గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 05, 2020 , 23:23:46

రచ్చే ప్రధానమా!

రచ్చే ప్రధానమా!

మన ప్రజాస్వామ్యం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. అయినా సవాళ్ళను ఎదుర్కొనే పరిణతి భారతీయ సమాజానికి ఉందని అనేక సందర్భాల్లో రుజువైంది. మన రాజ్యాంగ వ్యవస్థలు కూడా బలంగా ఉన్నాయి. రాజ్యాంగ పరిధిలో సంక్షోభాలను అధిగమించడం మనకు కొత్త కాదు. ఈ వాస్తవాలను విదేశాలకు నిర్దంద్వంగా చెప్పగలిగే నైతిక ైస్థెర్యం మనకు ఉండాలి. ఏ మాత్రం అవకాశం దొరికినా మన దేశంపై వేలెత్తి చూపడానికి కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మనలో మనం ఎట్లా ఉన్నా ఇతర దేశాలకు తలదూర్చే అవకాశం ఇవ్వకూడదు.

పార్లమెంటు ఉభయసభల్లో చర్చకు బదులు రచ్చ చేయడం ఆందోళనకర స్థాయికి చేరుకున్నది. గురువారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను స్పీకర్‌ లోక్‌సభ నుంచి బహిష్కరించవలసి రావడం చట్టసభల్లో పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. సోమవారం నుంచి ప్రతిపక్షాలు సభకు అంతరాయం కలిగిస్తూనే ఉన్నాయి. లోక్‌సభలో సోమవారం నాడు అధికార, ప్రతిపక్షసభ్యుల మధ్య తోపులాట సాగడం ఒక అవాంఛనీయ ఘటన. ఆ తర్వాత రోజూ కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో స్పీకర్‌ ఓం బిర్లా వివిధ రాజకీయపక్షాల పెద్దలతో సమావేశం ఏర్పాటుచేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. సభలోని ఘటన పట్ల ఆవేదన చెందిన స్పీకర్‌ రెండురోజుల పాటు పార్లమెంటుకు వచ్చి కూడా అధ్యక్ష స్థానంలో కూర్చోలేదు. ఆ తర్వాత కూడా అదే గందరగోళం. సభాధ్యక్ష స్థానం ముందు భాగంలోకి చొచ్చుకువచ్చి రచ్చ చేస్తే చర్య తీసుకుంటామని స్పీకర్‌ హెచ్చరించారు.


వరుస ఆటంకాలు చివరికి కాంగ్రెస్‌ సభ్యుల బహిష్కరణకు దారితీసాయి. రాజ్యసభలోనూ కార్యక్రమాలు సజావుగా సాగడం లేదు. కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాల సభ్యులు అంతరాయం కలిగిస్తుండటంతో ఆగ్రహించిన రాజ్యసభ చైర్మన్‌ ‘ఇది పార్లమెంటా లేక బజారా’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై సభలో చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుపడుతున్నది. హోలీ అనంతరం పదకొండవ తేదీన చర్చ జరపడానికి స్పీకర్‌ హామీ ఇచ్చారు. కాదు వెంటనే చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుపడుతున్నది. ఈ విషయమై చర్చ సాగేవరకు ఇత ర చర్చలకు అంతరాయం కలిగిస్తూనే ఉంటామని అంటున్నది. ఏ అంశంపై అయినా ఒక మెట్టు దిగడానికి ఇరుపక్షాలూ సిద్ధంగా ఉండాలి. నాలుగురోజులు అటూఇటూ ఏదో ఒక దగ్గర అంగీకారానికి వస్తే బాగుండేది.


