గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 06, 2020 , 23:09:55

అయ్యో భారతీ!

అయ్యో భారతీ!

తన పర్యటన రెండు రోజులు ఢిల్లీలో చెలరేగిన మతోన్మాద హింసాకాండ, విధ్వంసం వెనుక దాగి ఉన్న హస్తం ఎవరిదో అధ్యక్షుడు ట్రంప్‌కు, ఆయన ప్రభుత్వానికి తెలియదా? సీఏఏ అసలు ఉద్దేశం ఏమిటో, ఆ చట్టం పుట్టలో పుట్టి రానున్న ఎన్పీఆర్‌?, ఎన్నార్సీ ఏ కుట్ర ఫలితాలో ట్రంప్‌నకు, ట్రంప్‌ ప్రభుత్వానికి, అమెరికన్లకు, అక్కడి ప్రజాస్వామ్యశక్తులకు తెలియదనుకుంటే ఆత్మవంచనే.

పలు పర్యాయాలు అమెరికా వెళ్లివచ్చిన ఒక మిత్రుడు తీరిక దొరి కినప్పుడు అక్కడి చాలా విషయాలు చెప్పేవాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా, రష్యా తీవ్రంగా పోటీ పడుతున్న రోజులవి. ఇప్పటి చైనీస్‌ కరోనా వైరస్‌ వలె (కరోనా వైరస్‌ అతి స్వల్పకాలంలోనే వికృతరూపం ధరించి, నెల రోజులైనా కాకముందే మాతృభూమి చైనా ఎల్లలుదాటి దాదాపు ఎనభై దేశాలకు తన విషపు కోరలను విస్తరింపచేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భోగట్టా. భయంకరంగా విజృంభించి ప్రపంచ ప్రజలకు భయాందోళనలు కలిగిస్తున్న కరోనా-పిశాచి-పేరు వినగానే ప్రాచీన గ్రీకు అతివల పేర్లు జ్ఞాపకం వస్తున్నాయి). అడవి బాపిరాజు ‘హిమబిందు’ నవలలోని విషకన్య ఒకరు దురుద్దేశంతో కృత్రిమంగా సృష్టించిన మృత్యుహేల. 


ఈ విషకన్య వంటిదే నేటి కరోనా. అప్పుడు అమెరికా-రష్యా ప్రచ్ఛన్నయుద్ధం, శీతలయుద్ధం వార్తలు, విశేషాలు, వ్యాఖ్యాన కథనాలు ప్రపంచ ప్రజలకు, వివిధ దేశాల వారికి ఆం దోళన కలిగిస్తుండేవి. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణాన యుద్ధం రగుల్కొంటుం దో, అది చిలికిచిలికి గాలివాన అయినట్లు, అణు యుద్ధానికి దారితీస్తుం దో ఏమో తెలియకపోయేది. ఒకవంక నిరాయుధీకరణ చర్చలు, సమావేశాలు జరుపుతూ మరోవంక ఎవరికి వీలైనచోట వారు భయంకర అణ్వస్త్ర పరీక్షలు జరిపేవారు. వాటితో కనీవినీ ఎరుగని వాతావరణ, పర్యావరణ కాలుష్యం ఏర్పడి కరోనా అమ్మ వంటి విష రోగాలు వ్యాపించేవి. ఈ ప్రపంచ మానవాళి కుటుంబంలో ఏదీ ఎవరి ‘అంతర్గత సమ స్య’ కాదు; ‘మా అంతర్గత సమస్యలో మీరు జోక్యం చేసుకొని మా సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి వీల్లేదు’ అని విర్రవీగలే రు, వెర్రి సమాధానాలు చెప్పలేరు.


