గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 04, 2020 , 23:22:50

మాగాణమాయె తెలంగాణ బీడు

మాగాణమాయె తెలంగాణ బీడు

నెర్రెలు బారిన తెలంగాణ నేలలు

ఏళ్ల తరబడి నోళ్లు తెరిచిన బీళ్లు

మడికట్టు బోర్లకందని నీటి బొట్లు

చీపురు కొయ్యలూ మొలవని చెల్కలు..

ముళ్లకంపలు, పిచ్చి మొక్కల క్షేత్రాలు

తడికి తపనపడే మాగాణి మనాదులు!

కాళేశ్వర జల కవాతుల జోరులు

పైపైయి ఎగిసే నీటి నాట్య విన్యాసాలు

కాల్వలు,  కుంటలు చెరువులే కాదు

నిండుకుండలైన  డ్యాంలు, బ్యారేజ్‌లు

గోదారి నీరు చేరగా మానేరు మురిసె

జలకళతో పునీతం ‘సిరి’రామసాగరం!

చరిత్ర తిరగరాసిన ఎత్తిపోతల యజ్ఞాలు

రైతు కళ్లల్లో ఆనందభాష్పాల చెలిమెలు

హరిత తివాచీల పంటల సొగసులు

నిండు గర్భిణులైన గుమ్మలు, గాబులు

ఎడారిలో జల పుష్ప నృత్యాల ఉరుకులు

వేదన లేని భూగర్భజల ఊటలు

చిట్టచివరి మడికందిన నీటి పొట్లాలు

బతుక్కి భరోసానిచ్చిన భగీరథ యత్నాలు

ఆకలిని తరిమేసే అన్నదాత ‘వరి’సిరులు!

- డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి, 99497 00037


logo
>>>>>>