గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Mar 06, 2020 , 23:07:24

ప్రగతి సూచికల పరుగులు

ప్రగతి సూచికల పరుగులు

అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవి అణిగిపోయి ఉండటం వల్ల ఈ ప్రాంతాలు వెనుకబడిపోయినాయి. ఈ ప్రాంతాలు రాష్ర్టాలుగా ఏర్పడగానే వీటిల్లోని సహజంగా నిబిడీకృతమై ఉన్న సమస్త సృజనాత్మకశక్తులు వికాసం చెంది ప్రజలను కార్యోన్ముఖులను కావించాయి.

రాష్ట్ర ఆవిర్భావానికి ముందున్న పరిస్థితులతో పోల్చిచూసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనబడుతున్నది. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తక్షణమే సాగునీటి రంగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం వైఫల్యాలను సమీక్షించుకొని ప్రాజెక్టులను పూర్తిచేయడానికి వ్యూహాలను సిద్ధం చేసుకున్నది. మొత్తంగా రాష్ట్రంలో ఒక కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కృష్ణా, గోదావరీ నదీజలాల్లో తెలంగాణ వాటా సుమారు 1400 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగంలోకి తేవాలని సంకల్పించింది. 


ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం నాలుగంచెల వ్యూహాన్ని అనుసరించింది. 1.మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ. 2.పెండింగ్‌ ప్రాజెక్టులను పూరి ్తచేసుకోవడం. 3.గత ప్రభుత్వాలు ఆమోదించిన ప్రాజెక్టులను పూర్తిచేసుకోవడం. 4.పాత ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకీకరించడం. ఈ వ్యూహం ఈ ఐదేండ్ల కాలంలో స్పష్టమైన ఫలితాలు సాధించింది. ఆ ఫలితాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయి కూడా. వీటిని కొన్ని సూచికల కింద వర్గీకరించుకొని పరిశీలిస్తే మనకు సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని అంచనా వేయవచ్చు. ప్రాజెక్టులపై ఖర్చులు, ఆయకట్టు సాధనలో వృద్ధి, పంటల దిగుబడిలో వృద్ధి, చేపల ఉత్పత్తిలో వృద్ధి, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల తగ్గుదల అనే ఐదు సూచికలను ఈ ఐదేండ్ల ప్రగతి విశ్లేషణకు ఎంచుకోవడం జరిగింది.


ప్రాజెక్టులపై నిధుల ఖర్చు: ఉమ్మడి రాష్ట్రంలో 2004-14 మధ్య కాలం లో తెలంగాణలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్ననీటి చెరువులు, ఇతర ఖర్చులు కలుపుకొని పెట్టిన మొత్తం ఖర్చు 54,020.71 కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-19 మధ్యకాలంలో పెట్టిన ఖర్చు 1,02,124.12 కోట్లు. తెలంగాణ రాష్ర్టానికి నిధుల ఖర్చుపై స్వేచ్ఛ వచ్చిన కారణంగానే కేవ లం ఈ ఐదేండ్లలోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 1 లక్షా 2 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టగలిగింది. తెలంగాణకు జీవనాధారంగా ఉన్న చెరువులపై ఈ ఐదేండ్ల కాలంలో పెట్టిన ఖర్చు 7,219 కోట్లు. అంటే సగటున సంవత్సరానికి 1,443 కోట్లు. ఇదొక చరిత్ర. ఉమ్మ డి రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలకు కలిపి చెరువులపై ఖర్చు ఏడాదికి 900 కోట్లు మించకపోయేది.


ఆయకట్టు సాధనలో వృద్ధి: ఉమ్మడి రాష్ట్రంలో 2004-14 మధ్యకాలంలో తెలంగాణలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి చెరువు లు, చిన్న ఎత్తిపోతల పథకాల కింద సాధించిన కొత్త ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలు, స్థిరీకరణ 93 వేల ఎకరాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-19 మధ్యకాలంలో సాధించిన కొత్త ఆయకట్టు 13.12 లక్షల ఎకరాలు. 12 ప్రాజెక్టులను పూర్తిచేయడం, మరో 11 ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా సాగునీరు సరఫరా జరుగుతున్నందున ఈ ఆయకట్టును సాధించ డం జరిగింది. ఇకపొతే స్థిరీకరణ ద్వారా సాధించిన ఆయకట్టు 17.36 లక్షల ఎకరాలు. ఇందులో 15 లక్షల ఎకరాలు మిషన్‌ కాకతీయలో 22 వేల చెరువులను పునరుద్ధరించడం వల్ల సాధ్యమైంది.


