గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 04, 2020 , 23:28:29

డిజిటల్‌ కరెన్సీ

డిజిటల్‌ కరెన్సీ

క్రిప్టో కరెన్సీ పట్ల వివిధ దేశాల వైఖరి భిన్నంగా ఉన్నది. జర్మనీ వంటి ఒకటి రెండు పెద్ద దేశాలు మినహాయిస్తే, దీనిని అనుమతించిన మిగతావన్నీ చిన్న దేశాలే. అమెరికా తదితర దేశాలు, యురోపియన్‌ యూనియన్‌ పాక్షికంగా లావాదేవీలను అనుమతించడం గమనార్హం. అయితే క్రిప్టో కరెన్సీ సవాలును ఎదుర్కొనడానికి వివిధ దేశాలు స్వయంగా తాను డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. భారత్‌ కూడా డిజిటల్‌ కరెన్సీ వైపుగా అడుగులు వేయడం తప్పనిసరి అవుతున్నది. డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టడం వల్ల అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ లావాదేవీల మీద రెండేండ్ల కిందట రిజర్వు బ్యాంకు విధించిన నిషేధాన్ని బుధవారం సుప్రీంకోర్టు ఎత్తివేయడం, డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం అన్నిరంగాలను ముంచెత్తుతున్న పరిణామాన్ని సూచిస్తున్నది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధించడానికి ఆర్బీఐకి అధికారాలు లేవనేది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం. ఇటువంటి నిషేధాన్ని విధించడానికి అవసరమైన చట్టాలు లేవు కనుక ఆర్బీఐ నిర్ణయం నిలబడలేదు. కోర్టు ఆదేశాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతమున్న చట్టాల పరిధిలో క్రిప్టోకరెన్సీల ఆగమనాన్ని మనం ఎంతోకాలం నిరోధించలేమన్నది వాస్తవం. ఇప్పటికైనా దీనిపై స్పష్టతకు రావలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు తీర్పు గుర్తుచేస్తున్నది. బిట్‌కాయిన్‌ వంటివి పెరిగిపోయిన నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థికసంస్థలు వర్చువల్‌ కరెన్సీతో లావాదేవీలు జరుపకుండా 2018 ఏప్రిల్‌లో ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. 


వీటితో లావాదేవీలను మూడు నెల ల్లో తెంచుకోవాలని స్పష్టంచేసింది. క్రిప్టో కరెన్సీల నుంచి దేశ ఆర్థికవ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రిజర్వుబ్యాంకు ఈ నిర్ణయం తీసుకుందనడంలో సందేహం లేదు. కానీ ఆర్బీఐ నిర్ణయాన్ని ఇంటర్‌నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఇమాయి) న్యాయస్థానంలో సవాలు చేసింది. క్రిప్టో కరెన్సీ అంటే దానినొక కరెన్సీగా కన్నా ఒక సరుకుగా భావించాలని ఇమాయి వాదించడం విశేషం. వీటి లావాదేవీలపై నిషేధానికి చట్టమేమీ లేదనే అంశాన్ని కూడా ఇమాయి ఎత్తిచూపింది. సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయమై ఒక విస్పష్ట విధానాన్ని రూపొందించుకోవడం ఇక తప్పనిసరి.


డిజిటల్‌ సాంకేతికపరిజ్ఞానం అన్నిరంగాలకు విస్తరిస్తున్నది. ఇంటర్‌నెట్‌ ద్వారా లావాదేవీలు పెరిగిపోయాయి. ఈ కామర్స్‌ అనూహ్యంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ కరెన్సీ రావడం కూడా అనివార్యం. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ పురోగమనం క్రిప్టో కరెన్సీ విస్తృతం కావడానికి దారితీసింది. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తయ్యాయి. డబ్ల్యుటీవో వంటి ఆర్థిక సం స్థలు అధ్యయనాలు చేపట్టాయి. గతేడాది జీ20 వేదిక కూడా ఈ అంశంపై చర్చించింది. క్రిప్టో కరెన్సీ వల్ల ఆయా దేశాల ద్రవ్య వ్యవస్థలకు ఉన్నపళంగా ఇబ్బంది లేనప్పటికీ, వాటి కార్యకలాపాలను విస్మరించలేమని గుర్తించింది. వివిధ దేశాలు క్రిప్టో కరెన్సీపై అధ్యయనాలు సాగించి తమ విధానాలను రూపొందించుకోవడం ప్రారంభించాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై కమిటీలు వేసి అధ్యయనాలు సాగించింది. క్రిప్టో కరెన్సీలకు ఎటువంటి చట్టబద్ధత లేదు. వీటిద్వారా అనేక అక్రమాలు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. 


ఈ కం పెనీలు అనేకం మూత పడ్డాయి. వీటి వల్ల నష్టపోతే పరిహారం పొందడానికి ఏర్పాట్లు లేవు. అవినీతి సొమ్మును సక్రమమైందిగా చూపడానికి, ఉగ్రవాదులకు నిధులు అందించడానికి కూడా క్రిప్టో కరెన్సీ ఉపయోగపడవచ్చు. అందువల్ల క్రిప్టో కరెన్సీ వల్ల మన ఆర్థిక వ్యవ స్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఆర్బీఐ నిర్ణయం కూడా ఈ ఉద్దేశంతో తీసుకున్నదే. డిజిటల్‌ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ముసాయిదా బిల్లును రూపొందించింది.  ఇలాంటి కరెన్సీ రూపకల్పన, అమ్మకాలు, కొనుగోళ్ళ వంటి వివిధ దశల్లో పాల్గొన్నవారికి కఠినశిక్షలు విధించే విధంగా చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.


క్రిప్టో కరెన్సీ పట్ల వివిధ దేశాల వైఖరి భిన్నంగా ఉన్నది. జర్మనీ వంటి ఒకటి రెండు పెద్ద దేశాలు మినహాయిస్తే, దీనిని అనుమతించిన మిగతావన్నీ చిన్న దేశాలే. అమెరికా తదితర దేశాలు, యురోపియన్‌ యూనియన్‌ పాక్షికంగా లావాదేవీలను అనుమతించడం గమనార్హం. అయితే క్రిప్టో కరెన్సీ సవాలును ఎదుర్కొనడానికి వివిధ దేశాలు స్వయంగా తాను డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. భారత్‌ కూడా డిజిటల్‌ కరెన్సీ వైపుగా అడుగులు వేయడం తప్పనిసరి అవుతున్నది. డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టడం వల్ల అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే దీనివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించి, తదనుగుణమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నది.


ఫేస్‌బుక్‌ ప్రవేశపెడుతున్న లిబ్రా వంటి డిజిటల్‌ కరెన్సీలు పెద్ద సవాలు కాబోతున్నాయనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పటికే పలు జాతీయ ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను నిర్దేశించుకునే స్థితిని కోల్పోయాయనే విమర్శ ఉన్నది. బ్రిటన్‌ ప్రజలు ఈయూ నుంచి వైదొలిగిన తీరు ఇందుకు నిదర్శనం. డిజిటల్‌ విప్లవం వ్యాపారాలను మార్చడంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థల ను కూడా అతలాకుతలం చేసే అవకాశం ఉన్నది. కరెన్సీలు ప్రాధాన్యం కోల్పోతాయనే అభిప్రా యం వ్యక్తమవుతున్నది. కొత్త సాంకేతికతను ఆహ్వానించడం తప్పనిసరి. అదే సమయంలో దానిని మన పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవడం ఆవశ్యకం. 


logo