శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 04, 2020 , 23:25:38

ఇంత బద్నామీ ఎప్పుడూ లేదు

ఇంత బద్నామీ ఎప్పుడూ లేదు

భారతదేశాన్ని ప్రపంచం దృష్టిలో కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ పలుమార్లు అప్రతిష్ఠపాలు చేశాయి. కానీ ప్రస్తుతం బీజేపీ హయాంలో చూస్తున్నది అప్రతిష్ఠ మాత్రమే కాదు. జాతివాదం పేరిట సమాజాన్ని నెమ్మదిగా నాజీయిజంవైపు తోసుకుపోజూస్తున్నారా అనే సందేహాలు అంతటా తలెత్తుతున్నాయి. సాక్షాత్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌ ఈ స్థితిని గుర్తించారా అన్నట్లు, జాతివాదం అనే పదానికి నాజీయిజం, ఫాసిజంతో సంబంధం ఉన్నందున ఆ పదాన్ని ఉపయోగించవద్దంటూ తమ సహచరులను హెచ్చరించటం గమనించదగ్గది.

గాంధీ, నెహ్రూ, పటేల్‌ సహా మన స్వాతంత్రోద్యమ నాయకులంతా భారతదేశపు మహా వైవిధ్య సమాజంలో జాతిభావన కోసం, జాతి నిర్మాణం కోసం పాటుపడ్డారు. మోహన్‌ భాగవత్‌ ప్రస్తావించిన జాతివాదం, ఫాసిజం,నాజీయిజాలు యూరప్‌లో, జపాన్‌లో సాగించిన మహా దారుణాలను వారు అప్పటికే తమ జీవితకాలంలో చూశారు.  అందువల్లనే దేశానికి ఇటువంటి ఆధునిక, ప్రజాస్వామిక, సెక్యులర్‌  రాజ్యాంగాన్నిఅంబేద్కర్‌ అధ్యక్షతన తయారుచేశారు.


కాంగ్రెస్‌, బీజేపీల చర్యలు లోగడ ప్రజాస్వామికవాదుల విమర్శలకు గురయ్యాయి. అంతర్జాతీయంగా అప్రతిష్ఠను తెచ్చిపెట్టాయి. కాంగ్రెస్‌ వారి ఎమర్జెన్సీ, సిక్కులపై హత్యాకాండ, బీజేపీ వారి బాబ్రీ మసీదు కూల్చివేత, హిందీ రాష్ర్టాల్లో గుజరాత్‌లో మత కలహాలు ఇందుకు ఉదాహరణలు. కొన్ని దోషాల్లో ఇరువురూ భాగస్వాములయ్యారు. అయోధ్యలో రామ మందిరం తాళాల తొలిగింపు, శిలాన్యాస్‌ మొదలుకొని మసీదు కూల్చివేత నాడు చేతులు ముడుచుకొని కూర్చొనటం వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాత్ర ఏమిటో తెలిసిందే. ఈ రకరకాల ఉదంతాలన్నింటిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాత్ర గల కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ సోకాల్డ్‌ జాతీయపార్టీలే. అవి ఆ అకృత్యాలు చేసింది తమ అధికారం కోసమే తప్ప దేశ ప్రయోజనాల కోసమో, ప్రజల బాగు కోసమో కాదు. దేశంలోని వివిధ ప్రాంతాలకు, సామాజికవర్గాలకు భాగస్వామ్యం ఉండి, ఆ వర్గాలు ప్రభుత్వ విధానాలను, పరిపాలనను నియంత్రించే ఫెడరల్‌ రాజకీయవ్యవస్థ కేంద్రంలో అధికారంలో ఉండి ఉన్నట్లయితే కాంగ్రెస్‌ గాని, బీజేపీ గాని ఇటువంటి హానికరమైన చర్యలకు పాల్పడే వీలుండేది కాదు. ప్రజాస్వామికవాదుల విమర్శలకు, అంతర్జాతీయంగా అప్రతిష్ఠకు ఆస్కారం ఏర్పడేది కాదు.


