గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Mar 07, 2020 , 23:59:10

జాగ్రత్తపడితే దరి చేరదు

జాగ్రత్తపడితే దరి చేరదు

25-27 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో కరోనా వైరస్‌ పూర్తిగా చచ్చిపోతుంది. గాలిలో నీటి తుంపరలను ఆధారం చేసుకుని మాత్రమే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించగలదు. ఏ వస్తువు మీద గాని,ఇతర ఉపరితలంపైన గాని 10 నిమిషాలకు మించి కరోనా వైరస్‌ బతుకదు.

ఎటు చూసినా సంచలనం సృష్టిస్తున్న  కరోనా వైరస్‌ గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం.

కంటికి కనబడని సూక్ష్మజీవులలో ఆరోగ్యానికి హానికరమైన  బాక్టీరియా, ఫంగస్‌లతో పాటు వైరస్‌లు  కూడా ఒక రకం. ఇవి కణం కన్న చిన్నవి, అసంపూర్ణంగా ఉండే సజీవ క్రిములు. ఇందులో కరోనా ఒకటి. ఇది, 2 బీటా కరోనా వైరస్‌ అనే జాతికి చెందినది.


   ఈ తరహా సామూహిక అనారోగ్య సమస్యలను పరిశీలిస్తే, మొట్టమొదటిసారిగా 2003లో మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోవ్‌ు (ఎంఈఆర్‌ఎస్‌) అంటూ కరోనా వైరస్‌ మనిషిలో ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యం కలుగ చేస్తున్నదని తెలిసింది. అప్పట్లో  4652 మందిలో ఈ వైరస్‌ కనుక్కొన్నారు. 850 మంది దాకా మరణించారు కూడా. త్వరలోనే అది నియంత్రణలోకి వచ్చింది. తరువాత ఇది 2012లో సౌదీ అరేబియాలోనూ కనబడింది. 2019 డిసెంబరు 31న చైనాలోని  వూహాన్‌ నగరంలో, హుబై  జిల్లా లో  కరోనాకు సంబంధించిన తొలి కేసు నమోదు అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెబుతున్నది. సరిగ్గా నెల తిరగకుండానే ఈ వైరస్‌ బారిన పడి ఎందరికో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాక వారిని హాస్పిటల్లో చేర్చారు. అతి స్వల్ప సమయంలో అది న్యుమోనియాగా విజృంభించి, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో ఎక్కువసంఖ్యలో చనిపోయారు. 

అందుకే 2020 జనవరి 30న డబ్ల్యూహెచ్‌వో కోవిడ్‌ -2019  అనే పేరు తో నమోదు చేసింది. ఫిబ్రవరి 11న  వైరస్‌ డిసీజెస్‌ వర్గీకరణ చేసే ప్రపంచ కమిటీ సార్స్‌- సీవోవీ-2 పేరుతో ఈ కరోనా వైరస్‌ను నమోదు చేసింది. 


ఈ జబ్బు విస్తృతంగా ప్రబలడంతో  ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ అంటే హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. మార్చి 6వ తేదీ నాటి సమాచారం ప్రకారం సుమారుగా లక్ష మందికి కరోనా వైరస్‌ సోకింది. 3,400 మంచి మరణించినట్టుగా లెక్కలు తెలుపుతున్నారు. 

సోషల్‌ మీడియా చాలా ఎక్కువగా ప్రబలిన ఈ శతాబ్దంలో, కరోనా వైరస్‌ గురించి ఎన్నో వీడియోలు,ఫోటోలు సంచలన వార్తలు వెలువడుతున్నాయి.  వీటిలో ఔచిత్యం లేదు సరికదా ఆ దేశ,ప్రాంతాల ఆహారపు అలవాట్లను హేళ న చేస్తూ ఉన్నాయి. ప్రాణాన్ని రక్షించే తుమ్ము, దగ్గు వంటి కీలకమైన శారీరక ప్రక్రియలపై అసంబద్ధమైన జోకులు ప్రచారం చేస్తున్నారు. పైగా నివార ణ, వైద్యం గురించి చిట్కాలు ప్రతిరోజూ లెక్కలేనన్ని పంచుకోవడం, కరో నా పేరిట సేనిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌లు, మాస్క్‌లు ధరలు పెంచి అమ్మడం  జరుగుతున్నది.  


