బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 05, 2020 , 23:17:57

భిన్నవాదాల కూడలి

భిన్నవాదాల కూడలి

పొత్తూరి జర్నలిస్టుల్లో జర్నలిస్టు. ఆస్తికుల్లో ఆస్తికుడు. నాస్తికుల్లో నాస్తికుడు. మానవహక్కుల్లో ఉద్యమకారుడు.సంప్రదాయజ్ఞుల్లో సంప్రదాయవాది. అభ్యుదయవాదుల్లో అభ్యుదయకారుడు. విప్లవోద్యమాలకు మిత్రుడు.అధికారపీఠాల్లో పెద్దలకు ఆత్మీయుడు. ప్రతిపక్షాలకు సలహాదారుడు. తెలుగు భాషాప్రేమికుడు. తాను నొచ్చుకున్నా ఇతరులను నొప్పించని పెద్దమనిషి.

పొత్తూరి వెంకటేశ్వరరావు జగమెరిగిన జర్నలిస్టు. 86 ఏం డ్లు పూర్ణమిదం, పూర్ణఫలం అన్నట్లు సార్థక జీవనం గడి పి, విలువలను, ఆదర్శాలను తన అడుగుజాడలుగా వది లి వెళ్లారు. దాదాపు అర్ధ శతాబ్దంగా తెలుగు ప్రజాక్షేత్రంలోనే ఉన్న పొత్తూరి తెరిచిన పుస్తకం. ఇప్పుడు కొత్తగా ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదనుకుంటే మనకే నష్టం. నిజానికి ఇప్పుడే పొత్తూరి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి.


జర్నలిస్టుగా, ప్రధాన సంపాదకుడిగా ఆయన ముద్ర ఆయనకున్నది. పత్రిక యజమాని-సంపాదకుడు ఒకరే అవుతున్నకాలంలో బహుశా సంపాదకుడిగా స్వేచ్ఛగా బాధ్యతను నిర్వహించిన చివరి మనిషి పొత్తూరి. జర్నలిజం భాష, పరిభాష, అనువాదాలు, కొత్తపదాల వాడుక, పారిభాషిక పదాల నిఘంటువుల తయారీ, కొత్త తరం జర్నలిస్టుల కు శిక్షణ పాఠాలు, పాత పత్రికల డిజిటలైజేషన్‌ లాంటి విషయాల్లో పొత్తూరి కృషి చెబితే చర్విత చర్వణం అవుతుంది. హైదరాబాద్‌ విజయనగర్‌ కాల నీ ఆయనింట్లో మెట్లెక్కి పైకి వెళ్ళగానే చుట్టూ ఎటుచూసినా పుస్తకా లే పుస్తకాలు. అందులో చక్కగా పేర్చిన టేబుల్‌ మీద డెస్క్‌ టాప్‌. ఆధునికులతో పోటీపడుతూ తెలుగు, ఇంగ్లిషులో ఆయన వ్యాసాల ను ఆయనే టైప్‌ చేసుకుంటారు. నెట్లో లేటెస్ట్‌ విషయాలను ఫాలో అవుతారు. గ్రంథాలయం మధ్యలో ఒక వాలు కుర్చీ, చిన్న మంచం, పరుపు. నిత్య పఠనం పొత్తూరి బలం.


పొత్తూరి జర్నలిస్టుల్లో జర్నలిస్టు. ఆస్తికుల్లో ఆస్తికుడు. నాస్తికుల్లో నాస్తికుడు. మానవహక్కుల్లో ఉద్యమకారుడు. సంప్రదాయజ్ఞుల్లో సంప్రదాయవాది. అభ్యుదయవాదుల్లో అభ్యుదయకారుడు. విప్లవోద్యమాలకు మిత్రుడు. అధికారపీఠాల్లో పెద్దలకు ఆత్మీయుడు. ప్రతిపక్షాలకు సలహాదారుడు. తెలుగు భాషాప్రేమికుడు. తాను నొచ్చుకున్నా ఇతరులను నొప్పించని పెద్దమనిషి. అజాతశత్రువు. వివాదాస్పద అంశాల మధ్య వివాదం లేకుండా నడిచినవాడు. వైరుధ్యాల మధ్య వైవిధ్యంగా నిలబడినవాడు. పెద్దల్లో పెద్ద, చిన్నల్లో చిన్న గా మెలిగినవాడు. అందరి బంధువు అయినవాడు.


పేలాల్సిన అన్నల మందుపాతర మీద మాటను మంత్రించడం, ఎక్కుపెట్టిన పోలీసు తుపాకీ గొట్టానికి తనచేతిని అడ్డుపెట్టడం రెండూ పొత్తూరి ఒకే సమయంలో చేయగలిగారు. రాజ్యం, హింస, పౌరహక్కు ల గురించి ఆయన ఎంత లోతుగా ఆలోచిస్తారో? వాల్మీకి రాముడు-రాముడి ఆదర్శాల గురించి అంతే లోతుగా ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. ఎందులో అయినా మంచిని చూసే గుణమేదో ఆయనకు స్వతహాగా అబ్బినట్లుంది. అందుకే విప్లవోద్యమ ఎర్రజెండాల వారు ఆయనతో కాఫీ తాగి వెళ్లిన వెంటనే అదే కుర్చీలో ఆయన ఎదురుగా సనాతనధర్మ కాషాయాంబరధారులు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుంటారు.


ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు ఉద్యమరూపం తీసుకున్నప్పుడు ఆయన తెలంగాణను స్వప్నించారు, ప్రేమించారు. ఉద్యమానికి బాసటగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణను నిండు మనసుతో అభినందించారు. ఆశీర్వదించారు. భిన్నవాదాలకు పొత్తూరి ఎలా పొత్తు కుదిర్చారో నేటితరం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. పరస్పర తీవ్ర వైరుధ్యాలున్న వారితో ఆయన దశాబ్దాల తరబడి హాయిగా ఎలా నడువగలిగారో నేటి సమాజం గమనించాల్సి ఉన్నది. వాదాలను, వేదాలను ఆయన ఒకే ఒరలో సునాయాసంగా ఎలా సర్దుబాటు చేశారో ఆధునికులు అర్థం చేసుకోవాల్సి ఉన్నది.


సమాజం పట్ల బాధ్యత అంటే సంపాదకీయాలు రాసి వెదజల్లడం కాదని పొత్తూరిని చూసి నేర్చుకోవాలి. సమాజంలో భాగం కావాలం టే సమాజంలోనే ఉండాలని పొత్తూరిని చూసి తెలుసుకోవాలి. చెప్పే మాటలకు-చేసే పనులకు తేడా ఉండకూడదనుకుంటే పొత్తూరిని చదవాలి. ముదిమి వయసు సవాలు చేస్తున్నా అంతరాంతరాల్లో సంఘంపట్ల సంఘర్షణ పురులు విప్పాలంటే పొత్తూరిని అధ్యయనం చేయాలి. బుద్ధిజీవి బాధ్యతగా ఎన్ని సమస్యల సముద్రాలను ఈదగలడో తెలుసుకోవాలంటే పొత్తూరిని అర్థం చేసుకోవాలి. చివరగా-మనిషితనపు మౌలికమైన పునాదులు గట్టిపడాలంటే పొత్తూరిని గట్టిగా పట్టుకోవాలి.

- పమిడికాల్వ మధుసూదన్‌


logo