కాంగ్రెస్‌, బీజేపీలకు తమ సిద్ధాంతాలు తమకు ఉండటం సహజం. అధికారం ఒక లక్ష్యం కావటం కూడా సహజం. వారి సిద్ధాంతాల పట్ల ఎవరికి ఏ అభ్యంతరాలున్నప్పటికీ సిద్ధాంతాల ప్రచారం, అధికార సాధ న ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరిగినట్లయితే ఆక్షేపించదగిందేమీ ఉండదు. కానీ, పైన ఉదాహరించిన కొన్ని దుర్మార్గాలకు  కాం గ్రెస్‌ పార్టీ పాల్పడగా  బీజేపీ, దాని మిత్రశక్తులు అసలు సమాజాన్నే విషపూరితంగా మార్చి విచ్ఛిన్నం చేసే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. దేశం లో పరిస్థితి ఇంత ప్రమాదకరంగా మారటం, అంతర్జాతీయంగా అప్రతిష్ఠ పాలవటం అందువల్లనే. సంఘ్‌పరివార్‌ పరమలక్ష్యాలేమిటి, మోహన్‌ భాగవత్‌  మనసులో ఉన్నదేమిటి అన్న ప్రశ్నలను  పక్కన ఉం చితే, ఆయన గత నెల 20వ తేదీన రాంచీలో ఆ విధంగా ఎందుకు హెచ్చరించవలసి వచ్చింది? జాతివాదం అనే మాటను ఉపయోగించకండి. జాతి, జాతీయత, జాతీయ అనండి. జాతివాదమన్నది హిట్లర్‌, నాజీయిజం, ఫాసిజంతో సంబంధం గలది. పరివార్‌ లక్ష్యం దేశభక్తిని, హిందూ భావనను పెంపొందించటం మాత్రమే అన్నారాయన.


అయితే ఇందులో పైకి చూసేందుకు హేతుబద్ధంగా కనిపించే హితవు, హెచ్చరికలతో పాటు, వాటిని వారు ఆచరణలోకి తీసుకువెళ్లినప్పుడు వైరుధ్యాలు కన్పించటం తెలిసిందే. జాతి, జాతీయ, జాతీయత అన్న భావనలు అన్నిదేశాల్లో ఉన్నవే. అంతవరకు అవి ఆరోగ్యకరమైనవే. కానీ ఈ మూడు పదాల నిర్వచనంలోకి ఒక దేశంలోని అన్ని జాతులు, ఉపజాతులు, తెగలు, మతాలు, సామాజికవర్గాలు వస్తాయి. అందులో భాగంగా ఏ మతం వారికి ఆ మత భావనలు ఉండటం వరకు కూడా సహజం. కానీ ఏదో ఒక మత భావనను జాతి, జాతీయ, జాతీయత అనే భావనలకు, దృక్పథానికి సమానార్థకం చేయబూనినపుడు, ఆ మతానికి ఆధిపత్య స్థానం ఇవ్వబూనినపుడు, అందుకు తక్కినవన్నీ లోబడి ఉండాలని భావించినప్పుడు అది స్వయంగా మోహన్‌ భాగవత్‌ తగదంటున్న జాతివాదానికి దారితీస్తుంది. ఇటలీ, జర్మనీలలో జరిగింది అదే. ఇప్పుడు మన దేశంలోనూ అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయేమోననే ఆందోళన ఇంటా, బయటా కన్పిస్తున్నది. ప్రస్తుత అల్లర్ల వల్ల కలుగుతున్న ఆందోళనకు వెనుక ఇటువంటి అనుమానాలున్నాయి గనుకనే మన దేశానికి ఇంతటి బద్నామీ గతంలో ఎన్నడూ లేదని అనవలసివస్తున్నది.