వైరస్‌లు మానవునిలో కలుగజేసే అనారోగ్యాలు రెండువిధాలుగా ఉంటా యి. శ్వాసకోశ సంబంధమైనవి, ఉదరకోశ, చర్మ వ్యాధులు. ఈ శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలలో జలుబు, తుమ్ములు, ముక్కు వెంట నీరు కార డం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం దగ్గు , ఆయాసం అనే లక్షణాలు ప్రారంభదశలో ఉంటాయి. వైరస్‌ అనేది మనిషిలో ఎంత త్వరగా వ్యాపిస్తుంది అనేది ఆ సూక్ష్మజీవి చొచ్చుకుపోయే తత్వం పైన, ఆ వ్యక్తి రోగ నిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ వైరస్‌ కణాలు చిన్న తుంపరల నీటి బిందువులతో కలసి ప్రయాణం చేస్తాయి. మనుషులు గుంపు గా, సమూహంగా ఉన్నచోట్ల మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఒక మనిషి నుంచి మరొక వ్యక్తికి ప్రయాణిస్తాయి. విద్యాసంస్థలు, మాల్స్‌, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, ఆఫీసులు, కార్యాలయాలు ఇలాంటి చోట ఆ వైరస్‌ ఉన్న తుంపరలు అధికంగా ఉంటాయి.


వైరస్‌ మానవ శరీరంలో ప్రవేశించాక, పై లక్షణాలు బయటపడడానికి పట్టే సమయాన్ని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు. ఇది కరోనా వైరస్‌లో4 నుంచి 7 రోజులు. వ్యాధి లక్షణాలు కనిపించిన తరువాత, వైరస్‌ వ్యాధి సంక్రమించిన రోగి తన నుంచి మరొక వ్యక్తికి వైరస్‌ను సంక్రమింప చేయగలగడానికి సమయం 12 నుంచి 14 రోజులు. ఈ వైద్య పరిభాషను మామూలు మాట ల్లో చెప్పుకోవాలంటే వైరస్‌ సోకిన తరువాత ఆ మనిషి వ్యాధి నిరోధక శక్తి ఉంటే రెండు వారాలలో దానిని అదుపు చేయగలుగుతాడు. ఆపై ఆ వ్యక్తి మరొకరికి చేరవేయవచ్చు. ఆ వ్యక్తికి శక్తి చాలకపోతే ఈ 14 రోజులలోనూ ఆ వైరస్‌ విజృంభించి అతడిలోని తెల్ల రక్త కణాలను ఓడించి, ఆయాసం, వైరల్‌ న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యాన్ని కలుగజేసి వెంటిలేటర్‌ సహాయంతో తప్ప ఆక్సిజన్‌ను అదుపు చేసుకోలేని బలహీనస్థితిలోకి తీసుకొని పోతుంది. అందుకే ఈ సమయంలోనే సెప్టిక్‌ షాక్‌, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ తో ఆ రోగి చనిపోతాడు. 


కరోనా వైరస్‌కు సంబంధించినంత మటుకు ప్రస్తుతం యాంటీ వైరల్‌ మందులు, అది రాకుండా ఉండే వ్యాక్సి న్లూ తయారు కాలేదు. శాస్త్రీయంగా, ఇది వీలు కాదు. ఎందుకంటే  ప్రతిసారి ఒక వైరస్‌ మనిషిలోనికి ప్రవేశించినప్పుడు ఒక కొత్త జన్యు పొందిక తోటి వస్తుంది. అందుకే దానిని మైక్రోబయాలజీ వారు చాలా పరిశీలిం చి, ఆ కణం తాలూకూ అమరికను బట్టి దానికి ఒక పేరు పెట్టడం, సంబంధిత జబ్బును నియంత్రించడానికి మందులు కనిపెట్టడం, నిరోధించడానికి కొత్త వ్యాక్సిన్‌ను కనిపెట్టడం జరిగేవరకు చాలా సమయం పడుతుంది. హెచ్‌1ఎన్‌1- వైరస్‌ గురించి మనందరికి గుర్తుంది కదా. అలాగే ఇది. 


పేరు ఎలా పెట్టారు?

ఈ వైరస్‌ను, అది తొలిసారి మనిషిలోకి ప్రవేశించాక, ఆ ఊరు పేరుతో వూహాన్‌ వైరస్‌ అని పిలిచారు. శాస్త్రజ్ఞులు దాన్ని పరిశీలించి ఇది ‘కరోనా’ అనే తెగకు చెందినదని చెప్పారు. అంటే  ‘సూర్యమండలం వలే ఉన్నది’ అని. ఈ వైరస్‌ వృత్తాకారంలో వుండి, దాని పైన కొన్ని ప్రొటోమియర్స్‌, సూర్యకిరణాల వలె బయటకు పొటమరించి ఉంటాయి. అందుకే దీనికి కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు.


కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు:

జలుబు, తుమ్ములు, ముక్కు నుంచి నీరు కారడం,  కళ్ళు ఎర్రగా అవ్వడం, గొంతు నొప్పి, పొడిదగ్గు, కఫం, జ్వరం, పనులు చేసుకోలేనంత బలహీన త,  ఆకలి లేకపోవడం మొదలైనవి. 


కరోనా వైరస్‌ లక్షణాలు ఏమిటి?

 25-27 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో కరోనా వైరస్‌ పూర్తిగా చచ్చిపోతుంది. గాలిలో నీటి తుంపరలను  ఆధారం చేసుకుని మాత్రమే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించగలదు. ఏ వస్తువు మీద గాని, ఇతర ఉపరితలంపైన గాని 10 నిమిషాలకు మించి కరోనా వైరస్‌ బతుకదు.


ఎటువంటి వారికి ఈ వ్యాధి వస్తుంది?

అన్నివయసుల వారికి, ఆడవారికి మగవారికి కూడా ఇది రావచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అంటే, గర్భిణీలు, నెలలు నిండకుండా పుట్టి న పసి పిల్లలు, 70 సంవత్సరాలు దాటిన వారు, మంచానికి పరిమితమై న వారు, తరచుగా జలుబు దగ్గు వచ్చేవారు, క్యాన్సర్‌కు కీమోథెరపీ తీసుకుం టున్నవారు, హెచ్‌ఐవి ఉన్నవారు, డయాబెటిస్‌ ఉన్నవారు, కిడ్నీల ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ వంటివి జరిగిన వారు మొదలైనవారిలో ఎక్కువ రావచ్చు. మామూలు మనుషులు కూడా ఈ వైరస్‌ బారినపడవచ్చు.


కరోనా గురించిన అపోహలు:

1)ఒక దుమారం లాగా అందరికీ ఒకేసారి వస్తుంది. 2) వందలకొద్ది మనుషులు వెంటనే  ఈగల్లా, పిట్టల్లా గుంపుల కొద్ది చనిపోతారు. 3)చైనా నుంచి వచ్చే ప్యాకేజీలలో ఉండే, బబుల్‌ ప్యాకేజ్‌ పగలగొడితే వచ్చే గాలిలో వైరస్‌ ఉంటుంది. ఇవన్నీ వంద శాతం అసత్యాలే. ఎందుకంటే వైరస్‌ 48 గంటలలోనే ఎక్కడ ఉన్నా వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోతుంది. తేమ, చల్లదనం ఉంటేనే, నాలుగు డిగ్రీలు అంటే మన రిఫ్రిజరేటర్‌ ఉష్ణోగ్రతలో మాత్రమే బతుకగలదు. 


తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి?

జలుబు,దగ్గు ఉన్నవారు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముక్కుకు, నోటికి  అడ్డు పెట్టుకోవాలి. అలాంటి లక్షణాలు ఉంటే, ఇంటిలోనే 48  గంటల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.అప్పుడు రోగి ఇతరులకు సంక్రమింపచేసే ప్రమాదం తగ్గుతుంది. గోరువెచ్చని మంచినీళ్లు తరచుగా తాగాలి. గొంతు పూర్తిగా ఎండి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి అయితే గానీ ప్రయాణాలు చేయవద్దు. చేతులు శుభ్రంగా  కడుక్కోవాలి. నీళ్లు దొరకనప్పు డు ఆల్కహాల్‌ బేస్‌ ఉన్న హ్యాండ్‌ వాష్‌, సేనిటైజర్‌తో రెండు నిమిషాల పాటు చేతులను ఒకదానిపై ఒకటి వేసి శుభ్రం చేసుకోవాలి .


వైద్యంలో అసలు మందులున్నాయా? 

అత్యవసరంగా అమెరికా ఆహార, ఔషధ నిర్వహణ శాఖ ద్వారా కొంత పరిశోధన మొదలైంది. క్లోరోక్విన్‌ అనే మూల ఔషధం పనికి వస్తుంది అంటున్నారు. త్వరలోనే వాక్సిన్‌ వస్తుంది. 


ఏం చేయకూడదు?

ఈ వైరస్‌ను గురించి అశాస్త్రీయమైన వదంతులు, వాట్సాప్‌ సందేశాలు నమ్మకూడదు. వాటిని ఇంకొకరికి చెప్పకూడదు. ఇది రెండు దేశాల మధ్య జరిగే పరోక్ష యుధ్ధం అంటూ వచ్చిన వార్తలన్నీ వదంతులే. 


logo