తలాక్‌ నిరోధ చట్టాన్ని తెచ్చిన మోదీజీ ప్రభుత్వం 2011లో లోక్‌సభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని తీసుకురావడంలో శ్రద్ధ చూపకపోవడం విచిత్రం-ఇప్పుడు రాజ్యసభలో తమకు మెజారిటీ ఉన్నపటికీ! ఇటువంటి చట్టం ఏదీ లేకుండానే మహా నాయకుడు కేసీఆర్‌ ఈ రాష్ట్రంలోని అన్ని ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం నిజంగా ఘనకార్యం. 


గత ఫిబ్రవరి నెల నుంచి (ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకా రం) ఇప్పటికే మూడు, నాలుగు వేల మందిని పొట్టన పెట్టుకొని అనేక దేశాల్లో మరికొన్ని వేల మందికి సోకిన, ఇంకా సోకే ప్రమాదం ఉన్న కరోనా వైరస్‌ చైనా ‘అంతర్గత సమస్య’ కానట్లే కశ్మీర్‌లో 370వ ఆర్టికల్‌ రద్దు లేక నిర్వీర్యీకరణ, దాని పర్యవసానాలు, ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), తత్ఫలితంగా పుట్టబోనున్న ఎన్పీఆర్‌, ఎన్నార్సీ, మతద్వేషం, అమెరికాలో భారతీయులకు, ఇతర జాతీయులకు ట్రంప్‌ ప్రభుత్వం కలిగిస్తున్న ఇబ్బందులు ‘అంతర్గత సమస్యలు’ కావు. దక్షిణాఫ్రికాలో వందేండ్ల కిందట శ్వేతజాతి పాలనలో అక్కడి భారతీయుల, ఇతర జాతీయుల మానవహక్కుల హరణం అంతర్గత సమస్య అయితే అక్కడ గాంధీజీ సత్యాగ్రహ సమరానికి అంకురార్పణ జరిగేది కాదు; తర్వాత గాంధీజీ నాయకత్వంలో భారత స్వాతంత్య్ర ఉద్యమం విజయవంతమయ్యేది కాదు-ఈ దేశంలో గత 72 ఏండ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమయ్యేది కాదు-మోదీయులు ఆరేండ్ల కిందట అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కాదు. 


ఇవన్నీ ఇటీవలి చరిత్రలోని ఇంగ్లిష్‌ ‘ఇఫ్‌లు’, ‘బట్‌లు’. ఈ కాలమ్‌ మొదటి వాక్యంలో ప్రస్తావితుడైన మిత్రుడు అప్పటికే ప్రచురితమైన ‘వండర్‌లాండ్‌ యు.ఎస్‌.ఏ’ పుస్తకా న్ని (ఇది ప్రఖ్యాత పత్రికా రచయిత బినోద్‌యు రావు రచించిన గ్రం థం) చదివాడు- అమెరికా పలు పర్యాయాలు వెళ్లివచ్చాడు. ఇండియా లో లేక ఇంకే దేశంలో ఏ ఇంటి పడకగదిలో ఏం ముచ్చట్లు జరుగుతా యో, ఏ స్నానాల గదిలో ఏం సరసాలు జరుగుతాయో యూఎస్‌ఏ నాసాలో, గీసాలో శుభ్రంగా రికార్డవుతుందని ఆ మిత్రుడు అన్నప్పుడు నా ఆశ్చర్యానికి హద్దు లేదు. 


ఇక మనుషుల జీవితాల్లో ప్రైవసీ అన్నది ఏముంటుంది? డబ్భు ఏండ్ల కిందట అంతటి టెక్నాలజీ ఉన్న యూఎస్‌ ఏ తర్వాత సంవత్సరాలలో తన ఈ టెక్నాలజీ నైపుణ్యాన్ని అద్భుతంగా పెంచగలిగింది. పాక్‌-ఆఫ్ఘన్‌ సరిహద్దు ప్రాంతంలోని ఒక రహస్య స్థావరంలో అల్‌ఖాయిదా మతోన్మాద టెర్రరిస్టు సంస్థ అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను అమెరికన్‌ సైనికులు నిర్దాక్షిణ్యంగా వధిస్తున్న దృశ్యాన్ని వాషింగ్టన్‌ వైట్‌హౌజ్‌లో తన ఉన్నతాధికారులతో కలిసి కూర్చొని అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తనవితీరా వీక్షించగలిగారు-ఒక లైవ్‌ ప్రోగ్రామ్‌ చూసినట్లు. అన్నిటికంటే ముఖ్యం కరోనా వైరస్‌ వంటి మహమ్మారికి కళ్లెం వేయగలిగిన టెక్నాలజీ రావడం.


