గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 08, 2020 , 22:47:17

నడకను కత్తిరించినప్పుడు...

నడకను కత్తిరించినప్పుడు...

చూపు కంటిని మింగింది

అధికారం ఒంటరిదైనప్పుడు

తోడు నేనున్నానంటూ చీకటి జత కట్టింది

కుర్చీకి ఉన్న నాలుగు కాళ్ళు

అవి కదలకుండానే నన్ను భయపెడుతున్నవి;

నేను సహజంగానే 

మనుషుల మధ్యకు నడిచి వచ్చాను

వాళ్ళు అలవాటుగానే నా మెడలు విరిచి

నా కాళ్ళకు సమాధి కట్టారు

నేను జనన వాక్యమై మళ్ళీ మొలకెత్తుతుంటే

ఎవరో నా ముఖం మీద 

కులం జెండా విసిరి పోయారు

చీకటి తెల్ల రంగు వేసుకొని

నా భుజం మీద చెయ్యి వేసింది

చురుకుగా ఆలోచించాల్సిన నేను

ఇరుకు ఇరుకు ఆలోచనలతో

మడికట్టుకొని మాట్లాడుతున్నాను

ఇంతలో ఇంద్రధనుస్సుకు 

ఏడు రంగుల బరువెందుకంటూ

రాజ్య శాసనం ప్రశ్నిస్తుంది

చంద్రుని మరకలు

వెన్నెలకు కూడా ఉన్నాయని

అది పదే పదే ప్రకటిస్తుంది

ఇప్పుడు నేనెవరన్నదే కాదు సమస్య

రేపటి నా శవం కూడా నాది కాదన్నది నిజం.

            

 - ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌

 9849082693 


logo
>>>>>>