనుక దేశం కోవిడ్‌-19 హాలాహలంలో..


షేక్‌ షేక్‌.. ప్రపంచ షేర్‌ మార్కెట్లు 

మాల్స్‌ హంగామాల మార్కెట్‌కూ గాయాలు

షేక్‌హ్యాండ్‌కూ చేతులు దూరం 

మొదటి దెబ్బకు లబలబా మొత్తుకోగానే 

మార్కెట్‌ కా..రోనా మొదలు.. 


ఇప్పుడు ప్రపంచమంతా కుగ్రామం కదా

వాట్సప్‌, ఫేస్‌బుక్‌లు పాకినట్లుగానే 

కర్ర పెత్తనం చేస్తోంది కరోనా

చలి లేదు, ఎండ లేదు మంట పెట్టడానికి 

దేశం ఏదైతేనేం, ప్రాంతం ఎక్కడుంటేనేం

లబోదిబో లబ లబ లబ 

విపరీత బుద్ధులతో మొదలైన వినాశనం 

ఇపుడు అణ్వస్ర్తాలు ఆయుధాలవసరం లేదు

కంటికి కనిపించని వైరస్‌ చాలు 

భస్మాసురహస్తం తనపై, అందరిపై..


ఇప్పుడిక చేతులు కడుక్కుందాం

కాళ్లు, మొఖాలు కడుక్కుందాం

మనల్ని మనమే కడిగేసుకుందాం

ముఖాలకు మాస్క్‌లేసుకుందాం  

దగ్గినా తుమ్మినా దాచి దాచుకొని తుమ్ముదాం

ఎవరికి వారే ఒంటరితనంతో 

బతుకుదాం భయం భయంగా 

రోగం పలకరిస్తే ఊరడింపులుండవు 

సానుభూతుల మాటలు సల్ల చిలుకవు

వెలేసినట్లుగా ఐసోలేషన్‌ వార్డుల్లో 

బితుకు బితుకుమంటూ బిక్కచచ్చిన ముఖంతో.. 


పిట్టల కంటే బలహీనంగా మనుషులు

ఇపుడంతటా కరోనా రెడ్‌ అలర్ట్‌ 

శరీరమంతా మాస్కులు ధరించిన 

ఒంటరితనాల వార్డులు రెడీ రెడీ 

చావు రోగం కబురు చల్లగా చెప్పరు

ప్రపంచమంతా టాంటాం దండోరా

జాగ్రత్త పారా బడా హుషార్‌...


- కొమురవెల్లి అంజయ్య 


logo