స్వతంత్ర భారతదేశం సంగతులు, నఖశిఖ పర్యంతం ఈ దేశం అస లు స్వరూపం అమెరికా అధ్యక్షుడికి, అక్కడి ప్రభుత్వ వ్యవస్థకు తెలిసి నంతగా, కనిపించినంతగా మనకు తెలియవు, కనిపించవు. అహ్మదాబా ద్‌ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు (రామా, అయోధ్య రామా! నిన్నే స్మరిస్తూ అసువులు విడిచిన బాపూజీ ఆశ్రమం పవిత్రకు భంగం కలిగిందే!) వికటాట్టహాసం చేస్తున్న దారిద్య్రం, పేదరికం కనిపించకుండా మోదీజీ కోట్ల రూపాయల వ్యయంతో కట్టించిన గోడ సంగతి గోడల స్పెషలిస్టు ట్రంప్‌కు తెలియదా? ఈ దేశం పేదరికాన్ని దాచిన మోదీజీ తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ఇక్కడి శ్రీమంతులతో ట్రంప్‌కు పరిచయం కావించడం విశేషం. 


తన పర్యటన రెండు రోజులు ఢిల్లీలో చెలరేగిన మతోన్మాద హింసాకాండ, విధ్వంసం వెనుక దాగి ఉన్న హస్తం ఎవరిదో అధ్యక్షుడు ట్రంప్‌కు, ఆయన ప్రభుత్వానికి తెలియదా? సీఏఏ అసలు ఉద్దేశం ఏమిటో, ఆ చట్టం పుట్టలో పుట్టి రానున్న ఎన్పీఆ ర్‌?, ఎన్నార్సీ ఏ కుట్ర ఫలితాలో ట్రంప్‌కు, ట్రంప్‌ ప్రభుత్వానికి, అమెరికన్లకు, అక్కడి ప్రజాస్వామ్యశక్తులకు తెలియదనుకుంటే ఆత్మవంచనే. తెలుసు కనుకనే అమెరికన్‌ కాంగ్రెస్‌లో (పార్లమెంటులో) పాలకపక్షం రిపబ్లికన్‌ పార్టీకి చెందినవారు, ప్రతిపక్షం డెమొక్రటిక్‌ పార్టీకి చెందినవా రు ఒకే గొంతుతో కశ్మీర్‌లో 370వ ఆర్టికల్‌ రద్దును, కశ్మీర్‌లోని ఆంక్షల ను, నిర్బంధాలను, పౌరసత్వ సవరణ చట్టాన్ని, ప్రతిఘటిస్తున్న ప్రజాతంత్రశక్తుల పట్ల ప్రదర్శిస్తున్న సర్కార్‌ దౌర్జన్యాన్ని, అరాచకశక్తుల విశృంఖల విహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. 


