బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 06, 2020 , 23:15:07

కుబేరుల భారతం

కుబేరుల భారతం

కొద్దిమంది దగ్గర పోగుపడుతున్న సంపద ప్రజలందరికి ఆసరాగా, వారి అభివృద్ధికి తోడ్పడాలి. తద్వారా మాత్రమే సామాజిక సమూహాల్లో శాంతియుత సహజీనం సాధ్యమవుతుంది. మధ్య ఆదాయవర్గాలు, గ్రామీణ కులవృత్తుల అభ్యున్నతికి పెద్దపీట వేయాలి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో సానుకూలమైనవి. ముఖ్యంగా వ్యవసాయరంగ అభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి వ్యవసాయరంగాన్ని పరిపుష్టి చేసేందుకు చేస్తున్న కృషి గమనించదగినది.

దేశ ఆర్థికవ్యవస్థ నేలబారుగా చూస్తుండగా, మరోవైపు కుబేరుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని సర్వేలు చెబుతున్నాయి. మొన్నటి ఆక్స్‌ఫామ్‌ మొదలు నేటి నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనం దాకా వ్యక్తుల సంపద వృద్ధిపై చూపుతున్న గణాంకాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆల్ట్రా హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (అపర కుబేరుల) సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నది. దేశంలోనూ వ్యక్తిగత సంపద ఎక్కువ కలిగినవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. నైట్‌ఫ్రాంక్‌ ప్రకారం ప్రస్తుతం దేశంలో 5,986 మంది కుబేరులున్నారు. ఈ శ్రీమంతుల సంఖ్య 2024 నాటికి 10,354కు చేరుకుంటుందని ఈ సంస్థ తెలిపింది. అంటే ధనికులు 73 శాతం వృద్ధి చెందుతున్నారు. 220 కోట్లకు పైగా నికర సంపద కలిగి ఉన్నవారినే ఈ కుబేరుల జాబితాలో చేరుస్తున్నారు.  


ధనవంతుల వృద్ధినే గాకుండా ప్రపంచంలో సంపద కలిగిన ప్రాంతాల గురించి కూడా నైట్‌ఫ్రాంక్‌ వివరించింది. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన నగరాల్లో ముంబాయి 44వ స్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి. రాబోయేకాలంలో ప్రపంచంలోనే  అతిపెద్ద సంపద కలిగిన రెండవ కేంద్రంగా ఆసియా నిలుస్తుందని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. ఆసక్తికరమైన విషయమేమంటే, ఆసియాలో 73 శాతం వృద్ధిరేటుతో భారత్‌ మొదటిస్థానంలో నిలువటం. ఇన్నాళ్లుగా ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకుంటున్న చైనా, వియెత్నాం లాంటి దేశాలు కూడా భారత్‌కన్నా వెనుకబడిపోయాయి. ఇదిలా ఉంటే ఆర్థిక నిపుణులు దేశ ఆర్థికస్థితి మందగమనంలో ఉన్నదని చెప్పటం గమనార్హం.


నైట్‌ఫ్రాంక్‌ చెప్పిన దాన్నే గత నెలలో ఆక్స్‌ఫామ్‌ వివరించింది. 2017 తర్వాత ప్రభుత్వా లు అనుసరించిన ఆర్థికవిధానాల నేపథ్యంలో ప్రతి రెండురోజులకు ఒక కొత్త బిలియనీర్‌ పుట్టుకొచ్చాడు. ఒక శాతం ధనికుల చేతుల్లోకి 73 శాతం సొత్తు వెళ్లింది. కానీ 67 కోట్ల మంది పేదల సంపద మాత్రం ఒక శాతమే పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య పెరుగుతు న్న తీరును చెబుతూనే, ఆక్స్‌ఫామ్‌ సంస్థ ఆర్థిక తారతమ్యాలపై ఆందోళన వ్యక్తం చేసింది. సంప ద సృష్టికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో, అదే స్థాయిలో దాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తేవటం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. రోజురోజుకూ తరిగిపోతున్న కార్మికుల నిజ వేతనాలు, మహిళల వేతనాల విషయంలో వివక్షలను రూపుమాపాలని ఆ సం స్థ హితబోధ చేసింది. 