సభా కార్యక్రమాలకు ఏ పార్టీ అటంకం కలిగించి నా గర్హనీయమే. ప్రతిపక్షమంటే గొడవలు చేయడమనే సంస్కృతి రాజకీయపక్షాల్లో పేరుకుపోయింది. బీజేపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదేవిధంగా వ్యవహరించింది. 2009 నుంచి 2014లో అధికారంలోకి వచ్చేవరకు బీజేపీ ప్రతిపక్షంగా నిరంతరం ఆటంకాలు కలిగించింది. లోక్‌సభ కార్యక్రమాలు 2009లో 93 శాతం జరిగితే, 2013 నాటికి 46 శాతానికి పడిపోయాయి. ఆటంకాలు కలిగించడం కూడా సభా కార్యక్రమాలలో భాగమే అని ఆ పార్టీ నాయకులు సమర్థించుకున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి, వివిధ అంశాలపై ఒత్తి డి పెట్టడానికి ప్రతిపక్షాలు గొడవలు చేయడం ఏ దేశ పార్లమెంటులోనైనా మామూలే. కానీ ఆటంకాలే ఎక్కువై సభా కార్యక్రమాలు తగ్గడం పార్లమెంటు ప్రమాణాల పతనానికి సూచన. 


పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు శుక్రవారం నాడు స్పీకర్‌ ఓం బిర్లా ఒక సందర్భంలో మాట్లాడు తూ- సభా కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా నివారించడానికి చట్టాన్ని తెస్తున్నట్టు వెల్లడించారు. తాము తేబోయే చట్టం కఠినంగా ఉంటుందనీ, రాష్ర్టాల శాసనసభలకు కూడా వర్తిస్తుందని తెలిపా రు. సభాకార్యక్రమాలకు అంతరాయాలను నివారించడంపై కొంతకాలంగా చర్చ సాగుతున్నది. గతేడాది నవంబర్‌లో సభాపతుల సమావేశంలో కూడా ఈ విషయమై చర్చ జరిగింది. కనీసం చట్టం తేవడం వల్లనైనా సభా కార్యక్రమాలు గౌరవప్రదంగా సాగితే మంచిదే.


మన ప్రజాస్వామ్యం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. అయినా సవాళ్ళను ఎదుర్కొనే పరిణతి భారతీయ సమాజానికి ఉందని అనేక సందర్భాల్లో రుజువైంది. మన రాజ్యాంగ వ్యవస్థలు కూడా బలంగా ఉన్నాయి. రాజ్యాంగ పరిధిలో సంక్షోభాలను అధిగమించడం మనకు కొత్త కాదు. ఈ వాస్తవాలను విదేశాలకు నిర్దంద్వంగా చెప్పగలిగే నైతిక ైస్థెర్యం మనకు ఉండాలి. ఏ మాత్రం అవకాశం దొరికినా మన దేశంపై వేలెత్తి చూపడానికి కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మనలో మనం ఎట్లా ఉన్నా ఇతర దేశాలకు తలదూర్చే అవకాశం ఇవ్వకూడదు. కానీ క్లిష్టసమస్యలు ఎదురైనప్పుడు పార్లమెంటుసభ్యులు కూడా రాజకీయాలే ప్రధానంగా వ్యవహరించడం వల్ల నవ్వేటో ళ్ళ ముందు జారిపడినట్టవుతున్నది. పార్లమెంటు సభ్యులు బాధ్యత గల ప్రజా ప్రతినిధులు. 


వారు పార్లమెంటులో వ్యవహరించే తీరుపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు. కానీ తదనుగుణమైన బాధ్యతను వారు కనబరచకపోవడమే విచారకరం. ఇప్పటికైనా పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలుగకుండా అన్నిపక్షాల నాయకులూ రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయానికి రావాలి. స్వీయ క్రమశిక్షణ పాటిస్తే చట్టాల ద్వారా నియంత్రించవలసిన అవసరం రాదు. చెప్పుకోవడానికి కూడా గొప్పగా ఉంటుంది. కానీ సభ్యులలో ఆ హుందాతనం లోపించినప్పుడు చట్టం ద్వారా చక్కదిద్దడం తప్ప మరో మార్గం లేదు. మొదట్లో తెలంగాణ శాసనసభలో చర్చలు సజావుగా సాగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయమై శ్రద్ధ కనబరచి ప్రజా సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాలపై నిర్విఘ్నంగా చర్చించే పరిస్థితులను నెలకొల్పారు. ఇది దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ప్రజాస్వామ్యప్రియులు గుర్తించవలసిన అంశం.


logo
>>>>>>