పంటల దిగుబడిలో వృద్ధి: ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు నికరంగా అందించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. పంటల దిగుబడి కూడా పెరిగింది. 2015-16తో పోల్చినప్పుడు 2017-18లో నాలుగు ప్రధాన పంటల దిగుబడుల పెరుగుదల ఈ విధంగా పెరిగాయి. కందులు-151, వేరుశనగ-80.91, వరి-105.52, మక్కలు- 57.17 (శాతాల్లో). రాష్ట్రంలో నాలుగు ప్రధాన పంటల దిగుబడి బాగా పెరిగినప్పటికీ మిగతా పంటల కన్నా వరి ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తున్నది. 2018-19 వరి ధాన్యం దిగుబడి 118.83 శాతానికి పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 


చేపల ఉత్పత్తిలో వృద్ధి: మత్స్యశాఖ 2018లో ప్రచురించిన నివేదిక ప్రకారం చేపల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 2,70,209 టన్నులు, వాటి విలువ రూ.2,565 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2,94, 209 టన్నులకు పెరిగింది. వీటి విలువ సుమారు రూ.2,942 కోట్లు. రాష్ట్రంలో మంచినీటి రొయ్యల ఉత్పత్తిలో కూడా గణనీయ వృద్ధి సాధ్యమైందని నివేదిక స్పష్టం చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రొయ్యల ఉత్పత్తి 7,783 టన్నులు ఉంటే, 2018-19 ఆర్థిక సంవత్సరంలో అది 9,998 టన్నులకు పెరిగింది. 


మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో చేపల ఉత్పత్తి పెరిగిందనడంలో సందేహం లేదు. ఇటీవల పార్లమెంట్‌ స్థాయీ సంఘం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారం తెలంగాణలో 25 వేల జలాశయాలున్నాయని, వాటి ఉపరితల విస్తీర్ణం 5.73 లక్షల చ॥కి.మీ. అని, దీనితో తెలంగాణ మంచినీటి చేపల ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నది.రైతుల ఆత్మహత్యల్లో తగ్గుదల: 2018లో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వారు విడుదల చేసిన నివేదిక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 54 శాతం తగ్గినట్లు పేర్కొన్నది. ఒకవైపు పంజాబ్‌, హర్యానా, కర్నాటక వంటి రాష్ర్టాల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతుంటే తెలంగాణలో సగానికి తగ్గడం గమనార్హం. సాగునీటి సౌకర్యాల కల్పనతో పాటు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యా లు, గిట్టుబాటు ధరలు కల్పించడం లాంటి చర్యలు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి దోహదం చేశాయి.


ఉపసంహారం: గడిచిన ఐదేండ్లలో తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేదిశగా ప్రాజెక్టుల పురోగతి సాగుతున్నది. మానవాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగా నిలిచింది. ఈ సందర్భంలో 2011లో జాతీయ అభివృద్ధి మండలి తమ 11వ నివేదికలో కొత్త రాష్ర్టాలైన ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లు తమ మాతృ రాష్ర్టాలతో పోల్చినప్పుడు Gross State Domestic Product పెరుగుదలపై ఈ విధంగా వ్యాఖ్యానించింది.


అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవి అణిగిపోయి ఉండటం వల్ల ఈ ప్రాంతాలు వెనుకబడిపోయినాయి. ఈ ప్రాంతాలు రాష్ర్టాలుగా ఏర్పడగానే వీటిల్లోని సహజంగా నిబిడీకృతమై ఉన్న సమస్త సృజనాత్మకశక్తులు వికాసం చెంది ప్రజలను కార్యోన్ముఖులను కావించాయి. తమ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన పరిపాలన కూడా బయ టి పెట్టుబడులను రాష్ట్రంలోకి ఆకర్షించి ఆర్థిక ప్రగతికి దోహదం చేసి ఉంటుం ది. వనరుల వినియోగం కూడా అందుకు ఊతం ఇచ్చింది. ఈ వ్యాఖ్యానం తెలంగాణకూ, సీఎం కేసీఆర్‌కు అక్షరాలా వర్తిస్తుంది.


logo