ఆర్థికాభివృద్ధి కోసమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలు చేస్తున్నది. సులభ వ్యాపారం కోసం చట్టసవరణలు చేస్తున్న ది. పెట్టుబడులకు దేశాన్ని స్వర్గధామంగా చేసి, తద్వారా ఉద్యోగ కల్పనకు, స్థూల జాతీయోత్పత్తిని పెంచేందుకు కృషిచేస్తానంటున్నది. కానీ దేశంలో సగటుమనిషి జీవన ప్రమాణాలు పెంచేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతున్న తీరు కనిపిస్తున్నది. ముఖ్యంగా దేశ ఆర్థికవ్యవస్థకు జీవనాడిగా ఉన్న వ్యవసాయరంగాన్ని సంరక్షించుకోవటంలో ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని రూపుమాపి గ్రామీణ ఆర్థికవ్యవస్థకు జవసత్వాలు నింపాలి. పైస్థాయిలో జరిగే అభివృద్ధి సహజంగా కిందివర్గాలకు మేలు చేకూర్చుతుందన్న అవరోహణ (ట్రికిల్‌ డౌన్‌) సిద్ధాంతం వాస్తవరూపం దాల్చటం లేదన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలోనే దేశ ఆర్థికాభివృద్ధి రేటు ఆశాజనకంగా ఉండటం లేదు. మరోవైపు  విశాల గ్రామీణ భారతంలో మౌలికవసతుల లేమి, పేదరికం, నిరక్షరాస్యత నేటికీ వెక్కిరిస్తున్నాయి.


ప్రతి పౌరుడికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల్లో సమానత్వం సాధించాలన్న అంతస్సూత్రంపై భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. రాజ్యాంగం స్ఫూర్తిగా అందరికీ సమన్యాయం దక్కే లా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. పౌర సమాజంలో భిన్న శ్రేణుల ఆదాయస్థాయిలో, సంపద సృష్టిలో తీవ్ర తారతమ్యాల దుష్పరిణామాలను ప్రథమ ప్రధాని నెహ్రూ ఆనాడే మదింపు చేశారు. సామాజిక న్యాయం సాధిస్తూ, అసమానతలను తొలిగించటానికి ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలతో దిశానిర్దేశం చేశారు. కానీ కాలక్రమంలో ప్రాధాన్యతా క్రమాలు తారుమారై సమాజంలో అనేక అపసవ్వాలు చోటుచేసుకున్నాయి. కొద్దిమంది దగ్గర పోగుపడుతున్న సంపద ప్రజలందరికి ఆసరాగా, వారి అభివృద్ధికి తోడ్పడాలి. తద్వారా మాత్రమే సామాజిక సమూహాల్లో శాంతియుత సహజీనం సాధ్యమవుతుంది. 


మధ్య ఆదాయవర్గాలు, గ్రామీణ కులవృత్తుల అభ్యున్నతికి  పెద్దపీట వేయాలి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో సానుకూలమైనవి. ముఖ్యంగా వ్యవసాయరంగ అభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి వ్యవసాయరంగాన్ని పరిపుష్టి చేసేందుకు చేస్తున్న కృషి గమనించదగినది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించటంతో పాటు, పెట్టుబడి సాయానికి చేపట్టిన రైతుబంధు పథకం లాంటివి రైతులను రుణ విముక్తులను చేసి స్వయంపోషకులుగా మార్చాయి. అలాగే గ్రామీణ కులవృత్తుల సంక్షేమానికి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సమతుల సమగ్రాభివృద్ధి మాత్రమే సామాజిక జీవన ఉన్నతికి దారితీస్తుంది.


logo