గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 08, 2020 , 22:45:23

విలువల పరిరక్షణ కోసమే హెచ్‌బీటీ

విలువల పరిరక్షణ కోసమే హెచ్‌బీటీ

నవతరానికి మంచి పుస్తకాలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌బీటీ) ఏర్పడింది. ఈ సంస్థ నలభై సంవత్సరాలు పూర్తిచేసుకొని పురోగమిస్తుండటం తెలుగు వారికి గర్వకారణం. సంస్థ ఏర్పడిన కొత్తలో అభ్యుదయవాదులైన మేధావులు ఎందరో ఈ సంస్థకు చేయూతనిచ్చారు. లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరలకు గొప్ప రచనలను అందించిన ఘనత హెచ్‌బీటీకి దక్కుతుంది. ప్రజల సాంస్కృతిక చైతన్యానికి ఉపకరించే విధంగా ఉండే రచనలను ఎంపిక చేసి ప్రచురించడంలో, ఇతర భాషల నుంచి అనువదించి ప్రచురించడంలోనూ హెచ్‌బీటీకి ప్రత్యేకత ఉన్నది.


 విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను మౌకికంగా రాయించడంతో పాటు అనువాదాలూ ప్రచరించింది. మత, ధార్మిక విషయాలకు సంబంధించిన రచనలూ స్త్రీ వాద, దళిత వాదాలకు సంబంధించిన రచనలకు హెచ్‌బీటీ కేంద్రం. ఈ క్రమంలో ఎక్కడో వేదాలలో దాచిపెట్టిన విషయాలను కొత్త తరం వారు తెలుసుకోవాలనే తపనతో హెచ్‌బీటీ శ్రమించింది. ఎన్నో విలువైన పరిశోధనాత్మక రచనలను పాఠకులకు అందించింది. తెలుగు పాఠకలోకాన్ని చైతన్యపరిచేందుకు హెచ్‌బీటీ సాగించిన ప్రయాణంలో ‘నలుపు’ పత్రిక నిర్వహణ ఒక మైలురాయి. ఇది ప్రాంతీయ చైతన్యానికీ, దళిత వదానికీ అండదండ లందించి గొప్ప చారిత్ర బాధ్యతను నెరవేర్చింది.


 భిన్న నేపథ్యాల చదువరులను ఒక అనుకూల భావజాలంవైపు ఆకర్షించే రీతిలో హెచ్‌బీటీ ప్రచురణలు సాగిస్తున్నది. ఈ సంస్థ ప్రచురణ రంగంలో అసాధారణమైన కృషి చేస్తున్నదనటం నిర్వివాదాంశం. ప్రజాస్వామిక విలువల పరిరక్షణే ధ్యేయం గా భావి తరాన్ని సంఘటితంగా, సజీవంగా ఉంచడానికి హెచ్‌బీటీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. ఈ కృషి వెనుక అచంచలంగా దృఢమైన దీక్షతో నిలిచి ఉన్న గీతారామస్వామి గారికి పాఠకలోకం తరఫున అభినందనలు. 

-విజయభారతి


logo