శుక్రవారం 30 అక్టోబర్ 2020
Editorial - Mar 08, 2020 , 00:01:22

ఆమెకు ‘ఆమే’ నాయకత్వం

ఆమెకు ‘ఆమే’ నాయకత్వం

సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం, దేవదాసీ పడుపు వృత్తి మొదలైన దుర్మార్గపు సంప్రదాయాలన్నింటిని మట్టుబెట్టి ముందడుగులు వేస్తున్న తరుణంలో లైంగికదాడుల అమానుషపు చర్యలను ఖండించాలి, ఎదిరించాలి. ‘చరిత్రను ఆధునిక స్త్రీ పునర్లిఖిస్తుంద’న్న గురజాడ స్వప్నాన్ని నిజం చేయడానికి స్త్రీ సమస్యలకు స్త్రీయే నాయకత్వం వహించి పోరాటం చేయాలి. స్త్రీలు వేసే అడుగులు భవిష్యత్తులో చైతన్యవంతమైన అడుగుజాడలుగా మారాలి.

ప్రతిభ దైవదత్తం. ఆ ప్రతిభకు  స్త్రీ పురుష భేదం లేదు. ప్రతిభావంతులైన స్త్రీలు అన్ని కాలాల్లో, అన్ని దేశాలలో, అన్నిరంగాల లో ఉన్నారు. వేదాంత విద్యలో కూడా పరిణతిచెందిన మంత్రద్రష్టలైన స్త్రీలు ఎందరో ఉన్నారు. ప్రాచీనకాలంలో రోమ ష, ఘోష, విశ్వవర, ఆత్రేయ, లోపాము ద్ర, వసుక్రపత్ని, ఇంద్రాణీ, అపాల, శ్రద్ద, వైవస్వతి,యమి, పౌలోమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, శచి, వాక్‌ లాంటి ప్రతి భావంతులు ఎందరెందరో ఉన్నారు.


బృహదారణ్యక ఉపనిషత్తులో శాశ్వతస్థానం సంపాదించుకున్న బ్రహ్మ వాదినుల లో ఒకరైన గార్గి వ్యాకరణ శాస్త్రంలో దిట్టనేగాక  ఆత్మైస్థెర్యంతో, మనోబలంతో తన అస్త్రబలం లాంటి వాదబలంతో యజ్ఞవల్క్యునిచే సృష్టి రహస్యాలు తెలుసుకున్న విదుషీమణిగా, స్థిరచిత్తగా చరిత్రలో మహోన్నత వ్యక్తిగా నిలిచిపోయింది.

వేదాలను స్త్రీ దరి చేరరాదన్నారు. కాని వేదాలలో కొన్ని ఋక్కులనే రచించిన స్త్రీలున్నారు. వీరు ఋషులతో సమానంగా ఋషికలనబడేవారు. రామాయణ భారత కాలంలో స్త్రీలు బ్రహ్మ విద్యలో, అస్త్ర విద్యలో ఆరితేరారు. రామాయణ కాలంలో స్త్రీలు యుద్ధ విద్యా నిపుణులనడానికి ఉదాహరణ కైకేయి. ద్వాపరయుగంలో సత్యభామ, ప్రమీల ఈ కోవకు చెందినవారే. నాటి నారీమణుల మనో నిగ్రహం, కర్తవ్య పరాయణత్వం, వారిలోఅంతర్లీనంగా ఉన్న ప్రతిభా పరిమళాలు వెలలేనివి. అన్నికాలాల మహిళలకు స్ఫూర్తిదాయకమై మార్గదర్శకమైనవి. 


పర్వత రాజపుత్రి పార్వతి  పరమశివుని పతిగా పొందగోరి అతిక్లిష్టమైన పరిస్థితులనెదుర్కొని అసాధ్యమైన మహత్కార్యం తలపెట్టి అమిత ఓర్పుతో, కఠోర దీక్ష తో, అనంత పట్టుదలతో  చేసిన తపస్సు, సాధించిన విజయం మనకు తెలిసిందే.

