శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 04, 2020 , 23:23:36

ఉత్పత్తి నాణ్యతతోనే మనుగడ

ఉత్పత్తి నాణ్యతతోనే మనుగడ

పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉన్నది. ఈ రంగంలో ఉద్యోగ కల్పన కూడా అధికంగా ఉన్నది. ఎగుమతుల్లో కూడా పత్తి ప్రాధాన్య స్థానంలో ఉన్నది. టెక్స్‌టైల్‌ రంగంలో దేశంలో నాలుగు కోట్ల మంది పనిచేస్తున్నారు. టెక్స్‌టైల్‌ రంగంలో నాణ్యత, పోటీతత్వం తగ్గటం కారణంగా మోదీ అంటున్న ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అనేది నినాదప్రాయంగా మిగిలిపోయింది. జీఎస్‌పీ విధానాన్ని అటుంచి ఈ రంగాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నదో అంతుపట్టదు.

భారత పర్యటనను విజయవంతంగా ముగించుకొని డొనాల్డ్‌ ట్రంప్‌ సంతోషంగా అమెరికా వెళ్లారు. భారత్‌తో మూడు బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటూనే, మన దేశాన్ని ‘టారిఫ్‌ కింగ్‌'గా అభివర్ణించారు. ఇదంతా జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫెరెన్సెస్‌ (జీఎస్‌పీ) నుంచి భారత్‌ను తొలిగించిన తర్వాతి పరిణామం కావటం గమనార్హం. జీఎస్‌పీ పరిధిలో ఉన్న దేశాలకు ఎగుమతులపై అమెరికా సుంకాలను మినహాయిస్తుంది. దీన్నే అమెరికా అనుసరిస్తున్న ‘సాధారణ ప్రాధా న్య విధానం’గా వ్యవహరిస్తారు. అమెరికా జీఎస్‌పీ విధానాన్ని 1974లో ప్రవేశ పెట్టింది. ఈ విధానం కింద వివిధదేశాల నుంచి అమెరికాలోకి సుమారు 3,500 రకాల ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ఈ అవకాశం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు చేదోడుగా ఉండేందుకు ఉద్దేశించినది. ప్రధానంగా  తక్కువ ఆదాయం జాబితాలో ఉన్న దేశాల ఎగుమతులపై ఏ విధమైన పన్నులుండవు. పేద దేశాలు అమెరికాతో వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవడమే.జీఎస్‌పీ ప్రధాన ఉద్దేశం. 


ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం.. తలసరి వార్షికాదాయం 1,026 డాలర్లకన్నా తక్కువ ఉన్నవారు మాత్రమే పేదలు. కానీ భారతదేశంలో తలసరి వార్షిక ఆదాయం 2,100 డాలర్లుగా ఉన్నది. దీనిప్రకారం.. భార త్‌ పేద దేశంగా పరిగణించబడదు. కాబట్టి ట్రంప్‌ భారత్‌ను జీఎస్‌పీ పరిధి నుంచి తొలిగించటం సమర్థనీయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని జీఎస్‌పీ పరిధి నుంచి అమెరికా తప్పించటం మూలంగా భారత్‌ ఏ స్థాయిలో నష్టపోతున్నదో చూడాలి. 2018-19లో భారత్‌ అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 88 బిలియన్లుగా ఉన్నది. అమెరికాతో వర్తక వాణిజ్యం చేస్తున్న దేశాల్లో చైనా కన్నా భారత్‌ ముందువరు సలో ఉన్నది. ఇలా అమెరికాకు ఎగుమతవుతున్న భారత ఉత్పత్తుల్లో టెక్స్‌టైల్‌, దాని అనుబంధ ఉత్పత్తులు, గడియారాలు, పాదరక్షలు, ఆటోమొబైల్‌ పరికరాలు, చర్మ అనుబంధ ఉత్పత్తులు ప్రధానంగా ఉన్నాయి. 


ఈ ఎగుమతుల్లో వజ్రాలు 1 9శాతం, ఔషధాలు 14 శాతం, ఆటోమొబైల్‌ పరికరాలు 2.1శాతం, టెక్స్‌టైల్‌ వస్త్ర ఉత్పత్తులు 3.7 శాతం ఉన్నాయి. ఇది భారత్‌ ఎగుమతుల స్థితిని తెలుపుతున్నది. అమెరికాకు ఎగుమతి అవుతున్న నాలుగు ప్రధాన వస్తువుల్లో టెక్స్‌టైల్‌ అనుబంధ ఉత్పత్తులు, ఆటోమొబైల్‌ పరికరాలు జీఎస్‌పీ పరిధిలో ఉండటం గమనించదగినది. సేంద్రియ ఉత్పత్తులు, ఇంజినీరింగ్‌ పరికరాలు, న్యూక్లియర్‌ బాయిలర్లు, యంత్ర పరికరాలు తదితర ఎగుమతులు భారతదేశాన్ని జీఎస్‌పీ పరిధి నుంచి తప్పించటం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. అయితే భారత్‌ నుంచి ఎగుమతవుతున్న వాటిలో వీటి శాతం తక్కువే. అయినా వీటి మూలంగా జరుగుతున్న నష్టం పెద్దమొత్తంలోనే ఉంటున్నది. ఎందుకంటే 2010-2018 మధ్యకాలంలో ఈ ఉత్పత్తులలో 58 శాతం ఎగుమతి అవుతున్నాయి.