అధికారాన్ని ఆధారం చేసుకొని తమ సిద్ధాంతాల అజెండాను ముం దుకు తీసుకువెళ్లజూడటం అందరూ చేసే పనే. 1980లో బీజేపీగా మారటానికి ముందు జనసంఘ్‌గా ఉన్నపుడు తాము స్వయంగానో, ఇతర ఐక్య సంఘటనల్లో భాగంగానో అధికారంలో ఉండిన దశలోనూ, వాజ పేయి నాయకత్వాన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడూ వారు చేసిన ప్రయత్నమే ఇది. కానీ అప్పటి నర్మగర్భమైన పనితీరుకు భిన్నమై న వ్యవహరణ ఇప్పుడు కన్పిస్తున్నది. వాజపేయి కన్న ముందు ఉత్తరప్రదేశ్‌లో అధికారం నెరపినప్పటి బుల్‌డోజర్‌ ధోరణి తిరిగి ముందుకు వస్తున్నది. వీటిలో వేటిలోనూ జాతి, జాతీయ, జాతీయత కన్పించటం లేదు. జాతివాదమే కన్పిస్తున్నది. జాతివాదంలో మతతత్వవాదం కన్పిస్తున్నది. ఈ అజెండాను వారు పట్టుదలతో, ఇతరులపై కక్షబూనిన  విధంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తాత్కాలికంగా ఒక అడుగు వెనుకకు వేసినా తిరిగి రెండడుగు లు ముందుకువేస్తున్నారు. తిరిగి అధికారం లభించటం, మెజారిటీ పెరుగటం, ప్రతిపక్షాలు బాగా బలహీనపడటంతో ఇక తమ అజెండాను ముందుకు తోయవలసిందేనన్నట్లు ఈ సదవకాశాన్ని వదలుకోరాదన్న ట్లు ప్రవర్తిస్తున్నారు. 


మోదీ మొదటిసారి అధికారానికి వచ్చిన తర్వాత ఇండియాను సందర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, మతసహనం అవసరం గురించి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి అసహనాన్ని చూసి గాంధీజీ షాక్‌ తినేవారని కూడా ఘాటుగా అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం, బీజేపీ తమ తీరు మార్చుకోలేదు. కొద్దికాలం మిన్నకుండి మళ్లీ అదే ధోరణిలో సాగారు. ఇప్పుడు మరో అధ్యక్షుడు ట్రంప్‌ బహిరంగవ్యాఖ్యలు చేయలేదు గాని, తన ఆలోచన ఏమిటో మనకు అర్థం కాకపోలేదు. జాతివాదం, మతతత్వవాదాలు జాతి, జాతీ య, జాతీయతలకు విరుద్ధమైనవి. ఈ రెండు వాదాలు అజెండాపై ఉన్నప్పుడు జాతిభావం పెంపొందటం గాని, జాతి నిర్మాణం గాని వీలయ్యేవి కావు. గాంధీ, నెహ్రూ, పటేల్‌ సహా మన స్వాతంత్రోద్యమ నాయకులం తా భారతదేశపు మహా వైవిధ్య సమాజంలో జాతిభావన కోసం, జాతి నిర్మాణం కోసం పాటుపడ్డారు. మోహన్‌ భాగవత్‌ ప్రస్తావించిన జాతివాదం, ఫాసిజం, నాజీయిజాలు యూరప్‌లో, జపాన్‌లో సాగించి న మహా దారుణాలను వారు అప్పటికే తమ జీవితకాలంలో చూశారు. అం దువల్లనే దేశానికి ఇటువంటి ఆధునిక, ప్రజాస్వామిక, సెక్యులర్‌  రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ అధ్యక్షతన తయారుచేశారు.