వసుచరిత్రలో గిరిక పాత్రలోని విలక్షణత్వాన్ని  వేనోళ్ళ కీర్తించవచ్చు.కాళిదాసు విరచిత ‘శాకుంతల’లోని వన దేవత వంటి శకుంతల భర్త తిరస్కృతులు తట్టుకొని పుత్రుని సకలశాస్త్ర కోవిదుడ్ని చేసింది. ఆత్మనిగ్రహంతో, విజ్ఞతతో ఆదర్శమైన జీవి తంతో మన హృదయాలను ఆకట్టుకొన్న స్త్రీ రత్నం. నరకాసురున్ని శూరత్వంతో వధించిన సత్యభామ, ప్రవరాఖ్యుని పట్ల తన ప్రేమతో ఆచంద్రతారార్కం విరాజి ల్లే స్వచ్ఛమైన ప్రేమమూర్తియైన ‘మనుచరిత్ర’లోని వరూధిని, దమయంతి చరిత్ర జగద్విదితాలు. భారతంలో ద్రౌపది ప్రశ్నలకెవ్వరూ సమాధానం చెప్పలేకపోయా రు. అనాదిగా అన్నిదశలలో స్త్రీ పురుషునిపై ఆధారపడి వుండాలనేది స్మృతుల్లో, శాస్ర్తాల్లో వారికి నిర్ణయింపబడిన పరిధి. వ్యక్తిగతంగా స్త్రీకి  సంఘంలో గాని, రాజకీయరంగంలో గాని మధ్యయుగం దాకా స్థానమే లేదు. అయినా ప్రతి కాలంలో స్త్రీలు అన్నిరంగాలలో ఈ పరిధులను ఛేదించుకొని ముందుకు నడిచారు. ఏచట్టా లు, శాస్ర్తాలు వీరిని ఆపలేకపోయాయి. 


జగద్గురు శంకరాచార్యులతో చర్చించిన మండనమశ్రుడు ఓడిపోయినా, అతని భార్య ఉభయభారతీ దేవి ఆచార్యులను ఓడించినందున ఆ భారతి పేరును ప్రతి శంకర స్వాముల చివరన పెట్టుకునే వారట.

చంద్రగుప్త మౌర్యుని కాలంలో అంగరక్షకులుగా సాయుధులైన స్త్రీలు ఉండేవారని  మెగస్తనీస్‌ చెప్పాడు. ఈ విధమైన ఆచారం విజయనగర రాజుల వరకూ కొనసాగింది. శాతవాహనుల పరిపాలనా కాలంలో ఆ రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి ,వాసిష్టీ పుత్ర శాతకర్ణిగా తల్లిపేర్లతో ప్రసిద్ధికెక్కడం మనకు తెలియనిది కాదు. రాష్ట్ర కూ ట, చాళుక్య రాజులపాలనలో కూడా అనేకమంది స్త్రీలు ఆలయ నిర్మాణాలు, తటాకాలు తవ్వించడం, విద్యాలయాలు స్థాపించడం వంటి సత్కార్యాలు చేసి పేరెన్నికగన్నారు. 

కాకతీయుల కాలంలో స్త్రీలు చాలాముందంజలో ఉన్నారు. కాకతీయ రాజ్యాన్ని నిలిపిన కామసాని,రాణి రుద్రమదేవి గురించి తెలియనివారుండరు. రాణిరుద్రమ వంటి  ప్రజలచే అభిమానింపబడిన రాణిని చూడలేదని మార్కోపోలో రాసుకున్నా డు. స్వయంగా కత్తి పట్టి ముందుకురికి పోరు చేసిన వీరాంగన ఆమె. చివరకు యుద్ధభూమిలోనే ఒరిగిపోయిన వీరవనిత.


సాహిత్య కవితా క్షేత్రాల్లో కూడా విశిష్టమైన ఖ్యాతిగాంచిన స్త్రీలు ఎందరో ఉన్నారు. ఆతుకూరి మొల్ల తన పేరుపైనే ‘మొల్ల రామాయణా’న్ని రచించింది. ఖడ్గతిక్కన భార్య చానమ్మ యుద్ధభీతుడై వెనుదిరిగిన తనభర్తలో నిద్రాణమైఉన్న పౌరుషాన్నిరెచ్చగొట్టి వీర మరణం పొందేలా చేసింది.