జీఎస్‌పీ నుంచి భారత్‌ను తప్పించిన తర్వాత కొన్ని అనుకూల, ప్రతికూల ఫలితాలున్నాయి. భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించిన ప్రకారం-  జీఎస్‌పీ లేకపోవటం కారణంగా కేవలం 190 మిలియన్‌ డాల ర్లు మాత్రమే భారత్‌ నష్టపోయింది. రెడీమేడ్‌ గార్మెంట్‌ రంగంలోని 15 ఉత్పత్తులు 0.46 శాతం మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఇక ప్రతికూల ప్రభావం- అమెరికాకు భారత్‌ నుంచి టెక్స్‌టైల్‌ రంగం, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 150 బిలియన్‌ డాలర్లు. ఈ టెక్స్‌టైల్‌ రం గ ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం చిన్న, మధ్యతరహా పరిశ్రమలవే ఎక్కువ. ఇలాంటి  పరిశ్రమలన్నీ ఈ విధానంతో ఎక్కువ భాగం మూసివేతలకు గురయ్యే ప్రమాదంలో పడ్డాయి. అలాగే అల్యూమినియం ఉత్పత్తులు, ఇందులో ముఖ్యంగా ఆటోమొబైల్‌ ఉత్పత్తులు, ఇంజినీరింగ్‌ పరికరాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఉత్పాదక నాణ్యతా లోపం కారణంగా కూడా ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌ ఉత్పత్తుల నాణ్యత లోపం కారణంగా  2010-19 కాలంలో వీటి ఎగుమతిలో చాలా క్షీణత ఉన్నది. దీనికి పోటీతత్వం, నాణ్యతా లోపమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉన్నది. ఈ రంగంలో ఉద్యోగ కల్పన కూడా అధికంగా ఉన్నది. ఎగుమతుల్లో కూడా పత్తి ప్రాధాన్య స్థానంలో ఉన్నది. టెక్స్‌టైల్‌ రంగంలో దేశంలో నాలుగు కోట్ల మంది పనిచేస్తున్నారు. టెక్స్‌టైల్‌ రంగంలో నాణ్యత, పోటీతత్వం తగ్గటం కారణంగా మోదీ అంటున్న ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అనేది  నినాదప్రాయంగా మిగిలిపోయింది. జీఎస్‌పీ విధానాన్ని అటుంచి ఈ రంగాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నదో అంతుపట్టదు.భారత్‌ ఎగుమతి చేస్తున్న వస్ర్తా ల విషయంలో రూ.వెయ్యి లోపు ధర ఉన్నవాటిపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) 5 శాతం మాత్రమే. రూ. వెయ్యి కన్నా ఎక్కువ విలువ కలిగిన వాటిపై మాత్రం జీఎస్టీ 12 శాతం ఉంటున్నది. వీటిపై పరోక్షపన్నులు కూడా నామమాత్రంగా ఉన్నాయి. కానీ అదే ఆ వస్తు ఉత్పత్తుల రవాణా, పంపిణీ తదితర కార్యక్రమాలపై మాత్రం 18 శాతం జీఎస్టీ పన్ను ఉన్నది. ఉత్పత్తి క్రమంలో ఉన్న పన్ను కన్నా, సరఫరా, పంపిణీలో పన్నులు ఎక్కువ ఉండటం గమనార్హం.


ఇదే విధమైన స్థితి అల్యూమినియం ఉత్పత్తుల విషయంలోనూ కనిపిస్తున్నది.  ప్రైవేటు కంపెనీలైన హిండాల్కో, వేదాంత, ప్రభుత్వరంగంలోని నాల్కో కంపెనీలకు దేశంలోని 90 శాతం అల్యూమినియం మార్కెట్‌పై  ప్రాబల్యం ఉన్నది. భారత ప్రభుత్వం ఈ అల్యూమినియం పరిశ్రమలపై 8.35 శాతం కస్టమ్‌ సుంకం విధింపుతోనే వాటికి సంరక్షిస్తూ దన్నుగా ఉంటున్నది. అయినా అల్యూమినియం ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో పోటీకి తట్టుకోలేక కుదేలవుతున్నాయి. అల్యూమినియం ఉత్పత్తులపై అత్యధిక శ్లాబ్‌ రేటు జీఎస్టీ పన్ను 28 శాతం. ఇలాంటి పన్ను విధానంతో అల్యూమినియం ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌లోనూ నిలువలేని స్థితి ఏర్పడుతున్నది. ఇదే సందర్భంలో చైనాలో చూస్తే అల్యూమినియం ఉత్పత్తులపై 16 శాతం సబ్సిడీ ఇస్తున్నది. దీంతో ప్రపంచమార్కెట్‌లో చైనా అల్యూమినియం ఉత్పత్తులు మనగలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను బతికించుకోవటం ద్వారానే దేశంలో ఉద్యోగకల్పనకు దోహదం చేయాలి. తద్వారా ప్రపంచ మార్కెట్‌లో పోటీని తట్టుకొని నిలువ గలిగే నాణ్యత కలిగిన వస్తూత్పత్తిని పెం చాలి. 

(వ్యాసకర్త: గ్రేటర్‌ నోయిడాలోని బెన్నెట్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌) 


logo