మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 03, 2020 , 23:07:50

కరోనాతో ఆర్థికరంగమూ కుదేలు

 కరోనాతో ఆర్థికరంగమూ  కుదేలు

ప్రపంచ జీడీపీలో సుమారు 16.3 శాతం వాటా ఉన్న చైనా దేశంలో వచ్చిన సంక్షోభం అన్నిదేశాల ఆర్థిక మూలలను కుదుపుతున్నది. కరోనా వైరస్‌ వలన చైనాలో ఇప్పటికే 15 శాతానికి పైగా ఆర్థికవ్యవస్థ దిగజారింది. వైరస్‌ కారణంగా చైనా మార్కెట్‌కు ఎగుమతి చేసే అమెరికా, భారత్‌, ఇతరదేశాలు బేజార్‌ అవుతున్నాయి. ముడిసరుకు కోసం చైనాపై ఆధారపడ్డ దేశాలలోని ఆయారంగాలు కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

చైనాలోని ‘వుహాన్‌ పట్టణంలో బయటపడిన కరోనా వైరస్‌ క్రమేణా ఇతర దేశాలకు విస్తరిస్తున్నది. ఈ వైరస్‌ ప్రభా వం ప్రపంచవ్యాప్తంగా సుమారు 61 దేశాలలో కనిపిస్తున్నది. చైనాలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 2800 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ బాధితుల సంఖ్య వేల సంఖ్యలో ఉన్నది. అయితే ఈ వైరస్‌ కేవలం మనుషులకే కాదు వాణిజ్యసంస్థలకు కూడా సోకింది! ఇప్పటికే  ‘ఆర్థిక మందగమనం’తో అల్లాడుతున్న ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కరోనా సంక్షోభం ‘మూలి గే నక్కపై తాటిపండు’ పడినట్లయింది. కరోనా వైరస్‌ అంతర్జాతీయ వ్యాపారం, వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావమే చూపిస్తున్నది. వైరస్‌ వలన ఇప్పటివరకు ప్రపంచ ఆర్థికవ్యవస్థ సుమారు 350 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి కర్మాగారంగా విరాజిల్లుతున్న చైనాలో కరోనా వైరస్‌ వలన పరిశ్రమలు ఉత్పతులను ఆపేశాయి. వైరస్‌ బారిన పడకుండా ఉండటానికి చైనా పౌరులు ఉద్యోగాలకు కూడా వెళ్లడంలేదు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని బ్రాండెడ్‌ సంస్థలన్నీ చైనా లో తమ ఉత్పత్తి ప్లాంట్లను కలిగి ఉన్నాయి. వైరస్‌ కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడాయి.  ఫలితంగా పరిశ్రమలు నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.


కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకరంగాన్ని కూడా దెబ్బతీస్తున్నది. పర్యాటకం వాటా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10.4 శాతం. ప్రపంచ ఉపాధిలో 10 శాతం వాటా కలిగిన అతి పెద్ద అంతర్జాతీయ వ్యాపారం. కానీ కరోనా వైరస్‌ భయంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. చైనా పర్యటనకు ఇతర దేశస్థులు వెళ్లడం లేదు. ఆ దేశ పర్యాటకులను దాదాపు అన్నిదేశాలు నిషేధించాయి. అలాగే తమ దేశ ప్రజలపై విదేశీ దేశాల పర్యటనపై ఆంక్ష లు విధించాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో సుమారు 8.8 ట్రిలియన్స్‌గా ఉన్న పర్యాటకరంగ ఆదాయం ఈ సంవత్సరం భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నట్లు ‘ప్రపంచ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌' ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ ముఖ్యంగా ‘ఆసియా ట్రావెల్‌ అండ్‌ టూరిజం’పై తీవ్ర ప్రభావం చూపిస్తుననది.


పర్యాటకం ప్రధాన వనరుగా ఉన్న థాయిలాండ్‌ దేశంలో చైనా పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించలేదు. కాని థాయిలాండ్‌ టూరిజం రెండు నెలలుగా వందల కోట్ల రూపాయలు నష్టాలు చవిచూసింది. దీనికికారణం అక్కడికి చైనీయుల సంఖ్యనే  కాకుం డా ఇతర దేశాల పర్యాటకుల సంఖ్య సైతం కరోనా వైరస్‌ వలన భారీగా పడిపోవడమే. మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలలోనూ కరోనా వైరస్‌ భయంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఫలితంగా అక్కడి పర్యాటక సంస్థ లు భారీగా నష్టపోతున్నాయి. ఇరాన్‌ దేశంలో కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో  చుట్టుపక్కల దేశాలైన అర్మీనియా, పాకిస్థాన్‌, టర్కీ దేశాలు ఇరాన్‌ దేశ సరిహద్దులు మూసేశాయి. కువైట్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బహ్రెయిన్‌, ఒమన్‌, టర్కీ దేశాలు అంతర్జాతీయ పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించాయి. ఇటలీలోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా యూరప్‌ దేశాలు అప్రమత్తమయ్యా యి. 