కంపిలి రాయల పట్టమహిషి గంగాదేవి సంస్కృతంలో తన భర్త విజయ యాత్రలను వర్ణిస్తూ ‘మధురావిజయం’ అనే గ్రంథాన్ని రచించింది. తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య తిరుమలాంబ ‘సుభద్రా కల్యాణ’మను గ్రంథాన్ని రచించింది. కృష్ణదేవరాయలు కుమార్తె ‘మరీచి పరిణయం’అను గ్రంథ కర్త. నాయక రాజుల ఆస్థానంలో అష్టభాషా విశారదులైన రంగాజమ్మ, ముద్దుపళని వంటి స్త్రీలు ఉండేవారు. 


అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో వనితల విశిష్టతను చాటి చెప్పడానికి చేసిన ప్రయత్నానికి ముందే శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు 200 మంది కవయిత్రుల రచనలను ఎన్నోప్రయాసలకోర్చి సేకరించి, రచించి, ప్రచురించడం మహిళా లోకానికి ఆదర్శం.

‘ఏ జాతి సగం బానిసగా, సగం స్వతంత్రంగా మన లేదు’ అన్న  అబ్రహం లింకన్‌ సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని, మహాత్ముడు స్త్రీలు పాల్గొననిదే భారతదేశానికి స్వాతం త్య్రం రాదని, వచ్చినా అది అసమగ్రంగానే ఉండిపోతుందని పిలుపునిచ్చారు. ఆ ఉత్తేజంతోనే వేలకొద్ది స్త్రీలు స్వాంతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. పురుషులతో పాటు జైలుకు వెళ్ళారు. ‘మను’ భాషితమైన ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతే’ అన్న ఈ దేశానికి ఒక మహిళ ప్రధాని అయింది.


స్వాతంత్య్రానంతరం మహిళా వికాసం కోసం అనేక ప్రణాళికలు రూపొందించబడ్డాయి. చట్టపరంగా కూడా మహిళలకు అనేకహక్కులు కలిగాయి. ఇందువల్ల వినూత్న ఉత్సాహంతో, కార్యదీక్షతో ఎంతోమంది మహిళలు దేశానికి వివిధ రంగాలలో సేవలు చేస్తున్నారు. న్యాయవాద వృత్తిలో మహిళలు 1882 నుంచి  ప్రముఖ స్థానం ఆక్రమించారు. సుప్రీంకోర్టు న్యాయవాదులుగా, సెషన్‌ జడ్జీలుగా అనేక పదవుల్లో కూడా మహిళలను చూస్తున్నాం. కేరళలోని  ‘అన్నాచండీ’   హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన మొదటి మహిళ. ‘తంగం ఫిలిప్పు’ న్యూట్రీషియన్‌  సంస్థకు  ప్రిన్సిపాల్‌. అంతర్జాతీయరంగంలో మెడల్‌ పొందిన బహు కొద్దిమంది మహిళల లో ఆమె ఒకరు. ముద్రణారంగంలో కూడావేళ్ళూనుకున్న స్త్రీలు ఉన్నారు. కలకత్తాలోని ‘సిగ్నెట్‌' ముద్రణాలయాన్ని నిర్వహించే నీలిమాదేవి ఢిల్లీలోని వికాస ప్రచురణాలయానికి  అధిపతి. అనేక మంది స్త్రీలు  పత్రికా రంగంలో, సమాచార, టూరిజంలో’, వాణిజ్యరంగంలో, చేతి పనులలో రాణించి ప్రఖ్యాతిగాంచారు. వ్యవసాయరంగంలో, కోళ్ల పరిశ్రమలో ప్రఖ్యాతిగాంచిన శ్రీమతి నెహ్రూ సుప్రసిద్ధురాలు. ఆమె వేలకొద్ది కోడి పిల్లలను పొరుగు దేశాలకు విమానాల మీద పంపుతున్నది.