ఈ దేశంలో మానవహక్కులకు కలుగుతున్న విఘాతాన్ని చూసి, చేతులు ముడుచుకొని కూర్చోలేకనే ఐరాస ప్రధాన కార్యదర్శి, ఐరాస మానవహక్కుల కమిషన్‌, బెర్నీ సాండర్స్‌ వంటి అమెరికన్‌ సోషలిస్టు, డెమొక్రటిక్‌ నాయకులు గొంతు విప్పడం జరిగింది. రెండు మూడురోజుల కిందట పాలకపక్షం బీజేపీ     పార్లమెంటరీ సమావేశంలో ప్రసంగిస్తూ, మోదీజీ శ్రీరంగనీతులు ఎన్నో చెప్పారు-శాంతి, సామరస్యం, ఐక్యత ముఖ్యమని నొక్కిచెప్పారు. కానీ, తమ పార్టీయుల సమావేశాల్లో, ర్యాలీల్లో వినిపిస్తున్న ‘గోలీమారో’ నినాదాలను ఖండించలేదు. ‘అంతర్గత సమస్యలు’ అని భారత విదేశాంగ శాఖ ఎంత మొత్తుకున్నా గతంలో ఎన్నడూ లేని రీతిగా (గతంలోని గౌర వప్రతిష్టలకు భిన్నంగా) అంతర్జాతీయరంగంలో భారతదేశం ప్రతిష్ట దిగజారుతున్నది-ఖండన మండనలకు గురవుతున్నది.


‘అయ్యో భారతీ’ అని విచారించక తప్పడంలేదు. ‘భారతమాత’ అని అంటున్నవారే పరమత ద్వేషంతో, అసహనంతో భారతమాతకు అత్యంత ఆవేదన కలిగిస్తున్నారు. ఒక మహాకవి ‘ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని’ అని అన్నాడు. వీరే దేశం వెళ్లినా గత ఆరేండ్ల నుంచి తమ మాతృభూమిని అవమానించే మాటలు మాట్లాడుతున్నారు-All religions are true. God  can be reached by different religion -s.. all are one అని అన్నిమతాల ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించిన రామకృష్ణ పరమహంస (వివేకానంద స్వామి గురువు) బోధన ను వీరు విస్మరిస్తున్నారు. పరమహంస బోధనకు అనుగుణంగా, అన్ని మతాల ఐక్యతా నినాదం ఇస్తూ భారతమాత వేదనను తగ్గిస్తున్నారు షాహీన్‌బాగ్‌ (ఢిల్లీ) ఉద్యమ మహిళలు, మహిళాశక్తికి ప్రతీకగా దాదాపు మూడు మాసాల నుంచి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, గాం ధేయమార్గంలో షాహీన్‌బాగ్‌ మహిళల ఉద్యమం కొనసాగడం విశేషం. 120 ఏండ్ల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్నది. మహిళామణులు ఆయా దేశాల్లో ప్రభుత్వ అధినేతలవుతున్నారు.


ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దక్షిణాసియాలో ఏడుగురు మహిళలు ప్రధానమంత్రులైనారు. ఐరాసకు ఒక భారత మహిళ అధ్యక్షురాలైంది. అయినా, వివిధ దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో మహిళలపై హింసా దౌర్జన్యాలు హెచ్చుతున్నాయి కానీ తగ్గడం లేదు. అధ్యక్షస్థానం అధిరోహించిన ట్రంప్‌నకు మహిళల పట్ల గౌరవం లేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. తలాక్‌ నిరోధ చట్టాన్ని తెచ్చిన మోదీజీ ప్రభు త్వం 2011లో లోక్‌సభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని తీసుకురావడంలో శ్రద్ధ చూపకపోవడం విచిత్రం-ఇప్పుడు రాజ్యసభలో తమకు మెజారిటీ ఉన్నపటికీ! ఇటువంటి చట్టం ఏదీ లేకుండానే మహా నాయకుడు కేసీఆర్‌ ఈ రాష్ట్రంలోని అన్ని ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం నిజంగా ఘనకార్యం. నన్ను ‘గాంధేయ జర్నలిస్టు’ అని పలుకరించి, ప్రోత్సహించిన మా కులం పెద్ద (మాది గోకులం కాదు, గోలీమార్‌ కులం కాదు-మాది పాత్రికేయ కులం) పొత్తూరికి ఇదే అక్షర అశ్రునివాళి.


logo
>>>>>>