ఇటువంటి నేపథ్యం గల దేశంలో ఇప్పుడేమి జరుగుతున్నది? సీఏఏ తో మొదటి అడుగువేస్తూ మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇచ్చేందుకు చర్యలు మొదలైపోయాయి. దాన్ని ప్రశ్నించితే చాలు దేశద్రోహులు, పాకిస్థానీలు అవుతున్నారు. నిరసన ప్రదర్శనలు చేస్తే చాలు గోలీమారో అని మంత్రులతో సహా పలువురు భయపెడుతున్నారు. ఆ ప్రకారం కాల్పులు నిజంగానే మొదలుపెట్టారు. ఆ చట్టాన్నో, ప్రధానమంత్రినో విమర్శించి తే చాలు  అరెస్టుచేసి కేసులు మోపుతున్నారు. విమర్శలు, నిరసనలు దేశద్రోహం కాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఎలుగెత్తి ప్రకటిస్తున్నా వెనుకాడటం లేదు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయాలన్న దోషానికి ఒక న్యాయమూర్తిని అర్ధరాత్రి వేళ బదిలీ చేశారు. 


అటువంటి ప్రసంగాలు ఇతరులు కూడా చేసినట్లు ఎదురువాదన చేసిన ప్రభుత్వం అటువంటివారందరిపై కూడా చర్యలు తీసుకోవటం సరైనదవుతుందా లేక ఆ వాద న మాటున గోలీమారో వాదులను కాపాడటం సమంజసమవుతుందా? హింస ఆరోపణపై ఆప్‌ నాయకుడు తాహిర్‌ హుస్సేన్‌పై పోలీసులు కేసు పెట్టి మంచి పనిచేశారు. ఆ వెంటనే ఆయనను ఆ పార్టీ సస్పెండ్‌ చేసి తన నేరం రుజువైతే రెట్టింపు శిక్ష వేయమంది. కానీ గోలీమారో వగైరా బీజేపీ నేతలను మాత్రం ఏమీ చేయకుండా రక్షిస్తున్నారు. అసలు పోలీ      సులు తొలిదశలో ఏ చర్యలూ తీసుకోలేదని, కనుకనే అల్లర్లు అంతగా జరిగాయని, ప్రతిచోటా భాదితులు, రిటైర్డ్‌ పోలీస్‌ అధికారులు, చివరికి కోర్టులు సైతం ఎత్తిచూపటాన్ని బట్టి ఆ నిష్క్రియాపరత వెనుక ఎవరున్నట్లు అర్థం చేసుకోవాలి?


మోదీ పాలనలో ఇటువంటివి అనేకానేకం జరుగుతున్నాయి గనుకనే దేశానికి ఈ రోజున గతంలో ఎన్నడూ లేనంతటి అప్రతిష్ఠ ఎదురవుతున్నది. ఆయా విదేశాలను అట్లుంచి యురోపియన్‌ యూనియన్‌, మాన వహక్కుల సంస్థలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు సైతం మోదీ ప్రభుత్వపు తీరును ఖండిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా ఆక్షేపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మేధావులు, రచయితలు, కళాకారులూ విమర్శించటం ఇటీవలికాలంలో జామియా, ఏఎంయూ, జేఎన్‌యూ ఘటనలతోనే మొద లై కొనసాగుతున్నది. ఆ విమర్శలను అర్థం చేసుకొని తమ పద్ధతులను మార్చుకునేబదులు, ఇదంతా మా అంతర్గత వ్యవహారమంటూ బయటివారిని దబాయిస్తున్నారు. అదే విమర్శ మన దేశంలోనివారు చేస్తే దేశ ద్రోహులను, పాకిస్థానీలను నోరుమూయించజూస్తున్నారు. దీనంతటితో ఉక్కిరిబిక్కిరై ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు కూడా ప్రభు త్వ తీరుకు అభ్యంతరం చెప్పటం మొదలుపెట్టాయి. ఈ పరిణామాల ను, ధోరణులను జాతి-జాతీయ-జాతీయత అనాలా లేక జాతివాదం, ఆ పేరిట మతతత్వవాదమనాలా?


logo