సైనిక శాఖలో,  విద్యా వైద్యశాఖల్లో కూడా అనేక ప్రఖ్యాతి గాంచిన స్త్రీలు ఉన్నారు. కల్నల్‌, మెటల్గాభట్‌ నేవీలోను, బ్రిగేడియర్‌ మిస్‌.జి.ఎ.రావ్‌ు ఆర్మీలోను చీఫ్‌ మేట్రన్‌గా వున్నారు. మేజర్‌ ఫరీదా రెహనా ఆకాశంలోకి చొచ్చుకు పోయి పేరా ట్రూపులను 1975 నవంబరులో ఆగ్రాపై ప్రదర్శించడంలో పాల్గొన్న ఏకైక మహిళా మణి. డి బెనర్జీ భారత వైమానిక సర్వీసు వ్యాపారరంగంలో పైలట్‌గా ఉన్నారు.

శాస్త్రీయ రంగంలో ప్రఖ్యాతివహించిన మహిళ డాక్టర్‌ అషియాచటర్జీ. డాక్టర్‌ ఎన్‌. పద్మావతి భారతీయమెడికల్‌ సైన్స్‌కు అధ్యక్షురాలై విశేష గౌరవ మర్యాదలను అందుకున్నది. అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో బయో మెడిసిన్‌లో అవార్డు పొందిన 12 మంది  శాస్త్రజ్ఞులలో ఐదుగురు  మహిళలు ఉండటం విశేషం.


హైదరాబాద్‌ న్యూట్రిషన్‌ సంస్థలో డాక్టర్‌ కమలా ఎస్‌ జయరావు సరైన పౌష్టికాహారం లభించని పేద పిల్లల కోసం వారి హార్మోన్లు సరైన స్థితిలో ఉంచటానికి ఒక నూతన  పదార్థాన్ని కనుగొన్నది. బీహార్‌లో మధురవాణి పెయింటింగులను పునరుద్ధరించి ప్రఖ్యాతి గాంచింది ఒక గ్రామీణ మహిళ. చిత్రలేఖనంలో దేశమంతటా ప్రదర్శనలు ఏర్పాటుచేయటంలో ప్రసిద్ధి గాంచిన అనేకమంది మహిళలు ఉన్నారు.


శాస్త్రీయ, నృత్య, సంగీతాల్లో  స్త్రీలు పురుషులను మించిపోయారు. 1940- 50లో  శాంతారావు నాట్యంలో అగ్రగణ్యురాలుగా పేరొందింది. మరొక సుప్రసిద్ధ నర్తకి మృణాళినీ సారాబాయి ‘దర్పణ’ అనే నృత్య కేంద్రాన్ని స్థాపించింది. ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి సంగీత కచేరీ చేసే శాస్త్రీయ సంగీత దిట్ట. ఐక్యరాజ్యసమితిలో కూడా తన సంగీతంతో శ్రోతలను ముగ్దులను చేశారు. లతామంగేష్కర్‌, పి.సుశీల, ఎస్‌.జానకి గాన కోకిలలుగా ప్రసిద్ధికెక్కారు. 

 సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం, దేవదాసీ పడుపు వృత్తి మొదలైన  దుర్మార్గపు సంప్రదాయాలన్నింటిని మట్టుబెట్టి ముందడుగులు వేస్తున్న తరుణంలో లైంగికదాడుల అమానుషపు చర్యలను ఖండించాలి, ఎదిరించాలి. ‘చరిత్రను  ఆధునిక స్త్రీ పునర్లిఖిస్తుంద’న్న గురజాడ స్వప్నాన్ని నిజం చేయడానికి స్త్రీ సమస్యలకు స్త్రీయే నాయకత్వం వహించి పోరాటం చేయాలి. స్త్రీలు వేసే అడుగులు భవిష్యత్తు లో చైతన్యవంతమైన అడుగుజాడలుగా మారాలి. 

(నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)