బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 02, 2020 , 22:31:23

ఆఫ్ఘన్‌లో శాంతిరేఖ

ఆఫ్ఘన్‌లో శాంతిరేఖ

అమెరికాపై, ఆ దేశ మిత్ర రాజ్యాలపైన దాడులు చేయబోమని తాలిబన్‌ హామీ ఇచ్చింది కనుక భారత్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. శాంతి ఒప్పందంతో కొత్త అధ్యాయం మొదలవుతుంది. భిన్నశక్తుల మధ్య కొత్త సంబంధాలు నెలకొంటాయి. అందువల్ల పాత పద్ధతిలోనే అలోచించి ఆందోళనపడకూడదు. తాలిబన్లు కూడా చేతికి అధికారం వచ్చిన తరువాత కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించక తప్పదు. ఏదిఏమైనా భారత్‌ అప్రమత్తంగా ఉంటూ చైనా, పాకిస్థాన్‌తోపాటు కశ్మీర్‌లోని విదేశీ ప్రేరేపిత శక్తుల కార్యకలాపాలను గమనిస్తూ ఉండడం తప్పనిసరి.

అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదరడంతో సంక్షుభిత ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొంటుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. 2001లో అమెరికా యుద్ధంలోకి దిగిననాటి నుంచి ఇప్పటివరకు 3, 500 మంది అమెరికా సైనికులు మరణించారు. రెండు లక్షల కోట్ల డాలర్లు వ్యయం అయిందని అంచనా. తాలిబన్లతో పాటు సాధారణ పౌరులు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రకృతి, సామాజిక విధ్వంసాలు అంచనాకు అతీతమైనవి. తాలిబన్లు ఇంకా బలంగా ఉండటం, రష్యా, చైనా, ఇరాన్‌ పరోక్షంగా వారికి తోడ్పడుతుండటం వల్ల అమెరికా ఏదో ఒక స్థాయిలో ఒప్పందం కుదుర్చుకొని యుద్ధాన్ని విరమించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తాలిబన్లపై ఇతరశక్తుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు కీలకమైన ఈ ప్రాంతంలో తమ పట్టును బలోపేతం చేసుకోవాలని అమెరికా కొత్త వ్యూహాన్ని ఎంచుకొని ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో పద్నాలుగు వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు.


 ఒప్పందం సజావుగా అమలైతే  పద్నాలుగు నెలల్లో దశల వారిగా తన సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకుంటుంది. అమెరికా మొత్తం ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్ల చేతిలో పెడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అమెరికా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వబోమని, అమెరికాపైన, ఆ దేశ మిత్రరాజ్యాలపై దాడులు సాగించబోమని తాలిబన్లు హామీ ఇచ్చారు. అంటే ఆయాదేశాలు చేపట్టే ప్రాజెక్టులకు, ఇతర కార్యకలాపాలకు భద్రత లభిస్తుంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇతరపక్షాలతో చర్చలు జరపడానికి కూడా తాలిబన్లు అంగీకరించారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వాన్ని గుర్తించబోమంటూ తాలిబన్లు ఇంతకాలం అధికారిక చర్చలకు కూడా అంగీకరించలేదు. ఇప్పుడు చర్చలకు అంగీకరించారంటే, భవిష్యత్తులో అధికారం పంచుకోవడానికి కూడా సిద్ధపడవచ్చు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సేనలు ప్రవేశించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నది. సోవియెట్‌ ఆక్రమణను కూడా పరిగణనలోకి తీసుకుంటే 1979 నుంచే ఆఫ్ఘనిస్థాన్‌ సంక్షోభం మొదలైంది. ఈ విధంగా నాలుగు దశాబ్దాలుగా ఆఫ్ఘన్‌ సమాజం అనేక సంక్షోభాలను చవి చూసింది. ఇప్పటికైనా శాంతి నెలకొంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్‌ ఖైదీలను విడుదల చేయబోమని ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది చర్చల్లో తమ పట్టు కాపాడుకోవడానికే తప్ప నిజంగా ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించడానికి కాదు. అమెరికా సైన్యం ఉండటం వల్లనే ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వం నిలబడ్డది. అందువల్ల భవిష్యత్తులో తాలిబన్లతో ఏదో స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవడానికే ఆఫ్ఘన్‌ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.