తమ దేశ ప్రజల పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటలీ ప్రభు త్వం వెనిస్‌ కార్నివాల్‌, ఓపెరా షోలు, సాకర్‌ మ్యాచ్‌లు రద్దు చేసింది. కరోనా వైరస్‌ కారణంగా అమెరికా ట్రావెల్‌ అండ్‌ టూరిజం తీవ్ర నష్టాల ను ఎదుర్కొంటున్నది. సుమారు 5 బిలియన్‌ డాలర్ల వరకు ఆదాయం 2020లో నష్టపోతామని అక్కడి పర్యాటక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనాతో ఫ్రాన్స్‌లో పర్యాటకుల సంఖ్య సుమారు 40 శాతం తగ్గింది అని ఆ దేశం ప్రకటించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు లేక వెల వెల బోతున్నాయి.  అన్నిదేశాల ‘విమానయాన రంగం’ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ వైరస్‌ వలన ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం సుమారు 29.3 బిలియన్ల వరకు నష్టపోనుందని ‘ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్పోర్టేషన్‌' అంచనా వేసింది. గత రెండు మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య సుమారు 8 శాతం మేర తగ్గింది.


ప్రపంచ జీడీపీలో సుమారు 16.3 శాతం వాటా ఉన్న చైనా దేశంలో వచ్చిన సంక్షోభం అన్నిదేశాల ఆర్థిక మూలలను కుదుపుతున్నది. కరోనా వైరస్‌ వలన చైనాలో ఇప్పటికే 15శాతానికి పైగా ఆర్థికవ్యవస్థ దిగజారింది. వైరస్‌ కారణంగా చైనా మార్కెట్‌కు ఎగుమతి చేసే అమెరికా, భారత్‌, ఇత ర దేశాలు బేజార్‌ అవుతున్నాయి. ముడిసరుకు కోసం చైనాపై ఆధారపడ్డ దేశాలలోని ఆయా రంగాలు కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. విడిభాగాలు, యంత్రాలు,  ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఇతరత్రా వస్తువుల తయారీకోసం చైనా దిగుమతులపై ఆధారపడ్డ దేశాలలో ఇప్పటికే 5 నుంచి 10 శాతానికి ఆయా వస్తువుల ధరలు పెరిగాయి. 


చైనాకు ఎగుమతులు నిలిచి, ఆయారంగాలపై ఆధారపడ్డ వారు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజురోజు కు పరిశ్రమల నష్టాలు పెరిగిపోవడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు సైతం కుదేలవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లలో ఆయా కంపెనీల వాటాలు క్షిణిస్తున్నాయి. దానితో అన్నిరంగాల వాటాల విలువలు తగ్గడమే కాకుండా లక్షల కోట్ల రూపాయల ‘మదుపరుల’ సంపద ఆవిరైపోతున్నది. వైరస్‌ ఇతర దేశాలకు విస్తరిస్తుండటంతో మును ముందు పరిశ్రమలు నష్టాలను పొందవచ్చని ఆందోళన చెందుతున్నారు. ‘మదుపరులు’ తమ పెట్టుబడులను బంగారం, వెండి వంటి వాటిపై మళ్లిస్తున్నారు. అందుకే మార్కెట్లో పుత్తడి విలువలో పెరుగుదల కనిపిస్తున్నది. ఇటు ‘ఆర్థిక కార్యకలాపాలు’ మందగించి చమురు డిమాండు తగ్గి అంతర్జాతీయ ముడిచమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఫలితంగా అన్నిదేశాల స్టాక్‌మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి.


 ప్రపంచంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించే, అమెరికా ‘ప్రభుత్వ బాండ్స్‌' రాబడి కూడా రికార్డుస్థాయికి పడిపోయింది. 2008 సంవత్సరం తరువాత ప్రపంచ మార్కెట్లు ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాక, ఎరువులు, పౌల్టీ, ఆక్వా, వ్యవసాయం, తయారీరంగాలకు చెందిన ఎగుమతి, దిగుమతి వ్యాపారం తీవ్రంగా నష్టపోతున్నది. నిరుద్యోగం పెరిగే అవకాశం కూడా ఉన్నది. భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యాపార నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఒక దేశంలో వచ్చిన ఆరోగ్య సమస్య ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఇంతగా ప్రభావం చూపించడం ఇదే మొదటిసారి.  

(వ్యాసకర్త: యూజీసీ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో,కామర్స్‌ విభాగం,  ఓయూ)  


logo
>>>>>>