సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 03, 2020 , 23:12:30

స్వీయ నియంత్రణ

స్వీయ నియంత్రణ

రోజుకు రెండు గంటలకు మించి సోషల్‌ మీడియాలో గడిపితే మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నపిల్లలు మందబుద్ధులవుతున్నారు. పెద్దవారు మానసిక ఒత్తిడులకు లోనవుతున్నారు. అవసరాలను తీర్చడానికే పరిమితం కాకుండా సోషల్‌ మీడియా దారి మళ్లి అనేక అకృత్యాలకు హేతువు అవుతున్నది. దీనివల్ల కుటుంబాలు కూడా కూలుతున్నాయి. మనిషి సమూహంలోనే ఒంటరివాడై మానసిక రుగ్మతలకు గురవుతున్నాడు.

ప్రధాని నరేంద్రమోదీ ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లను వీడాలని ఆలోచిస్తున్నట్టు ట్విటర్‌ ద్వారా తెలుపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆధునిక టెక్నాలజీ ని అద్భుతంగా వినియోగించుకునే నేతల్లో ఒకరిగా పేరుగాంచిన మోదీ అకస్మాత్తుగా వాటిని వీడాలనుకోవడం ఆలోచింపచేస్తున్నది. ఆయన తన నిర్ణయాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాదిమంది వీక్షకులు స్పందించారు. సోమవారం అర్ధరాత్రి వరకే 35 వేల మందికి పైగా రీ ట్వీట్‌ చేశారు. లక్షా పదివేల మంది లైక్‌ చేశారు. 2009 జనవరిలో ట్విటర్‌ లో చేరిన మోదీకి ప్రస్తుతం ఐదున్నర కోట్లమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 


ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మూడు కోట్ల మందికి పైగా ఆయన్ను అనుసరిస్తారు. ఇంతటి ప్రభావశీలమైన సోషల్‌ మీడియాను వీడాలనే నిర్ణయాన్ని మోదీ కాకతాళీయంగా తీసుకున్నారని అనుకోలేం. సామాజిక మాధ్యమం కారణంగా సమాజంలో అనేక విపరీతాలు చోటు చేసుకుంటున్నాయి. హింసా ప్రవృత్తులు, పెడధోరణులు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేయటం, అదొక వ్యసనంగా మారటం కూడా జరుగుతున్నది. సోషల్‌ మీడియా కారణం గా పుస్తకాలు చదువటం తగ్గిపోయిందని ఈ మధ్యనే మోదీ వాఖ్యానించారు.  ఈ నేపథ్యంలో మోదీ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానన్న నిర్ణయం అందరినీ ఆలోచింపచేస్తుందనటంలో సందేహం లేదు. 


 ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాద్యమాల విప్లవం ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతున్నది. సోషల్‌ మీడియా ను వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియా ఖాతాదారుల సంఖ్య 302 కోట్లకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. 2021నాటికి భారత్‌, చైనా దేశాల నుంచే  110 కోట్ల మంది సోషల్‌ మీడియా ఖాతాదారులుంటారు. మన దేశంలో 35 కోట్ల మంది దాకా ఉంటారని అంచనా. అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్‌ దేశాలతో పోలిస్తే, భారత్‌లో సెల్‌ఫోన్‌ వినియోగం ఎక్కువ స్థాయిలో ఉండటం విశేషం. అయితే ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషుల మధ్య సంబంధాలు పెరిగిపోయాయి. సమాచారం, విజ్ఞానం ఎల్లప్పు డూ అందుబాటులో ఉండటం కారణంగా జ్ఞానం పరివ్యాప్తం అయ్యింది. 


కుగ్రామంలోని వ్యవసాయదారుడు మొదలు, విద్యార్థి దాకా అవసరమైన విజ్ఞానాన్ని పొందుతూ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. సామాజిక మాధ్యమా న్ని సద్వినియోగం చేసుకొని ఎదుగుతున్నారు. ఇవ్వాళ సోషల్‌ మీడియా లేకుండా ఒక్క రోజును ఊహించలేం. మానవానుబంధాలనుంచి, ఉత్పత్తుల దాకా సకల సామాజిక, ఆర్థిక జీవనం సోషల్‌ మీడియాపై ఆధారపడి ఉన్నది. మార్క్‌ జూకర్‌ బర్గ్‌ ఫేస్‌బుక్‌ను ఆవిష్కరిస్తూ విశ్వమానవ స్నేహసబంధాలకు పెద్దపీట వేశాడు. అలాగే ఫేస్‌బుక్‌ ఆశయాన్ని వివరిస్తూ- ఈ ప్రపంచం తెరిచిన పుస్తకంగా ఉండాలి. ప్రతిఒక్కరూ తమ ఇష్టాయిష్టాలను స్వేచ్ఛగా పంచుకోగలుగాలి. స్నేహ సంబంధాలు ఖండాలు దాటాలి. స్నేహ సామ్రాజ్యం విస్తరించాలి అని ఆకాంక్షించాడు. జూకర్‌బర్గ్‌ ఆశించిన విధంగానే సామాజిక మాధ్యమం ప్రపంచ ప్రజలను చేరువ చేసింది. కానీ ఇదంతా నాణానికి ఒక పార్శమే. 


ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ పెరుగుతున్న సామాజిక హింసలో సోషల్‌ మీడియా పాత్ర, ప్రమేయం చర్చనీయాంశం అవుతున్నది. సోషల్‌ మీడియా ఎప్పుడైతే ఆధునిక మానవుని జీవితంలో భాగమైపోయిందో, నాటి నుంచి ఏదీ గోప్యం కాకుండా పోయింది. వ్యక్తిగతానికి, సామాజికానికి మధ్య ఉన్న సన్నని హద్దు చెరిగిపోయింది. పిల్లల నుంచి పెద్దల దాకా, విద్యావంతుల నుంచి నిరక్షరా స్యుల వరకు అందరికీ స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి  వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమం పెద్ద మహమ్మారిగా మారిపోయింది. గంటలకు గంటలు సెల్‌పోన్లలో గడుపటం ద్వారా విలువైన పనిగంటలు నష్టపోతున్నాం. రోజుకు రెండు గంటలకు మించి సోషల్‌ మీడియాలో గడిపితే మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నపిల్లలు మందబుద్ధులవుతున్నారు. 


పెద్దవారు మానసిక ఒత్తిడులకు లోనవుతున్నారు. అవసరాలను తీర్చడానికే పరిమితం కాకుండా సోషల్‌ మీడియా దారి మళ్లి అనేక అకృత్యాలకు హేతువు అవుతున్నది. దీనివల్ల కుటుంబాలు కూడా కూలుతున్నాయి. మనిషి సమూహంలోనే ఒంటరివాడై మానసిక రుగ్మతలకు గురవుతున్నాడు. ఏదైనా మితిమీరితే విషమే, విపత్కరమే. బహుశా ఈ సామాజిక వాస్తవ స్థితిలోంచే మోదీ వాటికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి ఉంటారని ఊహించటం కష్టం కాదు. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల్లో పొద్దుపుచ్చకుండా ఎవరికి వారు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉన్నది.  


logo