 అమెరికా మధ్యవర్తిత్వ పాత్ర నిర్వహించవచ్చు. ఎక్కడైనా యుద్ధం ముగిసి శాంతి నెలకొంటే సంతోషించవలసిందే. కానీ తాలిబన్లు కరడుగట్టిన ఉగ్రవాదులు. అమెరికా దళాలు ఉన్నప్పుడే దాదాపు గ్రామీణ ప్రాంతాన్నంతా శాసిస్తున్నారు. నగరాలను స్వాధీనం చేసుకుంటూ అమెరికా వైమానిక దాడుల వల్ల వెనక్కు తగ్గుతున్నారు. అమెరికాతో చర్చలు సాగుతున్నప్పుడు కూడా దాడులను నిలిపివేయలేదు. మానవహక్కులను ఏ మాత్రం గౌరవించని ఈ సంస్థ స్త్రీల పట్ల మత నిబంధనలను కఠినంగా అమలు చేయవచ్చు. తమ స్వేచ్ఛను హరించే శాంతి మాకు వద్దని కూడా కొందరు మహిళలు అంటున్నారు. అమెరికా సైన్యం ఉపసంహరణ తరువా త ఈ సంస్థ ఎంత పేట్రేగిపోతుందోననే భయం వ్యక్తమవుతున్నది. 


అందువల్ల అంతర్జాతీయ సమాజం అక్కడి భిన్న తెగలకు అధికారంలో భాగస్వామ్యం లభించే విధంగా చూడాలి. ఆఫ్ఘనిస్థాన్‌ సమాజంలోని భిన్నవర్గాలు తమ అస్తిత్వం కోసం చేసే పోరాటాలకు మద్దతు ఇవ్వాలి.మన దేశానికి ఆఫ్ఘనిస్థాన్‌ ఒప్పందం కొంత ఆందోళనకరమైన అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మన దేశం ఇప్పటివరకు ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వంతోనే సంబంధాలు పెట్టుకున్నది. అక్కడి పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొంటున్నది. తాలిబన్లతో ఇప్పటివరకు చేదు అనుభవాలే తప్ప సత్సంబంధాలు లేవు. అందువల్ల రాబోయే పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎన్ని సందేహాలున్నా ఆఫ్ఘనిస్థాన్‌ ఒప్పందం పట్ల భారత్‌ అనుకూలంగా స్పందించింది. ఇందుకు కారణం అమెరికా నుంచి పరోక్షంగా సంకేతాలు రావడమై ఉంటుంది. అమెరికాపై, ఆ దేశ మిత్ర రాజ్యాలపైన దాడులు చేయబోమని తాలిబన్‌ హామీ ఇచ్చింది కనుక భారత్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. శాంతి ఒప్పందంతో కొత్త అధ్యాయం మొదలవుతుంది.


 భిన్నశక్తుల మధ్య కొత్త సంబంధాలు నెలకొంటాయి. అందువల్ల పాత పద్ధతిలోనే అలోచించి ఆందోళనపడకూడదు. తాలిబన్లు కూడా చేతికి అధికారం వచ్చిన తరువాత కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించక తప్పదు. ఏదిఏమైనా భారత్‌ అప్రమత్తంగా ఉంటూ చైనా, పాకిస్థాన్‌తోపాటు కశ్మీర్‌లోని విదేశీ ప్రేరేపిత శక్తుల కార్యకలాపాలను గమనిస్తూ ఉండడం తప్పనిసరి. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొన్న తరువాత భారీ ఎత్తున పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగుతాయి. మౌలిక వసతులు, వ్యవసాయం, పరిశ్రమలతో పాటు విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో భారీగా అవకాశాలుంటాయి. భారత్‌ తోడ్పాటు ఆఫ్ఘనిస్థాన్‌కూ అవసరమే. అందువల్ల భారత్‌ మారిన పరిస్థితులకు అనుగుణంగా వేగంగా పావులు కదపాల్సిన అవసరం ఉంది. 


logo